17, నవంబర్ 2010, బుధవారం

హంసను మీరు చూశారా?

హంస ఒక అందమైన పక్షి అంటారు. హిందూమతంలో హంసకొక ప్రత్యేకస్థానం ఉందట. హంస సరస్వతీదేవి వాహనమట. వేదాలలో అత్యున్నత స్థాయికి చేరిన వారిని పరమహంస అని ప్రస్తుతించేవారుట. హంసకు పాలను, నీరును వేరుచేసే సామర్థ్యం ఉందంటారు. కాని అది పాలు, నీరు కలిసిన మిశ్రమంలో నుండి పాలను మాత్రమే తాగి నీటిని పాత్రలో మిగులుస్తుందట. ఇది వేదాలలో చెప్పబడిన హంస. ప్రస్తుతం ఇవి లేవు అంటారు. అంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం రవాణాశాఖ వారి సరికొత్త బస్సుసర్వీసుకు రాజహంసని పేరు పెట్టారు. ఆదిలోనే హంసపాదు అనే పదాన్ని ఆటంకాలు ఏర్పడిన సందర్భాలలో పత్రికల్లో రాసేస్తున్నారు. వయ్యారి భామ నీహంసనడక అని రచయితలు పాటను కూడా రాశారు. ఇలా హంస ప్రయోగం చాలా సందర్భాల్లో ఉపయోగిస్తున్నారు. అబ్బో తెగ రాసేస్తున్నారు. ఇంతకూ హంసను చూశారా? చూస్తే ఎలా ఉంటుంది. పాలను, నీళ్లను వేరు చేసిన సందర్భాలున్నాయా? హంసపాదు అని ఎందుకు ప్రయోగించారు. హంస నడక చూశారా? చూసిన వారేవరయినా వివరణ ఇస్తారని ఆసిస్తున్నాను.

16, నవంబర్ 2010, మంగళవారం

చేనుకు గట్టు వూరికి కట్టు ఉండాలి


మనిషికి క్రమశిక్షణ ఎంత అవసరమో వివరించే సామెత ఇది. విచ్చల విడిగా తిరగడం, హద్దూపద్దూ లేకుండా వ్వవహరించడం , మంచితనం అనిపించుకోదు. ఈ విషయాన్నే ఈసామేత వివరిస్తోంది. ఎవరిదైనా ఒక చేను ఉన్నదంటే దానికి హద్దులను సూచించే విధంగా గట్టు ఉండటం ఎంత అవసరమో మనుషులంతా కలిసి మానవత్వంతో బతకాలనుకున్నపుడు వారు నివసిస్తున్న ఊరికి కొన్న కట్టుబాట్లు ఉండితీరాలి. ఆకట్టుబాట్లను ఆ ఊరిలోని వారంతా సమానంగా ఆచరించాలి. అప్పుడే అన్ని విధాలా సుఖశాంతులు వర్థిల్లుతాయి. చేనుకు వేసిన గట్టు ఆచేను హద్దును సూచించినట్లుగానే ఒక ఊరి ప్రజలు ఏర్పరుచుకున్న కట్టుబాట్లు వారి జీవనశైలిని , మంచితనం వంటి లక్షణాలను ఇతరులు సులభంగా చూసి తెలుసుకోవడానికి వీలుంటుంది. అదేవిధంగా ఒక దేశం కూడా మనుషులు ఎలా ఉండాలనేదానికోసం కొన్ని కట్టుబాట్లను రాజ్యంగ యంత్రం ద్వారా రూపొందించుకున్నాం. అవి పాటించడంలో లోపాలు స్పష్టంగా కనబడుతున్నాయి. అవినీతి, బంధుప్రీతి పెరిగిపోయాయి. దేశంలో రాజకీయాలు అంటే అసహించుకునేలా మారింది. మనకున్న కట్టుబాట్లు, క్రమశిక్షణ ఎందుకని పాటించడం లేదు. ఎవరు బాధ్యత వహించాలి. గవర్నర్‌ అంటున్నారు. కాగ్‌ నివేదికపై అసెంబ్లీలో చర్చించాలని అందుకు ఎమ్మెల్యేలు మంత్రులు సిద్దంగా ఉన్నారా? ఉంటే ఏ స్థాయిలో చర్చజరుగుతుందో వేచి చూడాలి.

14, నవంబర్ 2010, ఆదివారం

కిరణ్ బేడి జీవిత విశేషాలు


కిరణ్ బేడీ (Kiran Bedi) భారతదేశపు మొట్టమొదటి ఐ.పి.ఎస్.అధికారిణి. 1972 బ్యాచ్‌కు చెందిన కిరణ్ బేడీ పోలీసు శాఖలో అనేక పదవులు చేపట్టి, అనేక సంస్కరణలు చేపట్టి, మెగ్సేసే అవార్డుతో సహా పలు అవార్డులను పొందినది. బ్యూరో ఆప్ పోలీస్ రీసెర్చి అండ్ డెవెలప్‌మెంట్ డైరెక్టర్ జనరల్ గా పనిచేస్తూ డిసెంబర్ 2007లో స్వచ్ఛంద పదవీ విరమణ తీసుకొంది. 
బాల్యం, విధ్యాభాసం
కిరణ్ బేడీ జూన్ 9, 1949 నాడు పంజాబ్ రాష్ట్రంలోని అమృత్‌సర్ లో జన్మించింది. తల్లిదండ్రులకు 4 కూతూర్లలో ఈమె రెండవది. డిగ్రీ వరకు స్థానికంగా అమృత్‌సర్ లోనే విధ్యాభాసం కొనసాగించింది. 1968-70 లో రాజనీతి శాస్త్రంలో పంజాబ్ విశ్వవిద్యాలయం, చండీగర్ నుంచి ఎం.ఏ.పట్టా పొందినది. ఉద్యోగంలో చేరిన తరువాత 1988లో ఢిల్లీ విశ్వవిద్యాలయం నుంచి న్యాయశాస్త్రంలో డిగ్రీ పట్టా పొందినది. 1993లో ఢిల్లీ ఐ.ఐ.టి. పి.హెచ్.డి. పట్టాను ప్రధానం చేసింది. కిరణ్ బేడీ చిన్న వయస్సులో మంచి క్రీడాకారిణిగా గుర్తింపు పొందినది. గతంలో అఖిల భారత టెన్నిస్ టైటిల్ ను మరియు ఆల్_ఏషియన్ టెన్నిస్ టైటిల్‌ను గెలుపొందింది. 22 ఏళ్ళ వయసులో ఏషియా మహిళల టైటిన్‌ను గెలుపొందినది. 
ఉద్యోగ జీవితం
కిరణ్ బేడీ అమృత్‌సర్ లోని ఖాల్సా మహిళల కళాశాలలో రాజనీతి శాస్త్రంలో ఉపన్యాసకురాలిగా (లెక్చరర్) జీవితం ప్రారంభించినది (1970-72. 1972లో ఆమె ఇండియన్ పోలీస్ సర్వీసుకు ఎంపైకైంది. ఢిల్లీలో ట్రాఫిక్ పోలీస్ కమీషనర్‌గా, మిజోరాంలో డిప్యూటీ ఇన్స్‌పెక్టర్ జనరల్ ఆప్ పోలీస్‌గా, చంఢీగర్ లెప్టినెంట్ గవర్నర్ సలహాదారునిగా, ఐక్యరాజ్య సమితిలోను పనిచేసింది. ఢిల్లీ ట్రాపిక్ పోలీస్ కమీషనర్ గా ఉన్నప్పుడు రోడ్లపై త్రాపిక్ నియమాలను ఉల్లంఘించిన ఉన్న కార్లను క్రేన్లతో పారద్రోలి క్రేన్ బేడీగా ప్రసిద్ధి చెందినది. తీహారు జైలులో పలు సంస్కరణలు ప్రవేశపెట్టి అందరి మన్నలను పొందింది. వాటి పలితంగా ప్రభుత్వ సర్వీసు రంగంలో రామన్ మెగ్సేసే అవార్డు పొందినది.

అన్నిట్లో ముందుంటూ.. ఆకలితో అల్లాడుతూ...

నిరాదరణకు గురవుతున్న కావలికారులు
రోజంతా పని చేస్తే కూలి 56 రూపాయలే..
కనీసం ప్రభుత్వ ఉద్యోగిగా గుర్తించలేని స్థితి
ప్రజలను దోపిడీ చేస్తూ అన్యాయానికి పాల్పడే వారిని నియంత్రించి.. బాధితులకు న్యాయం చేసేది ప్రభుత్వం. కానీ ప్రభుత్వమే శ్రమదోపిడీ చేస్తూ.. శ్రమకు తగ్గ ఫలితం ఎగ్గొడుతున్న తీరు విస్మయం కల్గించకమానదు. కనీస వేతనాలు అమలు చేయాల్సిన ప్రభుత్వమే.. కావలికారులతో వెట్టిచాకిరీ చేయిస్తోంది. ఊరంతా నిద్రపోయినా తను మాత్రం గ్రామ క్షేమం కోరి మేల్కొని ఉండే కావలికారు.. దోపిడీలు, గొడవలు అరికట్టడంలో ముందుంటున్నాడు. మూడు రంగుల చేతికర్రతో ఊరంతా గస్తీ తిరుగుతూ... ఎవరికి ఏ ఆపద వచ్చినా తన సొంత ఆపదలా వణికిపోతాడు. గ్రామానికి ఏ అధికారి వచ్చినా 'జీ సలాం' అంటూ సహాయకారిగా ఉంటాడు. గ్రామానికి వచ్చిన ఏ అభివృద్ధి పథకమైనా కావలికారులు లేనిదే ప్రజలకు చేరదు. ఇంతటి ప్రాధాన్యత గల వారి జీవితంలోకి తొంగి చూస్తే... ప్రభుత్వం ఇచ్చే అరకొర జీతభత్యాలు సరిపోక అర్ధాకలితో అలమటించే వారే ఎక్కువగా కనిపిస్తున్నారు.
మహబూబ్‌నగర్‌ జిల్లా నాగర్‌కర్నూల్‌ రెవెన్యూ డివిజన్‌లోని 13 మండలాల్లో 534 మంది గ్రామసేవకులు ఉన్నారు. ఇందులో బంట్రోతు, సోడు, గ్రామ కావలికారులు ఉన్నారు. వీరంతా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు చెందిన వారే ఉన్నారు. వీరు 3,562 మంది వీరిపై ఆధారపడి ఉన్నారు. వంతులవారీగా చేస్తున్న గ్రామసేవకులు మరో 5 వేలకు పైగానే ఉంటారు. మొత్తం 8,562 మంది గ్రామసేవకులు ప్రభుత్వం ఇచ్చే అరకొర జీతభత్యాల మీద ఆధారపడి జీవిస్తున్నారు. వీరికి ఎలాంటి ఇతర ఆస్తులూ ఉండవు. భూములు, మాన్యాలు గతంలో ఉన్నా క్రమంగా పటిక, పట్వార్వీలు వీటిని అన్యక్రాంతం చేసుకున్నారు.
నిరాదరణలో గ్రామసేవకులు
ప్రభుత్వ నిరాదరణతో గ్రామసేవకులు తల్లడిల్లుతున్నారు. 24 గంటలూ పనిచేసే వీరికి నెల జీతం 1,700 రూపాయలు మాత్రమే ఇస్తున్నారు. అంటే రోజుకు 56 రూపాయలు అన్నమాట. ఉపాధి కూలికి 100 రూపాయలు ఇస్తున్న ప్రభుత్వం.. గ్రామసేవకులకు మాత్రం 56 రూపాయలు చెల్లించడమేమిటని ప్రజాసంఘాల నాయకులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. మండల కార్యాలయానికి డ్యూటీలో వెళితే రాత్రి ఉండాలి. వీటికి గానూ అలవెన్సుల కింద రోజుకు పది రూపాయలను అధికారులే మెక్కుతున్నారు. మండల కార్యాలయానికి వెళ్లడానికి ప్రతి ఒక్కరికీ ఒక సైకిల్‌ ఇవ్వాల్సి ఉండగా.. దీన్ని ఎక్కడా అమలు చేయడం లేదు. వీరిని నాల్గో తరగతి ఉద్యోగులుగా గుర్తించాలని కొంతకాలంగా కోరుతున్నా ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోంది. వీరిలో చదువుకున్న ప్రతి ఒక్కరికీ పదోన్నతి కల్పించాలని, కారుణ్య నియామకాలు చేపట్టాలని ప్రజా సంఘాలు డిమాండ్‌ చేస్తున్నాయి. స్వచ్ఛంద పదవీ విరమణ వర్తింపజేసి అర్హులైన వారసులకు ఉద్యోగాలు ఇప్పించాలని కూడా వీరంతా కోరుతున్నారు. అధికారుల వేధింపులను, గ్రామ పెద్దల బెదిరింపులను అరికట్టాలని కూడా వీరు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
అన్నీ వెట్టి పనులే..
గ్రామంలో వీరు చేస్తున్న పనులన్నీ వెట్టిపనులే. సర్పంచి ఇంట్లో పెళ్లి జరిగినా, పేరంటాలు అయినా గ్రామసేవకులు అన్నీ అయి చూసుకోవాలి. కట్టెలు కొట్టాలి. వంటలు చేయాలి. వడ్డించాలి. సాగనంపాలి. ఇలా ప్రతి పనీ గ్రామసేవకులే చేయాలి. సర్పంచికే కాదు గ్రామ భూస్వాములందరికీ ఈ వెట్టిచాకిరి చేయాల్సిందే. ఊర్లో ఎవరైనా చనిపోతే, ఆక్సిడెంట్‌ అయితే, మందుతాగి చనిపోతే ఆ శవం దగ్గర జాగారాలు చేయాల్సిందే. కేసు అయితే పోలీసులు వచ్చి పోస్టుమార్టం చేసి తిరిగి సమాధి పెట్టేవరకు అంతా వీరే చేయాలి. గొడవలు జరిగినా, ఇళ్లు కూలినా అధికారులకు సమాచారం ఇవ్వాల్సిన బాధ్యత వీరిదే. ఇంకా జనాభా లెక్కింపు, ఓటింగు సమయంలో వెటర్నరీ సేవలు, హౌసింగ్‌ బిల్లులు, పింఛన్లు, రేషన్‌కార్డులు ఇలా ప్రతి ఒక్క ప్రభుత్వ పనికీ కావలికారులే ముందుండి అధికారులకు సహాయం అందివ్వాలి.
సమ్మె చేసినా లేని ఫలితం శూన్యం
జీతభత్యాల పెంపు కోసం ట్రేడ్‌ యూనియన్‌ సిఐటియు ఆధ్వర్యంలో గతంలో 45 రోజుల పాటు సమ్మె చేశారు. రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావు చేత ఒప్పందం కూడా చేసుకున్నారు. అయినా ఈ కోరికలు నెరవేరకపోవడంతో మళ్లీ గ్రామసేవకులు సమ్మెబాట పట్టనున్నారని గ్రామసేవకుల సంఘం జిల్లా అధ్యక్షులు నిరంజన్‌ హెచ్చరిస్తున్నారు.
తినేది కూడా నమ్మకం లేదు
ఏ అధికారి ఎప్పుడు వస్తాడో తెలియదు. అన్నం తింటుంటే అధికారి వచ్చినా, పోలీస్‌ వచ్చినా మధ్యలోనే పోవాలి. పూర్తిగా తింటామో, లేదో తెలియదు. అన్ని సౌకర్యాలు అధికారులకు చేయాలి. మేము ఉపవాసం ఉండాలి.
- లక్ష్మయ్య, గ్రామ సేవకుడు, నడిగడ్డ
ఉపాధి పనే నయం
ఉపాధి పనికి పోతే రోజు కూలి రూ.100 ఇస్తారు. మాకు మాత్రం 56 రూపాయలే. పెరిగిన ధరలకు ఈ మొత్తం దేనికీ సరిపోదు. దీంతో ఒక్కోరోజు పస్తులుండాల్సి వస్తోంది. పోలీసోల్ల లాగా ఎప్పుడూ టెన్షన్‌గా ఉండాల్సి వస్తోంది.
- కాశన్న, తాడూరు
కనీస వేతన చట్టం
అమలు చేయాలి
గ్రామసేవకులకు కనీస వేతన చట్టం అమలు చేయాలి. వీరిని నాలగవ తరగతి ఉద్యోగులుగా గుర్తించాలి. ప్రభుత్వ పిఎఫ్‌, డిఎలు వర్తింపజేయాలి. ప్రతి గ్రామసేవకునికి సైకిల్‌ ఇవ్వాలి. పింఛన్‌, కారుణ్య నియామకాలు, పదోన్నతి తదితర సదుపాయాలు కల్పించాలి. వీటి అమలు కోసం ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. లేదంటే తీవ్ర ఉద్యమాలు చేపడతాం.- పొదిల రామయ్య,
సిఐటియు నాయకులు

13, నవంబర్ 2010, శనివారం

కర్నూలు జిల్లాలో వ్యవసాయం

కర్నూలు జిల్లాలో వర్షపాతం తక్కువగా నమోదవుతోంది. జిల్లాలో నల్లరేగడి నేలలు ఎక్కువగా ఉన్నాయి. రబీ పంటలూ వర్షం ఆధారంగా సాగుచేస్తారు. జిల్లా సగటు వర్షపాతం 670 మిల్లీ మీటర్లు. 44.15 లక్షల ఎకరాల భౌగోళిక విస్తీర్ణం ఉంది. అందులో 23.475 లక్షల ఎకరాల సాగు భూమి ఉంది. సాగునీటి వనరుల కింద ఐదు లక్షల ఎకరాల భూమి ఉంది. ప్రధానంగా వేరుశనగ, వరి, పొద్దుతిరుగుడు, పత్తి, శనగ, జొన్న పంటలు పండిస్తారు. రెండేళ్లుగా ఖరీఫ్‌ సీజన్‌లో ఆముదం, కంది పంటలను విస్తారంగా సాగు చేస్తున్నారు. ఖరీఫ్‌ సాధారణ సాగు విస్తీర్ణం 13.5 లక్షల ఎకరాలు. ఈ సీజన్‌లో వేరుశనగ, వరి, పొద్దుతిరుగుడు, కంది, పత్తి, ఉల్లి పంటలు సాగు చేస్తారు. గిట్టుబాటు ధరలు లభించడం లేదని గత ఏడాది నుండి వేరుశనగ, పొద్దుతిరుగుడు సాగు చేసే రైతులు ఆముదం, కంది పంటల వైపు మొగ్గు చూపుతున్నారు. ఈ ఏడాది కందులు లక్షా 25 వేల ఎకరాల్లో, ఆముదం 35 వేల ఎకరాల్లో సాగు చేశారు. రబీలో బావుల, సాగునీటి వనరుల కింద 14 వేల హెక్టార్లలో మొక్కజొన్న సాగు చేశారు. గతంలో రెండున్నర లక్షల ఎకరాల్లో పత్తిని సాగుచేసేవారు. 4,5 సంవత్సరాలుగా పత్తికి ధరలు లేకపోవడంతో రైతులు ప్రత్యామ్నాయ పంటల వైపు మొగ్గు చూపుతున్నారు. రబీలో 4.3 లక్షల హెక్టార్లలో శనగ, జొన్న, పొద్దుతిరుగుడు పంటలు సాగు చేశారు. ధనియాలు 20 వేల హెక్టార్లలో, వేరుశనగ 18 వేల హెక్టార్లలో, వరి 12 వేల హెక్టార్లలో, మినుములు 10 వేల హెక్టార్లలో సాగు చేస్తారు. వీటితో పాటు టమోట, వంకాయ, బెండకాయ, ఉల్లి పంటలు విస్తృతంగా సాగు చేస్తారు. జిల్లాలో కెసి కెనాల్‌, తుంగభద్ర దిగువ కాల్వ, ఎగువ కాల్వ, తెలుగు గంగ, ఎస్‌ఆర్‌బిసి, గాజులదిన్నె ప్రాజెక్టుల కింద ఆయకట్టు ఉంది. తుంగభద్ర ప్రాజెక్టు నదీ పరివాహక ప్రాంతాల్లో సరైన వర్షాలు లేకపోవడం వల్ల కెసి కెనాల్‌లో 150 కిలోమీటర్ల వరకు ఆయకట్టు సాగు కష్టంగా మారింది. ఎల్‌ఎల్‌సి కింద కర్నాటక రాష్ట్రంలో నాన్‌ ఆయకట్టు విపరీతంగా ఉండటంతో జిల్లాలో ఎల్‌ఎల్‌సి ఆయకట్టు క్రమేణా తగ్గిపోతోంది. ఆదోని, ఎమ్మిగనూరు, మంత్రాలయం నియోజకవర్గాల్లోని ఆయకట్టుకు కొంత వరకు నీరు అందుతున్నా కోడుమూరు ప్రాంత రైతులకు అందడం లేదు. ఓ పక్క వర్షాభావ పరిస్థితులు, మరోపక్క సాగు నీటి విధానంలో స్పష్టమైన ప్రణాళిక లేకపోవడంతో జిల్లా రైతులు ఏటా కరువు బారిన పడుతున్నారు. ఏటా సరైన దిగుబడులు రాక... ఒకవేళ వచ్చిన మార్కెట్‌లో గిట్టుబాటు ధరలు లేక రైతులు పెద్ద సంఖ్యలో ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. కరువు బారిన పడిన రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం వద్ద స్పష్టమైన ప్రణాళిక లేకపోవడంతో రైతుల ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. జిల్లాలో కెసి కెనాల్‌, ఎల్‌ఎల్‌సి, హెచ్‌ఎల్‌సి, తెలుగుగంగ, గాజులదిన్నె, గురురాఘవేంద్ర ప్రాజెక్టుల కింద ఆయకట్టు ఉంది. కరువు ప్రాంతాలపై డోన్‌, పత్తికొండ, ఆలూరు, నియోజక వర్గాల్లో సాగునీరు అందించేందుకు చేపట్టిన హంద్రీనీవా ప్రాజెక్టు నిర్మాణ పనులు నత్తనడకన సాగుతున్నాయి. హంద్రీనీవాకు ఆగస్టు 15 నాటికి నీరు అందిస్తామని చెప్పిన ప్రభుత్వం ఆ వాగ్ధానాన్ని నిలుపుకోలేకపోయింది. దీంతో అసలు హంద్రీనీవాకు నీళ్లు ఇస్తారా? ఇవ్వరా? అని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. హంద్రీనీవాకు నీరిస్తే కరువు ప్రాంతమైన పశ్చిమ ప్రాంతం సస్యశ్యామలం అవుతుంది. జిల్లా నుండి ఉల్లి, టమోట పంటలను ఇక్కడి నుండి హైదరాబాద్‌, కలకత్తా, చెన్నై వంటి నగరాలకు ఎగుమతి చేస్తారు. ఉల్లి మార్కెట్‌లోకి ఎక్కువగా వచ్చినప్పుడు కొనుగోలు చేసి, నిల్వ చేసేందుకు గోడౌన్ల వసతి లేక రైతులు నష్ట పోతున్నారు. టమోట రైతుదీ అదే పరిస్థితి. టమోటాను చెన్నై, తాడేపల్లిగూడెం, విజయవాడ, హైదరాబాద్‌, గుంటూరు, వరంగల్‌ వంటి ప్రాంతాలకు ఎగుమతి చేస్తారు. టమోట దిగుబడులు అధికంగా ఉన్నప్పుడు మార్కెట్‌లోకి గిట్టుబాటు ధర లేక రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. వారిని ఆదుకునేందుకు ఆస్పరిలో జ్యూస్‌ ఫ్యాక్టరీ నిర్మిస్తామని పాలకులు ఎన్నికల సందర్భంగా వాగ్ధానం చేస్తున్నా అమలుకు నోచడం లేదు. జిల్లాలో కెసి కెనాల్‌ కింద పండించే సోనామసూరి రకం బియ్యానికి రాష్ట్ర వ్యాప్తంగా మంచి డిమాండ్‌ ఉంది.

10, నవంబర్ 2010, బుధవారం

ఈయన ఆయన కావడానికి ఎంతో సమయం పట్టకపోవచ్చు

మహారాష్ట్ర రాజకీయాలు ఈ మధ్య అగమ్యగోచరంగా మారాయని చెప్పవచ్చు. అవినీతికి అంతేలేదు. మనరాష్ట్రంతో పోల్చితే తక్కువే కావచ్చు. ఈ క్రమంలో ఆదర్శ్‌ అపార్టుమెంట్ల కుంభకోణంలో ఇరుకున్న అశోక్‌చౌవాన్‌ రాజీనామా చేశాడు. ఆయన రాజీనామాను ఆలస్యంగా నయినా ఆమోదించిన అధిష్టానం కేంద్రమంత్రి పృధ్విరాజ్‌ చవాన్‌ ముఖ్యమంత్రిగా ప్రకటించింది. ఈనెల11న ప్రమాణం చేస్తారట. ఈయనపై ఎలాంటి ఆరోపణలు లేవని.చాలా బుద్ధిమంతుడని అందరూ కొనియాడుతున్నారు. ఈ రాష్ట్ర చరిత్రలో ఇటీవల అంటే 2000 సంవ్సతరం నుంచి ముఖ్య మంత్రిగా ఉన్న విలాస్‌రావ్‌ దేశ్‌ముఖ్‌ కుంభ కోణాల్లో ఇరుక్కుని ఏమయ్యాడో చూశాం. అదేవిధంగా అశోక్‌ చవాన్‌ మంచోడని ముఖ్యమంత్రిని చేశారు. ఆయన కూడా కుంభకోణాల్లో ఇరుక్కుని రాజీనామా చేశారు. పృధ్విరాజ్‌ కూడా కుంభకోణాల్లో ఇరుక్కోవడానికి ఎక్కువకాలం పట్టకపోవచ్చని అనిపిస్తుంది. ఇరుక్కో పోవచ్చేమో చెప్పలేం. ముందుముందు చూద్దాం.........
మహారాష్ట్ర గురించి
మహారాష్ట్ర భారత దేశంలో వైశాల్య పరంగా మూడో పెద్దరాష్ట్రం. జనాభా పరంగా రెండో పెద్దరాష్ట్రం ఉత్తర ప్రదేశ్‌ తరువాత స్థానం దీనికి ఉంది. ఈ రాష్ట్రానికి గుజరాత్‌, మధ్య ప్రదేశ్‌, చత్తీస్‌గడ్‌, ఆంధ్రప్రదేశ్‌, కర్ణాటక, గోవా రాష్ట్రాలలోనూ కేంద్రా పాలిత ప్రాంతాలైన దాద్రా-నగర్‌ హవేలీ తోనూ సరిహద్దులున్నాయి. పశ్చిమాన అరేబియా సముద్రం ఉన్నది. అతి పెద్దనగరం ముంబయి రాజధానిగా ఉంది. ఈప్రాంతం రుగ్వేదంలో రాష్ట్ర అని, అశోకుని శాసనాలలో రాష్ట్రీకమని తరువాత హువాన్‌త్సాంగ్‌ వంటి యాత్రికుల రచనల్లో మహారాష్ట్ర అని ప్రస్తావించారు. మహారాష్ట్ర అనే ప్రాకృత పదం నుంచి ఈ పేరు రూపాంతంరం చెందిందని భావి స్తున్నారు. మహా కాంతార అంటే పెద్ద అడవులు అన్న పదం నుంచి మహారాష్ట్ర పదం ఉట్టిందని అంటారు. దీనంతటికి బలమైన ఆధారాలు మాత్రం లేవని చరిత్ర చెబుతోంది. ఇక్కడ అధికార భాష మరాఠీ. అయితే హిందీ, గుజరాతీ, ఇంగ్లీషు భాషలను విస్తారంగా మాట్లాడుతారు.
రాజకీయం
ఇక్కడ 35 జిల్లాలు, ఆరు రెవెన్యూ డివిజన్లున్నాయి. 288 శాసన సభ , 48 పార్లమెంటు, 19 రాజ్యసభలో స్థానాలున్నాయి. 1995 వరకు కాంగ్రెస్‌కు తిరుగులేదు. ఆతరువాత శివసేన, బిజెపి కూటమి అధికారం లోకి వచ్చింది. 2004 కాంగ్రెస్‌, నేషనలిస్టు కాంగ్రెస్‌ కూటమి అధికారంలోకి వచ్చింది. ఆతరువాత తిరిగి కాంగ్రెస్‌ అధికారంలో ఉంది.
ప్రస్తుతం శాసన సభలో కాంగ్రెస్‌ 82, ఎన్‌సిపి 62, బిజెపి 46, శివసేన 45, ఎంఎన్‌ఎస్‌ (మహారాష్ట్ర నవనీత్‌ నిర్మాణ్‌ సేన) 13, ఎస్‌పి 03, పిడబ్ల్యుపిఐ 04, బివిపి 02, సిపిఐ(ఎం) 01, ఇతరులు 30 మంది శాసన సభ్యులున్నారు.

9, నవంబర్ 2010, మంగళవారం

ఇండియన్స్‌ నాడి ఒబామా తెలుసుకున్నాడా?

ఇండియా నాడి ఒబామా తెలుసుకున్నాడని ఆయన ప్రసంగాన్ని బట్టి అర్థమవుతుంది. ఆయన ఇండియాకు రాగానే పెద్ద మార్కెట్‌గా అభివర్ణించాడు. తరువాత ఇండియాలోని స్వాతంత్య్ర సమరయోధులు శాంతి కాముకుడు జాతిపిత మహాత్మాగాంధీ, రాజ్యాంగ పిత డాక్టర్‌ బిఆర్‌ ఆందేద్కర్‌ , సమాజ నీతిని బోధించిన వేమనల గొప్పతనాన్ని కొనియాడారు. అదేవిధంగా పంచతంత్ర కథల సారాంశాన్ని గుర్తు చేశారు. ఇండియన్స్‌ సెంటిమెంటుకు ప్రాధాన్యత ఇస్తారని చెప్పకనే చెప్పారు. అదేవిధంగా ఆయన ప్రసంగాలతో ఎదుటి వారిని ఆకట్టుకోవడానికి ప్రయత్నించారు. ఆయన నల్లజాతీయుడు కావడం వల్ల ఇండియాను బాగా అర్థంచేసుకున్నారు. దేశానికి కొంతయినా ప్రయోజనం ఉంటుందని కొందరు విశ్లేశిస్తున్నారు. మరో పక్క ఇదంతా కపట ప్రేమ, దేశాన్ని కొల్లగొట్టడానికి , మన సంపదను దోచుకోవడానికి ఎంతో తాపత్రయ పడుతున్నాడు ఒబామా అని అభ్యుదయ వాదులు, మేథావులు , వామపక్ష పార్టీల నేతలు అంటున్నారు. ఒక దేశ అధ్యక్షుడు వచ్చాడు కాబట్టి గౌరవిద్దాం ఒకే కాని మనకు నష్టం కలిగిస్తే వ్యతిరేకించాలా లేదా? ఒబామా పర్యటనను ఎలా చూడాలి.?

6, నవంబర్ 2010, శనివారం

దేశాన్ని కొల్లగొట్టడానికే ఒబామా పర్యటన



వ్యాపారంతో భారత దేశాన్ని ఎలా కొల్లగొట్లాలో పూర్తిపథకంతో వచ్చినట్లు ఒబామా ముంబరులో చేసిన తొలిరోజు ప్రసంగం అర్థమవుతుంది. గతంలో ఈస్టిండియా కంపెనీ పేరుతో మొదట వ్యాపారం పేరుతోనే ఇండియాకు వచ్చి 200 ఏళ్లు దేశాన్ని పట్టిపీడించిన ఆంగ్లేయుల మోసాన్ని మనపాలకులు మరిచిపోయారా? లేక అమెరికా మోసపూరిత ఒప్పందాలను అర్థం చేసుకోవడం లేదా? లేక మాట ఇచ్చాం కాబట్టి ప్రజలేమయినా పరవాలేదు. అనుకుంటున్నారా? అర్థం కావడం లేదు. భారత్‌ తమకు భవిష్యత్‌ మార్కెట్‌ అని అమెరికా అధ్యక్షుడు బరాక్‌ ఒబామా అంటున్నారు. ఇక్కడ సుంకాలు, ఇతర అడ్డంకులను తొలగిస్తే పెట్టుబడులు పెట్టేందుకు తాము సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. తమ దేశంలో 50 వేలకు పైగా ఉద్యోగావకాశాలను కల్పించేందుకు వీలుగా భారత్‌ను 44 వేల కోట్ల డాలర్ల విలువైన వాణిజ్య ఒప్పందాలలో ఇరికించారు. ఈ మేరకు పలు ఒప్పందాలు కుదుర్చుకోనున్నట్లు ఒబామా ప్రకటించారు. శనివారం ముంబరులో జరిగిన భారత్‌ -అమెరికా వాణిజ్య మండలి (యుఎస్‌ఐబిసి) ఏర్పాటు చేసిన కార్పొరేట్‌ దిగ్గజాల సదస్సులో ఆయన మాట్లాడుతూ తమ దేశంతో వాణిజ్యంలో ప్రస్తుతం 12 స్థానంలో ఉన్న భారత్‌ను అగ్రస్థానానికి చేర్చడమే తన ప్రస్తుత పర్యటన లక్ష్యమన్నారు. రెండు దేశాల మధ్య వాణిజ్య బంధం 21వ శతాబ్దంలో భాగస్వామ్యాన్ని నిర్వచించే ఒప్పందాలలో ఒకటిగా మిగిలిపోతుందని తాను భావిస్తున్నానన్నారు. తన పర్యటనలో పలు ఒప్పందాలను కుదుర్చుకోనున్నట్లు, బోయింగ్‌ సంస్థ కొన్ని డజన్ల విమానాలను, జనరల్‌ ఎలక్ట్రిక్‌ (జిఇ) సంస్థ వందల కొద్ది విద్యుత్‌ ఇంజన్లను భారత్‌కు విక్రయించేందుకు సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. భారత్‌తో తాము కుదుర్చుకోబోయే మొత్తం 44 వేల కోట్ల డాలర్ల విలువైన ఒప్పందాల ద్వారా తమ దేశంలో 50 వేల ఉద్యోగావకాశాలు కల్పించగలమన్నారు. వాణిజ్య మండలి భేటీలో ఒబామా ప్రసంగానికి ముందు రిలయన్స్‌ పవర్‌ సంస్థ తాము జిఇ సంస్థ నుంచి 2,400 మెగావాట్ల విద్యుత్‌ ప్లాంట్లను, స్పైస్‌ జెట్‌ సంస్థ తాము బోయింగ్‌ సంస్థ నుంచి 33 కొత్త తరం 737 విమానాలను కొనుగోలు చేయనున్నట్లు ప్రకటించాయి. ఈ ప్రకటనలను అభినందించిన ఒబామా ఎగుమతి నిబంధనలను సడలించడం ద్వారా డిఆర్‌డిఒ, ఇస్రో వంటి భారత సంస్థలకు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందజేస్తామన్నారు. ఇందులో ఎంత మోసముందో అర్థం చేసుకోకపోతే దేశం మరింత అప్పుల పాలయ్యే అవకాశం ఉంది. అమెరికా అధ్యక్షుడు బారాక్‌ ఒబామా పర్యటనతో మన దేశానికి తీరని నష్టం కలుగనుంది. ప్రపంచ పోలీసుగా పెత్తనం సాగిస్తున్న అమెరికా భారత్‌ పర్యటన ద్వారా తన ఆధిపత్యాన్ని చాటుకోవాలనే లక్ష్యంతో ఆ దేశ అధ్యక్షుడు ఇక్కడికి వచ్చారు. ఒబామా మూడున్నర రోజుల పర్యటించనున్నారు. ఒబామా పర్యటన ఆంతర్యాన్ని తెలుసుకున్న వారు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అమెరికాకు అన్ని విధాలుగా మేలు చేసే ఒప్పందాలను చేసుకునే ఎత్తుగడతో ఒబామా పర్యటన సాగుతోంది. రాజకీయ రాజధాని ఢిల్లీకి కాకుండా వాణిజ్య రాజధాని ముంబయిలో అడుగు పెట్టడంతోనే ఆయన పర్యటనలోని అసలు ఉద్దేశ్యం అర్థం చేసుకోవచ్చు.. రక్షణ, విద్య, వ్యవసాయ, ఆర్థిక తదితర రంగాల్లో పలు ఒప్పందాలను చేసుకునే ముఖ్య ఉద్దేశ్యంతో పర్యటనకు వచ్చారు. 120 యుద్ధ విమానాలను మన దేశానికి విక్రయిస్తున్నారు. ఆయన వెంట దేశవ్యాప్తంగా ప్రసిద్ధిగాంచిన రెండొందల మంది సీఈఓలు సైతం ఉన్నారు. ఇటీవల పాకిస్థాన్‌కు ఆర్థికసాయం చేసిన అమెరికా ఆ వెంటనే భారత్‌లో పర్యటించడంలో ఆంతర్యం ఏమిటి.. మన దేశ పాలకులు కూడా అమెరికాకు మోకరిల్లే విధానాలను అనుసరించడం శోచనీయం. అమెరికా మొదటి నుండీ ' మీ ఇంటికొస్తే ఏం ఇస్తావ్‌ ? మా ఇంటికొస్తే ఏం తెస్తావ్‌ ? ' అనే పద్ధతిని అనుసరిస్తోంది. ప్రపంచంలో ఎక్కడ పచ్చగుంటే అక్కడికి వెళ్లి వారి సంపదను కొల్లగొట్టే విధానాలను అమెరికా అనుసరిస్తోంది. ప్రధాని మన్మోహన్‌ సింగ్‌, యుపిఎ ఛైర్‌పర్సన్‌ సోనియా గాంధీ లాంటి వారు అమెరికా విధానాలకు వత్తాసు పలకడం దురదృష్టకరం.

3, నవంబర్ 2010, బుధవారం

'బుడబుడ కావడం'


ఏదైనా రహస్యం మెల్లగా బహిర్గతం కావటం అనేఅర్థంలో 'బుడబుడ కావడం' జాతీయ ప్రయోగంలో ఉంది. నీటి నుంచి గాలిబుడగలు కొన్ని సందర్భాల్లో వస్తుంటాయి. రబ్బరు గొట్టాలాంటివి చిల్లులు పడిన సందర్భాల్లో వాటిమీద నీరు ప్రవహిస్తున్నప్పుడు బుడబుడమంటూ బుడగలు పైకొస్తూ ఉంటాయి. దీన్నిబట్టి ఆగాలిబుడగలు వచ్చే ప్రాంతంలో రబ్బరు గొట్టానికి రంధ్రం పడిందన్న విషయం స్పష్టమవుతుంది. ఇక్కడ రంధ్రం అనేది రహస్యం. ఆరహస్యాన్ని బహిర్గతం చేసేవి నీటి బుడగలు. ఈ భావనతోనే బుడబుడ కావటం అనే జాతీయం ప్రయోగంలోకి వచ్చింది. నవంబర్‌ 3న రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరిగింది. ఇక్కడి రహాస్యాలు మంత్రుల ద్వారా బయటకు వెళ్తున్నాయని ముఖ్యమంత్రి రోశయ్య ఆగ్రహం చెందారట..... పై జాతీయానికి ఆయన ఆందోళన సరిపోయిందని నాభావన... ఈ సందర్భంగా మరో సామెత కూడా గుర్తుకొస్తుంది. '' గుణం మార్చుకోవే గూటాల మల్లీ అంటే అవసరమైతే నామొగున్నయినా మార్చుకుంట గాని గుణం మార్చుకోనన్నదట'' మంత్రుల వ్యహార మాత్రం ఈ సామెతలా ఉంది.
ఈ సమావేశం తీరును పరిశీలిద్దామా...ముఖ్యమంత్రి రోశయ్య మంత్రులపై మరోసారి ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రివర్గ సమావేశం వివరాలను మీడియాకు లీకు చేయకూడదని ఎన్నిసార్లు నిర్ణయించుకున్నా విషయాలు బయటకు పొక్కుతూనే ఉన్నాయని, మనమేమన్నా చిన్నపిల్లలమా అని సిఎం రోశయ్య ప్రశ్నించారట. దీంతో మంత్రివర్గ సమావేశం వాడివేడిగా సాగిందట. రాష్ట్ర పరిస్థితులపై కేంద్రప్రభుత్వం కమిటీ వేసిందని, ఆ కమిటీ నివేదిక ఇచ్చిన తర్వాత తెలంగాణాపై ఎలాంటి నిర్ణయం వచ్చినా కట్టుబడతామని, అప్పటివరకు మంత్రులందరూ కలిసిమెలిసి ఉండాలని, ప్రభుత్వంలో భాగస్వామ్యంగానే ఉంటారని చెప్పినట్లు తెలిసింది. పేదలకు రెగ్యులరైజ్‌ చేస్తున్న భూమి అంశంపై దానం నాగేందర్‌, బొత్స సత్యనారాయణ మధ్య వాదన జరిగిందట. గ్రేటర్‌ హైదరాబాద్‌లో పేదలకు 80 గజాల వరకు భూమిని రెగ్యులరైజ్‌ చేస్తున్నామని, దానిని 120 గజాలకు పెంచాలని దానం సూచించగా రాష్ట్రవ్యాప్తంగా తీసుకున్న నిర్ణయాన్ని ఒక్క హైదరాబాద్‌కు పరిమితం ఎలా కుదురుతుందని బొత్స వాదించినట్లు తెలిసింది. రెగ్యులరైజ్‌ కోసం జీవో 166ను కూడా ప్రభుత్వ పరంగా విడుదల చేశామని, ఇది రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రాంతాలకు వర్తిస్తుందని, హైదరాబాద్‌కు ఎలా పరిమితం చేస్తారని బొత్స అడిగినట్లు సమాచారం. 120 గజాలకు రెగ్యులరైజ్‌ చేయాలనుకుంటే నామినల్‌ ఛార్జీ వసూలు చేస్తే బాగుంటుందని సూచించినట్లు తెలిసింది. దానికి దానం ఏదో చెప్పబోతుండగా సిఎం వారించినట్లు తెలిసింది. 'మంత్రులు ఒకరి నొకరు ఇలా వాదించుకుంటారు. ఈ విషయాలు కేబినెట్‌ వరకే పరిమితం కావడం లేదు. మీడియాకు కూడా ఎక్కుతున్నాయి. దీనివల్ల మంత్రుల మధ్య సఖ్యత లేదని పెద్దపెద్ద హెడ్డింగ్‌లు వస్తున్నాయి. వాదించుకోవడం ఎందుకు మీడియాకు చెప్పుకోవడం ఎందుకు' అని రోశయ్య ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. కేబినెట్‌లో చర్చించుకున్న అంశాలను బయట చెప్పకూడదని ఎన్నోసార్లు చెప్పుకొన్నా అమలు కావడం లేదని, రాజ్యాంగం మీద ప్రమాణం చేసి మాట తప్పితే ఎలా అని మందలించినట్లు తెలిసింది. 'ఇలా ఎన్నిసార్లు చెప్పుకుంటాం. మనం చిన్నపిల్లలం కాదు కదా' అని సిఎం అన్నట్లు తెలిసింది.