వివాహం అనేది స్త్రీపురుషుల మధ్య చట్టపరమైన ఒడంబడిక లేదా సామాజిక కట్టుబాటు అని సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు ఎంఏ గఫూర్ అన్నారు. 2011 జూన్ 23న గురువారం కర్నూలు సిపిఎం కార్యాలయ ఆవరణంలో ఆ పార్టీ ఆధ్వర్యంలో ఎస్ఎఫ్ఐ జిల్లాకార్యదర్శి సిపి నాయుడు, ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కమిటీ సభ్యులు మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన ఎం.రాధ ఆదర్శ వివాహం చేసుకున్నారు. ప్రస్తుత కట్టుబాట్లు, సాంప్రదాయాలకు, హంగు ఆర్భాటాలకు భిన్నంగా ఈ వివాహం జరిగింది. ప్రముఖ వైద్యులు డాక్టర్ కన్నా ఆచార్యులుగా వ్యవహరించి కష్టసుఖాలలో కలిసుంటామని, సమాజ మార్పుకోసం కృషి చేస్తామని ప్రమాణం చేయించారు. పూలమాలలు వేయించి సాదాసీదాగా అందరి ఆమోదంతో ఈ ప్రక్రియను నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంఏ గఫూర్ మాట్లాడుతూ ఒకరినొకరు తెలుసుకుని ఒడిదొడుకులను తట్టుకుని జీవించడానికి సిద్దపడిన రాధ, సిపి నాయకుడులను అభినందించారు. ప్రేమించే హృదయాలకు పేదరికం, కుల, మతాలు అడ్డురావని అన్నారు. ఆదర్శ వివాహాలు చేసుకునేందుకు ముందుకు రావాలని యువతకు పిలుపు నిచ్చారు. ఇలాంటి వివాహాల వల్ల ఇరువర్గాల వారికి ఖర్చు తగ్గుతుందన్నారు. ప్రజాసమస్యల పరిష్కారం కోసం పాటుపడాలని వధూవరులను కోరారు. మీ సంతోషంతో పాటు పెంచి పెద్దచేసిన తల్లిదండ్రులను గౌరవించాలని, వారి ఆశలను అడియాసలు చేయరాదని సూచించారు.
జిల్లా కార్యదర్శి టి.షడ్రక్ మాట్లాడుతూ ఇలాంటి వివాహాలు తమ పార్టీ ఆధ్వర్యంలో ఎంతో మందికి నిర్వహించామన్నారు. సాంప్రదాయ పెళ్లిళ్లకు భిన్నంగా వివాహాలు చేస్తున్నామన్నారు. సిపిఎం మహబూబ్‌నగర్ జిల్లా కార్యదర్శి కిల్లెగోపాల్ మాట్లాడుతూ సమైక్యతనూ చాటుతూ కర్నూలు, మహబూబ్‌నగర్ ఎస్ఎఫ్ఐ నాయకులు పెళ్లి చేసుకోవడం సంతోషమన్నారు. సేవాదృక్పదం, సమాజ అవగాహన కలిగిన ఎం.రాధ కష్టపడే స్వభావం కలిగి ఉందని చెప్పారు. నాయుడు, రాధ పరస్పరం అవగాహనతో అందరికి మార్గ దర్శకులు కావాలని సూచించారు. సాంప్రదాయాలకు భిన్నంగా ఒకరినొకరు అర్థం చేసుకుని జీవిత భాగస్వాములు కావడం అభినందనీయమని అన్నారు. ఈ సందర్బంగా రాయలసీమ యూనివర్సిటీ ప్రొఫెసర్ పుణ్యశేషుడు, నారాయణ విద్యాసంస్థలు జోనల్ ఇన్చార్జ్ రామలింగేశ్వరరెడ్డి, సాయిరాం విద్యాసంస్థల అధినేత సుధాకర్‌రెడ్డి, మహబూబ్‌నగర్ సిపిఎం కార్యదర్శి కె.గోపాల్, ఐద్వా రాష్ట్ర ఉపాధ్యక్షురాలు పి.నిర్మలమ్మ, కలెక్టరేట్ భూపరిపాలన విభాగం ఎఓ మల్లికార్జున, ఎఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి హుస్సేన్, ఎస్ఎఫ్ఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి నరసింహ, మహబూబ్‌నగర్ జిల్లా ఎస్ఎఫ్ఐ నాయకులు బాలనాగిరెడ్డి, జిల్లా అధ్యక్షులు శ్రీరాంలు వధువరులను ఆశీర్వదిస్తూ వారి జీవితం సుఖసంతోషాలతో సాగాలని, సమాజ సేవకోసం పాటుపడుతూ అందరికి ఆదర్శంగా నిలవాలని ఆకాంక్షించారు. ఈ ఆదర్శ వివాహానికి అన్ని ప్రజాసంఘాల నాయకులు హాజరై వారిని ఆశీర్వదించారు.
3 కామెంట్లు:
congratulations to new couple
వధూవరులకు శుభాకాంక్షలండి
నూతన జంటకు శుభాకాంక్షలు. ఇలాంటి పెల్లిలను ప్రోత్స్తహించిన పెద్దలు అభినందనీయులు. ఉన్నతికి దారి చూపేదే ప్రేమ. సామాజిక భాద్యతను గుర్తెరిగి ఆదర్శంగా నిలుస్తారని మనస్పూర్తిగా ఆకాంక్షిస్తున్నా...
కామెంట్‌ను పోస్ట్ చేయండి