గుండెపోటుతో తుది శ్వాస విడిచిన సాహితీ వటవృక్షం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనంతపురం జిల్లాకు చెందిన ప్రముఖ సాహితీవేత్త, పద్మశ్రీ అవార్డు గ్రహీత, కళారత్న డాక్టర్ ఆశావాది ప్రకాశరావు కన్నమూశారు. 2022 ఫిబ్రవరి 17న గురువారం పెనుకొండలోని తన నివాసంలో గుండెపోటుకు గురయ్యారు. మధ్యామ్నం 3 గంటల సమయంలో గుండెపోటుకు గురైన ఆయన్ను కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించేలోపు తుదిశ్వాస విడిచారు. కవి, అవధాని, విమర్శకుడు, పరిశోధకుడు, అనువాదకులుగా ఆయన గుర్తింపు పొందారు. తెలుగు పద్యానికి, అవధానానికి, వర్తమానకాలంలో ప్రసిద్ధుడైన ఆశావాది ఎన్నో వందల అవధానాలు దేశవ్యాప్తంగా చేశారు. అంతేగాక అనేక గ్రంధాలు దాదాపు 60 దాకా రాశారు. ఆయన కవిగా, వక్తగా, రచయితగా, సాహితీ కార్యకర్తగా, విద్యావేత్తగా ప్రముఖ అవధానిగా అనంత సాహితీ వనంలో ఏపుగా పెరిగిన పెద్ద సాహితీ వటవక్షంగా నిలిచారు. ఆయన సాహిత్య ప్రయాణంలో 'పద్మశ్రీ' సైతం ఆయన్ను వెతుక్కుంటూ వచ్చింది. నలుగురు కూతుళ్లు, ముగ్గురు కుమారులు ఉన్నారు. వివిధ ఉద్యోగాల్లో వారు స్థిరపడ్డారు. పెనుకొండ పట్టణంలో శుక్రవారం 18-02-2022న ప్రకాశరావు అంత్యక్రియలు నిర్వహిస్తున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
తెలుగు పద్యానికి వన్నె తెచ్చిన డాక్టర్ ఆశావాది
తెలుగు రాష్టాల్లోని సాహిత్య రంగంలో పద్యానికి, అవధానానికి వన్నెతెచ్చిన డాక్టర్ ఆశావాది ప్రకాశరావు 1944వ సంవత్సరం ఆగస్టు 2న అనంతపురం జిల్లా శింగనమల మండలంలోని కొరివిపల్లి గ్రామంలో కుళాయమ్మ, పక్కీరప్ప దంపతులకు జన్మించారు. అష్టావధానంలో ఆశావాది దిట్ట. ఎన్నో అవధానాలు చేసిన ఆశావాది తన అనుభవాల్ని అక్షరబద్ధం చేసి అనేక రచనలు చేశారు. వీటిలో అవధానదీపిక, అవధాన కౌముది, అవధానకళాతోరణము, అవధాన వసంతం మొదలైనవి ఉన్నాయి. ఇవిగాక వరదరాజు శతకం, పార్వతీశతకం, మెరుపు తీగలు వంటి కావ్యాలు కూడా ఉన్నాయి. ఆశావాది పద్యరచనతో పాటు ఆధునిక వచన కవితలో ఆర్కెస్ట్రా, అంతరంగ తరంగాలు మొదలైన కావ్యాలు రచించారు. విద్యార్థి దశ నుంచే జాతీయ భావాలు కలిగిన డాక్టర్ ఆశావాది విద్యార్థి దశలోనే అప్పటి రాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ చేత 'బాలకవి'గా ప్రశంసలు పొందారు. 55 సంవత్సరాలుగా రచనా వ్యాసంగం, సాహిత్యంలో ప్రయాణం సాగించారు. 35 సంవత్సరాలు విద్యారంగంలో ఉపాధ్యాయుడు, అధ్యాపకుడిగా విశేష కషి చేశారు. ప్రకాశరావు 171 అవధానాలు చేసి, 60కి పైగా పుస్తకాలు వెలువరించారు. ఆశావాది సాహిత్యకషిని గురించి వివిధ కవులు ఆయన పేరిట 24 పుస్తకాలు రచించి తమ అభిమానాన్ని చాటుకున్నారు. తెలుగు సాహిత్యాన్ని మహోన్నత శిఖరాలకు చేర్చిన మేరుపర్వతం ఆశావాది ప్రకాశరావు. ఆయన రచనలపై ఐదారుగురు పిహెచ్‌డిలు చేశారు. ఆయనకు రెండు తెలుగు రాష్టాల్లో శిష్యులున్నారు. ఢిల్లీ, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ , కర్ణాటక రాష్ట్రాల్లో ఆయన అష్టావధానాలు చేశారు.
పురస్కారాలు, సత్కారాలు
ఆశావాది సాహిత్య రంగంలో ఎన్నో సత్కారాలు పొందాడు. 1976లో దళితుల్లో ప్రథమ అవధానిగా 'తెలుగు వెలుగు' పురస్కారాన్ని రాష్ట్రప్రభుత్వం నుంచి అందుకున్నారు. 1986లో తెలుగు విశ్వవిద్యాలయం 'రాష్ట్రకవి'గా సత్కరించింది. 1994లో ఉగాది పురస్కారాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది. పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం 2000 సంవత్సరంలో డిలిట్ డాక్టరేట్‌ను ఇచ్చి సత్కరించింది. 2005లో హరిజన సేవాసంఘం ద్వారా గాంధేయ వాద పురస్కారం పొందాడు. అధికార భాషాసంఘం నుండి 'భాషాభిజ్ఞు' పురస్కారాన్ని పొందారు. ఆశావాది జీవితంలో అపూర్వఘట్టం పూర్వం అల్లసాని పెద్దనలా 'స్వర్ణగండ పెండేర సన్మానం' పొందడం. అనంతపురం జిల్లా పెనుగొండలో ఆయన తన సాహితీ ప్రజ్ఞకు గుర్తుగా ఈ సన్మానాన్ని పొందడం విశేషం. ఆశావాది తెలుగు సాహితీ క్షేత్రంలో సాహితీ వారసత్వంగా ఎన్నో తెలుగు విత్తనాలు వేసి సాహిత్యాన్ని సుసంపన్నం చేశారు. ఆయన స్వయంగా 'రాయలకళాగోష్టి' సంస్థ స్థాపించి దానికి కార్యదర్శిగా పనిచేశారు. 'ఆంధ్ర పద్య కవితాసదస్సు' రాష్ట్ర కార్యదర్శిగా పది సంవత్సరాల పాటు 1993 నుండి పనిచేసి ఎంతోమంది సాహిత్య కారులును వెలుగులోకి తెచ్చారు. 'ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ' సభ్యునిగా కూడా పనిచేశారు. 2021లో కేంద్ర ప్రభుత్వం ఆయనను పద్మశ్రీ పురస్కారంతో సత్కరించింది.
ఇతర విశేషాలు
ప్రథమ సంవత్సరం డిగ్రీ చదువుకుంటున్న రోజుల్లోనే (1962) అప్పటి రాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకష్ణతో 'బాలకవి'గా ఆశీర్వదప్రాప్తి అందుకున్నారు. ఆయన ఆంధ్రప్రదేశ్ కర్నాటక ఉన్నత పాఠశాలల తెలుగు పాఠ్యాంశ రచయిత. అనేక పత్రికలలో వీరి కవితలు, వ్యాసాలు ముద్రితమయ్యాయి. వీరి సాహిత్యవికాసంపై 2 రోజులపాటు యుజిసి నిధులతో కర్నూలులోని కెవిఆర్ ప్రభుత్వ మహిళా కళాశాలలో జాతీయ సదస్సు జరిగింది. పలు సాహితీ సాంస్కతిక సంస్థలు 13 రకాల బిరుదులతో సత్కరించింది. సహ సాహితీవేత్తల గ్రంథాలు 14 దాకా అంకిత స్వీకారం పొందారు. ఆయన 7 జాతీయసదస్సులకు పరిశోధనపత్రాలు సమర్పించారు. వందకు పైగా ఆకాశవాణి, దూరదర్శన్ కార్యక్రమాలున్నాయి. దేశవ్యాప్తంగా 171 అష్టావధాన ప్రదర్శనలు చేశారు. భువనవిజయాది సాహితీరూపకాలతో కవుల పాత్రను పోషించారు. సామాజిక నాటకాలకు దర్శకత్వం వహించారు. శ్రీశైలజ్యోతి ( అనంతపురం ), గౌతమప్రభ ( గుత్తి ), జాగతి ( హైదరాబాదు ), పద్యవారధి ( రాజమండ్రి ) పత్రిక సంపాదకమండలిలో స్థానం పొందారు. గహగ్రంథాలయాల స్థాపనకు కషి చేశారు. పరిశోధక విద్యార్థులకు సహకారం అందించారు. ముద్రిత స్వీయరచనలను పలుగ్రంథాలయాలకు, సాహిత్య సంస్థలకు ఉచితముగా పంపిణీ చేశారు. శ్రీకష్ణదేవరాయలు , పద్మశ్రీ పుట్టపర్తి నారాయణాచార్యులు , డా క్టర్ బిఆర్.అంబేద్కర్ విగ్రహాల ప్రతిష్టాపనలకు కషి చేశారు. స్వీయ ఆధ్వర్య సాహిత్యసంస్థల ద్వారా 40 కి పైగా ప్రచురణలు, అజ్ఞాత కవులకు, యువసాహితీవేత్తలకు అండగా నిలిచి ప్రోత్సాహం అందిచారు. 2010 నుండి ఆశావాది సాహితీకుటుంబ పక్షాన సంప్రదాయకవులకు ఆధునిక రచయితలకు, సంఘసేవకులకు, ఆధ్యాత్మికప్రచారకులకు, ప్రతిసంవత్సరం ఆత్మీయపురస్కారాల ప్రదానం చేశారు. పలువురు గవర్నర్లు , కేంద్ర, రాష్ట్ర మంత్రులు, జస్టిస్‌లు , ఐఎఎస్, ఐపిఎస్, వైస్‌ఛాన్సిలర్ల చేతుల మీదుగా సత్కారాలు పొందారు.
సబ్‌కలెక్టర్ నివాళి : గుండెపోటులో మతిచెందిన ఆశావాది ప్రకాష్‌రావు మతదేహానికి సబ్‌కలెక్టర్ నవీన్ నివాళి అర్పించారు. ఆశావాది భౌతిక కాయాన్ని సందర్శించిన ఆయన పూలమాల వేసి నివాళులర్పించారు.
అనంతపురం : ప్రముఖ అవధాని, ఉపన్యాసకులు, బహు గ్రంథకర్త, పద్మశ్రీ పురస్కార గ్రహీత డాక్టరు ఆశావాది ప్రకాశరావు నిర్యాణం సాహిత్యలోకానికి తీరని లోటు అని కేంద్ర సాహిత్య అకాడమీ యువపురస్కార గ్రహీత డాక్టరు అప్పిరెడ్డి హరినాథరెడ్డి అన్నారు. ఆశావాది ప్రకాశరావు మతికి తెలుగు వెలుగు సాహిత్య సామాజిక సేవా సంస్థ అధ్యక్ష, ఉపాధ్యక్షులు టివి.రెడ్డి, అవధానం నాగరాజారావు, కార్యదర్శులు కాప ఓబిరెడ్డి, అల్తాఫ్ నివాళులర్పించారు. జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు టిసి.వరుణ్ సంతాపం తెలిపారు.
నేత్రదానం
ఆశావాది ప్రకాష్‌రావు చివరి కోరికను గౌరవిస్తూ వారి కుటుంబ సభ్యులు ఆయన నేత్రాలను సాయి ట్రస్టుకు దానం చేశారు. ఎల్‌వి ప్రసాద్ ఆసుపత్రికి చెందిన ఆప్తమాలిక్ అసిస్టెంట్ రాఘవేంద్ర ఆయన నేత్రాలను సేకరించి హైదరాబాద్‌కు తరలించారు.
ఆశావాది లేని లోటు తీర్చలేనిది : డాక్టర్ ఎన్.శాంతమ్మ
ఒక మహోన్న త సాహితీ వటవృక్షం ఆకస్మికంగా కూలిపోయిందని ఆయన లేని లోటు సాహితీ లోకానికి తీర్చలేనిదని రచయిత్రి డాక్టర్ ఎన్.శాంతమ్మ అన్నారు. ఎందరో రెక్కలు రాని సాహితీ విహంగాలకు గూడునిచ్చి, నీడనిచ్చి, రెక్కలు తొడిగి ఎగిరేటట్లు చేసిన మహోన్నత ఆచార్యుడాయన అన్నారు. డాక్టర్ ఆశావాది ప్రకాశరావు తనకు సాహితీ సేవలు చేసేందుకు స్ఫూర్తినిచ్చారన్నారు. తెలుగు సాహిత్యంలో తెలియని ఎన్నో విషయాలను బోధించి సందేహాలను తీర్చిన గురువులాయన తన ప్రతి రచనా పుస్తకరూపానికి రావడానికి ప్రధాన కారకులు. నాకు దైవమిచ్చిన సోదరులు. పరమ సౌజన్య మూర్తి. మంచితనానికి, మానవత్వానికి ప్రతీక ఆశావాది. ఆయన ఆకస్మిక మరణం మా అందరికీ పెను విషాదాన్ని మిగిల్చింది. భగవంతుడు వారి ఆత్మకు శాంతి కలిగించాలని ప్రార్ధిస్తున్నాను.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి