18, అక్టోబర్ 2014, శనివారం

చెన్నయ్‌ చేరిన జయలలిత

               బెంగుళూరు పరప్పన అగ్రహార జైలునుంచి 2014 అక్టోబర్‌ 18న  విడుదలయిన తమిళనాడు మాజీ ముఖ్యమంత్రిఅన్నా డిఎంకె అధినేత్రి జయలలిత చెన్నయ్‌లోని తన నివాసానికి చేరుకున్నారు. ఆదాయాన్ని మించి అక్రమ ఆస్తులున్నాయని సెప్టెంబర్‌ 27న ప్రత్యేక కోర్టు తీర్పు మేరకు ఆమెను జైలుకు తరలించారు. ఆమెకు నాలుగేళ్లు శిక్షవిధించిన విషయం తెలిసిందే. బెయిలుకోసం బెంగుళూరు హైకోర్టును ఆశ్రయించగా తిరష్కరించారు. దీంతో సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సుప్రీంకోర్టులో 17న బెయిలు మంజూరయింది. 18న బెయిలు పత్రాలు అందిన వెంటనే బెంగుళూరు జైలు నుంచి విడుదల చేశారు. జయలలితకు  చెన్నయ్‌ విమాశ్రయంలో  కార్యకర్తల నుంచి ఘనస్వాగతం లభించింది. భారీ వర్షాన్ని సైతం లెక్క చేయకుండా  పార్టీ కార్యకర్తలు, అభిమానులు విమానశ్రయంనుంచి నివాసం వరకు మానవహారం చేపట్టారు.  ఈసందర్భంగా అభిమానులు సంబరాల్లో మునిగి తేలారు.

14, అక్టోబర్ 2014, మంగళవారం

హుదూద్‌ తుపాన్‌ నష్టం లక్షకోట్లు

                                                     
                                                        4,55,000 ఎకరాల్లో పంటనష్టం
                                                                26 మంది మృతి
                     హుదూద్‌ తుపాను వల్ల ఉత్తరాంధ్రకు దాదాపు లక్షకోట్ల రూపాయల మేర నష్టం జరిగి ఉంటుందని ప్రభుత్వ వర్గాలు అంచనా వేశారు. 2014 సెప్టెంబర్‌ 12న తుపాను ఆంధ్రప్రదేశ్‌లోని ఉత్తరాంధ్రను కుదిపేసింది. 14న  విశాఖలో సమీక్ష నిర్వహించిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు  ఒక్క నేవికీ 2 వేల కోట్ల రూపాయలు నష్టం జరిగి నట్లు  చెప్పారు. విరుచుకుపడ్డ హుదూద్‌  తుపాన్‌ రాష్ట్రానికి భారీ నష్టం మిగిల్చింది.గతంలో ఎన్నడూ లేని స్థాయిలో  నష్టం సంభవించినట్లు చెబుతున్నారు.  హుదూద్‌ తుపాన్‌ నగర ప్రాంతంలో విలయం సృష్టించడమే దీనికి కారణం. గతంలో భారీ తుపా న్లు వచ్చినప్పటికీ వ్యవసాయరంగమే ప్రధానంగా నష్టపోయేది. ఈసారి పరిస్థితి దానికి భిన్నం.  పరిశ్ర మలు, పోర్టు, విమానాశ్రయంతో  రాష్ట్ర ఆర్థికరాజ ధానిగా నిలిచిన విశాఖ నగరం హుదూద్‌తో విలవిలలాడిరది. తుపాన్‌ తీరం దాటి రోజులు గడు స్తున్నా  విశాఖలో సాధారణ పరిస్థితులు నెలకొన లేదంటేనే  పరిస్థితి తీవ్రతను అర్ధం చేసుకోవచ్చు.  విశాఖ హార్బర్‌లోని   మత్స్యకార్మికు లకు చెందిన  బోట్లు పెద్ద సంఖ్యలో ధ్వంసం అయ్యా యి. 700 నుండి వెయ్యిబోట్లు దెబ్బతిన్నట్లు చెబు తున్నారు. కొన్ని బోట్లు కనపడకుండా పోయాయి.  ఒక్కో బోటు విలువ  లక్షల రూపాయల నుండి కోటి రూపాయల దాకా ఉంటుందని సమాచారం.  వీటిలో  బీమా సౌకర్యం లేనివే ఎక్కువ సంఖ్యలో ఉన్నట్లు  అధికారులు అంటున్నారు.  విశాఖ విమా నాశ్రయానికి 500 కోట్ల రూపాయల నష్టం వాటి ల్లిందని, ఉక్కు కర్మాగారానికి 340 కోట్ల రూపాయల నష్టం జరిగిందని అధికారులు ప్రాధమికంగా తేల్చారు. ఈ వివరాలను ముఖ్యమంత్రే  చెప్పారు.  ఒక్క విశాఖ నగరంలోనే దాదాపుగా 40 వేల కోట్ల విద్యుత్‌ స్తంబాలు నేలకూలాయి, ఇవిగాక విశాఖలోని మిగిలిన ప్రాంతాలు. విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో మరో 10 నుండి 15వేల  విద్యు త్‌ స్తంబాలు  నేల కూలి ఉంటాయని అంచనా!  తుపాన్‌ తీవ్రతకు  ఉప్పాడ నుండి కాకినాడ ప్రధాన హైవే పూర్తిగా దెబ్బతింది.  రోడ్డును పూర్తిస్థాయిలో పునరుద్దరించడానికి  వేల కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని అంచనా వేస్తున్నారు. కిలోమీటరకు దాదాపు కోటి  రూపాయలు ఖర్చు చేయాల్సిఉంటుందన్నది ప్రభుత్వ వర్గాల అంచనా!. విశాఖలోని కైలాసగిరి వంటి పర్యాటక ప్రాంతాలు, ఆంధ్రా విశ్వవిద్యాలయం, ఎన్‌టిపిసిలకు భారీ నష్టం వాటిల్లింది. ఈ నష్టాలపై ఇంకా ప్రాధమిక అంచనాలు సిద్దం కాలేదు. ఇవిగాక విశాఖపట్టణంలోని ప్రైవేటు ఆస్తులూ భారీగా దెబ్బతిన్నాయి. షాపింగ్‌మాల్స్‌, పెట్రోలు బంకులతో పాటు  కొన్ని భారీ వ్యాపారసముదాయాలు తుపాన్‌ నష్టాల బారిన పడ్డాయి.  పూరి గుడిసెలు, రేకుల ఇళ్లతో పాటు  హుదూద్‌ తుపాన్‌  అపార్ట్‌మెంట్లపైనా ప్రభావం చూపింది. టెలికాం సర్వీసులతో పాటు, రైల్వేశాఖ కూడా భారీ నష్టాన్ని చవి చూసింది. నష్టం అంచనాల్లో వీటన్నింటిని పరిగణలోకి తీసుకోవాల్సిఉంది.  విశాఖ నగరంలోనే భారీ నష్టం ఉండటంతో ఇప్పటిదాకా అనుసరిస్తున్న సంప్రదాయ  విధానాలు నష్టం మదింపునకు సరిపోవన్న అభిప్రాయం అధికారవర్గాల్లో వ్యక్తమవుతోంది.  కంప్యూటర్‌ మాడల్స్‌తో ఉన్న  కొత్త విధానాన్ని  వీరు ప్రతిపాదిస్తున్నారు.  పునరావాస, సహాయ చర్యలు కొలిక్కి వచ్చిన తరువాత  దీనిపై తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని అంచనా.
                                                                       26కు చేరిన మృతులు!
                హుదూద్‌ తుపాన్‌ కారణంగా రాష్ట్రంలో  మరణించిన వారి సంఖ్య 26కు చేరింది. 1,82,128 హెక్టార్లలో పంట నష్టం సంభవించినట్లు  రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. అయితే,  ఇది ప్రాధమిక అంచనా మాత్రమేనని  పంట నష్టం మరింత పెరిగే అవకాశం  ఉందని అధికార వర్గాలు చెబుతున్నాయి. ఈ అంచనాల ప్రకారం 1,44,175 హెక్టార్లలో వేసిన ఆహారపంటలు, 37,953 హెక్టార్లలో వేసిన వాణిజ్య పంటలు దెబ్బతిన్నాయి. 
                                                                    వెయ్యికోట్లు సాయం ప్రకటించినకేంద్రం
              హుదూద్‌ తుపాన్‌ బారిన పడిన ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి తక్షణ ఆర్థిక సాయంగా వెయ్యికోట్ల రూపాయలను మంజూరు చేస్తున్నట్లు ప్రధానమంత్రి నరేంద్ర మోడి ప్రకటించారు. తుపాన్‌ ధాటికి విలవిలలాడు తున్న విశాఖ నగరంలో ఆయన సెప్టెంబర్‌ 14న పర్యటించారు. తొలుత ఏరియల్‌ సర్వేలో తుపాన్‌ పీడిత ప్రాంతాలను  పరిశీలించారు.  విధ్వంసమైన విశాఖ విమానాశ్రాయాన్ని,   తుపాన్‌ నష్టాలపై ఏర్పాటుచేసిన ఫోటో ఎగ్జిబిషన్‌ను చూశారు. అధికారులతో సహాయచర్యలపై సమీక్షా సమా వేశం  నిర్వహించారు. అనంతరం మీడియాతో మాట్లాడిన  హుదూద్‌ తుపాన్‌ భారీ నష్టం కలిగిం చిందని చెప్పారు.
                                                                  విరాళం ప్రకటించిన సినీ పరిశ్రమ
                    తుపాను బాధితులను ఆదుకోవడానికి సినీ పరిశ్రమ విరాళాలు ప్రకటించింది. నటుడు పవన్‌కళ్యాణ్‌ రూ.50 లక్షలు, మహేష్‌బాబు 25లక్షలు, జూనియర్‌ ఎన్‌టిఆర్‌ 20 లక్షలు, రామ్‌చరణ్‌ తేజ 10లక్షలు, సినీనిర్మాతల మండలి 25లక్షలు ప్రకటించింది. ఈ విధంగా పలువురు ముఖ్యమంత్రి సహాయ నిధులు విరాళాలు ఇస్తున్నారు. ఇంకా ఆదుకోవడానికి ముందు రావల్సిన అవసరం ఉంది.

2, అక్టోబర్ 2014, గురువారం

దసరా శుభాకాం క్షలు


కలుషిత విధానాలతో స్వచ్ఛ భారత్‌ సాధ్యమా?

            దేశ సార్వభౌమత్వాన్ని కాపాడలేని పాలకులు దేశాన్ని స్వచ్ఛంగా ఉంచాలనే ఆలోచన సాధ్యమా?. రోడ్లు, టాయిలెట్స్‌, పరిసరాలు శుభ్రంగా ఉంచితే దేశం స్వచ్ఛమౌతుందా?. ఎవరి పరిసరాలు వారు శుభ్రం చేసుకోవడమనేది అత్యధిక మందికి తెలుసు.  నిరక్షరాస్యత, పేదరికం పోనంతకాలం కొన్ని ప్రాంతాలు శుభ్రం చేయలేం. కొన్నింటిని శుభ్రం చేయడానికి ప్రభుత్వ నిబంధనల ప్రకారం సిబ్బందినే నియమించుకోలేక పోతున్నాం. ఉన్న సిబ్బంది రిటైర్‌ అయితే ఆ ఖాళీలను భర్తీ చేయించుకోలేక పోతున్నాం. కాంట్రాక్టు లెక్కన సిబ్బందిని తీసుకుని వారి కష్టంనుంచే కాంట్రాక్టర్ల తాపేదార్లు దోచుకుంటున్నారు.
                                                      చేతల్లో  విదేశీ... మాటల్లో స్వదేశీ
      విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను ఆహ్వానిస్తున్నారు. ఆహ్వానిస్తే మన దేశ ప్రయోజనాలుండాలి. అవెక్కడా లేవు. ఒక వేల ఉంటే సంస్కరణలు ప్రారంభమైన నాటినుంచి లెక్కలు చూస్తే మన దేశంలో సంపన్నుల  ఆదాయం పెరుగుతూ పోతుంది. పేదరికం పెరుగుతూనే ఉంది. మనుగడ కోసం జరిగే పోరాటంలో అక్కడక్కడా విజయం సాధించిన బడుగులు బాగుపడుతున్నారు. పాలకుల విధానాల వల్ల సామాన్యునికి  ప్రయోజనం లేదు.
         స్వచ్ఛభారత్‌ కార్యక్రమాన్ని ప్రారంభించాక ప్రధాన మంత్రి మాట్లాడుతూ మహాత్మాగాంధీ నాయకత్వంలో స్వాతంత్య్రం సాధించుకున్నాం.  మహాత్ముడి స్వచ్ఛభారత్‌ కల మాత్రం నేటికీ సాకారం కాలేదు. క్విట్‌ ఇండియా...క్లీన్‌ ఇండియా అని మహాత్ముడు  సందేశమిచ్చారని  మోడీ గుర్తు చేశారు. పాలకులు విదేశీ విధానాలను అమలు చేసి సంస్కృతి సాంప్రదాయాలను కలుషితం చేసి స్వదేశీనినాదం చేసిన గాంధీ గురించి మాటల్లో గొప్పలు చెప్పుకుంటే ప్రయోజం ఏమిటి?. ఇలాంటి పబ్లిసిటీ కార్యక్రమాలు కాకుండా మన రాజ్యాంగంలోని నిబంధనలను సక్రమంగా అమలు చేస్తే సరిపోతుంది. 
                                                        మోడీ ప్రధాని అయ్యాక........
                 రక్షణ, రైల్వే రంగాల్లో విదేశీప్రత్యక్ష పెట్టుబడుల(ఎఫ్‌డిఐ)ను అనుమతించారు. బీమారంగంలో 49 శాతం ఎఫ్‌డిఐలకు వీలు కల్పిస్తూ బిల్లు రూపొందించారు. ప్రభుత్వ రంగ సంస్థలలో వాటాలను అమ్మకానికి పెట్టారు. నిర్వీర్యం చేయడానికి సిద్దమయ్యారు.  ఓఎన్‌జిసి, కోల్‌ఇండియా, ఎన్‌హెచ్‌పిసిలలో  వాటాల ఉపసంహరణకు కేంద్ర కేబినెట్‌ ఆమోదం తెలిపింది.  ప్రయివేటు శక్తులకు కట్టబెట్టబెడుతున్నారు.  ధరలకు కళ్లెం వేయలేక పోయారు. బడాపారిశ్రామిక వేత్తలకు రాయితీలు ఇస్తున్నారు.  శాస్త్ర వేత్తలు హెచ్చరికలు చేస్తున్నప్పటికీ జెనిటిక్‌ మోడిఫైడ్‌ పంటలకు అనుమతిచ్చారు. ఇవ్వన్ని ప్రజల ప్రయోజనాలకు కాకుండా కొందరి ప్రయోజనాలకోసం చేశారు. గాంధీ విదేశీ వస్తువుల దిగుమతులను వ్యతిరేకించారు. మనవాళ్లు అంటే ముందు పాలకులు, నేటి పాలకులు ఆహ్వానించారు. మద్యం విచ్చలవిడిగా అమ్మకాలు పెట్టి ఆరోగ్యం పాడు చేస్తున్నారు. సంస్కరణల పుణ్యమాని అవినీతి పెనుభూతమైంది. మోడీ కేబినెట్‌లోనే 18 మంది మంత్రులపై వివిధ రూపాల్లో అభియోగాలొచ్చాయి. మోడిగారు చంద్రబాబును గెలిపించాలని ప్రజలకు పిలుపు నిచ్చారు. ఆయన హామీలు మాత్రం అమలుకావడం లేదు. విజ్ఞానాన్ని, ఆరోగ్యాన్ని పంచే విద్యా, వైద్య రంగాల్లో ప్రయివేటు భాగస్వామ్యం పెరిగింది.  ఇలాంటి పరిస్థితిలో ఆరోగ్యకరమైన, స్వచ్ఛమైన భారత్‌ ఎలాసాధ్యమో ఆలోచించాలి.


27, సెప్టెంబర్ 2014, శనివారం

కోమలవల్లికి నాలుగేళ్లు జైలు

      
      అక్రమ ఆస్తుల కేసులో తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత (కోమలవల్లి)ను దోషిగా నిర్ధారించింది బెంగళూరులోని ప్రత్యేక న్యాయస్థానం. 2014 సెప్టెంబర్‌ 27న  ఆమెకు నాలుగేళ్లు జైలు శిక్ష విధించింది. ఆమె తన పదవికి రాజీనామా చేయనున్నారు. ఆమెతోపాటు శశికళ, ఇళవరసి, సుధాకరన్‌ను కూడా కోర్టు దోషులుగా తేల్చింది. వీరందరికీ కూడా నాలుగేళ్ల జైలు శిక్ష విధించింది న్యాయస్థానం. జయలలితకు రూ.100 కోట్ల భారీ జరిమానా విధించింది. మిగతా దోషులకు ఒక్కొక్కరికి రూ.10 కోట్లు జరిమానా విధించింది. 
 కర్ణాటకలో మాత్రమే అప్పీలుకు అవకాశం
      ప్రత్యేక కోర్టు తీర్పుపై తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితకు కర్ణాటక హైకోర్టులో మాత్రమే అప్పీలు చేసుకోవడానికి అవకాశం ఉంది. తీర్పును సవాలు చేస్తూ ఆమె అప్పీలుకు వెళ్లనున్నారు.
        బెంగళూరు ప్రత్యేక న్యాయస్థానంలో జయలలితపై నేరం రుజువు కావడంతో తమిళనాడు ఆర్థిక మంత్రి పన్నీర్‌ సెల్వం కోర్టు హాలులో కంటతడిపెట్టారు. బెంగళూరుకు చేరిన పలువురు ఆమె అభిమానులు తీవ్ర ఉద్వేగానికి లోనయ్యారు. దాదాపు 18 ఏళ్లపాటు సాగిన ఈ కేసు 14 మంది న్యాయమూర్తుల సమక్షంలో విచారణ సాగింది. 259 మంది ప్రాసిక్యూషన్‌ సాక్ష్యులు, 99 మంది డిఫెన్స్‌ సాక్ష్యుల వాంగ్మూలాన్ని కోర్టు నమోదు చేసింది. బెంగళూరు పరస్పన అగ్రహార జైలు ఆవరణలోని ప్రత్యేక కోర్టు వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. కోర్టు వద్దకు వేలాది మంది ఎఐఎడిఎంకె కార్యకర్తలు తరలివచ్చారు.
                                                              కేసు పూర్వాపరాలు
        ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారని 1996లో జయలలితపై కేసు నమోదయింది. ఆమెకు అత్యంత సన్నిహితురాలు శశికళ, ఆమె కుమారుడు సుధాకరన్‌, బంధువులు ఇళవరసి కూడా కేసులో నిందితులుగా ఉన్నారు. అప్పట్లో జయలలిత ఇంట్లో జరిగిన సోదాల్లో 880 కిలోల వెండి, 28 కిలోల బంగారం, 10 వేలకు పైగా చీరలు, 90కి పైగా వాచీలు, 750 జతల పాదరక్షలు స్వాధీనం చేసుకున్నారు. తమిళనాడులోని అనేక చోట్ల జయలలిత ఆస్తులు కూడబెట్టారనే ఆరోపణలొచ్చాయి. కేవలం ఒక్క రూపాయి వేతనం తీసుకుని ఇంత ఆస్తి ఎలా కూడబెట్టారనే అభియోగం నమోదయింది. జయ నివాసం నుంచి స్వాధీనం చేసుకున్న వస్తువులన్నీ న్యాయమూర్తి స్వయంగా పరిశీలించారు. దీనిపై 2011లో జయలలిత స్వయంగా కోర్టుకెళ్లి వాంగ్మూలం ఇచ్చారు. అప్పటి నుంచి కేసు విచారణ కొనసాగింది. ఈ కేసు విచారణ తొలుత చెన్నైలోనే జరిగినా మళ్లీ జయలలిత సిఎం కావడంతో న్యాయస్థానాన్ని ప్రభావితం చేస్తారని డిఎంకె పిటిషన్‌ దాఖలు చేసింది. డిఎంకె పిటిషన్‌తో కేసు విచారణ బెంగళూరులోని ప్రత్యేక న్యాయస్థానానికి మారింది.
                                                          జయలలిత జీవిత విశేషాలు
      సెల్వ జయలలిత 1948 ఫిబ్రవరి 24న కర్ణాటక రాష్ట్రం మైసూరులో  జన్మించారు. తమిళనాడు రాష్ట్ర ముఖ్యమంత్రి, తమిళ, తెలుగు భాషల్లో సినీనటి. ఆ రాష్ట్ర ప్రాంతీయ పార్టీ అయిన ఆలిండియా ద్రవిడ మున్నేట్ర కళగం కార్యదర్శి. తిరుచ్చి జిల్లా శ్రీరంగం పూర్వకంగా కలిగిన జయలలిత 1981లో రాజకీయాల్లో ప్రవేశించారు. 1984లో తమిళనాడు నుంచి రాజ్యసభకు ఎన్నికయ్యారు. అప్పటి ముఖ్యమంత్రి ఎంజి రామచంద్రన్‌కు సన్నిహితంగా మెలిగారు. ఆయన మరణానంతరం రామచంద్రన్‌ భార్య ముఖ్యమంత్రి అయ్యారు. కానీ ఎక్కువ రోజులు పదవిలో ఉండలేకపోయారు. గ్లామర్‌ వల్ల జయలలిత 1989 అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన తొలి మహిళా ప్రతిపక్ష నాయకురాలిగా స్థానం సంపాదించారు. 1991లో రాజీవ్‌గాంధీ మరణానంతరం జరిగిన శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీతో పొత్తు పెట్టుకుని విజయం సాధించి ముఖ్యమంత్రి అయ్యారు. ప్రజల చేత ఎన్నికయిన తమిళనాడు తొలి మహిళా ముఖ్యమంత్రి జయలలిత. 2006 మేలో జరిగిన ఎన్నికల్లో పరాజయం పాలయింది. తిరిగి మిత్రపక్షాలతో కలిసి 1977 తర్వాత అత్యంత పటిష్టమైన ప్రతిపక్షంగా నిలువ గల సీట్లను పొందారు. ఆమె ప్రస్తుతం తమిళనాడు ముఖ్యమంత్రి. అభిమానులు ఆమెను అమ్మ అని, పురుచ్చితలైవి (విప్లవాత్మక నాయకురాలు) అని పిలుస్తారు. జయలలిత అసలు పేరు కోమలవల్లి. అలనాటి సినీనటి సంధ్య కూతురు ఈమె. మైసూరులో జన్మించిన జయలలిత రాజకీయరంగ ప్రవేశానికి మునుపు తమిళ చిత్రరంగంలో విజయవంతమైన సినీనటి. కుటుంబ పరిస్థితుల వల్ల ఆమె తల్లి బలవంతంతో 15వ ఏట సినిమా రంగంలోకి వచ్చారు. తమిళ, తెలుగు భాషల్లో ఆమె నటించారు. ఆమె అవివాహితగానే జీవితాన్ని గడిపారు. 1988లో రాజ్యసభకు నామినేట్‌ అయ్యారు. 1989, 1991లో గెలిచారు. 1996లో జయలలితపై వచ్చిన అభియోగాల కారణంగా ఓడిపోయారు. 2001లో అత్యధిక మెజార్టీతో గెలిచారు. 2006లో ఓడిపోయారు. 2011లో తిరిగి గెలిచి ముఖ్యమంత్రి అయ్యారు. జయలలితపై అనేక కేసులు పెట్టినా ఎదురు నిలిచి పోరాడారు. ఆమె మీద పెట్టిన 11 కేసుల్లో తొమ్మిది పూర్తయ్యాయి. రెండు కేసులు కీలకమయ్యాయి. ఆదాయానికి మించి ఆస్తులు ఉన్న కేసుపై ప్రత్యర్థులు బలమైన ఆధారాలతో న్యాయస్థానాన్ని ఆశ్రయించారు.


19, సెప్టెంబర్ 2014, శుక్రవారం

మహేష్ 'ఆగడు'

ఎప్పుడెప్పుడా అని ఎదురు చుసిన మహేష్ బాబు 'ఆగడు' శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది.14 రీల్స్ పతాకంపై రామ్ ఆచంట,గోపీచంద్ ఆచంట మరియు అనిల్ సుంకర నిర్మిస్తున్న ఈ చిత్రంలో తమన్నా కథానాయిక,తమన్ సంగీతాన్ని అందించారు. సినిమా ఎలావుందో చూద్దాం.
మొదట సినిమా కథ విషయానికే వస్తే శంకర్(మహేష్)ఓ అనాథ,కాని చాల తెలివైన కుర్రాడు.తనలోని చురుకుదనాన్ని చుసిన రాజా రావు(రాజేంద్రప్రసాద్)అనే ఇన్స్ పెక్టర్ శంకర్ ను చేరదీసి పోలీస్ ఆఫీసర్ చేయాలనుకుంటాడు.కాని అనుకోని కారణాలవల్ల చేయని హత్యను తనమీద వేసుకొని జైలుకు వెళుతాడు.అరెస్టయిన శంకర్ బోస్టన్ స్కూల్ లో చదివి పోలీస్ ఆఫీసర్ అవుతాడు.అలా శంకర్ ఎన్ కౌంటర్ స్పెషలిస్ట్ గా పేరొందుతాడు.దాము అలియాస్ దామోదర్(సోనూ సూద్)అక్రమాలను అరికట్టడానికి ఒక పట్టణానికి ట్రాన్స్ ఫర్ చేస్తారు. శంకర్ ను.అసలు దాము ఎవరు?శంకర్ జైలుకు వెళ్ళడానికి కారణం ఏంటి? మొదలగునవి తెర మీద చూడాల్సిందే.
మహేష్ బాబు ఇంట్రడక్షన్ తోపాటు మొదటి సాంగ్ చాలా బాగొచ్చింది.సినిమాలో మహేష్ బాబు పంచ్ డైలాగ్ లు బాగానే ఉన్నాయి.అయితే పంచ్ డైలాగ్ ల డోస్ ఎక్కువైన ఫీలింగ్ ప్రేక్షకుల్లో కలుగుతుంది.ఇక తమన్నా విషయానికి వస్తే అంతగా ప్రాధాన్యంలేని పాత్ర.మహేష్ బాబుకు ప్రేయసిగా కనిపిస్తుంది.కొన్ని పాటల్లో గ్లామర్ డోస్ పెంచింది.సినిమా మొదటి భాగం బాగానే ఉంటుంది.రెండవ భాగంలోకి వచ్చే సరికి ప్రేక్షకులు కొంత ఇబ్బంది పడతారు.నిడివి కూడా ఎక్కువగా ఉంటుంది.శీను,పోసాని,రఘుబాబులతో చేయించిన'మీలో ఎవరు కోటీశ్వరుడు' సీక్వెన్స్ కూడా నవ్వించకపోగా బోర్ కొట్టిస్తుంది.బ్రహ్మనందం బ్రోకర్ పాత్రలో కనిపిస్తాడు కాని అంతగా ఆకట్టుకోలేదు.రొటీన్ కామెడీ తప్పా శ్రీనువైట్ల కామెడీ మాత్రం కనిపించలేదు సినిమాలో.పంచ్ డైలాగ్ లమీద చూపిన శ్రద్ధ సినిమా కథమీద చూపిస్తే సినిమా బాగుండేది.మహేష్ బాబు ఇమేజ్,మహేష్ బాబు పేల్చే డైలాగ్ ల మీడీ శ్రీనువైట్ల ఆధారపడ్డాడు.సినిమా రెండవ భాగం 'దూకుడు' సినిమాను పోలి ఉందని ప్రేక్షకులు పెదవి విరుస్తారు.
ప్లస్ పాయింట్లు
సినిమాలో ప్లస్ పాయింట్ల విషయానికి వస్తే సినిమా అంతా మహేష్ అనే చెప్పాలి.మహేష్ పేల్చే పంచ్ డైలాగ్ లు ఆకట్టుకుంటాయి.టోటల్ గా మహేష్ పెర్ఫార్మన్స్ చాలా బాగుంటుంది.
మైనస్ పాయింట్లు
ముఖ్యంగా సినిమాకు శ్రీనువైట్ల దర్శకత్వం మైనస్ గా నిలిచింది.మూస ధోరణిలో సాగడం,సినిమాలో పంచ్ డైలాగ్ ల డోస్ ఎక్కువవడం,సరైన కథ-కథనం లేకపోవడం,రెండవ భాగం,ఎక్కువ నిడివి.

దసరాకు ముందే ప్రేక్షకులను అలరించాలని 'ఆగడు' యూనిట్ అనుకున్నా అందులో సక్సెస్ కాలేదని చెప్పొచ్చు.కాకుంటే ప్రస్తుతానికి పెద్ద హీరోల సినిమాలు ఏవి లేకపోవడంతో కమర్షియల్ గా సక్సెస్ సాధించే అవకాశాలు ఉన్నాయి.

28, ఆగస్టు 2014, గురువారం

అభివృద్ధి వికేంద్రీకరణ అవసరం

            
నవ్యాంధ్ర ప్రదేశ్‌ అభివృద్ధి సంచిక ఆవిష్కరణ సభలో కలెక్టర్‌

       నవ్యాంధ్రప్రదేశ్‌లో అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలని  ఆంధ్రప్రదేశ్‌ కర్నూలు జిల్లా  కలెక్టర్‌ సిహెచ్‌ విజయమోహన్‌ అన్నారు. బుధవారం (2014 ఆగస్టు 27) కర్నూలు మండల పరిషత్‌ సమావేశ మందిరంలో   ప్రజాశక్తి నవ్యాంధ్రప్రదేశ్‌ అభివృద్ధి ప్రత్యేక సంచికను కలెక్టర్‌, ప్రజాశక్తి 34వ వార్షికోత్సవ ప్రత్యేక అనుబంధాన్ని సంపాదకులు తెలకపల్లి రవి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ రాష్ట్రం విడిపోక ముందు హైదరాబాద్‌ కేంద్రంగా అభివృద్ధి జరిగిందని అన్నారు. తెలుగు ప్రజల ఆశాసౌదంగా భావించిన హైదరాబాద్‌ నగరం నుంచి దూరమైన ఆరున్నర కోట్ల ఆంధ్రులు ఆందోళనకు గురయ్యారని చెప్పారు. రాజధానికంటె కీలకమైన ఆర్థిక వ్యవస్థను కోల్పోయామని చెప్పారు.  భవిష్యత్తులో ఇలాంటినష్టం జరగకుండా ఐదారు చోట్ల అలాంటి నగరాలను నిర్మించుకోవాలని ఆయన తెలిపారు. పదిచోట్ల మెగాసిటీల ఏర్పాటుకు ప్రభుత్వం ఆలోచిస్తుందని అన్నారు. అందులో కర్నూలు కూడా ఒకటని అన్నారు. పారిశ్రామిక హబ్‌ ఏర్పాటుకు కర్నూలు జిల్లా ఓర్వకల్లులో 29 వేల ఎకరాల భూమిని గుర్తించి ప్రభుత్వానికి నివేదిక పంపామని చెప్పారు. అదేవిధంగా కర్నూలు జిల్లాలో గనులు, వ్యవసాయం, నీటి వనరులు ఉన్నాయని వివరించారు. విత్తన ఉత్పత్తికి నంద్యాల డివిజన్‌లో రెండు లక్షల ఎకరాలు అనుకూలంగా ఉందని చెప్పారు. వ్యవసాయంలో ఉద్యానవనపంటలు, విత్తనోత్పత్తికి, కర్భూజ, అరటి పండ్ల ఉత్పత్తికి అవకాశాలున్నాయని చెప్పారు. వీటిపై ప్రభుత్వానికి  నివేదికలు పంపామని చెప్పారు. ఇక్కడ మానవ వనరులు కూడా పుష్కలంగా ూన్నాయని చెప్పారు. శారీరక శ్రమ చేసేవారు, మేధోశ్రమ చేసేవారు ఉన్నారని చెబుతూ శారీరక శ్రమ చేసే వారు వారి నైపుణ్యాన్ని పెంచుకోవాలని కోరారు. ఇవన్నీ జరిగితే స్థూల ఉత్పత్తి పెరిగే అవకాశాలున్నాయని అన్నారు. ఇందుకు ప్రజల సహకారం అవసరమని కోరారు. నవ్యాంధ్రప్రదేశ్‌ అభివృద్ధికోసం  ప్రజాశక్తి చేస్తున్న కృషిని కలెక్టర్‌ అభినందించారు. అనంరతం ప్రజాశక్తి సంపాదకులు తెలకపల్లి రవి మాట్లాడుతూ కర్నూలుకు పత్రికా రంగంలో విశిష్ట స్థానం ఉందని చెప్పారు. స్వాతంత్రోద్యమంలో కీలక పాత్ర పోషించిన జర్నలిస్టు  గాడిచర్ల హరిసర్వోత్తమరావు ఈ ప్రాంతానికి చెందిన వారు కావడం గర్వకారణమన్నారు.  ఆనాడు స్వాభిమానం కోసం మాది మాకు కావాలని పోరాడారని గుర్తు చేశారు.  1936లో తొలిపత్రిక కర్నూలు జిల్లా పత్తికొండలో ప్రారంభించారని అన్నారు. మీడియాకు సత్యనిష్ట అవసరమని, ప్రజాశక్తి స్థిరంగా, నికరంగా, నిజాయితీగా వ్యవహరిస్తోందని చెప్పారు. ప్రధాన స్రవంతి పత్రికల్లో ప్రజాశక్తి కూడా ఒకటని అన్నారు.  మీడియా అంటే పాలకులు భయపడుతున్నారని అందుకే ఇటీవల రెండు ఛానళ్ల ప్రసారాలను నిలిపేశారని అన్నారు. మీడియా దృష్టి సినిమా, కార్పోరేట్‌, సెలబ్రిటీ, సెన్సేషనల్‌, క్రైం వైపే కాకుండా కామన్‌మ్యాన్‌, కమ్యూనిష్టులపై కూడా ఉండాలని సూచించారు. రాష్ట్రం విడిపోయాక ప్రజల సమస్యలపై కేంద్రీకరించడాకి మీడియాకు ఎక్కువ అవకాశం ఉందని చెప్పారు.  రాష్ట్రం విడిపోయాక పరిష్కారం కాని ప్రధాన సమస్యల్లో నదీజలాలు ఒకటని చెప్పారు. కృష్ణానది నీటి విభజన జరగక పోతే రాయలసీమకు నష్టం జరిగే అవకాశం ఉందని అన్నారు. ప్రస్తుత పాలకులు అంతరరాష్ట్ర సమస్యలపై కాకుండా అంతర్గత సమస్యలను శాసనసభలో ప్రస్తావిస్తున్నారని చెప్పారు. ప్రజలకు ఉపయోగపడే ఉపాధి, ఉత్పత్తిపై చర్చజరగాలని సూచించారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు విజన్‌ 2020 కాస్త 2029గా మారిందని చెప్పారు. సెజ్‌లు, రాజధాని అభివృద్ధికి సూచికలు కావని అన్నారు. నవ్యాంధ్రను సవ్యాంధ్రగా చూడాలని ప్రజలు కోరుకుంటున్నారని చెప్పారు. రాష్ట్ర బడ్జెట్‌లో కేంద్రం 14 వేల కోట్లు ఇస్తుందని ఆశించారని, అలాంటి సూచనలు కానరాక 37వేల కోట్లకు  ద్రవ్యలోటు పెరిగిందని చెప్పారు. అనంతరం డిసిసి అధ్యక్షులు బివై రామయ్య, టిడిపి అధికార ప్రతినిధి నాగేశ్వరయాదవ్‌, సిపిఎం, సిపిఐ జిల్లా కార్యదర్శులు కె ప్రభాకర్‌రెడ్డి, రామాంజనేయులు, రవీంద్ర విద్యా సంస్థల అధినే జి పుల్లయ్య, కెవి సుబ్బారెడ్డి విద్యా సంస్థల అధినేత కెవి సుబ్బారెడ్డి మాట్లాడారు. సభకు కర్నూలు స్టాఫ్‌ రిపోర్టర్‌ బి.గోరంట్లప్ప అధ్యక్షత వహించారు. కార్యక్రమంలో జిల్లా పరిషత్‌ సిఇఓ జయరామిరెడ్డి, ప్రజాశక్తి కర్నూలు ఎడిషన్‌ ఇన్‌ఛార్జి పానుగంటి చంద్రయ్య, సిబ్బంది, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.

1, ఆగస్టు 2014, శుక్రవారం

కార్మిక భద్రతపై కేంద్రం దాడి

                            పోలవరం వ్యవసాయం కోసం కాదు
            వరంగల్‌ జాతీయ సెమినార్‌లో పాలగుమ్మి సాయినాధ్‌

        కేంద్రంలో కొత్తగా అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం కార్మికుల చట్టాల్లో సవరణలు తేవడం మొదటి ఎజెండాగా పెట్టుకున్నట్లుగా ఉందని సీనియర్‌ జర్నలిస్టు పాలగుమ్మి సాయినాధ్‌ అన్నారు. వ్యవసాయ కార్మిక సంఘం జాతీయ ఎనిమిదో మహాసభల నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రం హన్మకొండలోని పబ్లిక్‌ గార్డెన్‌లో 2014 ఆగస్టు ఒకటిన శుక్రవారం సెమినార్లు ఏర్పాటు చేశారు. ‘సరళీకరణ విధానాలు ` గ్రామీణ పేదల స్థితిగతులు’ అంశంపై సాయినాధ్‌, ప్రొఫెసర్‌ షీలా భల్లా మాట్లాడారు. సెమినార్‌లో సాయినాధ్‌ మాట్లాడుతూ పోలవరం ప్రాజెక్టు నిర్మాణం వ్యవసాయ అవసరాల కోసం కాదన్నారు. బహుళ జాతి సంస్థల కోసమేనని స్పష్టం చేశారు. అక్కడ సెజ్‌లు వెలుస్తాయన్నారు. ఆ ప్రాజెక్టు నిర్మాణం వల్ల పనిదినాలు పెరగవని చెప్పారు. ఉపాధి హామీకి కేవలం రూ.34 వేల కోట్లు కేటాయించారని తెలిపారు. కార్పొరేట్‌ శక్తులకు రూ.71 వేల కోట్ల పన్ను మాఫీ చేశారని వివరించారు. రూ.2 లక్షల కోట్ల పన్ను మినహాయింపు ఇచ్చారని చెప్పారు. దీనిలో రూ.48 వేల కోట్లు బంగారం, డైమండ్స్‌ దిగుమతులపై సబ్సిడీ ఉందన్నారు. ఇటువంటి చర్యల వల్ల లోటు బడ్జెట్‌ కనిపిస్తోందన్నారు. ఉపాధి హామీ చట్టానికి నిధులు కేటాయింపు పెంచాలంటే డబ్బులేవంటున్నారని విమర్శించారు. గడచిన మూడేళ్లలో బహుళ జాతి సంస్థల యజమానులకు ఇచ్చిన రాయితీ సొమ్ముతో దేశంలో వందేళ్లపాటు ఉపాధి హామీ చట్టం అమలు చేయవచ్చని చెప్పారు. అందరికీ పని కల్పించవచ్చన్నారు. ఆహారభద్రత చట్టం అమలుకు డబ్బుల్లేవని కేంద్రం చెబుతోంద న్నారు. ఉపాధి హామీ చట్టాన్ని నీరు గార్చడమే ప్రధాన కర్తవ్యంగా పెట్టుకున్నారని చెప్పారు. మహారాష్ట్రలో నీటి లభ్యత లేదని, అక్కడ కరువు ప్రకటించారని చెప్పారు. సహాయక చర్యలు మాత్రం చేపట్టలేదన్నారు. గ్రామాల నుండి ముంబాయికి వలస వచ్చిన వారిని కలిశామన్నారు. వారు ముంబాయిలో 37 అంతస్తుల భవన నిర్మాణంలో పని చేస్తున్నారని తెలిపారు. ఒక్కో అంతస్తులో ఒక్కో స్విమ్మింగ్‌ పూల్‌ ఉందన్నారు. నీరు ఎక్కడ నుండి వచ్చిందన్నారు. ఈ నీటిని వ్యవసాయానికి మళ్లిస్తే గ్రామీణ ప్రాంతానికి ఉపాధి పెరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
                                              శాశ్వత ఉపాధి కరువు : ప్రొఫెసర్‌ శీలా భల్లా
            గ్రామీణ ప్రాంతాల్లో శాశ్వత ఉపాధి కరువైందని ప్రొఫెసర్‌ శీలా భల్లా తెలిపారు. ‘సరళీకృత విధానాలు ` గ్రామీణ స్థితిగతులు’ అంశంపై సెమినార్‌లో ఆమె ప్రసంగించారు. 15 ఏళ్లలో వ్యవసాయ భూమి వ్యవసాయేతర అవసరాలకు వినియోగం పెరిగిందని చెప్పారు. ఆ రంగంలోనూ ఆశించినంతగా ఉపాధి పెరగలేదని తెలిపారు. నూతన ఆర్థిక విధానాల ప్రారంభం అనంతరం ఇటువంటి పరిస్థితి తీవ్రమైందన్నారు. ముఖ్యంగా యువత ఉపాధికి దూరం కావడం ఆందోళన కలిగిస్తోందని తెలిపారు. భారీగా అసమానతలు పెరిగాయని చెప్పారు. వలసలు ఎక్కువయ్యాయని వివరించారు. ఇటువంటి పరిస్థితి మారాలంటే పెట్టుబడిదారులకు, కార్మికులకు మధ్య ఉన్న అంతరాలు పోవాలని ఆకాంక్షించారు.

31, జులై 2014, గురువారం

ఆకలిని పెంచుతున్న పెట్టుబడి

భూపంపిణీతో ప్రజలకు కొనుగోలు శక్తి
పభాత్‌ పట్నాయక్‌
వ్యకాస ప్రతినిధుల సభలో ప్రారంభోపన్యాసం

       దేశంలో అత్యధిక ప్రజల ఆకలి సమస్యకు నయా ఉదారవాదం, అంతర్జాతీయ ఫైనాన్స్‌ కేపిటల్‌ ప్రధాన కారణమని ప్రొఫెసర్‌ ప్రభాత్‌ పట్నాయక్‌ చెప్పారు. నిన్నటి వరకు పాలించిన యుపిఎ, నేడు అధికారంలో ఉన్న ఎన్‌డిఎ ప్రభుత్వాలు అంతర్జాతీయ ఫైనాన్స్‌ కేపిటల్‌ ఒత్తిళ్లకు లొంగి పని చేస్తున్నాయని, ఫలితంగా వ్యవసాయరంగం, గ్రామీణ ప్రజానీకం మనుగడ ప్రశ్నార్ధకమైందని పేర్కొన్నారు. సరళీకరణ విధానాలకు ప్రత్యామ్నా యాలు ూన్నాయని,  వాటిని అమలు చేయించు కోవడం కోసం రైతులు, వ్యవసాయ కార్మికులు, ఇతర గ్రామీణ ప్రజానీకం ఐక్య పోరాటాలతో ప్రభుత్వాలపై ఒత్తిడి తేవాలని పిలుపునిచ్చారు. 2014 జులై 31న తెలంగాణ రాష్ట్రం వరంగల్‌ జిల్లాలో  జరుగుతున్న అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం (ఎఐఎడబ్ల్యుయు) మహాసభ ప్రతినిధుల సమావేశాన్ని గురువారం ప్రభాత్‌ పట్నాయక్‌ ప్రారంభించారు. ఎఐఎడబ్ల్యుయు అఖిల భారత అధ్యక్షుడు పాటూరు రామయ్య అధ్యక్షతన నిర్వహిం చిన సభనుద్దేశించి ప్రభాత్‌ ప్రారంభోపన్యాసం చేస్తూ భారత సమాజం వ్యవసాయంపై ఆధారపడి ఉండగా, ప్రభుత్వాలు సరళీకరణ దృక్పథాన్ని ఎంచుకున్నాక రైతుల ఆత్మహత్యలు పెరిగి సంక్షోభం తీవ్రమైందని పేర్కొన్నారు. ఈ సంక్షోభం ప్రభావం వ్యవసాయ కార్మికులు, ఇతర గ్రామీణ పేదలపై పడిరదన్నారు. ఆహార ధాన్యాల ూత్పత్తికి, ఆహార లభ్యతకు మధ్య అంతకంతకూ వ్యత్యాసం పెరగడం ప్రమాదకరమని వివరించారు. ‘నిపుణుల లెక్కల ప్రకారం ప్రతి మనిషికీ తలసరి 200 కిలోల ఆహార ధాన్యాలు కావాలి. స్వాతంత్య్రం వచ్చిన సమయంలో 145 కిలోల ఉత్పత్తి జరిగింది. బ్యాంకుల జాతీయకరణ, భూపంపిణీ, వ్యవసాయంలో ప్రభుత్వ పెట్టుబడుల వలన 1980లలో 180 కిలోలకు పెరిగింది. ఇన్నేళ్లలోనూ జనాభాకు అవసరమైన ఆహార ధాన్యాల ఉత్పత్తి జరగనేలేదు’ అని తెలిపారు. ప్రజలందరి అవసరాలకు సరిపడ ఒక పక్క ఆహార ధాన్యాల ఉత్పత్తి జరగకపోయినా విదేశాలకు మాత్రం పెద్ద ఎత్తున ఎగుమతులవుతున్నాయని ఎద్దేవా చేశారు.     2012లో ప్రభుత్వం వద్ద 82 మిలియన్‌ ఆహార ధాన్యాల నిల్వలుంటే, వాటిలో 42 మిలియన్‌ టన్నులు విదేశాలకు ఎగుమతయ్యాయని పేర్కొన్నారు. ఆకలి, పోషకారలోపం నివారణలో మన దేశం పలు ఆఫ్రికా దేశాల కంటే వెనుకబడి ఉందన్నారు. ప్రతి వ్యక్తికీ 2,400 కేలరీలు కావాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తుండగా 2,200 కేలరీలు మాత్రమే అందుతోందని చెప్పారు. సరిపడ కేలరీలు అందని ప్రజలు 1973లో 56 శాతం మంది ఉండగా నేటికి ఆ సంఖ్య 75 శాతానికి చేరిందన్నారు. గోదాముల్లో మూలుగుతున్న ఆహార ధాన్యాలను ప్రజా పంపిణీ వ్యవస్థ (పిడిఎస్‌) ద్వారా ఉచితంగా లేక చౌక ధరలకు పంపిణీ చేయాలని కోరితే సబ్సిడీల భారం పడుతుందని, ద్రవ్యలోటు పెరుగుతుందని ప్రభుత్వం, కొందరు ఆర్థిక వేత్తలు అర్థం లేని వాదనలు చేస్తున్నారని తప్పుబట్టారు. ఆహార ధాన్యాలు పంపిణీ చేస్తే ప్రజల కొనుగోలు శక్తి పెరుగుతుందన్నారు. ‘అంతర్జాతీయ ఫైనాన్స్‌ కేపిటల్‌, బహుళజాతి సంస్థలు సబ్సిడీలు పెంచేందుకు అంగీకరించవు. అందుకే ప్రభుత్వాలు వెనక్కి తగ్గాయి. ఆకలిని పెంచుతున్నది వారే’ అని ప్రభాత్‌ అన్నారు. వ్యవసాయ కార్మికుల పోరాటాలు, వామపక్షాల ఒత్తిడి వలన యుపిఎ`1 సర్కారు ఉపాధి హామీని ప్రారంభించగా, ఎన్‌డిఎ దాన్ని క్రమంగా ఎత్తేసేందుకు చూస్తోందన్నారు. ఉపాధి హామీకి సర్కారు కేటాయించింది కేవలం రూ.34 వేల కోట్లు. దేశ స్థూలోత్పత్తి రూ.12 లక్షల కోట్లు కాగా అందులో ఉపాధి హామీకి ప్రతిపాదించింది 0.3 శాతం మాత్రమే’ అని తెలిపారు. యుపిఎ సర్కారు చివరి సంవత్సరంలో రూ.34 వేల కోట్లు బడ్జెట్‌లో కేటాయించి, రూ.38 వేల కోట్లు ఖర్చు చేసింది. కూలీలు చేసిన పనికి రూ.4 వేల కోట్లు ఇంకా చెల్లించాల్సి ఉంది. మొత్తం కలిపితే రూ.42 వేల కోట్లవుతుంది. కానీ అధికారంలోకొచ్చిన ఎన్‌డిఎ ప్రవేశపెట్టిన తొలి బడ్జెట్‌లో కేవలం రూ.34 వేల కోట్లనే కేటాయించడాన్ని బట్టి ఉపాధి హామీని క్రమంగా ఎత్తేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు అర్థమవుతుందని వివరించారు. ఉపాధి హామీ నిరుపయోగం అన్నట్లు వ్యూహాత్మకంగా కొన్ని వర్గాలు మానసికంగా దాడి చేస్తున్నాయని విమర్శించారు. వ్యవసాయరంగం సంక్షోభానికి విరుగుడుగా ప్రత్నామ్నాయాలను ప్రభాత్‌ పట్నాయక్‌ సూచించారు. భూసంస్కరణలు, భూమి పున్ణపంపిణీ జరగాలన్నారు. భూపంపిణీ చేస్తే ప్రజల కొనుగోలు శక్తి పెరుగుతుందని చెప్పారు. స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలను రద్దు చేయాలని కోరారు. సహకార పద్ధతిలో వ్యవసాయాన్ని ప్రోత్సహించాలని పేర్కొన్నారు. సార్వజనీన పిడిఎస్‌ అమలు చేయాలన్నారు. ప్రజలకు ఉచిత విద్య, ఆరోగ్యం అందుబాటులోకి తేవాలని,ఉపాధి అనేది ప్రజల ప్రాధమిక హక్కుగా ఉండాలని, రైతులకు సబ్సిడీపై వ్యవసాయ ఉపకరణాలు, సంస్థాగత రుణాలు అందించాలని సూచించారు. బ్యాంకింగ్‌ వ్యవస్థలో ఎఫ్‌డిఐలను అనుమతించి ప్రైవేటీకరించేందుకు ఎన్‌డిఎ ప్రయత్నిస్తోందని, అదే జరిగితే బ్యాంకులపై సామాజిక బాధ్యత ఉండదని, రైతులకు, ఇతర వర్గాలకు తక్కువ వడ్డీపై రుణాలు లభించవని చెప్పారు. ప్రారంభ సభలో సిపిఎం పొలిట్‌బ్యూరో సభ్యులు బివి రాఘవులు, ఎపి రాష్ట్ర కార్యదర్శి పి మధు, ఎఐకెఎస్‌ నాయకులు హన్నన్‌ మొల్ల, రామచంద్రన్‌ పిళ్లై, ఎఐఎడబ్య్లూయు ప్రధాన కార్యదర్శి విజయరాఘవన్‌, సుభాషిణి అలీ పాల్గొన్నారు.