27, సెప్టెంబర్ 2014, శనివారం

కోమలవల్లికి నాలుగేళ్లు జైలు

      
      అక్రమ ఆస్తుల కేసులో తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత (కోమలవల్లి)ను దోషిగా నిర్ధారించింది బెంగళూరులోని ప్రత్యేక న్యాయస్థానం. 2014 సెప్టెంబర్‌ 27న  ఆమెకు నాలుగేళ్లు జైలు శిక్ష విధించింది. ఆమె తన పదవికి రాజీనామా చేయనున్నారు. ఆమెతోపాటు శశికళ, ఇళవరసి, సుధాకరన్‌ను కూడా కోర్టు దోషులుగా తేల్చింది. వీరందరికీ కూడా నాలుగేళ్ల జైలు శిక్ష విధించింది న్యాయస్థానం. జయలలితకు రూ.100 కోట్ల భారీ జరిమానా విధించింది. మిగతా దోషులకు ఒక్కొక్కరికి రూ.10 కోట్లు జరిమానా విధించింది. 
 కర్ణాటకలో మాత్రమే అప్పీలుకు అవకాశం
      ప్రత్యేక కోర్టు తీర్పుపై తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితకు కర్ణాటక హైకోర్టులో మాత్రమే అప్పీలు చేసుకోవడానికి అవకాశం ఉంది. తీర్పును సవాలు చేస్తూ ఆమె అప్పీలుకు వెళ్లనున్నారు.
        బెంగళూరు ప్రత్యేక న్యాయస్థానంలో జయలలితపై నేరం రుజువు కావడంతో తమిళనాడు ఆర్థిక మంత్రి పన్నీర్‌ సెల్వం కోర్టు హాలులో కంటతడిపెట్టారు. బెంగళూరుకు చేరిన పలువురు ఆమె అభిమానులు తీవ్ర ఉద్వేగానికి లోనయ్యారు. దాదాపు 18 ఏళ్లపాటు సాగిన ఈ కేసు 14 మంది న్యాయమూర్తుల సమక్షంలో విచారణ సాగింది. 259 మంది ప్రాసిక్యూషన్‌ సాక్ష్యులు, 99 మంది డిఫెన్స్‌ సాక్ష్యుల వాంగ్మూలాన్ని కోర్టు నమోదు చేసింది. బెంగళూరు పరస్పన అగ్రహార జైలు ఆవరణలోని ప్రత్యేక కోర్టు వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. కోర్టు వద్దకు వేలాది మంది ఎఐఎడిఎంకె కార్యకర్తలు తరలివచ్చారు.
                                                              కేసు పూర్వాపరాలు
        ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారని 1996లో జయలలితపై కేసు నమోదయింది. ఆమెకు అత్యంత సన్నిహితురాలు శశికళ, ఆమె కుమారుడు సుధాకరన్‌, బంధువులు ఇళవరసి కూడా కేసులో నిందితులుగా ఉన్నారు. అప్పట్లో జయలలిత ఇంట్లో జరిగిన సోదాల్లో 880 కిలోల వెండి, 28 కిలోల బంగారం, 10 వేలకు పైగా చీరలు, 90కి పైగా వాచీలు, 750 జతల పాదరక్షలు స్వాధీనం చేసుకున్నారు. తమిళనాడులోని అనేక చోట్ల జయలలిత ఆస్తులు కూడబెట్టారనే ఆరోపణలొచ్చాయి. కేవలం ఒక్క రూపాయి వేతనం తీసుకుని ఇంత ఆస్తి ఎలా కూడబెట్టారనే అభియోగం నమోదయింది. జయ నివాసం నుంచి స్వాధీనం చేసుకున్న వస్తువులన్నీ న్యాయమూర్తి స్వయంగా పరిశీలించారు. దీనిపై 2011లో జయలలిత స్వయంగా కోర్టుకెళ్లి వాంగ్మూలం ఇచ్చారు. అప్పటి నుంచి కేసు విచారణ కొనసాగింది. ఈ కేసు విచారణ తొలుత చెన్నైలోనే జరిగినా మళ్లీ జయలలిత సిఎం కావడంతో న్యాయస్థానాన్ని ప్రభావితం చేస్తారని డిఎంకె పిటిషన్‌ దాఖలు చేసింది. డిఎంకె పిటిషన్‌తో కేసు విచారణ బెంగళూరులోని ప్రత్యేక న్యాయస్థానానికి మారింది.
                                                          జయలలిత జీవిత విశేషాలు
      సెల్వ జయలలిత 1948 ఫిబ్రవరి 24న కర్ణాటక రాష్ట్రం మైసూరులో  జన్మించారు. తమిళనాడు రాష్ట్ర ముఖ్యమంత్రి, తమిళ, తెలుగు భాషల్లో సినీనటి. ఆ రాష్ట్ర ప్రాంతీయ పార్టీ అయిన ఆలిండియా ద్రవిడ మున్నేట్ర కళగం కార్యదర్శి. తిరుచ్చి జిల్లా శ్రీరంగం పూర్వకంగా కలిగిన జయలలిత 1981లో రాజకీయాల్లో ప్రవేశించారు. 1984లో తమిళనాడు నుంచి రాజ్యసభకు ఎన్నికయ్యారు. అప్పటి ముఖ్యమంత్రి ఎంజి రామచంద్రన్‌కు సన్నిహితంగా మెలిగారు. ఆయన మరణానంతరం రామచంద్రన్‌ భార్య ముఖ్యమంత్రి అయ్యారు. కానీ ఎక్కువ రోజులు పదవిలో ఉండలేకపోయారు. గ్లామర్‌ వల్ల జయలలిత 1989 అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన తొలి మహిళా ప్రతిపక్ష నాయకురాలిగా స్థానం సంపాదించారు. 1991లో రాజీవ్‌గాంధీ మరణానంతరం జరిగిన శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీతో పొత్తు పెట్టుకుని విజయం సాధించి ముఖ్యమంత్రి అయ్యారు. ప్రజల చేత ఎన్నికయిన తమిళనాడు తొలి మహిళా ముఖ్యమంత్రి జయలలిత. 2006 మేలో జరిగిన ఎన్నికల్లో పరాజయం పాలయింది. తిరిగి మిత్రపక్షాలతో కలిసి 1977 తర్వాత అత్యంత పటిష్టమైన ప్రతిపక్షంగా నిలువ గల సీట్లను పొందారు. ఆమె ప్రస్తుతం తమిళనాడు ముఖ్యమంత్రి. అభిమానులు ఆమెను అమ్మ అని, పురుచ్చితలైవి (విప్లవాత్మక నాయకురాలు) అని పిలుస్తారు. జయలలిత అసలు పేరు కోమలవల్లి. అలనాటి సినీనటి సంధ్య కూతురు ఈమె. మైసూరులో జన్మించిన జయలలిత రాజకీయరంగ ప్రవేశానికి మునుపు తమిళ చిత్రరంగంలో విజయవంతమైన సినీనటి. కుటుంబ పరిస్థితుల వల్ల ఆమె తల్లి బలవంతంతో 15వ ఏట సినిమా రంగంలోకి వచ్చారు. తమిళ, తెలుగు భాషల్లో ఆమె నటించారు. ఆమె అవివాహితగానే జీవితాన్ని గడిపారు. 1988లో రాజ్యసభకు నామినేట్‌ అయ్యారు. 1989, 1991లో గెలిచారు. 1996లో జయలలితపై వచ్చిన అభియోగాల కారణంగా ఓడిపోయారు. 2001లో అత్యధిక మెజార్టీతో గెలిచారు. 2006లో ఓడిపోయారు. 2011లో తిరిగి గెలిచి ముఖ్యమంత్రి అయ్యారు. జయలలితపై అనేక కేసులు పెట్టినా ఎదురు నిలిచి పోరాడారు. ఆమె మీద పెట్టిన 11 కేసుల్లో తొమ్మిది పూర్తయ్యాయి. రెండు కేసులు కీలకమయ్యాయి. ఆదాయానికి మించి ఆస్తులు ఉన్న కేసుపై ప్రత్యర్థులు బలమైన ఆధారాలతో న్యాయస్థానాన్ని ఆశ్రయించారు.


19, సెప్టెంబర్ 2014, శుక్రవారం

మహేష్ 'ఆగడు'

ఎప్పుడెప్పుడా అని ఎదురు చుసిన మహేష్ బాబు 'ఆగడు' శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది.14 రీల్స్ పతాకంపై రామ్ ఆచంట,గోపీచంద్ ఆచంట మరియు అనిల్ సుంకర నిర్మిస్తున్న ఈ చిత్రంలో తమన్నా కథానాయిక,తమన్ సంగీతాన్ని అందించారు. సినిమా ఎలావుందో చూద్దాం.
మొదట సినిమా కథ విషయానికే వస్తే శంకర్(మహేష్)ఓ అనాథ,కాని చాల తెలివైన కుర్రాడు.తనలోని చురుకుదనాన్ని చుసిన రాజా రావు(రాజేంద్రప్రసాద్)అనే ఇన్స్ పెక్టర్ శంకర్ ను చేరదీసి పోలీస్ ఆఫీసర్ చేయాలనుకుంటాడు.కాని అనుకోని కారణాలవల్ల చేయని హత్యను తనమీద వేసుకొని జైలుకు వెళుతాడు.అరెస్టయిన శంకర్ బోస్టన్ స్కూల్ లో చదివి పోలీస్ ఆఫీసర్ అవుతాడు.అలా శంకర్ ఎన్ కౌంటర్ స్పెషలిస్ట్ గా పేరొందుతాడు.దాము అలియాస్ దామోదర్(సోనూ సూద్)అక్రమాలను అరికట్టడానికి ఒక పట్టణానికి ట్రాన్స్ ఫర్ చేస్తారు. శంకర్ ను.అసలు దాము ఎవరు?శంకర్ జైలుకు వెళ్ళడానికి కారణం ఏంటి? మొదలగునవి తెర మీద చూడాల్సిందే.
మహేష్ బాబు ఇంట్రడక్షన్ తోపాటు మొదటి సాంగ్ చాలా బాగొచ్చింది.సినిమాలో మహేష్ బాబు పంచ్ డైలాగ్ లు బాగానే ఉన్నాయి.అయితే పంచ్ డైలాగ్ ల డోస్ ఎక్కువైన ఫీలింగ్ ప్రేక్షకుల్లో కలుగుతుంది.ఇక తమన్నా విషయానికి వస్తే అంతగా ప్రాధాన్యంలేని పాత్ర.మహేష్ బాబుకు ప్రేయసిగా కనిపిస్తుంది.కొన్ని పాటల్లో గ్లామర్ డోస్ పెంచింది.సినిమా మొదటి భాగం బాగానే ఉంటుంది.రెండవ భాగంలోకి వచ్చే సరికి ప్రేక్షకులు కొంత ఇబ్బంది పడతారు.నిడివి కూడా ఎక్కువగా ఉంటుంది.శీను,పోసాని,రఘుబాబులతో చేయించిన'మీలో ఎవరు కోటీశ్వరుడు' సీక్వెన్స్ కూడా నవ్వించకపోగా బోర్ కొట్టిస్తుంది.బ్రహ్మనందం బ్రోకర్ పాత్రలో కనిపిస్తాడు కాని అంతగా ఆకట్టుకోలేదు.రొటీన్ కామెడీ తప్పా శ్రీనువైట్ల కామెడీ మాత్రం కనిపించలేదు సినిమాలో.పంచ్ డైలాగ్ లమీద చూపిన శ్రద్ధ సినిమా కథమీద చూపిస్తే సినిమా బాగుండేది.మహేష్ బాబు ఇమేజ్,మహేష్ బాబు పేల్చే డైలాగ్ ల మీడీ శ్రీనువైట్ల ఆధారపడ్డాడు.సినిమా రెండవ భాగం 'దూకుడు' సినిమాను పోలి ఉందని ప్రేక్షకులు పెదవి విరుస్తారు.
ప్లస్ పాయింట్లు
సినిమాలో ప్లస్ పాయింట్ల విషయానికి వస్తే సినిమా అంతా మహేష్ అనే చెప్పాలి.మహేష్ పేల్చే పంచ్ డైలాగ్ లు ఆకట్టుకుంటాయి.టోటల్ గా మహేష్ పెర్ఫార్మన్స్ చాలా బాగుంటుంది.
మైనస్ పాయింట్లు
ముఖ్యంగా సినిమాకు శ్రీనువైట్ల దర్శకత్వం మైనస్ గా నిలిచింది.మూస ధోరణిలో సాగడం,సినిమాలో పంచ్ డైలాగ్ ల డోస్ ఎక్కువవడం,సరైన కథ-కథనం లేకపోవడం,రెండవ భాగం,ఎక్కువ నిడివి.

దసరాకు ముందే ప్రేక్షకులను అలరించాలని 'ఆగడు' యూనిట్ అనుకున్నా అందులో సక్సెస్ కాలేదని చెప్పొచ్చు.కాకుంటే ప్రస్తుతానికి పెద్ద హీరోల సినిమాలు ఏవి లేకపోవడంతో కమర్షియల్ గా సక్సెస్ సాధించే అవకాశాలు ఉన్నాయి.

28, ఆగస్టు 2014, గురువారం

అభివృద్ధి వికేంద్రీకరణ అవసరం

            
నవ్యాంధ్ర ప్రదేశ్‌ అభివృద్ధి సంచిక ఆవిష్కరణ సభలో కలెక్టర్‌

       నవ్యాంధ్రప్రదేశ్‌లో అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలని  ఆంధ్రప్రదేశ్‌ కర్నూలు జిల్లా  కలెక్టర్‌ సిహెచ్‌ విజయమోహన్‌ అన్నారు. బుధవారం (2014 ఆగస్టు 27) కర్నూలు మండల పరిషత్‌ సమావేశ మందిరంలో   ప్రజాశక్తి నవ్యాంధ్రప్రదేశ్‌ అభివృద్ధి ప్రత్యేక సంచికను కలెక్టర్‌, ప్రజాశక్తి 34వ వార్షికోత్సవ ప్రత్యేక అనుబంధాన్ని సంపాదకులు తెలకపల్లి రవి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ రాష్ట్రం విడిపోక ముందు హైదరాబాద్‌ కేంద్రంగా అభివృద్ధి జరిగిందని అన్నారు. తెలుగు ప్రజల ఆశాసౌదంగా భావించిన హైదరాబాద్‌ నగరం నుంచి దూరమైన ఆరున్నర కోట్ల ఆంధ్రులు ఆందోళనకు గురయ్యారని చెప్పారు. రాజధానికంటె కీలకమైన ఆర్థిక వ్యవస్థను కోల్పోయామని చెప్పారు.  భవిష్యత్తులో ఇలాంటినష్టం జరగకుండా ఐదారు చోట్ల అలాంటి నగరాలను నిర్మించుకోవాలని ఆయన తెలిపారు. పదిచోట్ల మెగాసిటీల ఏర్పాటుకు ప్రభుత్వం ఆలోచిస్తుందని అన్నారు. అందులో కర్నూలు కూడా ఒకటని అన్నారు. పారిశ్రామిక హబ్‌ ఏర్పాటుకు కర్నూలు జిల్లా ఓర్వకల్లులో 29 వేల ఎకరాల భూమిని గుర్తించి ప్రభుత్వానికి నివేదిక పంపామని చెప్పారు. అదేవిధంగా కర్నూలు జిల్లాలో గనులు, వ్యవసాయం, నీటి వనరులు ఉన్నాయని వివరించారు. విత్తన ఉత్పత్తికి నంద్యాల డివిజన్‌లో రెండు లక్షల ఎకరాలు అనుకూలంగా ఉందని చెప్పారు. వ్యవసాయంలో ఉద్యానవనపంటలు, విత్తనోత్పత్తికి, కర్భూజ, అరటి పండ్ల ఉత్పత్తికి అవకాశాలున్నాయని చెప్పారు. వీటిపై ప్రభుత్వానికి  నివేదికలు పంపామని చెప్పారు. ఇక్కడ మానవ వనరులు కూడా పుష్కలంగా ూన్నాయని చెప్పారు. శారీరక శ్రమ చేసేవారు, మేధోశ్రమ చేసేవారు ఉన్నారని చెబుతూ శారీరక శ్రమ చేసే వారు వారి నైపుణ్యాన్ని పెంచుకోవాలని కోరారు. ఇవన్నీ జరిగితే స్థూల ఉత్పత్తి పెరిగే అవకాశాలున్నాయని అన్నారు. ఇందుకు ప్రజల సహకారం అవసరమని కోరారు. నవ్యాంధ్రప్రదేశ్‌ అభివృద్ధికోసం  ప్రజాశక్తి చేస్తున్న కృషిని కలెక్టర్‌ అభినందించారు. అనంరతం ప్రజాశక్తి సంపాదకులు తెలకపల్లి రవి మాట్లాడుతూ కర్నూలుకు పత్రికా రంగంలో విశిష్ట స్థానం ఉందని చెప్పారు. స్వాతంత్రోద్యమంలో కీలక పాత్ర పోషించిన జర్నలిస్టు  గాడిచర్ల హరిసర్వోత్తమరావు ఈ ప్రాంతానికి చెందిన వారు కావడం గర్వకారణమన్నారు.  ఆనాడు స్వాభిమానం కోసం మాది మాకు కావాలని పోరాడారని గుర్తు చేశారు.  1936లో తొలిపత్రిక కర్నూలు జిల్లా పత్తికొండలో ప్రారంభించారని అన్నారు. మీడియాకు సత్యనిష్ట అవసరమని, ప్రజాశక్తి స్థిరంగా, నికరంగా, నిజాయితీగా వ్యవహరిస్తోందని చెప్పారు. ప్రధాన స్రవంతి పత్రికల్లో ప్రజాశక్తి కూడా ఒకటని అన్నారు.  మీడియా అంటే పాలకులు భయపడుతున్నారని అందుకే ఇటీవల రెండు ఛానళ్ల ప్రసారాలను నిలిపేశారని అన్నారు. మీడియా దృష్టి సినిమా, కార్పోరేట్‌, సెలబ్రిటీ, సెన్సేషనల్‌, క్రైం వైపే కాకుండా కామన్‌మ్యాన్‌, కమ్యూనిష్టులపై కూడా ఉండాలని సూచించారు. రాష్ట్రం విడిపోయాక ప్రజల సమస్యలపై కేంద్రీకరించడాకి మీడియాకు ఎక్కువ అవకాశం ఉందని చెప్పారు.  రాష్ట్రం విడిపోయాక పరిష్కారం కాని ప్రధాన సమస్యల్లో నదీజలాలు ఒకటని చెప్పారు. కృష్ణానది నీటి విభజన జరగక పోతే రాయలసీమకు నష్టం జరిగే అవకాశం ఉందని అన్నారు. ప్రస్తుత పాలకులు అంతరరాష్ట్ర సమస్యలపై కాకుండా అంతర్గత సమస్యలను శాసనసభలో ప్రస్తావిస్తున్నారని చెప్పారు. ప్రజలకు ఉపయోగపడే ఉపాధి, ఉత్పత్తిపై చర్చజరగాలని సూచించారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు విజన్‌ 2020 కాస్త 2029గా మారిందని చెప్పారు. సెజ్‌లు, రాజధాని అభివృద్ధికి సూచికలు కావని అన్నారు. నవ్యాంధ్రను సవ్యాంధ్రగా చూడాలని ప్రజలు కోరుకుంటున్నారని చెప్పారు. రాష్ట్ర బడ్జెట్‌లో కేంద్రం 14 వేల కోట్లు ఇస్తుందని ఆశించారని, అలాంటి సూచనలు కానరాక 37వేల కోట్లకు  ద్రవ్యలోటు పెరిగిందని చెప్పారు. అనంతరం డిసిసి అధ్యక్షులు బివై రామయ్య, టిడిపి అధికార ప్రతినిధి నాగేశ్వరయాదవ్‌, సిపిఎం, సిపిఐ జిల్లా కార్యదర్శులు కె ప్రభాకర్‌రెడ్డి, రామాంజనేయులు, రవీంద్ర విద్యా సంస్థల అధినే జి పుల్లయ్య, కెవి సుబ్బారెడ్డి విద్యా సంస్థల అధినేత కెవి సుబ్బారెడ్డి మాట్లాడారు. సభకు కర్నూలు స్టాఫ్‌ రిపోర్టర్‌ బి.గోరంట్లప్ప అధ్యక్షత వహించారు. కార్యక్రమంలో జిల్లా పరిషత్‌ సిఇఓ జయరామిరెడ్డి, ప్రజాశక్తి కర్నూలు ఎడిషన్‌ ఇన్‌ఛార్జి పానుగంటి చంద్రయ్య, సిబ్బంది, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.

1, ఆగస్టు 2014, శుక్రవారం

కార్మిక భద్రతపై కేంద్రం దాడి

                            పోలవరం వ్యవసాయం కోసం కాదు
            వరంగల్‌ జాతీయ సెమినార్‌లో పాలగుమ్మి సాయినాధ్‌

        కేంద్రంలో కొత్తగా అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం కార్మికుల చట్టాల్లో సవరణలు తేవడం మొదటి ఎజెండాగా పెట్టుకున్నట్లుగా ఉందని సీనియర్‌ జర్నలిస్టు పాలగుమ్మి సాయినాధ్‌ అన్నారు. వ్యవసాయ కార్మిక సంఘం జాతీయ ఎనిమిదో మహాసభల నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రం హన్మకొండలోని పబ్లిక్‌ గార్డెన్‌లో 2014 ఆగస్టు ఒకటిన శుక్రవారం సెమినార్లు ఏర్పాటు చేశారు. ‘సరళీకరణ విధానాలు ` గ్రామీణ పేదల స్థితిగతులు’ అంశంపై సాయినాధ్‌, ప్రొఫెసర్‌ షీలా భల్లా మాట్లాడారు. సెమినార్‌లో సాయినాధ్‌ మాట్లాడుతూ పోలవరం ప్రాజెక్టు నిర్మాణం వ్యవసాయ అవసరాల కోసం కాదన్నారు. బహుళ జాతి సంస్థల కోసమేనని స్పష్టం చేశారు. అక్కడ సెజ్‌లు వెలుస్తాయన్నారు. ఆ ప్రాజెక్టు నిర్మాణం వల్ల పనిదినాలు పెరగవని చెప్పారు. ఉపాధి హామీకి కేవలం రూ.34 వేల కోట్లు కేటాయించారని తెలిపారు. కార్పొరేట్‌ శక్తులకు రూ.71 వేల కోట్ల పన్ను మాఫీ చేశారని వివరించారు. రూ.2 లక్షల కోట్ల పన్ను మినహాయింపు ఇచ్చారని చెప్పారు. దీనిలో రూ.48 వేల కోట్లు బంగారం, డైమండ్స్‌ దిగుమతులపై సబ్సిడీ ఉందన్నారు. ఇటువంటి చర్యల వల్ల లోటు బడ్జెట్‌ కనిపిస్తోందన్నారు. ఉపాధి హామీ చట్టానికి నిధులు కేటాయింపు పెంచాలంటే డబ్బులేవంటున్నారని విమర్శించారు. గడచిన మూడేళ్లలో బహుళ జాతి సంస్థల యజమానులకు ఇచ్చిన రాయితీ సొమ్ముతో దేశంలో వందేళ్లపాటు ఉపాధి హామీ చట్టం అమలు చేయవచ్చని చెప్పారు. అందరికీ పని కల్పించవచ్చన్నారు. ఆహారభద్రత చట్టం అమలుకు డబ్బుల్లేవని కేంద్రం చెబుతోంద న్నారు. ఉపాధి హామీ చట్టాన్ని నీరు గార్చడమే ప్రధాన కర్తవ్యంగా పెట్టుకున్నారని చెప్పారు. మహారాష్ట్రలో నీటి లభ్యత లేదని, అక్కడ కరువు ప్రకటించారని చెప్పారు. సహాయక చర్యలు మాత్రం చేపట్టలేదన్నారు. గ్రామాల నుండి ముంబాయికి వలస వచ్చిన వారిని కలిశామన్నారు. వారు ముంబాయిలో 37 అంతస్తుల భవన నిర్మాణంలో పని చేస్తున్నారని తెలిపారు. ఒక్కో అంతస్తులో ఒక్కో స్విమ్మింగ్‌ పూల్‌ ఉందన్నారు. నీరు ఎక్కడ నుండి వచ్చిందన్నారు. ఈ నీటిని వ్యవసాయానికి మళ్లిస్తే గ్రామీణ ప్రాంతానికి ఉపాధి పెరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
                                              శాశ్వత ఉపాధి కరువు : ప్రొఫెసర్‌ శీలా భల్లా
            గ్రామీణ ప్రాంతాల్లో శాశ్వత ఉపాధి కరువైందని ప్రొఫెసర్‌ శీలా భల్లా తెలిపారు. ‘సరళీకృత విధానాలు ` గ్రామీణ స్థితిగతులు’ అంశంపై సెమినార్‌లో ఆమె ప్రసంగించారు. 15 ఏళ్లలో వ్యవసాయ భూమి వ్యవసాయేతర అవసరాలకు వినియోగం పెరిగిందని చెప్పారు. ఆ రంగంలోనూ ఆశించినంతగా ఉపాధి పెరగలేదని తెలిపారు. నూతన ఆర్థిక విధానాల ప్రారంభం అనంతరం ఇటువంటి పరిస్థితి తీవ్రమైందన్నారు. ముఖ్యంగా యువత ఉపాధికి దూరం కావడం ఆందోళన కలిగిస్తోందని తెలిపారు. భారీగా అసమానతలు పెరిగాయని చెప్పారు. వలసలు ఎక్కువయ్యాయని వివరించారు. ఇటువంటి పరిస్థితి మారాలంటే పెట్టుబడిదారులకు, కార్మికులకు మధ్య ఉన్న అంతరాలు పోవాలని ఆకాంక్షించారు.

31, జులై 2014, గురువారం

ఆకలిని పెంచుతున్న పెట్టుబడి

భూపంపిణీతో ప్రజలకు కొనుగోలు శక్తి
పభాత్‌ పట్నాయక్‌
వ్యకాస ప్రతినిధుల సభలో ప్రారంభోపన్యాసం

       దేశంలో అత్యధిక ప్రజల ఆకలి సమస్యకు నయా ఉదారవాదం, అంతర్జాతీయ ఫైనాన్స్‌ కేపిటల్‌ ప్రధాన కారణమని ప్రొఫెసర్‌ ప్రభాత్‌ పట్నాయక్‌ చెప్పారు. నిన్నటి వరకు పాలించిన యుపిఎ, నేడు అధికారంలో ఉన్న ఎన్‌డిఎ ప్రభుత్వాలు అంతర్జాతీయ ఫైనాన్స్‌ కేపిటల్‌ ఒత్తిళ్లకు లొంగి పని చేస్తున్నాయని, ఫలితంగా వ్యవసాయరంగం, గ్రామీణ ప్రజానీకం మనుగడ ప్రశ్నార్ధకమైందని పేర్కొన్నారు. సరళీకరణ విధానాలకు ప్రత్యామ్నా యాలు ూన్నాయని,  వాటిని అమలు చేయించు కోవడం కోసం రైతులు, వ్యవసాయ కార్మికులు, ఇతర గ్రామీణ ప్రజానీకం ఐక్య పోరాటాలతో ప్రభుత్వాలపై ఒత్తిడి తేవాలని పిలుపునిచ్చారు. 2014 జులై 31న తెలంగాణ రాష్ట్రం వరంగల్‌ జిల్లాలో  జరుగుతున్న అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం (ఎఐఎడబ్ల్యుయు) మహాసభ ప్రతినిధుల సమావేశాన్ని గురువారం ప్రభాత్‌ పట్నాయక్‌ ప్రారంభించారు. ఎఐఎడబ్ల్యుయు అఖిల భారత అధ్యక్షుడు పాటూరు రామయ్య అధ్యక్షతన నిర్వహిం చిన సభనుద్దేశించి ప్రభాత్‌ ప్రారంభోపన్యాసం చేస్తూ భారత సమాజం వ్యవసాయంపై ఆధారపడి ఉండగా, ప్రభుత్వాలు సరళీకరణ దృక్పథాన్ని ఎంచుకున్నాక రైతుల ఆత్మహత్యలు పెరిగి సంక్షోభం తీవ్రమైందని పేర్కొన్నారు. ఈ సంక్షోభం ప్రభావం వ్యవసాయ కార్మికులు, ఇతర గ్రామీణ పేదలపై పడిరదన్నారు. ఆహార ధాన్యాల ూత్పత్తికి, ఆహార లభ్యతకు మధ్య అంతకంతకూ వ్యత్యాసం పెరగడం ప్రమాదకరమని వివరించారు. ‘నిపుణుల లెక్కల ప్రకారం ప్రతి మనిషికీ తలసరి 200 కిలోల ఆహార ధాన్యాలు కావాలి. స్వాతంత్య్రం వచ్చిన సమయంలో 145 కిలోల ఉత్పత్తి జరిగింది. బ్యాంకుల జాతీయకరణ, భూపంపిణీ, వ్యవసాయంలో ప్రభుత్వ పెట్టుబడుల వలన 1980లలో 180 కిలోలకు పెరిగింది. ఇన్నేళ్లలోనూ జనాభాకు అవసరమైన ఆహార ధాన్యాల ఉత్పత్తి జరగనేలేదు’ అని తెలిపారు. ప్రజలందరి అవసరాలకు సరిపడ ఒక పక్క ఆహార ధాన్యాల ఉత్పత్తి జరగకపోయినా విదేశాలకు మాత్రం పెద్ద ఎత్తున ఎగుమతులవుతున్నాయని ఎద్దేవా చేశారు.     2012లో ప్రభుత్వం వద్ద 82 మిలియన్‌ ఆహార ధాన్యాల నిల్వలుంటే, వాటిలో 42 మిలియన్‌ టన్నులు విదేశాలకు ఎగుమతయ్యాయని పేర్కొన్నారు. ఆకలి, పోషకారలోపం నివారణలో మన దేశం పలు ఆఫ్రికా దేశాల కంటే వెనుకబడి ఉందన్నారు. ప్రతి వ్యక్తికీ 2,400 కేలరీలు కావాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తుండగా 2,200 కేలరీలు మాత్రమే అందుతోందని చెప్పారు. సరిపడ కేలరీలు అందని ప్రజలు 1973లో 56 శాతం మంది ఉండగా నేటికి ఆ సంఖ్య 75 శాతానికి చేరిందన్నారు. గోదాముల్లో మూలుగుతున్న ఆహార ధాన్యాలను ప్రజా పంపిణీ వ్యవస్థ (పిడిఎస్‌) ద్వారా ఉచితంగా లేక చౌక ధరలకు పంపిణీ చేయాలని కోరితే సబ్సిడీల భారం పడుతుందని, ద్రవ్యలోటు పెరుగుతుందని ప్రభుత్వం, కొందరు ఆర్థిక వేత్తలు అర్థం లేని వాదనలు చేస్తున్నారని తప్పుబట్టారు. ఆహార ధాన్యాలు పంపిణీ చేస్తే ప్రజల కొనుగోలు శక్తి పెరుగుతుందన్నారు. ‘అంతర్జాతీయ ఫైనాన్స్‌ కేపిటల్‌, బహుళజాతి సంస్థలు సబ్సిడీలు పెంచేందుకు అంగీకరించవు. అందుకే ప్రభుత్వాలు వెనక్కి తగ్గాయి. ఆకలిని పెంచుతున్నది వారే’ అని ప్రభాత్‌ అన్నారు. వ్యవసాయ కార్మికుల పోరాటాలు, వామపక్షాల ఒత్తిడి వలన యుపిఎ`1 సర్కారు ఉపాధి హామీని ప్రారంభించగా, ఎన్‌డిఎ దాన్ని క్రమంగా ఎత్తేసేందుకు చూస్తోందన్నారు. ఉపాధి హామీకి సర్కారు కేటాయించింది కేవలం రూ.34 వేల కోట్లు. దేశ స్థూలోత్పత్తి రూ.12 లక్షల కోట్లు కాగా అందులో ఉపాధి హామీకి ప్రతిపాదించింది 0.3 శాతం మాత్రమే’ అని తెలిపారు. యుపిఎ సర్కారు చివరి సంవత్సరంలో రూ.34 వేల కోట్లు బడ్జెట్‌లో కేటాయించి, రూ.38 వేల కోట్లు ఖర్చు చేసింది. కూలీలు చేసిన పనికి రూ.4 వేల కోట్లు ఇంకా చెల్లించాల్సి ఉంది. మొత్తం కలిపితే రూ.42 వేల కోట్లవుతుంది. కానీ అధికారంలోకొచ్చిన ఎన్‌డిఎ ప్రవేశపెట్టిన తొలి బడ్జెట్‌లో కేవలం రూ.34 వేల కోట్లనే కేటాయించడాన్ని బట్టి ఉపాధి హామీని క్రమంగా ఎత్తేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు అర్థమవుతుందని వివరించారు. ఉపాధి హామీ నిరుపయోగం అన్నట్లు వ్యూహాత్మకంగా కొన్ని వర్గాలు మానసికంగా దాడి చేస్తున్నాయని విమర్శించారు. వ్యవసాయరంగం సంక్షోభానికి విరుగుడుగా ప్రత్నామ్నాయాలను ప్రభాత్‌ పట్నాయక్‌ సూచించారు. భూసంస్కరణలు, భూమి పున్ణపంపిణీ జరగాలన్నారు. భూపంపిణీ చేస్తే ప్రజల కొనుగోలు శక్తి పెరుగుతుందని చెప్పారు. స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలను రద్దు చేయాలని కోరారు. సహకార పద్ధతిలో వ్యవసాయాన్ని ప్రోత్సహించాలని పేర్కొన్నారు. సార్వజనీన పిడిఎస్‌ అమలు చేయాలన్నారు. ప్రజలకు ఉచిత విద్య, ఆరోగ్యం అందుబాటులోకి తేవాలని,ఉపాధి అనేది ప్రజల ప్రాధమిక హక్కుగా ఉండాలని, రైతులకు సబ్సిడీపై వ్యవసాయ ఉపకరణాలు, సంస్థాగత రుణాలు అందించాలని సూచించారు. బ్యాంకింగ్‌ వ్యవస్థలో ఎఫ్‌డిఐలను అనుమతించి ప్రైవేటీకరించేందుకు ఎన్‌డిఎ ప్రయత్నిస్తోందని, అదే జరిగితే బ్యాంకులపై సామాజిక బాధ్యత ఉండదని, రైతులకు, ఇతర వర్గాలకు తక్కువ వడ్డీపై రుణాలు లభించవని చెప్పారు. ప్రారంభ సభలో సిపిఎం పొలిట్‌బ్యూరో సభ్యులు బివి రాఘవులు, ఎపి రాష్ట్ర కార్యదర్శి పి మధు, ఎఐకెఎస్‌ నాయకులు హన్నన్‌ మొల్ల, రామచంద్రన్‌ పిళ్లై, ఎఐఎడబ్య్లూయు ప్రధాన కార్యదర్శి విజయరాఘవన్‌, సుభాషిణి అలీ పాల్గొన్నారు.

30, మార్చి 2014, ఆదివారం

తెలుగు సంవత్సరాది ఉగాది


             పండుగలు, ఉత్సవాలు, జాతరలు, కొలువులు తదితరాలు మన సంస్కృతిలో భాగం. వీటిలో అన్ని మతపరమైనవి కావు. కొన్ని పండుగలు పూర్తిగా మానవుని ఉత్పత్తికి సంబంధించినవి. అందులో వ్యవసాయం, పశుపోషణ వంటివి ముఖ్యమైనవి. కొన్ని మానవుడు ప్రకృతిపై సాధించిన విజయాన్ని కూడా పండుగలుగా జరుపుకుంటారు. కొన్ని పండుగలు పూర్తిగా మత నమ్మకాలు, కథలపై ఆధారపడి ఉంటాయి. అయితే వాటన్నింటిని విడివిడిగా చూడటం కష్టం. మానవుడు ప్రకృతిపై, ఉత్పత్తులలో సాధించిన విజయాలలో కూడా మతపరమైన నమ్మకాలు ఉండవచ్చు కూడా. పూర్తిగా మతపరమైన కథలలో కూడా పరిశీలిస్తే మానవ సమూహాల అభివృద్ధి చారిత్రక విషయాలు కనిపిస్తుంటాయి. ఏదేమైనా పండుగ ఉత్సవాలను మతం, మూఢనమ్మకాల పేరుతో కొట్టిపారేయరాదు. ఆధ్యాత్మిక విషయాలను భూజాన వేసుకుని మోయరాదు. పండుగలలో ఉగాది వ్యవసాయ ఆధారామైనది. తెలుగువారి కొత్త సంవత్సరం ఆరంభ దినాన్ని ఉగాది అంటున్నాం. చైత్రశుద్ధ పాఢ్యమి నాడు తెలుగు వారికి, కన్నడీగులకు, మరాఠిలకు కొత్త సంవత్సరం ప్రారంభమవుతుంది. చంద్రమానాన్ని అనుసరించి వీరికి ఇప్పుడు ఉగాది. సౌరమానాన్ని అనుసరించే తమిళ, మాలయాళ, బెంగాళీ, పంజాబీ, అస్సామీ ప్రజలకు ఉగాది వేరే రోజున వస్తుంది. గుజరాతీలు, మార్వాడీలు బృహస్పతి మానాన్నను అనుసరించి ఉగాది జరుపుకుంటారు. ఉగాదిని కేరళలో ‘విషు’ పేరుతో ఎంతో ఘనంగా జరుపుకుంటారు. ఉగాది వసంత ఋతువులో వస్తుంది గనుక చెట్టన్నీ కొత్త చిగుళ్లను వేసి కోయిల పాటలతోను, కొత్త పూల పరిమళాలతో ప్రకృతి శోభాయమానంగా ఉంటుంది. చెరుకు, మామిడి, చింతపండువంటివి చేతికి వస్తాయి. అందువలననే కొత్త చింతపండు, కొత్త బెల్లం, చెరకు, వేపపువ్వు, పచ్చిమిరప, ఉప్పు, అరటిపండు కలిపి షడ్రుచులు గల ఉగాది పచ్చడి చేసుకొని తింటారు. సంవత్సరం ప్రారంభం కాబట్టి ఆరోజున పంచాంగం చూసి వర్షాలు పరిస్థితి, పంటల స్థితిగతులు ఎలా ఉంటాయో తెలుసుకుంటారు. పురోహితులు చదివే ఈ పంచాంగాన్ని అందరూ శ్రద్ధగా వింటారు. సంవత్సరం ప్రారంభం గనుక ఆరోజు ఏం జరిగితే సంవత్సరమంతా అదే జరుగుతుందనే నమ్మకం అందరిలోనూ ఉంటుంది. గ్రామీణా ప్రాంతాల్లో కుస్తీపోటీలు, బల ప్రదర్శనలు, పరుగు పందెలు, ఎడ్ల బండ్ల పందెలు వంటి వినోద కార్యక్రమాలు జరుగుతాయి. ఉగాది నాడు కవి సమ్మేళనాలు ముఖ్యమైన సాంస్కృతిక కార్యక్రమం మన రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లోను ఉగాది రోజున జరుగుతాయి. ఇప్పుడు ఈ సాంప్రదాయం బాగా తగ్గుముఖం పడుతున్నట్లు అనిపిస్తుంది. 
ఉగాది పచ్చడి 
              ఉగాది పచ్చడి అంటే ఈ పండుగకు మాత్రమే ప్రత్యేకంగా తినే పదార్థం. ఉగాది నాడు షడ్రుచుల సమ్మేళనం. తీపి, పులుపు, కారం, ఉప్పు, వగరు, చేదు. అనే ఆరు రుచులు కలిపిన ఉగాది పచ్చడి తింటారు. సంవత్సరం పొడవునా ఎదురయ్యే మంచి చెడులను, కష్టసుఖాలను సంయమనంతో స్వీకరించాలన్న సందేశాన్ని ఉగాది పచ్చడి ఇస్తుంది. ఈ పచ్చడి కోసం చెరుకు, అరటి పళ్లు, మామిడికాయలు, వేపపువ్వు, చింతపండు, జామకాయలు, బెల్లం వినియోగిస్తారు. ఉగాది పచ్చడికి మనశాస్త్రాల్లో  నింబకుసుమ భక్షణం, అశోకళికాప్రాశనం అని వ్యవహరించేవారు. రుతు మార్పు కారణంగా వచ్చే వాత, కఫి, పిత్త దోషాలను హరించే ఔషధంగా ఉగాది పచ్చడి తినే ఆచారం ఆరంభమైందని అంటారు. ఉగాది పచ్చడిని శాస్త్రీయంగా తయారు చేసే పద్ధతిలో ఉప్పు, వేపపువ్వు, చింతపండు, బెల్లం, పచ్చి మిరపకాయలు, మామిడి చిగుళ్లు, ఆశోక చిగుళ్లు,  వేసి చేసే వాళ్లు. ఈపచ్చడిని శ్రీరామ నవమి వరకు తినాలని చెబుతారు. 
గోదావరి ఉగాది పచ్చడి చేసే విధానం
            గోదావరి జిల్లాల్లో చేసే గాది పచ్చడి చాలా రుచిగా ఉంటుంది. దీనికి కావాల్సిన పదార్థాలను పరిశీలిద్దాం. వేపపువ్వు, కప్పుబెల్లం పొడి, కప్పు కొబ్బరి కోరు, కప్పు బాగా మగ్గిన అరటిపండ్లు, మామిడికాయ, చిటికెడు కొత్తకారం, అరస్పూను ఉప్పు, శనగ పప్పు, నిమ్మకాయంత చింతపండు, కొద్దిగా చెరుకు ముక్కలు, వేయించిన వేరుశనగ పప్పు, అరకప్పు చింతపండులో నీళ్లు పోసి పులుసు తీయాలి. అరటి పండు తొక్కలు తీసి చిన్న ముక్కలుగా తరగాలి. మామిడి కాయ తొక్క తీసి ముక్కలుగా తరగాలి. చింతపండు పులుసులో బెల్లం వేసి కరిగే వరకు కలపాలి.  వేపపువ్వు తప్ప మిగిలిన పదార్థాలన్నీ వేసి బాగా కలపాలి. ఆఖరున వేపపువ్వు కలపాలి. ఇలా తయారు చేసిన పచ్చడికి గోదావరి జిల్లాలో మంచి గుర్తింపు ఉంది.  ‘విజయ నామ’ సంవత్సరానికి వీడ్కోలు పలికి ‘జయ నామ’ సంవత్సరానికి స్వాగతం పలుకుదాం.  అందరికీ జయం చేకూర్చాలని ఆశిద్దాం. 

14, మార్చి 2014, శుక్రవారం

ఆవేశం....ఆత్మవిమర్శ

కాంగ్రెస్‌ను గద్దే దించాలి....దేశాన్ని కాపాడాలి
‘ జనసేన ’ పార్టీ ఆవిర్భావ సభలో పవన్‌ కళ్యాణ్‌
‘ఇల్లేమో దూరం, చేతిలో దీపం లేదు, గతుకుల దారి, గుండెల నిండా ధైర్యం’ఉందంటూ బాలగంగాధర్‌తిలక్‌ పద్వంతో జనసేన నేత ప్రముఖ సినీనటుడు పవన్‌ కళ్యాణ్‌ ప్రసంగాన్ని ప్రారంభించి రెండు గంటలపాటు సుదీర్ఘ ఉపన్యాసం చేశారు. సాయంత్రం ఏడు గంటల ఏడు నిమిషాలకు పవన్‌కళ్యాణ్‌ తన ప్రసంగాన్ని ప్రారంభించారు.  ‘అందరికీ హృదయ పూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నా. దౌర్జన్యాన్ని, అవినీతిని అరికట్టడానికి ముందుకు సాగుతాన్నా పిరికితనంతో నీ బాంచెన్‌ కాల్మోక్తా అనే పిరికిపందను కాదు, ఢల్లీిలో ఉన్నవారిని కాల్మొక్తా అంటూ  మన రాష్ట్రాన్ని ఈ పరిస్థితికి తెచ్చారు’ అని పవన్‌ కళ్యాణ్‌ ఆవేశంగా చెప్పారు.  2014 మార్చి 14న సాయంత్రం తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్‌ హైటెక్స్‌ నోవాటెల్‌లో మాట్లాడుతూ రాష్ట్ర ప్రజల్లో నెలకొన్న ఉత్కంఠకు తెరదించుతూ   పార్టీ పెడుతున్నట్లు ప్రకటించారు.  రాష్ట్ర విభజన విషయంలో కాంగ్రెస్‌పార్టీ అనుసరించిన విధానాన్ని  తూర్పారపట్టారు.  అన్నయ్య చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీలో పనిచేశానని, అన్నయ్య పార్టికీ ఎదురుగా నిలబడాల్సి రావడం దురదృష్టకరమని, తండ్రి లాంటి అన్నయ్యను తాను ఎదిరించలేనని, అలాంటి పరిస్థితిని ఢల్లీిలో కాంగ్రెసువాళ్లు కల్పించారని ఆయన అన్నారు. గొప్పగా బతకాలంటే సాహసాలు చేయాల్సి వస్తుందని అన్నారు. తాను బానిసను కాదని ఆయన చెప్పారు. ఐదేళ్ల క్రితం గుంటూరులో రాజకీయాలు మాట్లాడానని, ఆ తర్వాత రాష్ట్ర పరిస్థితి మీద గానీ, రాజకీయాల గురించి గానీ మాట్లాడలేదని అన్నారు. రాజకీయాలంటే తనకు ఇష్టం లేదని, ఎంపీగా గెలవాలని లేదు, మంత్రినీ ముఖ్యమంత్రిని కావాలని లేదని, అవన్నీ తనకు తుచ్ఛమని వ్యాఖ్యానించారు. నా తెలంగాణ, మన తెలంగాణ, పోరు తెలంగాణ అని గట్టిగా మాట్లాడారు. రాష్ట్రాన్ని విడగొట్టిన పరిస్థితిని చూసి బాధపడ్డానని అన్నారు.  తాను అందరిలాగా బతకాలని అనుకున్నానని, కానీ సమస్యలు తన వద్దకే వచ్చాయని తనకు ఎదురైన సమస్యలు ఈ సందర్భంగా వివరించారు. రాజకీయాల గురించి మాట్లాడుతానని  2014 మార్చి రెండున ప్రకటన చేసిన నాటినుండి తనపై నోటికి వచ్చినట్లు కొంతమంది మాట్లాడుతున్నారని అన్నారు. కాంగ్రెస్‌ పార్టీని గద్దెదింపాలని, దేశాన్ని రక్షించాలని పిలుపునిచ్చారు. ‘కాంగ్రెస్‌ హఠావో ... దేశ్‌ బచావో’ అని నినదించారు. సభకు హాజరైన అభిమానుల చేత ఆ నినాదం  పదేపదే చేయించారు. ‘ మిస్టర్‌ జైరామ్‌రమేష్‌, అహ్మద్‌ పటేల్‌, చిదంబరం, వీరప్ప మెయిలీ...మీరు రాష్ట్రాన్ని విభజించిన తీరు మమ్మల్ని గాయపరిచింది. మేం నెత్తురోడుతున్నాం. తెలుగు ప్రజలు మిమ్మల్ని నమ్మారు. మీకు అధికారం అప్పగించారు. మీరు మాకు వెన్నుపోటు పొడిచారు. అందుకే నేను దేశ వ్యాప్తంగా ప్రజలందరికి పిలుపునిస్తున్నా ...’ అని అన్న ఆయన ఆ వెంటనే  కాంగ్రెస్‌ హఠావో...దేశ్‌ బచావో అంటూ పెద్దగా నినాదం చేశారు. కార్యకర్తల చేత చేయించారు. అంతకుముందు ఆయన వేలాది మంది అభిమానుల సమక్షంలో పార్టీ పేరును ప్రకటించారు. ‘పార్టీ పెట్టాను.  దాని  పేరు జనసేన’ అని ఆయన హర్షధ్వానాల మధ్య ప్రకటించారు. తన  పార్టీ సామాన్యుల సేన అని అన్నారు. భారతీయుల సేవకోసమే పార్టీ పెడుతున్నట్లు చెప్పారు. సోనియాగాంధీ, రాహుల్‌గాంధీ, దిగ్విజయ్‌సింగ్‌, జైరాంరమేష్‌ వంటి తదితర నేతలపై నిప్పులు చెరిగారు. తనపై వ్యక్తిగత విమర్శలు చేసిన కెసిఆర్‌, కేటిఆర్‌, కవిత, వి.హనుమంతరావు, వెంకయ్యనాయుడులకు చురకలంటించారు. వ్యక్తిగత విమర్శలకు దిగితే అందరి వ్యక్తిగత జీవితాలను బయటపెడతానని హెచ్చరించారు. టిఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ నేతలపై ఆయన నేరుగా విమర్శలు చేశారు. చట్టం కొంతమందికి చుట్టం గాకుండా ఎవరికైనా సమానంగా పనిచేయాలన్నదే తమ పార్టీ లక్ష్యమని అన్నారు. అవినీతికి వ్యతిరేకంగా పోరాటం చేస్తానన్నారు. జగన్‌పై విమర్శలు చేయకపోయినా అవినీతికి వ్యతిరేకంగా పోరాడాలని, మంచి నాయకులను ఎన్నుకోవాలని కోరారు. కాంగ్రెస్‌ మినహా అన్ని పార్టీలతో కలిసి ఎన్నికల్లో పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నానని ప్రకటించారు. ఎన్నికల్లో పోటీపై ఆయన స్పష్టత ఇవ్వలేదు. అన్నయ్య చిరంజీవిపై కోపం లేదని, ఆయనకు వ్యతిరేకంగా నిలబడడానికి కాంగ్రెస్‌పార్టీనే కారణమని అన్నారు. కాంగ్రెస్‌ హఠావో.. దేశ్‌ బచావో అన్నరీతిలో పనిచేయాలని అభిమానులకు పిలుపునిచ్చారు. ఆయన ప్రసంగంలో ఎక్కడా టిడిపిని గానీ, ఆ పార్టీ నేతలను గానీ ఒక్క విమర్శ చేయలేదు. తనకు నచ్చిన నేతల్లో జయప్రకాశ్‌రెడ్డి(జగ్గారెడ్డి) ఒకరని మెచ్చుకున్నారు.  
టిఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌లపై విసుర్లు, సెటైర్లు
      జనసేన అనే తన పార్టీని కాంగ్రెస్‌పార్టీలో కలపాలని దిగ్విజయ్‌సింగ్‌ చెప్పడంపై పవన్‌ మండిపడ్డారు. దిగ్విజయ్‌ సింగ్‌ను ఆయన ఢల్లీి పవిత్రాత్మగా అభివర్ణించారు. కాంగ్రెస్‌పార్టీలో కలపడానికి అది ఏమైనా గంగానదా అని ఎద్దేవా చేశారు. తాను ఎలా కనిపిస్తున్నానని దిగ్విజయ్‌ను ప్రశ్నించారు.  కెసిఆర్‌పై కూడా ఆయన దుమ్మెత్తి పోశారు. నువ్వు నన్ను చెప్పనీరాదే అని కెసిఆర్‌పై సైటెర్లు వేశారు. క్షమాపణ చెప్పి పార్టీ పెట్టాలని అన్న కల్వకుంట్ల కవితపై ఆయన విరుచుకుపడ్డారు. నా తెలంగాణ గురించి క్షమాపణ చెప్పమనే హక్కు మీకెక్కడదని ప్రశ్నించారు. రాజకీయ నాయకులు తనను తిడితే పైకి వద్దామని అనుకుంటున్నారా అని ఆడిగారు. రెండు నెలల ఎన్నికల ముందు ఇలా వచ్చి భయపడేవాడినైతే నిలబడగలిగేవాడినా అని అడిగారు. పిరికితనమంటే తనకు చిరాకు అని అన్నారు. చచ్చిపోవడానికైనా సిద్ధపడతానని సవాల్‌ విసిరారు. జనసేన పార్టీ రిజిస్ట్రేషన్‌ అయిపోయిందని ఆయన అన్నారు. రాజకీయాల విషయంలో గుండెల్లో పెట్టుకునే అన్నయ్యను చూసిన తర్వాత ఆగిపోవాలా అనుకున్నానని ఆయన అన్నారు. నాలుగు రోజుల క్రితం వ్యక్తిగతంగా కలుసుకున్నానని, సమాజం ముఖ్యమా, వ్యక్తిగతం ముఖ్యమా అని ఆలోచించుకున్నానని, అప్పుడు సమాజం ముఖ్యమని అనుకున్నానని ఆయన అన్నారు. సమాజం ముఖ్యమని అనుకున్నప్పుడు కుటుంబం చిన్నదిగా కనిపించిందని చెప్పారు. వ్యక్తిగతంగా తనకు శత్రువులు లేరని, కోపం కూడా రాదని, ప్రతీకారం తీర్చుకోవాలనే కోరిక లేదని, తనకు మిత్రులు చాలా మంది ఉన్నారని, వారిలో త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ కూడా ఒకరని ఆయన అన్నారు. రాజకీయాల్లోకి తాను రావడం త్రివిక్రమ్‌కు ఇష్టం లేదని పవన్‌ చెప్పారు. ప్రజలకు తెలియని మిత్రుడు ూన్నారని, కామన్‌ మ్యాన్‌ ప్రొటెక్షన్‌ ఫోర్స్‌ను ఆపలేదని, అది ఇప్పుడు జనసేన అయిందని ఆయన అన్నారు. పార్టీ పెట్టడానికి వరంగల్‌కు చెందిన తన మిత్రుడు రాజు రవితేజ కారణమని అన్నారు. సినిమాల మీద ఆసక్తి లేదని, ఉన్న సినిమాలు పూర్తి చేస్తానని, కొత్త సినిమాలు తీయడం లేదని అన్నారు. ప్రతి పార్టీలోనూ వ్యక్తిగతంగా తనకు తెలిసిన నాయకులున్నారని, సన్నిహితంగా మెలిగేవారున్నారని, కానీ సైద్ధాంతికంగా విభేదిస్తానని, వాళ్ల ఆలోచన సరళికీ తన ఆలోచనా సరళికీ కుదరదని ఆయన అన్నారు. తెలంగాణకు తాను వ్యతిరేకం కాదని, సీమాంధ్ర ఆత్మగౌరవం దెబ్బ తింటే ఊరుకోనని, తెలుగు ప్రజలను కించపరిస్తే క్షమించబోనని పవన్‌ హెచ్చరించారు. గౌరవంగా తేవాల్సిన తెలంగాణను పార్లమెంటులో ఎలా తెచ్చారో అందరూ చూశారని మండిపడ్డారు. ఈ సందర్భంగా బిజెపి నేత వెంకయ్యనాయుడుపై వ్యాఖ్యలు చేశారు. భగత్‌సింగ్‌ ఆశయాల సాధనకు పనిచేస్తానని అన్నారు. ఆయన జీవితం తనకు స్ఫూర్తిదాయకమని అన్నారు. రాష్ట్ర విభజన జరిగిందని, ఇంకా తిట్టుకోవడం వల్ల పలితం లేదని అన్నారు. ‘నన్నయ్య గొప్పవాడా పాల్కూరికి సోమనాధుడు గొప్పవాడా అని ఇంకా మాట్లాడుకుంటే బంగారు తెలంగాణ రాదు’ అని ఆయన అన్నారు. పవర్‌ స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌ శుక్రవారం సాయంత్రం ఐదున్నర గంటలకు  నోవాటెల్‌కు చేరుకున్నారు. మెగా సినిమా ఆడియో విడుదల కార్యక్రమం స్థాయిలో పవన్‌ కళ్యాణ్‌ పార్టీ ఆవిర్భావ ప్రకటన కార్యక్రమానికి ఏర్పాట్లు చేశారు. ప్రధాన వేదికకు ఇరువైపులా రెండేసి ఎల్‌ఇడి స్క్రీన్లను ఏర్పాటు చేశారు. దాదాపు ఏడు గంటల ప్రాంతంలో పవన్‌ కళ్యాణ్‌ వేదిక మీదికి చేరుకున్నారు. తెల్ల ప్యాంట్‌, బూడిద రంగు కుర్తా వేసుకుని ఆయన వేదిక మీదికి చేరుకున్నారు. ఆయనను వేదిక మీద చూడగానే అభిమానులు కేరింతలు కొట్టారు. ఇది సామాన్యుడి సేన, ఇది ప్రతి ఒక్కరి సేన, ఇది మనసేన, జనసేన అనే అనే నినాదం తెరపై ఉంది. 

7, మార్చి 2014, శుక్రవారం

మార్కెట్‌ శక్తులను నియంత్రించాలి


సామాజిక న్యాయ సాధనలో అందరికీ భాగస్వామ్యం'ప్రజాస్వామ్యం, సోషలిజం'పై అంతర్జాతీయ సదస్సులో వక్తలు ,అహింసాయుత పద్ధతుల్లో బలమైన ఉద్యమాలు - జైపాల్‌రెడ్డి , రాజకీయాలను శాసిస్తోన్న మాఫియాలు - జస్టిస్‌ సుదర్శన్‌రెడ్డి 
            మార్కెట్‌ శక్తులను నియంత్రించటం ద్వారా సహజ వనరుల లూటీని అడ్డుకోవాలని రాజకీయ, ఆర్థిక, న్యాయ, సామాజికరంగాలకు చెందిన పలువురు వక్తలు సూచించారు. రాజ్యం ప్రోత్సహించే పెట్టుబడిదారీ విధానాలు అభివృద్ధి చెందుతున్న దేశాలకు అత్యంత ప్రమాదకరమని హెచ్చరించారు. ఇలాంటి విధానాల వల్ల పెట్టుబడిదారులు, కార్పొరేట్‌ శక్తులు, బహుళజాతి కంపెనీలు మొత్తం రాజకీయాలను, రాజ్య వ్యవస్థను తమ గుప్పిట్లోకి తీసుకుంటాయని తెలిపారు. ఫలితంగా ప్రజాస్వామ్య వ్యవస్థ పెను ప్రమాదంలోకి నెట్టబడుతుందని వారు ఆందోళన వ్యక్తం చేశారు. 
         'ప్రజాస్వామ్యం, సామ్యవాదం, 21వ శతాబ్దపు దృక్పథం' అనే అంశంపై నాలుగు రోజులపాటు జరిగే అంతర్జాతీయ సదస్సు 2014 మార్చి7న హైదరాబాద్‌లో ప్రారంభమైంది. తెలంగాణ విద్యావంతుల వేదిక, సెంటర్‌ ఫర్‌ దళిత్‌ స్టడీస్‌, డెమోక్రసీ డైలాగ్స్‌ సంస్థలు సంయుక్తంగా నిర్వహిస్తోన్న ఈ కార్యక్రమంలో కేంద్ర శాస్త్ర, సాంకేతికరంగాలశాఖ మంత్రి సూదిని జైపాల్‌రెడ్డి ముఖ్య అతిథిగా ప్రసంగిస్తూ...ప్రజాస్వామ్యం, సోషలిజం అనేవి 19వ శతాబ్దం నుండే ప్రారంభమయ్యాయని అన్నారు. అప్పటి సోషలిజం నుండే కమ్యూనిజం రూపాంతరం చెందిందని, ప్రస్తుతం అది ఆధునిక ప్రజాస్వామ్య సోషలిజంగా రూపాంతరం చెందిందని చెప్పారు. వివిధ దేశాల్లో సంపద అతి కొద్దిమంది చేతుల్లోనే కేంద్రీకృతమవటంతో ఆయా దేశాల్లోని కార్మికులు, కర్షకులు, శ్రామికులు అనేక సందర్భాల్లో ప్రజాస్వామ్య ఉద్యమాలకు శ్రీకారం చుట్టారని గుర్తుచేశారు. వ్యక్తిగత స్వేచ్ఛ పేరిట దేశ సంపదను లూటీ చేసేందుకు ప్రయత్నించే శక్తులకు వ్యతిరేకంగా ఈ పోరాటాలు జరిగాయని అన్నారు. వ్యక్తిగత స్వేచ్ఛ పేరుతో మొత్తం రాజ్యాన్నే తమ చెప్పు చేతల్లో ఉంచుకునేందుకు కొన్ని శక్తులు ప్రయత్నిస్తుంటాయని వివరించారు. ఏ దేశంలోనైనా ఆకలి, దారిద్య్రం, నిరుద్యోగం, అసమానతలు తారాస్థాయికి చేరితే అక్కడ కచ్చితంగా ఉద్యమాలు పుట్టుకొస్తాయని చెప్పారు. ఇదే సమయంలో పార్లమెంటరీ వ్యవస్థలోనే ఇలాంటి ఉద్యమాలకు ఆస్కారముంటుందని అన్నారు. మరోవైపు ప్రపంచదేశాల్లో సందప విపరీతంగా పెరుగుతూ వస్తోందని, అయితే ఈ సంపదను దేశంలోని అన్ని వర్గాలవారికి సమానంగా పంపిణీ చేయకపోవటం వల్ల అభివృద్ధి అనేది డోలాయమానంలో పడిపోతోందని చెప్పారు. ఫలితంగా ప్రజా ప్రయోజనాలు దెబ్బతింటున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో శక్తివంతమైన ప్రజాస్వామ్య పరిరక్షణ ఉద్యమాలను నిర్మించాల్సిన అవసరముందని అన్నారు. ఇవన్నీ అహింసాయుత పద్ధతుల్లోనే సాగాలని సూచించారు. సామాజిక న్యాయం, సామాజిక మార్పు పేరుతో హింసను ప్రేరేపించటం ఫాసిజమవుతుందని విమర్శించారు. ప్రస్తుతం అగ్రరాజ్యమైన అమెరికాతో పాటు భారత్‌, పాకిస్తాన్‌, శ్రీలంక, బంగ్లాదేశ్‌ తదితర దేశాలన్నీ తమ దేశ స్థూల జాతీయోత్పత్తిలో అత్యధిక భాగాన్ని ప్రజోపయోగ కార్యక్రమాల మీదకాకుండా సైన్యం మీద ఖర్చు పెడుతుండటం శోచనీయమన్నారు. అగ్రరాజ్యంగా చెప్పుకుంటున్న అమెరికాలో సైతం ఇప్పటికీ 3 కోట్ల మంది ప్రజానీకం బీమా సౌకర్యాన్ని పొందలేక పోతున్నారని చెప్పారు. ఆ దేశంలో నివసిస్తున్న భారత సంతతి వారిలో సైతం శతకోటీశ్వరులున్నారని గుర్తుచేశారు. ఈ నేపథ్యంలో దేశ ఆర్థిక వ్యవస్థను అతలాకుతలం చేస్తోన్న మార్కెట్‌ శక్తుల్ని క్రమక్రమంగా నియంత్రించాలని సూచించారు. తద్వారా సంపదలో అందరికీ వాటా దక్కేలా చూడాలని కోరారు. అంతర్జాతీయ సదస్సులో ఈ విషయాలన్నింటిపైనా సమగ్రంగా చర్చించాలని జైపాల్‌రెడ్డి ఈ సందర్భంగా సూచించారు. సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ బి.సుదర్శన్‌రెడ్డి ప్రారంభోపన్యాసం చేస్తూ... పెట్టుబడిదారులు మార్కెట్‌ శక్తుల రూపంలో దేశంలోని అటవీ సంపద, నదులు, ఖనిజాలు, నూనెలు (ఆయిల్‌) తదితర సహజ సంపదలను కొల్లగొడుతున్నాయని చెప్పారు. ప్రచార, ప్రసార మాధ్యమాలతోపాటు వివిధ విశ్వవిద్యాలయాలను కూడా కబళిస్తూ ఒక పెద్ద మాఫియా రాజ్యాన్ని నిర్మిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. చివరకు దేశ రాజకీయాలను, పార్టీలను సైతం శాసిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. తద్వారా రాజకీయ అజెండాను సైతం ఖరారు చేసే స్థాయికి ఆయా శక్తులు ఎదుగుతున్నాయని, ఇది దేశానికి అత్యంత ప్రమాదకరమని అన్నారు. మైనింగ్‌ మాఫియాతో పాటు ఇతర మాఫియాలు సమాజాన్ని చిన్నాభిన్నం చేస్తున్నాయని చెప్పారు. ఇలాంటి శక్తులకు వ్యతిరేకంగా అన్ని వర్గాలు, జాతులను ఐక్యం చేసి బలమైన ఉద్యమాలను నిర్మించాలని సూచించారు. తద్వారా పేదరిక నిర్మూలన, సామాజిక న్యాయ సాధన అనే లక్ష్యాల్ని సాధించాలని సూచించారు. సదస్సు ప్రారంభంలో ప్రజా గాయకుడు గద్దర్‌, అరుణోదయ సమాఖ్య విమలక్క బృందం ఆలపించిన గేయాలు సభికులను ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో విశ్రాంత ఐఎఎస్‌ అధికారి కాకి మాధవరావు, హెచ్‌ఎమ్‌టివి ప్రధాన సంపాదకులు కె.రామచంద్రమూర్తి, ఆహ్వాన సంఘం ఛైర్మన్‌ చుక్కా రామయ్య, సీనియర్‌ జర్నలిస్టు మల్లేపల్లి లక్ష్మయ్య, బూర్గుల నర్సింగరావు తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమానికి సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె.నారాయణ, ఎమ్మెల్సీ డాక్టర్‌ ఎమ్‌.గేయానంద్‌, ప్రజాశక్తి దినపత్రిక సంపాదకులు తెలకపల్లి రవి, పూర్వ సంపాదకులు ఎస్‌.వినయకుమార్‌, విశాలాంధ్ర ఎడిటర్‌ కె.శ్రీనివాసరెడ్డి తదితరులు హాజరయ్యారు. ఈనెల 10 వరకు జరిగే ఈ సదస్సుకు 30 దేశాల నుండి ప్రతినిధులు హాజరయ్యారు. మనదేశంలోని వివిధ రాష్ట్రాల నుండి ఆర్థిక వేత్తలు, విద్యా వేత్తలు, రాజకీయ నాయకులు, కవులు, కళాకారులు, విద్యార్థి, యువజన, మహిళా, కార్మిక సంఘాల ప్రతినిధులు, మానవ హక్కుల సంఘాల నేతలు హాజరవుతు న్నారు. 
              ఈ సదస్సులో '21వ శతాబ్దంలో సామ్య వాదంపై దృక్కోణం' అనే అంశంపై కాటు ఆర్కోనాడా (బొలీవియా), అమియా బగచీ (ఇండియా) ప్రసంగించారు. 'భూమి, కూలీలు, సహకార వ్యవస్థ' అనే అంశంపై అడాల్‌బెర్టో మార్టిన్స్‌ (బ్రెజిల్‌), గాస్‌పర్‌ మోర్కెన్చో (మెక్సికో), వినీత్‌ తివారీ (ఇండియా), సందీప్‌ చంద్రా (ఇండియా) ప్రసంగిం చారు. 'నూతన సమాజ నిర్మాణంలో కొత్త దృక్కో ణాలు' అనే అంశంపై యాన్నిస్‌ ఆలమ్‌పనిస్‌ (గ్రీస్‌), మిచెల్‌ లెబోవిజ్‌ (కెనడా), కెఆర్‌ వేణుగోపాల్‌ (ఇండియా), పి.టాన్యా (ఇండియా), డి.నర్సింహారెడ్డి (ఇండియా) ప్రసంగించగా, 'తెలంగాణలో వామపక్ష చరిత్ర నిర్మాణం' అంశంపై మల్లేపల్లి లక్ష్మయ్య, రమా మెల్కొటే, జి.కృష్ణారెడ్డి, డివి కృష్ణ, శాంతా సిన్హా మాట్లాడారు. '21వ శతాబ్దంలో వ్యవసాయిక విప్లవం' అనే అంశంపై అడాల్‌బెర్టో మార్టిన్స్‌ (బ్రెజిల్‌), గాస్‌పర్‌ మొర్కెన్చో (మెక్సికో), శామ్‌మోయో (జింబాబ్వే), గద్దర్‌ (ఇండియా), సంతోష్‌ రత్నా (ఇండియా) ప్రసంగించారు.  

20, ఫిబ్రవరి 2014, గురువారం

29వ రాష్ట్రంగా తెలంగాణ

       రాష్ట్ర విభజన జరిగితే బాగుంటుందని తెలంగాణ ప్రాంత రాజకీయ నాయకులు, అత్యధిక ప్రజలు, సీమాంధ్రలోని ప్రధాన పార్టీల నాయకులు ( సిపి(ఐ)ఎం మినహా) ఒక నిర్ణయానికి వచ్చారు. విభజన వద్దు సమైక్యంగా ఉండాలని సీమాంధ్రలో ప్రజలు , కొందరు రాజకీయ నాయకులు ఆందోళన చేశారు. రాయల తెలంగాణా కావాలని ఒకరిద్దరు రాజకీయ నాయకులు, అనంతపురం, కర్నూలు జిల్లాలోని కొందరు ప్రజలు కూడా కోరారు.  సమస్యలేంటని అధ్యయనం చేశాక ప్రజల్లో పలుకుబడి ఉన్న అధికార, ప్రతిపక్ష పార్టీలు(సిపిఎం మినహా) రాష్ట్ర విభజనకు అంగీకరించాయి.  కాంగ్రెస్‌పార్టీ అధికారంలో ఉంది కాబట్టి ఆమేరకు విభజనకు అంగీకరించింది. 10 సంవత్సరాలు హైదరాబాద్‌ ఉమ్మడి రాజధానిగా ఉంటుందని, ఐదేళ్లపాటు సీమాంధ్రకు ప్రత్యేక ప్రతిపత్తి కల్పిస్తూ రాజ్యసభలో ప్రధాని మన్మోహన్‌సింగ్‌ ప్రకటించారు. యుపిఏ భాగస్వామ్య పక్షాలు కాంగ్రెస్‌, బిజూజనతాదళ్‌, ఎన్‌సిపి, బిఎస్‌పి, సిపిఐ, ఆర్‌జెడి, ఎల్‌జిపి, ప్రధాన ప్రతిపక్షం బిజెపి బిల్లుకు అనుకూలంగా మాట్లాడి ఓటేశారు. సిపిఐ(ఎం), ఎస్‌పి, డిఎంకె, తృణమూల్‌ కాంగ్రెస్‌, అకాళిదల్‌, ఎజిపి బిల్లుకు వ్యతిరేకంగా మాట్లాడారు.  టిడిపి తెలంగాణ వాళ్లు అనుకూలంగా, సీమాంధ్ర సభ్యులు వ్యతిరేకంగా మాట్లాడారు.  లోక్‌సభలో 2014 ఫిబ్రవరి18న, రాజ్యసభలో 20న తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు బిల్లుకు ఆమోదం తెలిపారు. 
                             కాంగ్రెస్‌లోఉండి సమైక్య వాదం వినిపించిన కొందరు ప్రజాప్రతినిధులు రాజీనామా చేశారు. పార్లమెంటులో పెప్పర్‌ స్ప్రే ప్రయోగించి సంచలనం సృష్టించిన  విజయవాడ పార్లమెంటు సభ్యులు లగడపాటి రాజగోపాల్‌ పదవికి, కాంగ్రెస్‌ పార్టీకి రాజీనామా చేసి రాజకీయ సన్యాసం పుచ్చుకున్నారు.  ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి  కాంగ్రెస్‌పార్టీకి, ఎమ్మెల్యే , ముఖ్యమంత్రి పదవులకు రాజీనామా చేశారు. రాజ్యసభలో టిడిపి  ఎంపి సిఎం రమేష్‌ రాజ్యసభ కార్యదర్శి వద్ద వున్న టి బిల్లు ప్రతులను లాక్కోవడానికి దౌరజ్యనం చేశారు. ఆ అంశంపై సభ్యులు ప్రశ్నించడంతో క్షమాపణ చెప్పారు.  సేవ్‌ ఆంధ్రప్రదేశ్‌ ప్లకార్డు పట్టుకుని రోజంతా నిరసన తెలిపిన కాంగ్రెస్‌ సభ్యుడు కెవిపి రాంచందర్‌రావు సభలోనే సొమ్మసిల్లి పడిపోయాడు. ఆయనను ఆసుపత్రికి తరలించారు.  బిజెపి తెలంగాణకు అనుకూలం అంటూనే సీమాంధ్రలో సానుభూతికోసం అనేక ప్రయత్నాలు చేసింది. ఎట్టకేలకు తెలంగాణ 29 వ రాష్ట్రంగా ఏర్పాటుకు కేంద్రం ఆమోద ముద్ర వేసింది. 
             తెలంగాణ ఉద్యమాలు: తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు కోసం ఉద్యమాలు జరిగాయి. తరువాత తెలంగాణా ప్రజాసమితి 1971లో మర్రిచెన్నారెడ్డి నాయకత్వంలో ఏర్పడిరది.   ఆయన నాయకత్వంలో ఉధృత పోరాటం జరిగింది.  పలువురు ప్రాణాలు కోల్పోయారు. ఆతరువాత వచ్చిన ఎన్నికల్లో మర్రిచెన్నారెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు. ఆ తరువాత కాంగ్రెస్‌ పార్టీ ఆయనను ఖాళీగా ఉంచితే ఉద్యమాలు చేస్తారని గవర్నర్‌ పదవి ఇచ్చిం పంపింది.   ఆతరువాత తెలంగాణ ఉద్యమం పెద్దగా జరగలేదు.  టిడిపి నుంచి బయటకు వచ్చి ఇంద్రారెడ్డి తెలంగాణా ఉద్యమం ప్రారంభించి కొంతకాలం నిర్వహించి  కాంగ్రెస్‌తో కుదిరిన ఒప్పందం ప్రకారం ఆపార్టీనేత రాజశేఖర్‌రెడ్తితో కుమ్మక్కయ్యారు.  ఆతరువాత అనేక మలుపులు తిరిగిన ఉద్యమం 2001  ఏప్రిల్‌ 27న  కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు నాయకత్వంలో  తెలంగాణ రాష్ట్ర సమితిని( టిఆర్‌ఎస్‌) ఏర్పాటు చేశారు. పిసిసి ప్రధాన కార్యదర్శి జిల్లెల చిన్నారెడ్డి  నాయకత్వంలో ప్రత్యేక తెలంగాణ పార్టీ కమిటీని ఏర్పాటు చేశారు. 2009లో ఎన్నికలకు వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి తెలంగాణకు అనుకూలంగా మాట్లాడారు. ఎన్నిల తరువాత  మాటమార్చారు. రాజశేఖర్‌రెడ్డి మరణానంతరం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యయం పెరిగింది.  దీంతో కెసిఆర్‌ ఆందోళన ఉదృతం చేశారు. ఆమరణ నిరాహార దీక్ష చేయడంతో కాంగ్రెస్‌ ప్రభుత్వ దిగివచ్చింది. తెలంగాణా ప్రత్యేక రాష్ట్రం ఇస్తామని హామీ ఇచ్చారు. 2010లో శ్రీకృష్ణ కమిటీని ఏర్పాటు చేశారు. ఆ కమిటీ ఆరు ప్రతిపాదనలు చేసింది. ప్రభుత్వం అనుకున్న సమయానికి తిరిగి స్పందించ లేదని తెలంగాణా ఐక్యకార్యాచరణ కమిటీ ఏర్పడిరది. అందులో ఉద్యోగులు, ప్రజాసంఘాల చేతిల్లోకి ఉద్యమం వెళ్లింది. ప్రొఫెసర్‌ కోదండరాం నాయకత్వంలో ఎక్కువ మంది ఆందోళనలోకి వచ్చారు. తెలంగాణలో2011లో 42 రోజులు సమ్మె చేశారు. అఖిల పక్ష పార్టీలతో రెండు దపాలు చర్చలు జరిపారు. కాంగ్రెస్‌, టిడిపి, వైఎస్‌ఆర్‌సిపి, బిజెపి, సిపిఐ తెలంగాణా ఏర్పాటుకు సానుకూలంగా మాట్లాడారు. కొందరు లేఖలు కూడా ఇచ్చారు.  2013 జులై 30న కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు చేస్తామని తీర్మానం చేసింది. సీమాంధ్రలో ప్రజలు ఆందోళన చేశారు. 2013 అక్టోబరు 3న కేంద్ర మంత్రి మండలి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ఆమోదించింది. జిఓఎంను ఏర్పాటు చేసింది. సీమాంధ్రలో ఆందోళన ఉధృతమైంది. చివరికి 2014 ఫిబ్రవరి 18న  లోక్‌సభలో తెలంగాణ బిల్లుకు ఆమోదం తెలిపింది. 
     రాష్ట్రం స్వరూపం: 
       ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని మూడు విభాగాలలో తెలంగాణా ఒకటి. మిగతా రెండు విభాగాలనూ కోస్తా ఆంధ్ర లేదా ఆంధ్ర, లేదా సర్కారు, రాయలసీమ అని పిలుస్తారు. ఈ విభజన చారిత్రక కారణాల వల్ల వచ్చి భౌగోళిక, సాంస్కృతిక కారణాలతో అలాగే కొనసాగుతుంది.  ప్రస్తుత తెలంగాణా ప్రాంతం నిజాం తన రాజ్యంలోని  ప్రాంతాలను రకరకాల కారణాలతో  బ్రిటీషువారికి ఇచ్చివేయగా మిగిలినది తెలుగు ప్రాంతం. ప్రస్తుతం తెలంగాణా ప్రాంతంలో 10 జిల్లాలున్నాయి. భౌగోళికంగా ఇది దక్కను పీఠభూమిలో భాగం. తెలంగాణా ప్రాంతంలో 10 జిల్లాలున్నాయి. దేశంలోని 7వ నెంబరు జాతీయ రహదారి, 9వ జాతీయ రహదారి ఈప్రాంతం గుండా వెళ్తుంది. హైదరాబాద్‌`వాడి, సికింద్రాబాద్‌`కాజీపేట, సికింద్రాబాద్‌` విజయవాడ, సికింద్రాబాద్‌`డోన్‌, వికారాబాద్‌`పర్బని, కాజీపేట`బల్హర్షా రైతు మార్గాలు తెలంగాణా ప్రాంతం నుంచి వెళ్తున్నాయి.  సికింద్రాబాద్‌, కాజీపేట రైల్వేజంక్షన్లు దక్షిణమధ్య రైల్వేలో ప్రముఖ కూడళ్లుగా పేరెన్నికగలవి.  ఆరు దశాబ్ధాల పాటు కలిసి ఉన్న  తెలుగు భాష మాట్లాడే వాళ్లను రెండుగా విభజించారు. 
తెలంగాణా వాదుల వాదనలు
1. పెద్ద మనుషుల ఒప్పందాన్ని ఏనాడు ఆంధ్రులు అమలు చేయలేదు. ఉపముఖ్యమంత్రి పదవి ఇవ్వడం లేదు. 
2. కృష్ణాగోదావరి నదుల పరివాహక ప్రాంతం 80 శాతం మాదైతే 88 శాతం నాళ్లు వాళ్లవి. కరెండు 70 శాతం ూత్పత్తి మాది. 80 శాతం పంట రుణాలు వాళ్లవి. మూడొంతుల ఉద్యోగాలు వాళ్లవి. 
3. శాంతి యుతంగా అన్నదమ్ముళ్లా విడిపోదాం. 
4. తెలంగాణ వద్ద ఉన్న వనరులతో ఆంధ్రప్రాంతం ఇప్పటికేచాలా ప్రయోజనం పొందింది. 
5. ప్రత్యేక తెలంగాణ స్వాభిమానానికి ప్రతీక. ప్రత్యేక తెలంగాణాపై 50 ఏళ్లుగా ఉద్యమాలు జరుగుతున్నాయి. ఇది ప్రజల ఆకాంక్షల నుంచి పుట్టింది. 
6. రాజ్యాంగం ప్రకారం. చూసినా రాష్ట్రాల ఏర్పాటు అనేది కేంద్ర పరిధిలోని అంశం. అసెంబ్లీలో తీర్మానం అవసరం లేదు. అది లేకుండాను కేంద్రం ఆమోదించవచ్చు. 
7. తమిళనాడుకు తెలుగుగంగ నీళ్లు ఇస్తున్నప్పుడు తెలంగాణానుంచి అంధ్రకు నీళ్లుఅందకుండా చేస్తారని అనుకోవడం సరికాదు. 
8. భౌగోళిక , చారిత్రక కోణాల్లో ఎలా చూసినా హైదరాబాద్‌ తెలంగాణాలో అంతర్భాగమే. 
9. విలీనం నాటికి తెలంగాణాయే పారిశ్రామికంగా ముందుండేది. గత యాబైఏళ్లుగా తెలంగాణా చాలాత్యాగాలు చేసింది. ఆంధ్ర అభివృద్ధిలో ఎక్కువభాగానాన్ని  ఆంధ్రలోని సంపన్నులు తీసుకున్నారు. తెలంగాణా వివక్షకు గురైంది. సింగరేణిలో, సచివాలయంలో అన్ని చోట్లా కోస్తావారే ముఖ్యమైన ఉద్యోగాల్లో ఉన్నారు. ఇది  ఆర్థిక అసమానతలకు దారి తీసింది. 
10. బడ్జెట్‌లో కేటాయింపుల్లోనూ ఆంధ్రాకే అగ్రస్ధానం.
సమైక్యాంధ్రుల వాదనలు
1. పూర్తిగా అభివృద్ధి చెందిన తెలంగాణా ఇప్పుడు విడగొడితే కోస్తా వనరులన్నీ అటే వెళ్లాయి. దీనివల్ల కోస్తా ప్రాంతంలోని రైతులకు కష్టాలు తప్పవు. 
2. తెలంగాణా విడిపోతే  ఆ ప్రాంత ప్రజలు కోస్తాంధ్రకు రావాల్సి నీటిని అడ్డుకుంటారు. ఫలితంగా వ్యవసాయం, దాని అనుబంధ పరిశ్రమలు మూతపడి నిరుద్యోగం పెరుగుతుంది. 
3. తెలంగాణానుంచి కోస్తాంధ్రకు చెందిన ఉద్యోగులను తరిమేస్తారు. కోస్తాంధ్రాకు ఆదాయాలు కూడా తగ్గుతాయి. 
4. తెలుగు మాట్లాడే ప్రజలు విశాలాంధ్ర కోసం అనేక దశాబ్ధాలు పోరాడారు. భాషాప్రయుక్త రాష్ట్రాలనేవి జాతీయ ఉద్యమంలో ఒక భాగం భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటులో సహేతుకత ూంది. 
5. దేశంలో వెనుకబడిన ప్రాంతమంటూ లేని రాష్ట్రమేది. తెలంగాణాలో కూడా వెనుకబడిన ప్రాంతాలు ూండొచ్చు. కానీ అభివృద్ధి చెందిన ప్రాంతాలూ ూన్నాయి. ఇలాంటి విభజన కొనసాగిస్తే విభజన రేఖ ఎక్కడ గీయగలం. 
6. ప్రత్యేక వాదం సమస్యకు పరిష్కారం కాబోదు. ఇది మరో అతిపెద్ద సమస్యకు ప్రారంభం అవుతుంది. ఇతర రాష్ట్రాలతో పాటు, ప్రత్యేక వాదం గురించి మాట్లాడుతున్న అదే ప్రాంతంలోనూ భవిష్యత్తులో ఈసమస్య తలెత్తవచ్చు. 
7. చిన్నరాష్ట్రాలు దేశ ఉనికికి ప్రమాదంగా మారుతాయి. 
8. తెలుగు మాట్లాడే వారంతా కలిసి ఉంటేనే అభివృద్ధి సాధించవచ్చు. 
9 . ఐటి కంపెనీలు ఇతర రాష్ట్రాలకు తరలిపోవడానికి స్థిమవుతున్నాయి. 
ప్రత్యేకాంధ్రుల వాదనలు
1. కోస్తాలోని వెనుకబడిన ప్రాంతాలు తెలంగాణతో సమానంగా అభివృద్ధి చెందలేదు. 
2. హైదరాబాద్‌పై కాకుండా ఆంధ్రప్రదేశ్‌లోని మిగిలిన పట్టణాల అభివృద్ధి గురించి ఎన్నడూ ఆలోచించలేదు. 
3. రెండు లేదా మూడు రాష్ట్రాలు ఉంటే తప్పేంటి?. దేశంలో చిన్న రాష్ట్రాలు అభివృద్ధి చెందటం లేదా?. 
4. 1956లో ఆంధ్రప్రదేశ్‌ ఏర్పడినప్పటి నుంచీ ఇప్పటివరకు రెండు ప్రాంతాల మధ్య భావసమైక్యత లేదు. 
5. తెలంగాణ ప్రాంతమంతా విడిపోవాలని కోరుకుంటున్నప్పుడు కలిసే ఉందామనడం సమంజసం కాదు. 
6, ఒక వేళ తెలంగాణా ఇవ్వదలిస్తే పూర్వం భద్రాచలం డివిజన్‌ ను మళ్లీ తూర్పుగోదావరి జిల్లాలో కలపాలి. 
7. ఆంధ్రులకు మరో ముఖ్యపట్టణం అవసర ఉంది. ఆరోగ్యం, విద్య, న్యాయ, వ్యాపార, సాంకేతిక పరమైన అంశాలకు హైదరాబాద్‌ అందరికీ అందుబాటులో లేదు. 
8. కోస్తా ఆంధ్రులకు సుదీర్ఘమైన 960 కిమీ తీరప్రాంతం ఉంది. అనేక వనరులు పుష్కలంగా ఉన్నాయి. అయితే అవేవీ అక్కడ పేద ప్రజలకు ఉపయోగపడటం లేదు. 
9. విశాఖపట్టణాన్ని పారిశ్రామిక కేంద్రంగా , కర్నూలును న్యాయ వ్యవస్థా కేంద్రంగా , తిరుపతిని సాంస్కృతిక కేంద్రంగా మలుచుకోవచ్చు. 
10. భౌగోళికంగా విడిపోవడం వల్ల తెలుగుభాషకు నష్టం లేదు. వివిధ మాండలికాలు అభివృద్ధి చెందుతాయి. 
11. తెలంగాణ ఇవ్వడం వల్ల తెలంగాణ వారికి ఎంత ప్రయోజనమో ఆంధ్రావారికి అంతకు రెట్టింపు ప్రయోజనం. 
సామాన్యుల వాదనలు
1. తెలంగాణా ఉద్యమాల్లాంటివి దేశమంతటా ఉన్నాయి. 
2. తెలంగాణా రాష్ట్రం ఏర్పడాల్సిన అవసరం లేదు. ప్రత్యేక అభివృద్ధి ప్యాకేజీలు చేపడితే సరిపోతుంది. 
3. ఒక్క రాష్ట్రం ఏర్పడటానికే దేశంలో డబ్బులేదు. 
4. తెలంగాణా రాష్ట్రం ఏర్పడితే ఇతర రాష్ట్ర్ర ఉద్యమాల వల్ల దేశసమైక్యత తెబ్బతింటుంది. 
ఎట్టకేలకు అన్ని వాదనలకు తెరపడిరది 
          ఎట్టకేలకు రాష్ట్ర విభజనకు కాంగ్రెస్‌ ప్రభుత్వ అడుగుముందుకేసింది. ఆ తరువాత డోలాయమానంలో ఉన్న బిజెపి కూడా తెలంగాణ బిల్లుకు మద్దతు తెలిపింది. 2014 ఫిబ్రవరి 18న లోక్‌సభలో, 20న రాజ్య సభలో ఆమోదం తెలిపారు.  29వ రాష్ట్రంగా తెలంగాణ ఏర్పడిరది. ఆంధ్రప్రదేశ్‌కు రాజధాని, నదీ జలాల వివాదం, తదితరాలకు ప్రభుత్వం పరిష్కారం చూపాల్సి ఉంది.  తెలుగు ప్రజలు రెండు రాష్ట్రాలుగా ప్రభుత్వం విభజించింది. ఈవార్తలు విని తెలంగాణలో సంభరాలు జరుపుకోగా, సీమాంధ్రలో నిరసన తెలిపారు. ఫిబ్రవరి 18న తీవ్రంగా నిరసన తెలిపారు. 20న పెద్దగా నిరసనలు కనిపించలేదు.