25, డిసెంబర్ 2012, మంగళవారం

ప్రజల మోసగించు పద్ధతేల?


అఖిల పక్షము పేర అసలు సంగతి దాచి
కాల హరముచేయు కాంగిరేసు
రాష్ట్ర విభజనమ్ము రాజకీయ మయ్యెను
ప్రజల మోస గించు పద్ధతేల?


               రాజకీయ పార్టీలు రాష్ట్రాన్ని విభజించాలా వద్దా అనేది స్పష్టత లేకుండా వ్యవహరిస్తున్నాయి. ప్రజాసమస్యలన్నీ పక్కనబెట్టి సెంటిమెంటును రాజకీయం చేస్తున్నాయి. రాష్ట్ర విభజన సాధ్యాసాధ్యాలను అధికార పార్టీ తేల్చాలి. అదికూడా తేల్చకుండా కాలయాపన చేస్తోంది. రాష్ట్రంలో కాంగ్రెస్‌, టిడిపి, బిజెపి, వైఎస్‌ఆర్‌సిపి వైఖరి ప్రకటించడం లేదు. తెలంగాణాలో పైన చెప్పిన పార్టీ ల నాయకులు రాష్ట్రాన్ని విభజించాలని, సీమాంధ్ర ప్రాంత నాయకులు ఐక్యంగా ఉండాలని ఒకే పార్టీలో భిన్నస్వరాలు వినిపిస్తున్నారు. వామపక్షాలలో సిపిఎం మినహా ప్రాంతానికో మాట చెబుతున్నాయి. రాష్ట్రం ఐక్యంగా ఉండాలని సిపిఎం వైఖరి ప్రకటించింది. ఈ విషయాన్ని వెంటనే తేల్చాలని కూడా ఒత్తిడి చేస్తోంది. గతంలో అఖిలపక్ష సమావేశంలో పార్టీకి ఇద్దరిని పిలిచారు. అప్పుడూ స్పష్టత రాలేదు. డిసెంబర్‌ 28న నిర్వహించే అఖిల పక్ష సమావేశానికి కూడా పార్టీకి ఇద్దరిని పిలిస్తే అదే వస్తుంది. శ్రీ కృష్ణ కమిషన్‌ నివేదిక బుట్టదాఖలయింది. డిసెంబర్‌ తొమ్మిది చిదంబరం ప్రకటనను వక్రీకరించారు. కాలయాపన చేయడం వల్ల కాంగ్రెస్‌కు రెండు రకాల నష్టాలు జరిగాయి. తెలంగాణాలో టిఆర్‌ఎస్‌ బలపడింది. అదేనినాదంతో బిజెపి లాభపడింది. ఇలా చిన్నాచితక పార్టీలన్నీ తెలంగాణ పేరుతో బలపడుతున్నాయి. కోస్తాంధ్రలో మాత్రం వైఎస్‌ఆర్‌సిపి లాభపడింది. తెలంగాణ ఇస్తే కాంగ్రెస్‌లో కలిసిపోతామని టిఆర్‌ఎస్‌ చెప్పాక ఆ విషయాన్ని ప్రచారం చేసి టిడిపి, వైఎస్‌ఆర్‌సిపి లాభ పడుతున్నాయి. రాష్ట్రంలో కేంద్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్‌ పార్టీ ఈ సమస్యపై స్పష్టమైన విధానం ప్రకటించకుండా ప్రతిపక్షాలను ఒంటరి చేయాలని ప్రయత్నిస్తోంది. రాష్ట్రంలో అధికార పార్టీలో భేదాభిప్రాయాలు, తెలంగాణ రాష్ట్ర విభజన రెండింటి మధ్య ప్రజల సమస్యలను గాలికొదిలేశారు. ఈరెండు అంశాలకు తోడు అవినీతి, జగన్‌ కేసులు , మధ్యలో వచ్చిన తెలుగు సంబరాలు వీటిచుట్టూ ప్రభుత్వ వ్యవహారాలన్నీ ఉన్నాయి. ఆరు నెలలుగా సంక్షేమ పథకాలు అమలు చేయడం లేదని ముఖ్యమంత్రే శాసనసభలో ప్రకటించారు. అధికార, ప్రతిపక్షపార్టీల వైఖరి ప్రజలకు ఇబ్బందులు కలిగించేలా ఉంది. అన్ని రకాల భారాలు మోపి ప్రజలను కష్టాల్లోకి నెడుతున్నాయి.

కామెంట్‌లు లేవు: