10, మార్చి 2022, గురువారం

పంజాబ్‌ను ఊడ్చేసిన ఆప్‌



యుపిలో బిజెపి జోరు -డీలాపడ్డ కాంగ్రెస్‌

               పంజాబ్‌ను ఆమ్‌ ఆద్మీ పార్టీ (ఆప్‌) ఊడ్చేసింది. మొత్తం 117 స్థానాల్లో 92 స్థానాల్లో విజయం సాధించింది. అధికార కాంగ్రెస్‌ను చావుదెబ్బ కొట్టింది. దీంతో కాంగ్రెస్‌ 18 స్థానాలకే పరిమితమైంది. బిఎస్‌పి,శిరోమణి ఆకాళీదళ్‌ కూటమి, మాజీ ముఖ్యమంత్రి అమరీందర్‌ సింగ్‌ పంజాబ్‌ లోక్‌ కాంగ్రెస్‌-బిజెపి కూటమి ఎలాంటి ప్రభావం చూపలేకపోయాయి. ఆకాళీదళ్‌కు నాలుగు, బిజెపికి రెండు స్థానాలు లభించాయి. గత ఎన్నికల్లో ఆప్‌ 20 స్థానాలను గెలుచుకోగా, ఈసారి 92 స్థానాల్లో విజయం సాధించి, 72 స్థానాలను పెంచుకోగలిగింది. గత ఎన్నికల్లో ఆప్‌ 23.7 శాతం ఓట్లు సొంతం చేసుకోగా, ఇప్పుడు ఏకంగా 42 శాతం ఓటింగ్‌ సాధించింది. దాదాపు 19 శాతం ఓట్లు పెరిగాయి. గత ఎన్నికల్లో కాంగ్రెస్‌ 77 స్థానాలను గెలుచుకోగా, ఈసారి 18 స్థానాలకే పరిమితమైంది. కాంగ్రెస్‌ ఏకంగా 59 స్థానాలను కోల్పోయింది. గత ఎన్నికల్లో 38.5 శాతం ఓట్లు రాగా, ఈ ఎన్నికల్లో 23 శాతం ఓట్లు వచ్చాయి. దాదాపు 15 శాతం ఓట్లు కోల్పోయింది. శిరోమణి అకాలీ దళ్‌ గత ఎన్నికల్లో 15 స్థానాలు గెలవగా, ఈసారి మూడు స్థానాలకే పరిమితమైంది. గత ఎన్నికల్లో 25.2 శాతం ఓట్లు రాగా, 18.4 శాతం ఓట్లు వచ్చాయి. దాదాపు ఏడు శాతం ఓట్లు కోల్పోయింది. మంత్రులు ఓం ప్రకాష్‌ సోనీ, మన్‌ప్రీత్‌ సింగ్‌ బాదల్‌, రజియా సుల్తానా, భరత్‌ భూషన్‌, విజరు ఇందిర్‌ సింఘాలా, రణదీప్‌ సింగ్‌ నభా, గుర్కీరత్‌ సింగ్‌ కోట్లి తదితరులు ఓటమి పాలయ్యారు.
ఆప్‌ విజయం వెనుక..
            పంజాబ్‌లో ఆమ్‌ ఆద్మీ పార్టీ (ఆప్‌) విజయం వెనుక పక్కాగా ఎన్నికల వ్యూహం ఉందని స్పష్టమవుతోంది. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఆప్‌ ప్రచారాన్ని ప్రారంభించింది. నాణ్యమైన విద్యబోధన జరిగేలా ప్రభుత్వ పాఠశాలలు, ఆస్పత్రుల్లో మెరుగైన వైద్య సేవలను ప్రచార అస్త్రంగా కేజ్రీవాల్‌ ప్రయోగించారు. 18 ఏళ్లు నిండిన ప్రతి మహిళకు 400 యూనిట్ల ఉచిత విద్యుత్‌, నెలకు వెయ్యి రూపాయలు ఇస్తామని ప్రకటించారు. ఆ తర్వాత ఒక అడుగు ముందుకు వేసి, ఇంటింటికీ గ్యారెంటీ కార్డును నింపేలా ఫారాలిచ్చారు. ఇలా ఆప్‌ చెబుతున్న విషయాలు సామాన్యుల ఇళ్లకు చేరాయి. నగరాల్లో స్థానికంగా బలంగా ఉన్న దాదాపు 50 మంది ఇతర పార్టీల నేతలను పార్టీలో చేర్చుకుని టికెట్టు ఇచ్చారు. దీంతో గ్రామాలతో పాటు నగరాల నుంచి కూడా ఆమ్‌ ఆద్మీ పార్టీ విజయం సాధించటానికి కారణమైంది.

కీలకంగా మారిన మూడు అంశాలు
- పంజాబ్‌లో మార్పును పసిగట్టిన కేజ్రీవాల్‌.. పార్టీని అక్కడ బలంగా విస్తరించాలని నిర్ణయించుకున్నారు. అక్కడ నెలకొన్న రాజకీయ అస్థిరత, ప్రజాసమస్యలను కాంగ్రెస్‌ పట్టించుకోకపోవటం గమనించారు. ఇదే అదనుగా కేజ్రీవాల్‌ ప్రచార విధానాన్ని మార్చేశారు. మాల్వాలో పెద్ద ప్రభావం కనిపించింది.
- ఆప్‌.. బయటి పార్టీ అనికాంగ్రెస్‌ ప్రచార అస్త్రంగా వినియోగించింది. దీన్ని తిప్పికొట్టడానికి వివాద రహితుడైన భగవంత్‌ మాన్‌ను సిఎం అభ్యర్థిగా కేజ్రీవాల్‌ ప్రకటించారు. ఫీడ్‌బ్యాక్‌ నుంచి ప్రకటన వరకు, మద్దతుదారులు, ప్రత్యర్థుల వరకూ చర్చ జరిగేలా చేయటంలో సక్సెస్‌ అయ్యారు. ముందుగా ఒక్క అవకాశం ఇవ్వమని కేజ్రీవాల్‌ ప్రచారం చేశారు. కాంగ్రెస్‌ నుంచి విమర్శలు రాగానే... ఆ నినాదాన్ని మార్చారు. భగవంత్‌ మాన్‌ పేరుతో ఓట్లు అడగటం షురూ చేశారు.
- పంజాబ్‌ ఎన్నికలలో పోటీ చేస్తున్న 22 రైతు సంఘాల ఐక్య సమాజ్‌ మోర్చా. రైతు నాయకుడు బల్బీర్‌ రాజేవాల్‌ ఆప్‌తో పొత్తును నిరాకరించారు. ఈలోపు కేజ్రీవాల్‌ ధైర్యం చేసి 90 స్థానాల్లో ఆప్‌ అభ్యర్థులను ప్రకటించారు. మిగతా సీట్లు ఇవ్వటానికి కేజ్రీవాల్‌ సిద్ధమైనా.. రాజేవాల్‌ అంగీకరించలేదు. దీంతో ఆప్‌ ఒంటరిగానే బరిలోకి దిగి అత్యధిక మెజార్టీతో గెలవటానికి దారితీసిందని విశ్లేషకులు చెబుతున్నారు.
కాంగ్రెస్‌ను ముంచిన విభేదాలు
          కాంగ్రెస్‌లో విభేదాలు ఆ పార్టీని పూర్తిగా ముంచివేశాయి. ఎన్నికలకు ముందు ముఖ్యమంత్రిని మార్చడం ప్రతికూలంగా మారింది. ముఖ్యమంత్రి చరణ్‌జీత్‌ సింగ్‌ చన్ని పోటీ చేసిన రెండు నియోజకవర్గాల్లో దారుణంగా ఓటమి చవిచూశారు. పంజాబ్‌ పిసిసి చీఫ్‌ నవజ్యోత్‌ సింగ్‌ సిద్ధూ అమఅత్‌సర్‌ తూర్పు నియోజకవర్గం నుంచి పరాజయం చెందారు. అమృత్‌సర్‌ పార్లమెంట్‌ స్థానం నుంచి మూడు సార్లు విజయం సాధించిన సిద్దూ ఎమ్మెల్యేగా ఓటమి చవిచూశారంటేనే కాంగ్రెస్‌ పరిస్థితి అంచనా వేయవచ్చు. కాంగ్రెస్‌ మంత్రులు, ఎమ్మెల్యేలు ఆప్‌ ధాటికి గల్లంతయ్యారు.
కొత్త చరిత్ర సృష్టించాం,
పేదల అనుకూల, క్రియాశీల పాలనకు ప్రజల మద్దతు : ప్రధాని నరేంద్ర మోడీ
             పార్టీ పేదల అనుకూల, క్రియాశీల పాలనకు ప్రజల నుంచి బలమైన ఆమోదముద్ర లభించింది. ఇది ఉత్సాహం, ఉత్సవాల రోజు. ఈ ఉత్సాహం భారతదేశ ప్రజాస్వామ్యం కోసం. న్యూఢిల్లీలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో బిజెపి కార్యకర్తలను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ నాలుగు రాష్ట్రాల ఎన్నికలలో విజయం 'జీత్‌ కా చౌకా' అని అభివర్ణించారు. ఉత్తరప్రదేశ్‌ చాలా మంది ప్రధానమంత్రులను ఇచ్చిందని, తొలిసారిగా పూర్తి కాలం పనిచేసిన తర్వాత మళ్లీ ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యారని చెప్పారు. సుపరిపాలన మరింత మెరుగ్గా సాగిందన్నారు. గత కొన్నేళ్లుగా పారదర్శకంగా, పేదలకువారి హక్కులను అందజేస్తోందన్నారు. బిజెపి కార్యకర్తలు 24 గంటలూ పనిచేసి ప్రజల విశ్వాసాన్ని గెలుచుకోవడంలో విజయం సాధించారన్నారు. మణిపూర్‌, ఉత్తరప్రదేశ్‌, గోవాలలోనూ బిజెపి ఓట్ల శాతం పెరిగిందన్నారు. గోవాలో అన్ని ఎగ్జిట్‌ పోల్స్‌ తప్పని తేలిందని, గోవా ప్రజలు వరుసగా మూడోసారి వారికి సేవ చేసే అవకాశం ఇచ్చారని చెప్పారు. ''యుపి ప్రజల నుండి నేను పొందిన ప్రేమ. పార్లమెంటు సభ్యునిగా వారణాసి నుంచి నన్ను యుపిగా మార్చారు. ''మై యుపి వాలా,'' అని అన్నారు.
దేశమంతా విస్తరిస్తాం : కేజ్రీవాల్‌
            పంజాబ్‌ ప్రజలు అద్భుతమైన తీర్పు ఇచ్చారు. ఆప్‌ రూపంలో ప్రత్యామ్నాయం దొరికింది. ఆప్‌ జోరులో అమరీందర్‌, చన్నీ, సిద్ధూ, సుఖ్‌బీర్‌సింగ్‌, ప్రకాశ్‌సింగ్‌, బిక్రమ్‌సింగ్‌ కొట్టుకుపోయారు. ఆప్‌ను దేశమంతా విస్తరిస్తాం. ప్రజలు ఆదరించాలి.
ఈ ఫలితాల నుంచి నేర్చుకుంటాం : రాహుల్‌గాంధీ
             ఈ ఎన్నికల్లో విజయం సాధించిన ప్రతి ఒక్కరికీ అభినందనలు. ఈ ఎన్నికల కోసం పనిచేసిన కాంగ్రెస్‌ కార్యకర్తలు, వాలంటీర్లకు కృతజ్ఞతలు. ఈ ఫలితాల నుంచి మేం నేర్చుకుంటాం. దేశ ప్రజల ప్రయోజనాలకు అనుగుణంగా పనిచేస్తాం.
నిరాశ పడొద్దు : శరద్‌ పవార్‌
              తాజా ఎన్నికల ఫలితాలపై ప్రతిపక్షాలు నిరాశ చెందాల్సిన అవసరం లేదు. మనమంతా కలిసి పనిచేసే సమయం మళ్లీ వస్తుంది. దేశవ్యాప్తంగా బిజెపిని వ్యతిరేకించే పార్టీలన్నీ ఒక వేదికపైకి రావాల్సిన అవసరముంది. తద్వారా బిజెపికి ప్రత్యామ్నాయంగా మారుతాం. అంతర్గత సంక్షోభం కాంగ్రెస్‌ను దెబ్బతీసింది. కాంగ్రెస్‌ నిర్ణయాల్ని పంజాబ్‌ ప్రజలు అంగీకరించలేకపోయారు. యూపీలో అఖిలేశ్‌ యాదవ్‌ ఒంటరిగా పోరాడారు. బిజెపికి గట్టి పోటీ ఇచ్చారు. ప్రస్తుత ఎన్నికల ఫలితాలు మహారాష్ట్రలోని శివసేన-ఎన్‌సిపి-కాంగ్రెస్‌ సంకీర్ణ ప్రభుత్వంపై ప్రభావం చూపవు.
కొత్త చరిత్ర సృష్టించాం : యోగి ఆదిత్యనాథ్‌
           ఉత్తరప్రదేశ్‌లో బిజెపి కొత్త చరిత్ర సృష్టించింది. ప్రధానిమోడీ నాయకత్వంలో బిజెపి అద్భుతమైన విజయం అందుకుంది. అభివృద్ధి చూసే రెండోసారి అధికారం ఇచ్చారు. నాలుగు రాష్ట్రాల్లో బిజెపి అధికారంలోకి రాబోతోంది. పార్టీలో ప్రతి ఒక్కరి కృషితోనే ఈ విజయం దక్కింది.
ప్రజల తీర్పును అంగీకరిస్తున్నా : పంజాబ్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు నవజ్యోత్‌సింగ్‌ సిద్ధూ
            ఇది ప్రజా తీర్పు. ప్రజల ఆదేశాన్ని వినయంగా అంగీకరిస్తున్నాం. ఆప్‌కు అభినందనలు'' అని చెప్పారు. అమృత్‌సర్‌ తూర్పు నుంచి పోటీపడిన సిద్ధూ ఓటమి చెందారు. పంజాబ్‌ సీఎం చరణ్‌జిత్‌ సింగ్‌ చన్నీ పరిస్థితి మరీ దారుణం. పోటీ చేసిన రెండు స్థానాల్లో ఆయన ఓటమిపాలయ్యారు. పంజాబ్‌ మాజీ సీఎం కెప్టెన్‌ అమరీందర్‌ సింగ్‌ తన ఓటమిపై స్పందించారు. ప్రజల తీర్పును స్వీకరిస్తున్నట్టు చెప్పారు.
నాలుగు రాష్ట్రాల్లో ఎందుకిలాంటి ఫలితాలు వచ్చాయి?
         రైతులను , కార్మికులను, మధ్య తరగతి ప్రజలను ఇంతగా ఇబ్బంది పెట్టిన బిజెపిని నాలుగు రాష్ట్రాల ప్రజలు ఎందుకు ఆదరించారు?. నిత్యావసర ధరలు పెంచింది. లౌకిక వాదానికి తూట్లు పొడిచింది. మనువాదాన్ని ప్రజలపై బలంగా రుద్దేందుకు ప్రయత్నించింది. రుద్దుతోంది. విద్య, వైద్య రంగాలలో మూఢనమ్మకాలను ప్రోత్సహిస్తోంది. మరెన్నో పాపాలు చేసింది. అయినా ఎందుకు బిజెపికి ప్రజలు సానుకూలంగా మారారు. హిందూత్వ నినాదం పని చేసిందా?...కాంగ్రెస్‌, బిఎస్‌పి, ఇతర రాజకీయ పార్టీలన్నీ ఎందుకు చతికిల పడ్డాయి. భవిష్యత్తులో నయినా కాంగ్రెస్‌ ఇతర పార్టీలను కలుపుకుని పోవాలనే గుణపాఠం నేర్చుకోవాలి. వామపక్ష , ఇతర ప్రాంతీయ పార్టీలతో సఖ్యతగా ఉండాలి. దేశంలో లౌకిక వాదుల బలం పెరగాలి.

కామెంట్‌లు లేవు: