9, జనవరి 2013, బుధవారం

30 ఏళ్ల సోషల్‌ మీడియాకు జేజేలు

                      సోషల్‌ మీడియా ప్రారంభించి ఓ తరం దాటింది. తరమంటే గందరగోళ పడకండి. ఒక తరం అంటే 30 ఏళ్లు అని అర్థం.30 ఏళ్లలో అన్ని రంగాల్లో అనేక మార్పులు వచ్చాయి. అలాగే సోషల్‌ మీడియాలో కూడా మార్పులు చోటు చేసుకున్నాయి. అసలు సోషల్‌ మీడియాఅంటే ఏమిటో తెలుసుకోవాలనుకుంటే ఈ క్రింది సమాచారం చదవండి......
                సోషల్‌ మీడియా వ్యాపార సాధనంగా, వ్యాపారంగా మొదలైంది. ఒక సరుకును ఇంటర్నెట్‌ ద్వారా ప్రచారం చేయడం, దానిపై వినియోగదారుల స్పందనలు తెలుసుకోవడం, వాటి ఆధారంగా కొత్త వినియోగదారులను ఆకర్షించడం, మార్కెట్‌ను విస్తరించుకోవడం-ఇదీ సోషల్‌ మీడియా పని చేసే తీరు. గూగుల్‌, ఫేస్‌బుక్‌, ట్విట్టర్‌, మైస్పేస్‌, లింక్‌డ్‌ఇన్‌, యూట్యూబ్‌ వగైరాలన్నీ ఈ కోవకు చెందినవే. వీటిల్లో పాల్గొనే వారి సంఖ్యపై ఆధారపడి అడ్వర్‌టైజ్‌మెంట్సు వస్తాయి. అదే ఆదాయం. అలా గూగుల్‌, ఫేస్‌బుక్‌లు ప్రపంచంలోనే అతి పెద్ద ఇంటర్నెట్‌ కంపెనీలుగా మారాయి. సమాచార వ్యవస్థపై గుత్తాధిపత్యం దిశగా అడుగులేస్తున్నాయి. ఇంటర్నెట్‌పై నేడు అమెరికా ఆధిపత్యం కొనసాగుతోంది. వెబ్‌సైట్స్‌ రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలంటే అమెరికా కంపెనీలనే ఆశ్రయించాలి. ఇటీవల దుబారులో జరిగిన అంతర్జాతీయ టెలికమ్యూనికేషన్‌ సదస్సులో ఆధిపత్య పోరాటం జరిగింది. అమెరికా ఆధిపత్యం కొనసాగాలని కొద్ది దేశాలు వాదించగా, ఐక్యరాజ్యసమితి ఆధ్వర్యంలో ఆయా దేశాల ప్రభుత్వాల ఆధిపత్యం ఉండాలని మెజారిటీ దేశాలు నిర్ణయించాయి. ఒక స్వతంత్ర సంస్థ ఆధ్వర్యంలో నడవాలని మరి కొన్ని దేశాలు చెప్పాయి. మన దేశం ఎటూ చెప్పకుండా తిరిగొచ్చింది.
                   లాభం కోసం ఆరంభమైన కార్పొరేట్‌ ఇంటర్నెట్‌ కంపెనీలు అచేతనంగానే ఈ-తరాన్ని చైతన్య స్రవంతిలోకి లాగుతున్నాయి. టీవీ, పత్రికలకు భిన్నమైంది సోషల్‌ మీడియా. టీవీల్లో వ్యాఖ్యాతలు చెప్పేది వినాలి. పత్రికల్లో ఎడిటర్లు రాసింది చదవాలి. జనం పాఠకులుగానో, వీక్షకులుగానో ఉంటారు. ఇది ఒక రకమైన ప్రేక్షక పాత్ర. దీనికి భిన్నంగా సోషల్‌ మీడియాలో నెట్‌జనులదే ప్రధానపాత్ర. ఒక అభిప్రాయాన్ని మీడియాకు పంపిస్తే వాళ్లు ప్రసారం చేయొచ్చు, చేయకపోవచ్చు. కానీ దాన్నే సోషల్‌ మీడియాలో అప్‌లోడ్‌ చేస్తే అనేక మందికి చేరుతుంది. ఇలా ప్రతి ఒక్కరూ తమతమ అభిప్రాయాలు ఇతరులకు తెలపొచ్చు. దానిపై ఇతరులు స్పందించవచ్చు. భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేసుకోవచ్చు. అందరి భావాలకూ సమాన విలువే ఉంటుంది. నచ్చిన అభిప్రాయాలపై ఏకాభిప్రాయానికి రావచ్చు. అందరి అభిప్రాయాలూ ఒక చోట కలిస్తే అదే ఒక శక్తిగా మారుతుంది. దీన్నే భావాలు భౌతికశక్తిగా మారడం అన్నాడు లెనిన్‌. అరబ్‌ దేశాల్లోనూ, అమెరికాలోనూ, నేడు ఇండియాలోనూ జరుగుతున్నదదే.
                     సరిగ్గా 30 ఏళ్ళ క్రితం ఇంటర్నెట్‌ ఆవిర్భవించింది. అంతకు ముందు నుంచే కంప్యూటర్లున్నాయి. కంప్యూటర్ల మధ్య అనుసంధానం కూడా ఉంది. కానీ ఒక కంప్యూటర్‌కిచ్చే ఐపి అడ్రసు ద్వారా అందులో ఉండే సమాచారాన్ని ఎక్కడ నుండైనా మరో కంప్యూటర్‌లోకి డౌన్‌లోడ్‌ చేసుకొని చూడగలిగే అవకాశం ఇంటర్నెట్‌ కల్పించింది. టెలిఫోన్‌ కేబుల్‌ ద్వారా వీటి మధ్య అనుసంధానం జరుగుతుంది. ఈ టెక్నాలజీనే అర్పానెట్‌ అనేవాళ్లు. 1983 జనవరి 1న తొలిసారి అమెరికా రక్షణశాఖ 500 మిలిటరీ కంప్యూటర్లను జయప్రదంగా అనుసంధానించింది. సోవియట్‌ యూనియన్‌ను దెబ్బకొట్టడానికి, తనను తాను కాపాడుకోవడానికి మిలిటరీ దీన్ని ఉపయోగించుకుంది. 1960లలోనే అమెరికా ఇందుకోసం పెద్ద ఎత్తున నిధులు కేటాయించింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తమ మిలిటరీ కేంద్రాల రహస్యాలు, వివిధ దేశాల్లోని తమ రాయబార కార్యాలయాల నుంచి వచ్చే నిగూఢ సమాచారం, సిఐఎ ఏజెంట్లు పంపే సాంకేతిక సమాచారం సోవియట్‌ యూనియన్‌కు చేరకుండా, టెలిగ్రాఫ్‌, టెలిఫోన్‌ లైన్ల మధ్యలో దూరి వేరెవరైనా తస్కరించకుండా ఈ ఏర్పాటు చేసుకున్నారు. సోవియట్‌ పతనం తర్వాత 1995లో దీన్ని వాణిజ్య అవసరాలకు కూడా విడుదల చేశారు. వరల్డ్‌వైడ్‌ వెబ్‌(డబ్ల్యుడబ్ల్యుడబ్ల్యు), నెట్‌స్కేప్‌ అప్లికేషన్‌ రావడంతో ఈ పరిణామం మరింత వేగవంతమైంది. తద్వారా ప్రపంచవ్యాప్తంగా తమ ఆర్థిక కార్యకలాపాలు పెంచుకునేందుకు అమెరికా దీన్ని ఉపయోగించుకుంది. కార్పొరేట్‌ కంపెనీలకు ప్రపంచంలో చౌకగా శ్రమ ఎక్కడ దొరికినా ఉపయోగించుకునే సామర్థ్యం పెరిగింది. సమాచార, సాంకేతిక రంగంలో వచ్చిన విప్లవాత్మక మార్పులకు, ప్రపంచీకరణ విస్తరణకు మధ్య అవినాభావ సంబంధం ఉంది. మన దేశానికి అవుట్‌సోర్సింగ్‌ ద్వారా కాల్‌ సెంటర్లు, ఐటి ఉద్యోగాలు రావడంతో ఇంజనీరింగులో కంప్యూటర్‌ ఆధారిత కోర్సులకు ప్రాధాన్యత పెరిగింది. కాలేజీలు పెరిగాయి. యువతరం మధ్య నెట్‌ సంబంధాలు విస్తరించాయి. అది అలా అలా విస్తరించి సామాన్యుల చెంతకు చేరింది. సిటిజనుల్లో నెట్‌జనులనే కొత్త పొర ఏర్పడింది. వారే నేడు సోషల్‌ మీడియాకు వాహకులు.
        ఒకప్పుడు కంప్యూటర్‌ ఉంటేనే ఇంటర్నెట్‌. కానీ ఇప్పుడు స్మార్ట్‌ఫోన్‌ ద్వారా కనెక్ట్‌ కావచ్చు. వచ్చే రెండేళ్ళలో స్మార్ట్‌ఫోన్‌ వాడకందార్లు రెట్టింపవుతారని పారిశ్రామిక వర్గాల అంచనా. మన దేశంలో ప్రస్తుతం ఇంటర్నెట్‌ కనెక్షన్‌ ఉన్నవాళ్లు దాదాపు 14 కోట్ల మంది ఉన్నారు. వీరిలో 55 శాతం మొబైల్‌ వినియోగదారులే. గ్లోబల్‌ వెబ్‌ ఇండెక్స్‌ లెక్కల ప్రకారం ప్రపంచంలో భారత్‌ మూడో స్థానంలో ఉంది. 6.50 కోట్ల మంది ఫేస్‌బుక్‌ వినియోగదారులున్నారు. ట్విట్టర్‌ వాడుతున్నవాళ్లు దాదాపు మరో రెండు కోట్లు. ఇంటర్నెట్‌ వినియోగదారుల్లో 75 శాతం 35 సంవత్సరాల లోపు పట్టణ యువతరం. సోషల్‌ మీడియా ద్వారా 45 శాతం రాజకీయ చర్చల్లో చురుగ్గా ఉంటున్నారని ఈ మధ్య 'ప్యూ' అనే పరిశోధనా సంస్థ చేసిన సర్వేలో వెల్లడైంది. ఈ విషయంలో కొన్ని అరబ్‌ దేశాలు మనకన్నా ముందున్నాయి. ఇంటర్నెట్‌ విస్తరించేకొద్దీ సమాజంలో దాని పాత్ర, ప్రభావితం చేసే శక్తి పెరుగుతోంది. లాభం కోసమైనా అది ప్రజల వద్దకు రాక తప్పలేదు. ప్రజల భావాలను మోయకా తప్పలేదు. ఇంటర్నెట్‌ ఒక సాధనం మాత్రమే. అది ఎవరి చేతిలో ఉంటే వారికి ఉపయోగపడుతుంది. ప్రగతిశీలురే కాదు అభివృద్ధి నిరోధక శక్తులు, ప్రభుత్వమూ కూడా ప్రజలను ప్రభావితం చేయడానికి దీన్ని ఉపయోగించుకుంటున్నాయి. టీవీ, పత్రికలకు ఇది పోటీ కాదు. పైగా వాటికి సహాయకారి.

కామెంట్‌లు లేవు: