ప్రజాశక్తి-కర్నూలు ప్రతినిధి: అనంతపురం జిల్లాకు చెందిన ప్రముఖ అవధాని డాక్టర్ అశావాది ప్రకాశరావు పద్మశ్రీ పురస్కారాన్ని అందుకున్నారు. ఢిల్లీలో రాష్ట్రపతి రామ్‌నాథ్‌కోవింద్ చేతుల మీదుగా మంగళవారం (09-11-2021) ఈ అవార్డును ఆయన స్వీకరించారు. సాహిత్యం, విద్య విభాగంలో ఆయన ఈ పురస్కారాన్ని దక్కించుకున్నారు. అనంతపురం జిల్లా పెనుగొండకు చెందిన ప్రకాష్ రావు 1944 ఆగస్టు 2న కుల్లాయమ్మ, పకీరప్ప దంపతులకు జన్మించారు. ఆయన ఎస్‌ఎస్‌ఎల్సీ నుంచి ఎంఏ తెలుగు వరకు అనంతపురంలోనే చదువుకున్నారు. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల తెలుగు పండితులుగా ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించి ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్‌గా పదవి విరమణ చేశారు.
రచనలు : రాష్ట్రంలోనే కాకుండా దేశంలోని వివిధ రాష్ట్రాల్లో 150కి పైగా అవధానాలు చేశారు. పుష్పాంజలి, లోకలిలా సూక్తం, మెరుపు తీగలు, దీవన సేసలు, రామకథ కలశం, పార్వతి శతకం, ఆత్మతత్వ ప్రబోధం, అవధాన చాటువులు, అవధాన కౌముది, వివేక పునీత నివేదిత వంటి పద్య రచనలు చేశారు. రాప్తాటి పరిచయ పారిజాతం, దోమావధాని, సాహితీ కుంజర మూర్తిమత్వం, ప్రసార కిరణాలు, సమారాధన, భాగవత సౌరభం, సువర్ణ గోపురం, ప్రహ్లాద చరిత్ర ఎర్రన్న, పోతనల తులనాత్మక పరిశీలన వంటి విమర్శ రచనలు చేశారు. నిరోష్ఠ్య శతకం, భర్తృహరి, వైరాగ్యసతి వంటి వ్యాఖ్య రచనలు చేశారు. చల్లపిల్లరాయ చరిత్రం వంటి పరిష్కరణలు ఆర్కెస్ట్రా, నడిచే పద్యం నండూరి వంటి సంకలనాలు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జీవిత చరిత్రలు కలిపి మొత్తం 57 రచనలు వెలువరించారు.
గుర్తింపు : ప్రకాష్‌రావు అవధాన రంగంలో చేసిన కృషికి గాను పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్‌తో సన్మానించింది. స్వర్ణ గండపెండేర, రజిత హస్తకంకణ, కనకాభిషేక, రజత కిరీటం వంటి సత్కారాలను పొందారు. ఆయన అవధాన ప్రతిభను, సాహిత్య కృషిని మెచ్చి అవధాన కిశోర, అవధాన కోకిల, అవధాన ఆచార్య, శారదా తనయ, అపర జాషువా వంటి బిరుదులతో సత్కరించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వీరికి కవికోకిల జాషువా పురస్కారాన్ని ప్రదానం చేసింది. 2020లో మహాకవి డాక్టర్ గడియారం వెంకటేశ శాస్త్ర సాహిత్య పురస్కారాన్ని అందుకున్నారు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి