7, జూన్ 2015, ఆదివారం

బాబు బుక్కయ్యారా?

       
-స్టీఫెన్‌ సన్‌తో సంభాషణ బట్టబయలు
-ఆడియో రికార్డులు బహిర్గతం
-ఏక్షణమైనా నోటీసులు: టిసర్కారు వర్గాలు
-గవర్నర్‌తో కెసిఆర్‌ భేటీ
-ఉన్నతాధికారులతో బాబు అత్యవసర సమావేశం
-సిఎం గొంతు కాదు : పరకాల

ఒక వ్యక్తి: య్యా బ్రదర్‌  మన బాబుగారు మీతో మాట్లాడుతారు.లైన్‌లో ఉండండి.

కొన్ని సెకన్ల తరువాత
చంద్రబాబు : హలో!
స్టీఫెన్‌సన్‌ : సర్‌ గుడ్‌ ఈవినింగ్‌
బాబు : గుడ్‌ ఈవినింగ్‌  హౌ ఆర్‌యూ
స్టీఫెన్‌: ఫైన్‌ సర్‌ ధాంక్యూ
బాబు : మన వాళ్లు నాకంతా     వివరించారు. నేను మీకు అండగా ఉంటా.  కంగారు  వద్దు
స్టీఫెన్‌:  ఎస్‌  సర్‌.. రైట్‌ సర్‌
బాబు : అన్నింటికి  మీకు అండగా నేను ఉంటా. మా  వాళ్లు మీతో మాట్లాడినవన్నీ నెరవేరుస్తాం.
స్టీఫెన్‌:  ఎస్‌ సర్‌ ... ఒకే సర్‌
బాబు : అది మా హామీ .
 మనం కలిసి పనిచేద్దాం
స్టీఫెన్‌:  రైట్‌  థాంక్యూ సర్‌
బాబు : థాంక్యూ  
                      ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపుతున్న రేవంత్‌రెడ్డి ఓటుకు  నోటు  వ్యవహారం కీలక  మలుపు తిరిగింది.  మరికొన్ని గంటల్లో ఏడాది పాలన సంబరాలను ఘనంగా జరిపేందుకు  సిద్దమవుతున్న టిడిపి వర్గాలకు  భారీ షాక్‌ తగిలింది.  తెలంగాణ నామినేటెడ్‌ ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్‌తో చంద్రబాబు  చేసిన టెలిఫోన్‌ సంభాషణ బట్టబయలైంది.  ఆదివారం రాత్రి 9 గంటల ప్రాంతంలో ఎసిబి సేకరించిన ఆడియో రికార్డులు బహిర్గతమైనాయి.  స్టీఫెన్‌సన్‌తో చంద్రబాబు సంభాషణ వెలుగులోకి వచ్చిన కొద్దిసేపటికే గవర్నర్‌ నరసింహన్‌తో తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్‌ భేటీ అయ్యారు. తాజా పరిణామాలపై చర్చించారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని అస్థిరపర్చడానికి చంద్రబాబు కుట్ర చేస్తున్నారని ఫిర్యాదు చేసినట్లు సమాచారం. చంద్రబాబుకు ఏక్షణమైనా నోటీసులు జారీ చేసే అవకశం ఉందని టి. ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.  గవర్నర్‌తో కేసిఆర్‌ భేటీ జరుగుతుండగానే చంద్రబాబు ఉన్నతస్థాయి అధికారులతో అత్యవసరంగా భేటీ అయ్యారు. ఆంధ్రప్రదేశ్‌ డిజిపి రాముడుతో పాటు ఇతర ఉన్నతస్థాయి అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సమావేశం జరుగుతుండగానే మీడియాతో మాట్లాడిన ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ మీడియా సలహాదారు పరకాల ప్రభాకర్‌ ఆడియో టేపుల్లో వినిపించిన గొంతు చంద్రబాబుది కాదని ప్రకటించారు. ఒక నిమిషం కన్నా తక్కువ సమయంలో సాగిన ఈ సంభాషణ రెండు రాష్ట్రాల్లోని రాజకీయ వర్గాల్లో కలకలం రేపుతోంది.  చంద్రబాబునాయుడిపై కేసు నమోదు చేయాలన్న డిమాండ్‌ జోరందుకుంది.  ‘మన వాళ్లు నాకు వివరించారు. నేను మీకు అండగా ఉంటా. మా వాళ్లు మీతో మాట్లాడినవన్నీ మేం నెరవేరుస్తాం. మీరు స్వేఛ్చగా నిర్ణయం తీసుకోవచ్చు.’ అని  చంద్రబాబు  చెప్పడం ఈ  ఆడియో రికార్డుల్లో స్పష్టంగా వినపడిరది.   స్టీఫెన్‌సన్‌ను తమ  పార్టీ అభ్యర్థికి ఓటు వేయమనికాని,  బదులుగా ఇచ్చే ప్రయోజనాల గురించి కాని చంద్రబాబు నేరుగా ప్రస్తావించినప్పటికీ ‘ మా వాళ్లు మాట్లాడినవన్నీ నెరవేరుస్తాం’ అంటూచెప్పడం  ఈ వ్యవహారంలో చంద్రబాబే సూత్రధారి అని చెప్పడానికి సరిపోతాయన్న అభిప్రాయాన్ని టి. ప్రభుత్వ వర్గాలు వ్యక్తం  చేస్తున్నాయి.  తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా నామినేటెడ్‌ ఎమ్మెల్యే స్టీఫెన్‌స్‌కు 50 లక్షల రూపాయలను లంచంగా ఇస్తూ టిడిపి నేత రేవంత్‌రెడ్డి  ఎసిబికి అడ్డంగా దొరికిన సంగతి తెలిసిందే.  ఆ సందర్భంగా ‘బాస్‌ చెప్పారు... చంద్రబాబుతో మాట్లాడండి’ అంటూ రేవంత్‌ చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి. తాజాగా స్టీఫెన్‌సన్‌తో నేరుగా చంద్రబాబు మాట్లాడిన టేపులు వెలుగులోకి వచ్చాయి. మరోవైపు రేవంత్‌రెడ్డిని ఆదివారం నాడు కూడా ఎసిబి విచారించింది. కొన్ని గంటల పాటు సాగిన ఈ విచారణలో పలు ఆసక్తి కర విషయాలు వెలుగులోకి వచ్చినట్లు తెలిసింది. ఎమ్మెల్సీ ఎన్నికలకు ముందు  కొద్దిరోజుల పాటు దాదాపు నాలుగు సార్లు గన్‌మెన్లు లేకుండా రేవంత్‌ ఎక్కడికో వెళ్లినట్లు తెలియడంతో  దానిపై ఆరా తీసింది. అదే విధంగా  దాదాపు 27 ఫోన్‌ కాల్స్‌కు సంబంధించిన సమాచారాన్ని కూడా  రేవంత్‌నుండి సేకరించేందుకు ఎసిబి అధికారులు ప్రయత్నించారు. దాదాపు 50కిపైగా  ప్రశ్నలను ఆదివారం ఎసిబి అధికారులు  రేవంత్‌ను అడిగారు. విచారణ అనంతరం రేవంత్‌  అనారోగ్యంతో ఉన్నారని, .జ్వరంతో బాధపడుతున్నారని రేవంత్‌ తరపు న్యాయవాదులు మీడియాకు చెప్పారు.
                                                                       ట్యాపింగ్‌పై బాబు ఫిర్యాదు
                టెలిఫోన్‌ సంభాషణలు వెలుగులోకి రాకముందు ఆదివారం  సాయంత్రం రాష్ట్ర గవర్నర్‌ నరసింహన్‌ను కలిశారు. సోమవారం జరగనున్న ఏడాది ఉత్సవాలకు  ఆయన్ను ఆహ్వానించారు. ఈ సందర్భంగానే తెలంగాణ ప్రభుత్వం  ఫోన్ల ట్యాపింగ్‌కు పాల్పడుతోందని, ఇది చట్టవిరుద్దమని ఆయన ఫిర్యాదు చేసినట్లు సమాచారం.
                                                                ఫోన్‌ ఎలా ట్యాప్‌ చేస్తారు  : యనమల
               కేంద్ర టెలిగ్రాఫ్‌ చట్టాన్ని తెలంగాణ ప్రభుత్వం  ఉల్లంఘిస్తోందని ఆంధ్రప్రదేశ్‌ ఆర్థికశాఖ మంత్రి యనమల రామకృష్షుడు అన్నారు. టెలిగ్రాఫ్‌ చట్టం ప్రకారం ట్యాపింగ్‌కు ముందుగా అనుమతి తీసుకోవాలని దానికి భిన్నంగా  ముఖ్యమంత్రి ఫోన్‌ను ఎలా ట్యాప్‌ చేస్తారని ఆయన ప్రశ్పించారు.
                                                            ఎవరి ఫోన్‌ ట్యాప్‌ అయ్యింది ...?
                           తమ ఫోన్లను తెలంగాణ ప్రభుత్వం ట్యాప్‌  చేసిందని ఎపి నేతలు ఆరోపిస్తున్నప్పటికీ తెలంగాణ ప్రభుత్వం, నేతల వాదన భిన్నంగా ఉంది. చంద్రబాబునాయుడి ఫోన్‌ను ట్యాప్‌ చేయలేదని వారు చెబుతున్నారు.  లంచం వ్యవహారంపై ఎసిబికి ఫిర్యాదు చేసిన స్టీఫెన్‌సన్‌ ఫోనును, ఆయన అనుమతితో   ఎసిబి అధికారులు నిఘా పెట్టారని వారు చెబుతున్నారు. స్టీఫెన్‌సన్‌ ఫోన్‌కు చేసి  చంద్రబాబు బుక్‌  అయ్యారని వారు అంటున్నారు.  నవనిర్మాణ దీక్షకు కొన్ని గంటల ముందు రేవంత్‌రెడ్డి  విడియో రిలీజ్‌కాగా, ఏడాది ఉత్సవాలకు ఒక్క రోజు ముందు బాబు  మాట్లాడిన టేపులు విడుదలయ్యాయి.
                                                                   అంతు చూస్తాం...!
               బూటకపు టేపుల వ్యవహారాన్ని తేలిగ్గా తీసుకునేది లేదని,  చూస్తూ ఊరుకునేది లేదని,  అంతు చూస్తామని ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వ  కమ్యూనికేషన్స్‌ సలహాదారు పరకాల ప్రభాకర్‌ అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఉన్నతాధికారులతో సంప్రదిస్తుండగానే మీడియాతో మాట్లాడిన ఆయన  తెలంగాణ ప్రభుత్వానికి ఆ టేపులు ఎక్కడినుండి వచ్చాయో తెలపాలని డిమాండ్‌ చేశారు. చంద్రబాబు  ఎక్కడెక్కడో మాట్లాడిన విషయాలను కలిపి తప్పుడు ప్రచారం చేస్తున్నారని అని చెబుతూనే  టేపుల్లో ఉన్నది చంద్రబాబు గొంతు కాదని, అది బాబు చేసిన సంభాషణ కాదని  ఆయన అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రిని అప్రతిష్ట పాలు చేయడానికే ఇలా వ్యవహరిస్తున్నారని అన్నారు.  టిఆర్‌ఎస్‌ కార్యాలయంనుండి నడిచే టి.ఛానల్‌ ఈ టేపుల విషయాన్ని  మొదటిసారి వెలుగులోకి తీసుకువచ్చిందని చెప్పారు.  ప్రభుత్వ ఏడాది ఉత్సవాలకు సిద్దమవుతున్న నేపధ్యంలో ఆంధ్రప్రదేశ్‌ ప్రజల స్థైర్యాన్ని దెబ్బతీసేందుకు కుట్ర చేశారని అన్నారు. నోటీసులు ఇచ్చే ధైర్యం టి. సర్కారుకు ఉండకపోవచ్చని  చెప్పారు.

కామెంట్‌లు లేవు: