6, జూన్ 2015, శనివారం

ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఆకలికేకలు



 - రీసెర్చ్‌స్కాలర్స్‌కు రాత్రి అన్నమే టిఫిన్‌
-సరుకులు లేవు అన్నం పెట్టలేమన్న వార్డెన్లు
-మూడు హాస్టళ్ళలో ఇదే పరిస్థితి
-రూ.65 లక్షలకు చేరిన బకాయిలు
-ప్రభుత్వం బడ్జెట్‌ ఇవ్వక పోవడం వల్లే ఈ దుస్థితి


     ‘ఉస్మానియ క్యాంపస్‌లో ఉదయించిన కిరణమా వీర తెలంగాణమా’ అని పాడుకున్న పాటను రాష్ట్ర ప్రజలు మరచి పోక ముందే పాలకులు మాత్రం ఉస్మానియా విద్యార్థులను మరచిపోయారు. తరగతులను బహిష్కరించి తమ భవిష్యత్‌ను ఫణంగా పెట్టి రెండేళ్ళ పాటు లాఠీలను, తూటాలను లెక్కచేయకుండా పోరాడిన విద్యార్థులు ఇప్పుడు తాము సాధించిన రాష్ట్రంలోనే ఆకలితో అలమటిస్తున్నారు. తెలంగాణ నిర్మాణంలో తమ మేధాశక్తిని వినియోగించుకోవలసిన పరిశోధక విద్యార్థులు అర్థాకలితో కాలం గడుపుతున్నారు. ఒక వైపు తెలంగాణ రాష్ట్ర అవతరణ సంబురాల్లో పాలకులు మునిగి తేలుతుంటే  విద్యార్థులు మాత్రం కెసిఆర్‌ చెప్పే బంగారు తెలంగాణలో తాము లేమా అని ప్రశ్నిస్తున్నారు.
                    కేవలం కొద్దిపాటి బకాయిలను రాష్ట్ర ప్రభుత్వం చెల్లించక పోవడంతో ఉస్మానియా విశ్వవిద్యాలయంలోని మూడు ప్రధాన హాస్టళ్ళ మెస్‌లలో భోజనం పెట్టలేని పరిస్థితి ఏర్పడిరది. అంబేద్కర్‌ హాస్టల్‌గా పిలుచుకుంటున్న రీసెర్చ్‌ స్కాలర్స్‌ హాస్టల్‌లో (2015 జూన్‌ 6న) శనివారం ఉదయం టిఫిన్‌ కూడా పెట్టక పోవడంతో రీసెర్చ్‌ విద్యార్థులు శు క్రవారం రాత్రి వండిన అన్నంలో కొంత మిగిలితే అది తిని కడుపు నింపుకున్నారు. ఉస్మానియా విశ్వవిద్యాలయంలోని డిగ్రీ, పిజి కళాశాలలకు శెలవులు కావడంతో కొంత మంది విద్యార్థులకు మెస్‌ సౌకర్యాన్ని అధికారికంగానే నిలిపి వేశారు. వివిధ విభాగాల్లో విద్యనభ్యసిస్తున్న పరిశోధన విద్యార్థులకు మాత్రం ఎండాకాలం శెలవులంటూ ఉండవు. వీరికి సంవత్సరం పొడవునా హాస్టల్‌ వసతి, మెస్‌ సౌకర్యం ఉంటుంది. దాదాపు 700 మంది పరిశోధన విద్యార్థులు యూనివర్సిటీలో ఉండగా వీరిలో ఎక్కువ మంది ఎన్‌ఆర్‌ఎస్‌హెచ్‌, కొత్త పిజి, పాత పిజి హాస్టళ్ళలో ఉంటున్నారు. హాస్టల్‌ విద్యార్థులకు అవసరమైన మెస్‌ చార్జీలను గత కొద్దికాలంగా యూనివర్సిటీ అధికారులు ఇవ్వక పోవడంతో వార్డెన్లు అయోమయంలో పడిపోయారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన బకాయిలు, గ్రాంట్‌లు రాక పోవడంతో మెస్‌ల నిర్వహణ కష్టతరమవుతోందని అధికారులం టున్నారు. మెస్‌లు మూసేస్తే విద్యార్థులు ఆందోళన చేస్తారని భావించిన కొందరు అధికారులు బియ్యం, కిరాణా సామాన్లను అరువు తెచ్చి కాలం గడుపుతూ వచ్చారు. ఈ బకాయిలు కూడా రూ. 65 లక్షలకు దాటి పోవడంతో వీటిని సరఫరా చేసే వర్తకులు కూడా సరఫరా నిలిపివేశారని వార్డెన్లు తెలిపారు. శుక్రవారం సరకుల నిల్వ అయిపోవడంతో శనివారం ఉదయం తమ హాస్టల్‌లో టిఫిన్‌ కూడా వండలేదని రీసెర్చ్‌ విద్యార్థులు తెలిపారు. కట్టెలు, పాలు సరఫరా చేసే వారికి కూడా బకాయిలు చెల్లించక పోవడంతో వారు కూడా సరఫరా నిలిపి వేశారని వారు వాపోయారు. రీసెర్చ్‌ విద్యార్థులు ఉంటున్న పాత పిజి హాస్టల్‌లో కూడా శనివారం సాయంత్రం వరకూ మాత్రమే సరుకులు సరిపోతాయని, కొత్త పిజి హాస్టల్‌లో మరో రెండు రోజుల వరకే సరుకులు ఉన్నాయని వార్డెన్‌ తెలిపారు. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో విద్యార్థుల కోసం 15 హాస్టళ్ళు, వీటికి అనుబంధంగా మెస్‌లు పనిచేస్తున్నాయి. వీటిలో దాదాపు 8,000 మంది విద్యార్థులుంటున్నారు. వీరిలో 3,000 మంది కేవలం బాలికల హాస్టళ్ళలో ఉండి విద్యనభ్యసిస్తున్నారు. హాస్టళ్ళల్లో ఉండి విద్యనభ్యసించే విద్యార్థులో ఎక్కువ మంది గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చిన వారే కాకుండా ఆర్థికంగా సాంఘికంగా వెనుకబడిన వారు కావడం విశేషం. విద్యాప్రమాణాల విషయంలో ఉస్మానియా విశ్వవిద్యాలయానికి మంచి పేరే ఉంది. అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులకు మాత్రమే ఈ యూనివర్సిటీలో సీటు లభిస్తుంది. ఇంజనీరింగ్‌లో అంతర్జాతీయ ఖ్యాతిని కూడా ఈ యూనివర్సిటీ ఆర్జించింది. ఇంతటి పేరు ప్రఖ్యాతులున్న ఈ యూనివర్సిటీ గత కొద్దికాలంగా నిధుల కొరను ఎదుర్కొంటోంది. ప్రణాళిక, ప్రణాళికేతర వ్యయం కింద యూనివర్సిటీకి సంవత్సరానికి రూ. 500 కోట్లు అవసరం కాగా ప్రస్తుతం కేవలం రూ. 260 కోట్లు మాత్రమే అందుతున్నాయని అధికారులంటున్నారు. కేవలం జీతాలకే ఈ నిధులు సరిపోతున్నాయని వారంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు నిధులు విడుదల చేయక పోవడంతో కొత్త ప్రాజెక్టులు చేపట్టలేక పోతున్నామని, రీసెర్చ్‌ సౌకర్యాలను కూడా మెరుగు పరచ లేక పోతున్నామని వారంటున్నారు. హాస్టళ్ళు, మెస్‌ల నిర్వహణ కోసం రాష్ట్ర ప్రభుత్వం సాంఘిక సంక్షేమ శాఖ ఇచ్చే స్కాలర్‌షిప్‌లతో పాటు, ఐసిఎస్‌ఎస్‌ఆర్‌, ఆర్‌జిఎన్‌ఎఫ్‌ వంటి సంస్థలు ఇచ్చే ఫెలోషిప్‌లపై ఆధార పడుతున్నామని అంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి రావలసిన స్కాలర్‌షిప్‌ల బకాయిలు సకాలంలో అందక పోవడంతో మెస్‌ల నిర్వహణ కష్టసాధ్యమవుతోందని యూనివర్సిటీ అధికారులు విద్యార్థి సంఘాలకు తెలిపారు. మెస్‌లు నిర్వహించడం కష్టతరం కావడంతో కాకతీయ యూనివర్సిటీలో హాస్టళ్ళన్నీ విద్యార్థులే నిర్వహించుకునే విధంగా మార్చి వేశారు. ఉస్మానియా యూనివర్సిటీ కూడా ఇదే బాటలో నడిచే అవకాశం కనిపిస్తోందని విద్యార్థులంటున్నారు.
                                                              రూ. ఏడు కోట్ల హామీ నెరవేర్చని కెసిఆర్‌
             2009 నుంచి పేరుకు పోయిన మెస్‌ బకాయిల కోసం రాష్ట్ర ప్రభుత్వం చెల్లించవలసిన ఏడు కోట్ల రూపాయల బకాయిలను వెంటనే చెల్లిస్తామని ముఖ్యమంత్రి కెసిఆర్‌ ఆరు నెలల క్రితమే హామీ ఇచ్చినప్పటికీ అది అమలు కాలేదు. యూనివర్సిటీకి పూర్తి స్థాయి విసిని నియమించకుండా కేవలం ఐఎఎస్‌ అధికారిని తాత్కాలిక విసిగా నియమించడంతో పాలన పూర్తిగా కుంటుపడిరదని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. అడిగిన వారికి అడగని వారికి ఉదారంగా కోట్లాది రూపాయలిస్తున్న ముఖ్యమంత్రికి తెలంగాణలోని అతిపెద్ద యూనివర్సిటీకి నిధులివ్వలేరా అని వారు ప్రశ్నిస్తున్నారు. 
                                                                                                                               `కొండూరి రమేశ్‌బాబు

కామెంట్‌లు లేవు: