27, డిసెంబర్ 2012, గురువారం

ప్రపంచ తెలుగు మహాసభలు ప్రారంభం

             నాలుగో ప్రపంచ తెలుగు మహాసభలను 2012 డిసెంబర్‌ 27న ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు జిల్లా తిరుపతిలో రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జి ప్రారంభించారు. అనంతరం రాష్ట్ర పతి ప్రసంగిస్తూ తెలుగు మహాసభలకు హాజరయిన వారందరికీ అభినందనలు తెలిపారు. తెలుగు భాష అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న కృషి అభినందనీయమని ప్రశంసించారు. 11 నుంచి 14వ శతాబ్ధాల మధ్య కాలం తెలుగు సాహిత్యానికి స్వర్ణయుగమని అన్నారు. అనంతరం ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి అధ్యక్షోపన్యాసం చేశారు. ప్రంపంచంలోని తెలుగు వారందరికీ ఈసందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. 37 సంవత్సరాల తరువాత తెలుగు మహాసభలు నిర్వహించే అవకాశం దక్కడం అదృష్టంగా భావిస్తున్నానని తెలిపారు. మొదటి మహాసభలు 1975 ఏప్రెల్‌ 12 నుంచి 18 వరకూ హైదరాబాద్‌లో, రెండో మహాసభలు 1981 ఏప్రెల్‌ 14 నుంచి 18 వరకూ మలేసియా రాజధాని కౌలాలంపూర్‌, మూడో ప్రపంచ మహాసభలు 1990 డిసెంబర్‌ 10 నుంచి 13 వరకూ మారిషస్‌లో జరిగాయి. నాలుగో మహాసభలు తిరుపతిలో జరగడం సంతోషించదగ్గ విషమని చెప్పారు. తెలుగు భాషకు ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. తెలుగు భాషను పాలన, బోధన భాషగా అమలు చేస్తామని వెల్లడించారు. సంగీత, సాహిత్య, లలిత కళల, అకాడమీలను పునఃప్రారంభిస్తామని తెలిపారు. అనంతరం గవర్నర్‌ ప్రసంగిస్తూ ఈరోజు తెలుగు వారందరికీ పండుగ రోజని అన్నారు. తెలుగు భాష సంగీత కళలకు అనువైనదిగా అభివర్ణించారు. భారతదేశంలో ఎక్కువ మంది మాట్లాడే భాషల్లో తెలుగు రెండోదని అన్నారు. తెలుగులో అనేక పరిశోధనలు జరుగుతున్నాయని చెప్పారు. ఈ మహాసభలకు తెలుగు భాషాభిమానులు, కవులు, పండితులు, ప్రపంచ దేశాల్లో స్థిరపడిన తెలుగు మాట్లాడే ప్రముఖులు, వివిధ కళలలో నిఫుణులు, రాష్ట్ర మంత్రులు, ప్రజాప్రతినిధులు హాజరయ్యారు.

కామెంట్‌లు లేవు: