భోగి స్నానాలు చేసేసి పండగరోజులోకి ప్రవేశించేశారు
కదూ! ముందుగా మీకందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు..! ఓ వైపు చల్లటిగాలులు.
మరోవైపు మంచుకురుస్తూ ధనుర్మాసం ప్రవేశిస్తుంది. అదే సంక్రాంతి నెల
ప్రారంభం. ముద్దబంతులు విరబూసి మురిపించేకాలం. గుమ్మడిపూలను గొబ్బెమ్మలపై
పెట్టి యువతులు ముత్యాలముగ్గులు వేసి మురిసేకాలం. గాలిపటాలు ఎగరేస్తూ
యువకులు ముచ్చటపడే కాలం. అన్నీ అనుకూలిస్తే రైతన్నకు ఫలసాయాలు పుష్కలంగా
చేతికొచ్చేకాలం. ఘుమఘుమలాడే పిండివంటల్ని మహిళలు తయారుచేసి అందర్నీ
చవులూరించేకాలం. సంక్రాంతి అంటే అందరికీ ఇష్టమే. పిల్లలకు సెలవులు.
అమ్మమ్మ, నాన్నమ్మ, తాతయ్యల ఊళ్లకు పయనాలు. ఒక్కమాటలో చెప్పాలంటే ఉపాధి
కోసం ఎంత దూరంలో వున్నా పల్లెకు పయనమయ్యే పండుగ సంక్రాంతి. పిల్లాపెద్దా
అందరూ ఒక్కచోట చేరి సంబరంగా గడిపే పండుగ ఇదే అంటే అతిశయోక్తి కాదు. మారిన
పరిస్థితుల్లో నిజంగా ఇది అందరికీ పండుగేనా అంటే కచ్ఛితంగా అవునని
చెప్పలేం. అందరం బాగున్నరోజే అసలైన పండుగ. ఏదేమైనా ఈ సంక్రాంతి క్రాంతి మన
రాష్ట్రంలోనే వివిధ ప్రాంతాల్లో, అలాగే వివిధ రాష్ట్రాల్లోనూ, వివిధ
దేశాల్లోనూ ప్రసరిస్తోంది. ఆ సంక్రాంతి విశేషాలే ఈ పండుగ వేళ మీకోసం.
బంతిపూల సందళ్లు..
ఈ
పండుగకు ప్రత్యేక అలంకారం బంతిపూలు. అందుకే వీటిని 'సంక్రాంతి పూల'నీ
అంటుంటారు. ఇవ్వాళా రేపూ పట్టణాల్లో ఎప్పుడుబడితే అప్పుడు పెద్దగా
ఎదగనీయకుండానే చిన్న చిన్న మొక్కలకే బంతిపూలను పూయించేస్తున్నారనుకోండి. ఈ
బంతిపూల సువాసన అత్యద్భుతం. పూలే కాదు వీటి ఆకులు కూడా అంతే సువాసన కలిగి
వుంటాయి. బంతుల్లో బోలెడు రకాలున్నాయి. ఒక్కమాటలో చెప్పాలంటే ముద్దబంతి,
రెక్కబంతి అనొచ్చు. కానీ గడపకు రాసే పసుపురంగులో, కాషాయపురంగులో,
నిమ్మపండురంగులో, కుంకుమరంగులో విరబూస్తూ అలరిస్తాయి. బంతుల్లో ముద్దబంతి,
నూకబంతి (నూకలు నూకలుగా వుండే నూకబంతి.. దీన్నే బియ్యపు బంతి అని కూడా
అంటారు), రెక్కబంతి, కారపుబంతి.. ఇలా రకరకాలుగా ముద్దబంతైనా, రేకబంతైనా,
నూకబంతైనా రంగు రంగుల్లో వికసించి కనువిందు చేస్తాయి. అన్నింటిలోకి
ఆకర్షణగా నిలిచేది కారపుబంతి. ఇది కుంకుమరంగులో, కుదురుగా పెరిగి బోలెడు
పూలు పూస్తుంది. ఈ పూలను కాగడా మల్లెలతోనో, వేరే బంతులతోనో కలిపి మాలలు
కట్టి జడల్లో పెట్టుకోవటానికి అమ్మాయిలు మక్కువ చూపుతారు. ఇక బంతిపూలను
ముగ్గుల్లో పసుపు కుంకమలతో పాటు చల్లుతారు.
కొత్తబట్టల సరదా..
ఈ
పండుగకే కొత్త బట్టల సరదా తీరేది. అప్పటి వరకూ గౌనుల్లో తిరిగే చిన్నారి సీ
గానపెసూనాంబలు సైతం ఈ పండుగకు పొడుగు లంగాలు, పట్టులంగాలు కుట్టించమంటూ
పేచీలు పెట్టి మరీ సాధించుకుంటారు. నిక్కర్లలో వున్న చిట్టి తమ్ముళ్లు
జీన్స్ ప్యాంట్లు కావాలంటూ బాపు బుడుగులాగా ఊరంతా వినపడేలా ఏడ్చి మరీ
కొనిపించుకుంటారు. ఇక యువతుల సందడి అంతా ఇంతా కాదు. ఓణీలు వేసుకోవాలని
తహతహలాడతారు. పెద్దల నుండి పిల్లల వరకూ ఈ పండుగకు కొత్తబట్టలు కొనుక్కోవడం
పరిపాటి. ఈ పండుగ సందర్భంగా అబ్బాయిలకు పంచెలు, అమ్మాయిలకు ఓణీలు
కట్టబెట్టి పెద్దలు మురిసిపోతారు.
గొబ్బెమ్మలు.. ముగ్గులు..
యువతులంతా
పేపర్లలో వచ్చిన ముగ్గుల్ని పరీక్షలకు సిద్ధమైనంత శ్రద్ధగా నేర్చేసుకుని,
తెల్లారికల్లా వాకిట్లో వేసేయాలని తెగ ఉబలాటపడతారు. ఇరుగుపొరుగు వారితో
పోటీపడుతూ వినూత్నంగా రంగవల్లికలు తీర్చిదిద్దుతారు. వాటిల్లో రంగులు నింపి
మరింత ముచ్చటగొలుపుతారు. పెద్ద పెద్ద రథం ముగ్గులు వేయడం.. దాని తాడు ఎంత
పొడుగ్గా వీలైతే అంతా పొడుగ్గా వేస్తూ వేరే వాళ్ల రథం తాడుకు కలుపుతూ
సంబరపడిపోతారు. ఇలా కలపడానికి సోదరీమణులకు సోదరులు సహాయపడతారు. గొబ్బెమ్మలు
పట్టణాల్లో సాధ్యకాకపోయినా పల్లెల్లో అక్కడక్కడా ఇప్పటికీ పెడుతున్నారు. ఈ
గొబ్బెమ్మలపై ముగ్గులతో తెల్లని అడ్డగీతలు వేసి, పూలతో, పసుపుకుంకుమలతో
అలంకరిస్తారు. వాటివద్ద రేగిపండ్లు, నవధాన్యాలు ఉంచుతారు.
గాలిపటాలు..
అబ్బాయిలు
ఈ పండుగ కోసం ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసేది గాలిపటాలు ఎగురేయడానికే. 'పద
పదవే ఒయ్యారి గాలి పటమా..!' అని పండుగకు పదిరోజుల ముందే ఈ గాలిపటాల్ని,
దారాల్ని (మాంజాల్ని) కొని, రెపరెపలాడిస్తూ సందడి చేస్తారు. కొన్ని
ప్రాంతాల్లో ఈ పండుగను 'పతంగుల పండుగ' అని కూడా పిలుస్తారు. దీన్నిబట్టి
గాలిపటాలు ఈ పండుగకు ఎంతగా ఎగరేస్తారో వేరే చెప్పనవసరం లేదనుకుంట.
భోగిపళ్లు.. బొమ్మలకొలువులు..
భోగి పండుగకు బుజ్జి తమ్ముళ్లకూ, చెల్లాయిలకూ రేగిపళ్లతో బంతిపూలు, పైసలు
(నాణేలు) కలిపి భోగిపళ్లు పోస్తారు. అలాగే ఈ పండుగకు అమ్మాయిలు ముచ్చటపడేది
బొమ్మలకొలువు. ఎప్పటి నుండో కొనుక్కున్న బొమ్మలతోపాటు కొత్తగా కొనుక్కున్న
వాటిని జతచేర్చి, బొమ్మల కొలువు తీర్చిదిద్దుతారు. రోజుకో ప్రసాదం అమ్మతో
తయారుచేయించుకుని, చిట్టిపొట్టి పేరాంటాళ్లను పిలిచి తమ బొమ్మలన్నీ చూపించి
మురిసిపోతారు. ఈ సందర్భంగా పాటలు పాడి, ఆడతారు.
పిండి వంటలు..
ఇళ్లల్లో ఆడవాళ్లంతా ఈ పండుగ వచ్చిందంటే ఒకటే సందడి. ఇళ్లు దులుపుకోవడం
దగ్గర నుండి ఇంటికి సున్నాలు వేయడం వరకూ నెల రోజుల ముందునుండే పనులు
మొదలుపెడతారు. పండుగ రోజు పొంగలి, పులిహౌరా చేసుకుంటారు. అంతకు పక్షం రోజుల
ముందు నుండే అమ్మలక్కలంతా కలిసి అరిసెలు వండటం ప్రారంభిస్తారు. పల్లెల్లో
ఒక్కొక్కరివి ఒక్కోరోజు వండుతూ వుంటారు. ఆ సందర్భాల్లో హాస్యపు జల్లులతో ఆ
వాతావరణం చూడముచ్చటగా వుంటుంది. అరిసెలు వత్తడానికి ఎక్కువగా మగవాళ్లు
తమవంతు సాయం చేస్తారు. ఈ సందర్భాల్లో వరసైన వాళ్లమీద చతుర్లాడుతూ నవ్వులు
పూయిస్తారు. ఇవన్నీ పల్లెల్లోని మనుషుల కల్మషంలేని మనస్సుల్ని, ఐక్యతను
చాటి చెప్తాయి. అలాగే కొన్ని ప్రాంతాల్లో చకినాలు ఈ పండుగ ప్రత్యేక వంటకం.
ఇంకా కారప్పూస, చక్కలు (అప్పలు), కజ్జికాయలు, బూందీ, సున్నుండలు, పోకుండలు,
మిఠాయిలు, లడ్డూలు ఇలా ఎవరి ఆర్థికస్థోమతకు తగ్గట్టు వాళ్లు
తయారుచేసుకుంటారు.
భోగిమంటలు, కోడిపందేలు..
ఈ పండుగకు బంధువులందరూ
కలుసుకుంటారు. కొత్త అల్లుడు తప్పనిసరిగా అత్తగారింటికి వస్తాడు. ఈ పండుగకు
పెద్ద కొయ్యదుంగలతో భోగిమంటలు వేస్తారు. అందులో ఇళ్లల్లో పనికిరాని చెక్క
సామాన్లను, ముళ్లకంపల్ని, నెలరోజుల నుండి చేసిన గొబ్బెమ్మల పిడకల్ని
వేస్తారు. అందరూ పెద్ద పెద్ద కాగులతో, బిందెలతో, కుండలతో నీళ్లుకాచుకుని
తలస్నానాలు చేస్తారు. ఈ పండుగ నాడు గంగిరెద్దుల్ని అలకరించుకుని
గంగిరెద్దుల వాళ్లు వచ్చి వాటిని ఆడిస్తారు. 'హరిలో రంగ హరి..!' అంటూ వచ్చే
హరిదాసులు ఈ పండుగ ప్రత్యేక ఆకర్షణ. రైతులు పశువులకు మెడలో గంటలు, కాళ్లకు
మువ్వలు కడతారు. ఎడ్ల బండ్లను, నాగళ్లు వంటి వ్యవసాయ సామగ్రిని రంగులతో,
పూలతో అలంకరిస్తారు. పశువుల్ని బండ్లకు కట్టి తీసికెళుతుంటే వాటి మెడలోని
గంటల, కాలి మువ్వల శబ్ధాలు లయబద్ధంగా వినసొంపుగా వుంటాయి. కనుమ రోజు గారెలు
చేసి, కోడికూర వండడం ప్రత్యేకం. ఒకప్పుడు వేడుకగా జరిగే కోడిపందేలు
రానురానూ రాజకీయ ప్రోద్భలంతో డబ్బు పంపిణీకి ప్రధాన వేదికగా మారిపోయాయి.
నిషేధం అమల్లో వున్నా నేటికీ ఈ పండుగకు ఇవి అక్కడక్కడా జరుగుతూనే వున్నాయి.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి