18, జులై 2019, గురువారం

ప్రపంచ కుబేరుల జాబితాలో జెఫ్‌ నం.1


మూడోస్థానానికి పడిపోయిన బిల్‌గేట్స్‌
          ఆమెజాన్‌ సీఈవో జెఫ్‌బెజోస్‌ ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడి స్థానాన్ని పదిల పరుచుకున్నారు. ఇటీవల బ్లూంబర్గ్ బిలియనీర్‌ ఇండిక్స్‌ విడుదల చేసిన జాబితాలో ఈయన తొలిస్థానంలో నిలిచారు. బెజోస్ తర్వాత రెండో స్థానంలో కొనసాగుతున్న మైక్రోసాఫ్ట్‌ కార్పొరేషన్‌ సహవ్యవస్థాపకుడు బిల్‌ గేట్స్‌కు ఈ సారి మాత్రం షాక్‌ తగిలింది. గేట్స్‌ను వెనక్కి నెట్టి ఎల్వీఎంహెచ్‌ సీఈవో బెర్నార్డ్‌ ఆర్నాల్ట్‌ రెండో స్థానంలో నిలిచారు. ఆర్నాల్ట్ మొత్తం ఆస్తుల విలువ 108 బిలియన్ డాలర్లు కాగా, గేట్స్‌ ఆస్తుల మొత్తం 107 బిలియన్‌ డాలర్లుగా ఉంది. 
             అమెజాన్‌ చీఫ్‌ బెఫ్‌ బెజోస్‌ తన భార్య మెకంజీ బెజోస్‌కు భారీగా భరణం సమర్పించుకున్నప్పటికీ 125బిలియన్‌ డాలర్లతో తొలిస్థానంలో నిలిచారు. బిల్‌గేట్స్‌ తన సంపదలోని 35 బిలియన్‌ డాలర్లను గేట్స్‌ అండ్‌ మిలిందా సంస్థకు విరాళంగా ఇచ్చిన విషయం తెలిసిందే. దీంతో ఆయన సంపద 107 బిలియన్‌ డాలర్లకు చేరుకుంది. ఇక ఆర్నాల్డ్‌ 2019లో ఇప్పటి వరకు 39 బిలియన్‌ డాలర్లు సంపాదించారు. ఈ జాబితాలో పేర్కొన్న టాప్‌ 500 మంది ధనికుల్లో ఒక ఏడాదిలో అత్యధికంగా సంపాదించిన వారి జాబితాలో ఆర్నాల్ట్‌ తొలిస్థానంలో నిలిచారు.
మహిళల్లో నాలుగో స్థానం మెకంజీదే..

           అమెజాన్ చీఫ్‌ జెఫ్‌ బెజోస్‌తో విడాకులు తీసుకుని భరణం పొందిన మెకంజీ ధనిక మహిళల జాబితాలో నాలుగో స్థానంలో నిలిచారు. ఆమె నికర ఆస్తుల విలువ 40.3 బిలియన్ డాలర్లు. మొత్తంగా తీసుకుంటే ఈమె 22వ స్థానంలో ఉన్నారు. ఇక ప్రపంచంలో అత్యంత ధనవంతురాలిగా ఫ్రాంకోయిస్‌ నిలిచారు.
భారత కుబేరుడు మళ్లీ ఆయనే..

           రిలయన్స్ ఇండస్ట్రీస్‌ అధినేత ముకేశ్‌ అంబానీ భారత్‌లో అత్యంత ధనికుడిగా తన స్థానాన్ని పదిల పరుచుకున్నారు. ఆయన ఆస్తుల విలువ 51.8 బిలియన్‌ డాలర్లు. ప్రపంచ వ్యాప్తంగా 13 వస్థానంలో నిలిచారు. అంబానీ తర్వాత స్థానంలో విప్రో అధినేత అజీమ్‌ ప్రేమ్‌జీ 20.5 బిలియన్‌ డాలర్లతో రెండో స్థానంలో నిలిచారు. ప్రపంచ వ్యాప్తంగా ఈయన 48వ ర్యాంకును కైవసం చేసుకున్నారు. హెచ్‌సీఎల్‌ టెక్‌ శివ నాడార్‌ 92 స్థానంలో, కొటాక్‌ మహీంద్రా ఎండీ ఉదయ్‌ కొటాక్‌ 96స్థానంలో నిలిచారు.

10, జులై 2019, బుధవారం

చిన్నారులపై లైంగిక నేరాలకు పాల్పడితే ఉరిశిక్ష


కేంద్ర కేబినెట్‌ కీలక నిర్ణయాలు
న్యూదిల్లీ: కేంద్ర కేబినెట్‌ బుధవారం కీలక నిర్ణయాలు తీసుకుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో భేటీ అయిన కేబినెట్‌ పలు అంశాలపై చర్చించి వివరాలు ప్రకటించింది. పోక్సో చట్ట (2012) సవరణకు ఆమోదం తెలిపింది. చిన్నారులపై లైంగిక నేరాలకు పాల్పడితే ఉరిశిక్ష పడేలా చట్టానికి సవరణ చేయనుంది. అలాగే, చైల్డ్‌ పోర్నోగ్రఫీకి పాల్పడితే జరిమానా, జైలు శిక్ష విధించేలా చట్టాన్ని సవరణ చేయనుంది. మరోవైపు, సిక్స్‌ ఫర్‌ జస్టిస్‌ (ఎస్‌ఎఫ్‌జే) సంస్థ చట్టబద్దమైనది కాదని ప్రకటన చేసింది. పంజాబ్‌ సహా పలు రాష్ట్రాలతో సంప్రదింపులు జరిపాక ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
              దేశంలోని లక్షలాది మంది సంఘటిత, అసంఘటిత కార్మికులకు మేలు చేసే ‘కార్మిక రక్షణ కోడ్‌’కు ఆమోద ముద్ర వేసింది. 13 కేంద్ర కార్మిక చట్టాలను ఈ ‘ఒకే కోడ్’‌ పరిధిలోకి తీసుకురానుంది. వాణిజ్యం, వ్యాపారం, తయారీ, సేవా, ఐటీ వంటి అన్ని రంగాల కార్మికులకు ఈ ప్రయోజనాలు అందనున్నాయి. ఈ నిర్ణయం వల్ల కార్మికులు ఆరోగ్య రక్షణ, భద్రత వంటి ప్రయోజనాలు పొందొచ్చు. ఉద్యోగుల సంఖ్య 10 మందికి పైగా ఉండే అన్ని పరిశ్రమలకు ఈ కోడ్‌ వర్తిస్తుంది.
మరిన్ని కీలక నిర్ణయాలు
* ఆర్‌పీఎఫ్‌ సర్వీసులకు గ్రూప్‌-ఎ హోదా కేటాయిస్తూ నిర్ణయం
* ప్రధాని గ్రామ సడక్‌ యోజక మూడోవిడత పనులకు ఆమోదం
* రూ.80,250 కోట్లతో లక్షా 25 వేల కి.మీ రోడ్ల నిర్మాణానికి కేబినెట్‌ ఆమోదం
* అంతర్రాష్ట్ర నదీ వివాదాల పరిష్కార చట్టసవరణ బిల్లుకు ఆమోదం

8, జులై 2019, సోమవారం

15, 16 తేదీల్లో ‘మున్సిపల్‌’ నోటిఫికేషన్‌


నెలాఖరున పోలింగ్‌

14వ తేదీ నాటికే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళా ఓటర్ల గుర్తింపు

వేగవంతంగా ఎన్నికల ప్రక్రియ
                        తెలంగాణ  రాష్ట్రంలో పురపాలక ఎన్నికల నిర్వహణ ప్రక్రియను ప్రభుత్వం వేగవంతం చేసింది. ఈ క్రమంలో అవసరమైన ముందస్తు ప్రక్రియను మరింత ముందుకు తీసుకువచ్చింది. రాష్ట్రవ్యాప్తంగా పురపాలక సంఘాలు, నగరపాలక సంస్థల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళా ఓటర్ల గుర్తింపు ప్రక్రియను ఈ నెల 14వ తేదీ లోపు పూర్తి చేయాలని రాష్ట్ర పురపాలక శాఖ డైరెక్టర్‌ టి.కె.శ్రీదేవి అధికారులను ఆదేశించారు. గతంలో ఈ గడువు 18వ తేదీ వరకు ఉండగా దీన్ని నాలుగు రోజులు ముందుకు తీసుకువచ్చారు. వార్డుల వారీగా ఫొటోలతొ కూడిన ఓటర్ల జాబితాను 14న ప్రకటించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. ఈ రెండు పరిణామాల నేపథ్యంలో ఈ నెల 15న పురపాలక శాఖ రిజర్వేషన్లను ఖరారు చేసి రాష్ట్ర ఎన్నికల సంఘానికి అందించనున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఆ వెంటనే అంటే ఈ నెల 15న లేదా 16న రాష్ట్ర ఎన్నికల సంఘం పురపాలక ఎన్నికల నిర్వహణకు నోటిఫికేషన్‌ జారీ చేయనుందని తెలిసింది. జులై 30 లేదా 31న రాష్ట్రంలోని 131 పురపాలక సంఘాలు, మూడు నగరపాలక సంస్థల్లో ఎన్నికలు జరగనున్నాయి. దీనికి అనుగుణంగా రాష్ట్ర పురపాలకశాఖ, రాష్ట్ర ఎన్నికల సంఘం శరవేగంగా ఏర్పాట్లు చేస్తున్నాయి.
ముగిసిన వార్డుల పునర్విభజన

                ప్రభుత్వం ఇటీవల ఇచ్చిన ఆర్డినెన్స్‌ మేరకు రాష్ట్రంలో వార్డుల సంఖ్య పెరిగింది. కొత్త పురపాలక సంఘాల ఏర్పాటు, నగరపాలక సంస్థలు, పురపాలక సంఘాల విస్తరణ నేపథ్యంలో కొత్త వార్డులు ఏర్పడ్డాయి. వార్డులను ప్రకటించి ప్రజల నుంచి అభ్యంతరాలను స్వీకరించడంతోపాటు వాటిని పరిష్కరించి పురపాలక సంఘాలు, నగరపాలక సంస్థల్లో పునర్విభజన మేరకు ఆదివారం వార్డులను ఖరారు చేశారు. కొత్త వార్డుల ప్రకారం ఈ నెల 14వ తేదీ లోపు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళా ఓటర్లను గుర్తించి ప్రకటించనున్నారు. ఇది పురపాలక ఎన్నికల నిర్వహణలో కీలకమైన రిజర్వేషన్ల ఖరారుకు ప్రాతిపదిక కానుంది. పోలింగ్‌ కేంద్రాల ప్రకటనకు ఈ నెల 18వ తేదీ వరకు గడువు ఉంది. కానీ తాజాగా ఈ నెల 14 లోపు పురపాలక ఎన్నికల ముందస్తు ప్రక్రియను పూర్తి చేసే నేపథ్యంలో ఈ షెడ్యూలు కూడా మారనుందని తెలిసింది. ఈ నెల 14వ తేదీ లోపే పోలింగ్‌ కేంద్రాలను గుర్తించి ప్రకటించనున్నారు.
పరోక్ష పద్ధతిలోనే ఛైర్మన్లు, మేయర్ల ఎన్నిక

         పురపాలక సంఘాల ఛైర్మన్లు, నగరపాలక సంస్థల మేయర్లను ఈ సారీ పరోక్ష పద్ధతి ద్వారానే ఎన్నుకోనున్నారు. ప్రభుత్వం తీసుకురానున్న కొత్త పురపాలక చట్టం నేపథ్యంలో ఈ అంశంపై ముఖ్యమంత్రి కేసీఆర్‌ అధికారులతో చర్చించారు. పురపాలక చట్టంలో సమూల మార్పుల నేపథ్యంలో మున్సిపల్‌ ఛైర్మన్లు, మేయర్ల ఎన్నిక ప్రత్యక్ష పద్ధతి ద్వారా నిర్వహించడం బాగుంటుందనే అభిప్రాయం వ్యక్తమైంది. కానీ ఎన్నికలను ఈ నెలాఖరులోపు పూర్తి చేయాలనే లక్ష్యం నేపథ్యంలో ఈ సారీ పరోక్ష పద్ధతి ద్వారానే ఎన్నుకునే విధానంతో ముందుకు వెళ్లనున్నారు. ఎన్నికల ప్రక్రియ దీనికి అనుగుణంగానే సాగుతోంది. పురపాలిక ఎన్నికల ప్రక్రియను 15 రోజుల్లో పూర్తి చేయాలని ఎన్నికల సంఘం భావిస్తోంది.
ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళా ఓటర్ల గుర్తింపునకు తాజా షెడ్యూలు ఇది

      ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళా ఓటర్ల గుర్తింపు ముసాయిదా ప్రచురణ : జులై 10

అభ్యంతరాల స్వీకరణకు గడువు : జులై 11, 12 తేదీల్లో

అభ్యంతరాల పరిష్కారం : జులై 13

తుది జాబితా ప్రచురణ : జులై 14

7, జులై 2019, ఆదివారం

మలేరియాకు మన మందు


కొత్త ఔషధాన్ని ఆవిష్కరించిన హెచ్‌సీయూ బయోకెమిస్ట్రీ విభాగం
                మలేరియాపై జరుగుతున్న యుద్ధంలో మన దగ్గరి నుంచే ఓ ప్రత్యామ్నాయ ఔషధం ఆవిష్కృతమవుతోంది. వ్యాధి కారక ‘ప్లాస్మోడియం ఫాల్సిపారమ్‌’ అనే పరాన్నజీవి ఇప్పటికే ఉన్న ఔషధాలను తట్టుకొని.. మొండిగా తయారైంది. ఈ నేపథ్యంలో ఆ పరాన్నజీవిని పూర్తిగా చంపేందుకు ‘బీఓ2’ అనే మందును హైదరాబాద్‌ కేంద్రీయ విశ్వవిద్యాలయం (హెచ్‌సీయూ) బయోకెమిస్ట్రీ విభాగం కనుగొంది. వర్సిటీ బయోకెమిస్ట్రీ విభాగాధిపతి మ్రిణాల్‌కాంతి భట్టాచార్య పర్యవేక్షణలో పరిశోధక విద్యార్థులు ప్రతాప్‌ వైద్యం, డిబుయేందు దత్తా, నిరంజన్‌ సూత్రంతోపాటు బయోటెక్నాలజీ విభాగం ఫ్యాకల్టీ సునందా భట్టాచార్య పరిశోధనలో పాలుపంచుకున్నారు. ఈ ఆవిష్కరణ వివరాలు అమెరికాకు చెందిన ప్రతిష్ఠాత్మక జర్నల్‌ ఆఫ్‌ బయోలాజికల్‌ కెమిస్ట్రీలో ప్రచురితమయ్యాయి.
మలేరియా ఎలా వస్తుంది ?

       ప్లాస్మోడియం ఫాల్సిపారమ్‌ అనే ప్రోటోజోవా పరాన్నజీవితో మలేరియా వస్తుంది. ఆడ ఎనాఫిలస్‌ దోమ కుడితే ఇది మనషుల రక్తంలోకి ప్రవేశిస్తుంది. తొలుత కాలేయం, ఆ తర్వాత ఎర్ర రక్తకణాల్లోకి చేరుతుంది. దీని కారణంగా ఎర్ర రక్తకణాలు నిర్వీర్యమై వ్యాధి తీవ్ర పెరుగుతుంది. చికిత్స ఆలస్యమైతే పి.పాల్సిపారమ్‌ మెదడుకు చేరి ప్రాణాపాయం ఏర్పడుతుంది.
ప్రస్తుతం ఉన్న ఔషధాలు..
           ప్రస్తుతం మలేరియాను తగ్గించడానికి క్లోరోక్విన్‌, ఆర్టిమిసినిన్‌ అనే రెండు రకాల ఔషధాలు అందుబాటులో ఉన్నాయి. వ్యాధిగ్రస్థులు ఈ మందులు వేసుకుంటే పి.ఫాల్సిపారమ్‌ డీఎన్‌ఏను విచ్ఛిన్నం చేస్తాయి. అలా వ్యాధి కారకం చనిపోతుంది. కానీ, ఇటీవలికాలంలో దేశంలోని కొన్ని ప్రాంతాల్లో ఈ మందులు అంతగా పని చేయడం లేదు. వ్యాధికారక జీవి ఆ ఔషధాలను తట్టుకొని.. విచ్ఛిన్నమైన తన డీఎన్‌ఏను తిరిగి బాగుచేసుకుని బతుకుతోంది. దీన్నే వైద్య పరిభాషలో ‘హోమోలొగస్‌ రీ కాంబినేషన్‌’గా వ్యవహరిస్తారు. దీంతో వ్యాధి ముదురుతోంది. ఫాల్సిపారమ్‌లో ఉండే ‘ఆర్‌ఏడీ51’ అనే ఎంజైమ్‌ కారణంగా డీఎన్‌ఏ తిరిగి బాగవుతున్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. విచ్ఛిమైన డీఎన్‌ఏ రిపేర్‌ కాకుండా చేయగలిగితే వ్యాధి తగ్గుతుందని భావించిన హెచ్‌సీయూ పరిశోధక బృందం నాలుగేళ్లపాటు శ్రమించి ఈ ఔషధాన్ని కనిపెట్టింది.
బీఓ2 పనితీరు ఇలా..
        పరాన్నజీవి నమూనాను సేకరించి దానిపై ప్రస్తుతం ఉన్న ఔషధాలు ప్రయోగించారు. వ్యాధికారకం డీఎన్‌ఏ విచ్ఛిన్నమై.. తిరిగి రిపేర్‌ చేసుకునే క్రమంలో బీఓ2 మందును ప్రయోగించారు. దీంతో విచ్ఛిన్నమైన డీఎన్‌ఏను బాగు చేసుకునే శక్తిని అది కోల్పోయింది. క్రమంగా వ్యాధి తగ్గింది. బీఓ2 వల్ల ఇతర అవయవాలపై ఎలాంటి దుష్ప్రభావం ఉండదని తేలినట్లు పరిశోధకులు తెలిపారు.

5, జులై 2019, శుక్రవారం

గ్రాఫ్స్‌రూపంలో కేంద్ర బడ్జెట్‌..వీక్షించండి



గ్రాఫ్స్‌రూపంలో కేంద్ర బడ్జెట్‌..వీక్షించండి

 మోదీ  ప్రభుత్వం 2019-20 వార్షిక బడ్జెట్‌ నిరీక్షణకు తెరదించింది. మన తెలుగింటి కోడలు నిర్మలా సీతారామన్‌ కేంద్ర ఆర్థిక మంత్రి హోదాలో పార్లమెంట్‌లో కేంద్ర బడ్జెట్‌ను శుక్రవారం ప్రవేశపెట్టారు. పాఠకులకు సులభంగా అర్థమయ్యే రీతిలో ప్రెస్‌ ఇన్ఫర్మేషన్‌ బ్యూరో ఆఫ్‌ ఇండియా (పీఐబీ) గ్రాఫ్స్‌ రూపంలో చిత్రాలను విడుదల చేసింది. ఆ చిత్రమాలికే ఇది.. 

19, మార్చి 2019, మంగళవారం

ఏపీలో 2014 ఫలితాలిలా.. మరి 2019


                

ఆంధ్రప్రదేశ్‌లో 2014 అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం ఘనవిజయం సాధించింది. రాష్ట్ర విభజన ప్రకటన అనంతరం జరిగిన ఎన్నికలు కావడంతో ఈ ఎన్నికలు అన్ని పక్షాలకు సవాల్‌గా మారాయి. అవశేష ఆంధ్రప్రదేశ్‌లో మొత్తం 175 స్థానాలుండగా అప్పటి వరకు అధికారంలో ఉన్న కాంగ్రెస్‌కు ఒక్క సీటు కూడా దక్కకపోవడం గమనార్హం. చంద్రబాబునాయుడు సారథ్యంలోని తెలుగుదేశం, భాజపాతో పొత్తు కుదుర్చుకొని పోటీచేసింది.ఈ కూటమికి జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ మద్దతు ప్రకటించారు. వైకాపా తరఫున ఆ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డికి తెలుగుదేశం కూటమికి మధ్య హోరాహోరీ పోరు జరిగింది.
అప్పటి ఫలితాలు
          2014 ఎన్నికల్లో తెలుగుదేశం, భాజపా కూటమి 106 స్థానాల్లో విజయం సాధించింది. వైకాపా 67 సీట్లతో స్వతంత్రులు 2 సీట్లలో గెలుపొందారు.
ఓట్లశాతం పరంగా చూస్తే తెదేపా 44.61, వైకాపా 44.58, కాంగ్రెస్‌ 2.77, భాజపా 2.18, స్వతంత్రులు 1.77 శాతంగా ఉన్నాయి. తెదేపా-భాజపా కూటమికి వైకాపాకు మధ్య ఓట్ల తేడా కేవలం 2.21 శాతం కావడం గమనార్హం. 

పశ్చిమలో క్లీన్‌స్వీప్‌
              తెలుగుదేశం కూటమి విజయంలో పశ్చిమ గోదావరి జిల్లా్ కీలకభూమిక పోషించింది. ఇక్కడ మొత్తం 15 స్థానాలుంటే కూటమి అన్నింటినీ గెలుచుకుంది. తెదేపాకు 14, భాజపాకు 1 సీటు లభించాయి. ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళంలో మొత్తం 10 స్థానాలకు తెలుగుదేశం 7, వైకాపా 3 గెలుచుకున్నాయి. విజయనగరంలో 9 స్థానాలుంటే తెదేపాకు 6, వైకాపాకు 3 లభించాయి. విశాఖపట్నం జిల్లాలోనూ తెలుగుదేశం కూటమి తిరుగుదేని విజయాన్ని అందుకుంది ఇక్కడ మొత్తం 15 సీట్లు ఉంటే  12 సీట్లను కూటమి తనఖాతాలో వేసుకుంది. 
తూర్పులోనూ కూటమిదే హవా
            తూర్పుగోదావరి జిల్లాలో మొత్తం 19 స్థానాలుండగా కూటమి 14 స్థానాల్లో తెదేపా-భాజపా కూటమి జయకేతనం ఎగరవేసింది. వైకాపాకు 5 సీట్లు దక్కాయి. 
కృష్ణా, గుంటూరులో తెలుగుదేశం జోరు
          కృష్ణాలో 16, గుంటూరులో 17 సీట్లు వున్నాయి. కృష్ణా జిల్లాలో కూటమి 11 సీట్లను గెలుచుకోగా, వైకాపా 5 సీట్లలో విజయం సాధించింది. అలాగే గుంటూరులో తెదేపాకు 12, వైకాపాకు 5 దక్కాయి.
ప్రకాశం, నెల్లూరులో వైకాపా ఆధిక్యం
           ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో వైకాపా ఆధిక్యం  ప్రదర్శించింది. ప్రకాశంలో మొత్తం 12 సీట్లు ఉంటే అందులో తెదేపాకు 5, వైకాపాకు 6 దక్కాయి, చీరాలలో నవోదయం పార్టీ విజయం సాధించింది. నెల్లూరు జిల్లాలో 10 స్థానాలుండగా వైకాపా 7 స్థానాల్లో జయకేతనం ఎగరవేయగా మిగిలిన సీట్లలో తెదేపా గెలుపు సాధించింది.
రాయలసీమలో..
          రాయలసీమలోని అనంతపురం జిల్లాలో మొత్తం 14కు గాను తెదేపాకు 12, వైకాపాకు 2 లభించాయి. వైఎస్సార్‌ కడప జిల్లాలో వైకాపా భారీ విజయాన్ని నమోదుచేసింది. ఇక్కడ 10 నియోజకవర్గాలుండగా వైకాపా ఏకంగా తొమ్మిది స్థానాలను స్వీప్‌ చేసింది. తెదేపా ఒకే స్థానం (రాజంపేట)లో గెలుపొందింది. కర్నూలు జిల్లాలో మొత్తం 14 నియోజకర్గాలుండగా వైకాపా 10 స్థానాలను, తెదేపా 4 స్థానాలను దక్కించుకున్నాయి. చిత్తూరు జిల్లాలో 14 సీట్లు ఉండగా  తెదేపా 6, వైకాపాకు 8 సీట్లలో విజయాన్ని అందుకున్నాయి.
2019లో 
              తాజాగా  జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల్లో అధికారాన్ని నిలుపుకోవాలని తెలుగుదేశం, అధికారాన్ని అందుకోవాలని వైకాపా, కొత్తగా బరిలో దిగిన జనసేన తన సత్తా చూపించాలని ఆశిస్తున్నాయి. దీంతో రాష్ట్రంలో త్రిముఖపోరు నెలకొనింది. భాజపా సైతం ఒంటరిగా బరిలోకి దిగింది. అసెంబ్లీతో పాటు లోక్‌సభకు ఎన్నికలు జరుగుతుండటంతో రాష్ట్రంలో  రాజకీయవాతావరణం ఉత్కంఠగా మారింది. రాష్ట్రానికి ప్రత్యేక హోదా, హామీల అమలు, ప్రభుత్వ పనితీరు, వైకాపా ప్రకటించిన నవరత్నాలు, పోలవరం.. తదితర అంశాలు కీలకంగా ప్రభావం చూపించే అవకాశముంది.

20, ఫిబ్రవరి 2019, బుధవారం

కొత్త మంత్రులకు శాఖలు ఖరారు




హైదరాబాద్‌:  2019 ఫిబ్రవరి 19న ఉదయం రాజ్‌భవన్‌లో ప్రమాణ స్వీకారం చేసిన తెలంగాణ రాష్ట్ర మంత్రులకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ శాఖలు కేటాయించారు. గతంలో ఆర్థిక శాఖమంత్రిగా పనిచేసిన ఈటల రాజేందర్‌కు ప్రస్తుతం వైద్య ఆరోగ్యశాఖ కేటాయించారు. జగదీశ్‌రెడ్డి గతంలో విద్యుత్‌ శాఖ మంత్రిగా పనిచేయగా ప్రస్తుతం విద్యాశాఖను కేటాయించారు. నిరంజన్‌రెడ్డికి ఆర్థిక శాఖ కేటాయిస్తారని ప్రచారం జరిగినప్పటికీ సీఎం.. ఆశాఖను ఎవరికీ కేటాయించలేదు. ఆర్థిక, రెవెన్యూ, నీటిపారుదల, పురపాలక, విద్యుత్‌, పరిశ్రమలు, వాణిజ్య పన్నులశాఖ, ఐటీ, సమాచార, పౌరసంబంధాలశాఖలు సీఎం వద్దే ఉన్నాయి. తెలంగాణ కేబినెట్‌లో 16మందికి చోటు కల్పించే అవకాశం ఉన్నప్పటికీ తొలి విడతలో 10 మందికి  అవకాశం దక్కింది. లోక్‌సభ ఎన్నికల తర్వాత రెండో విడత మంత్రివర్గ విస్తరణ జరిగే అవకాశమున్నట్లు సమాచారం. 
మంత్రులకు కేటాయించిన శాఖల వివరాలు...
ఈటల రాజేందర్‌: వైద్య ఆరోగ్యశాఖ
తలసాని శ్రీనివాస్‌యాదవ్‌: పశుసంవర్థకశాఖ
ఎర్రబెల్లి దయాకర్‌రావు: పంచాయతీరాజ్‌శాఖ
నిరంజన్‌రెడ్డి: వ్యవసాయశాఖ
కొప్పుల ఈశ్వర్‌: సంక్షేమశాఖ
చామకూర మల్లారెడ్డి: కార్మిక శాఖ
జగదీశ్‌రెడ్డి: విద్యాశాఖ
శ్రీనివాస్‌గౌడ్‌: ఎక్సైజ్‌శాఖ, పర్యాటకశాఖ
ప్రశాంత్‌రెడ్డి: రవాణా, రహదారులు, భవనాలశాఖ
ఇంద్రకరణ్‌రెడ్డి: న్యాయ, అటవీ, దేవాదాయశాఖ

12, ఫిబ్రవరి 2019, మంగళవారం

మోదీ ఉండగానే మంత్రి అసభ్య ప్రవర్తన


                  అగర్తల: ఆయనో మంత్రి.. బాధ్యతాయుతమైన హోదాలో ఉండి తోటి మహిళా మంత్రితో అసభ్యంగా ప్రవర్తించాడు. అది కూడా ప్రధానమంత్రి నరేంద్రమోదీ పాల్గొన్న ఓ కార్యక్రమంలో. ఎదురుగా ప్రధాని మోదీ శంకుస్థాపనలో బిజీగా ఉంటే.. ఈయనేమో పక్కన నిల్చున మహిళా మంత్రిపై వేధింపులకు పాల్పడుతూ కెమెరాకు చిక్కారు. త్రిపురలో జరిగిన ఈ ఘటన రాజకీయ వివాదానికి దారితీసింది. వివరాల్లోకి వెళితే..
ప్రధాని మోదీ గత శనివారం త్రిపుర రాజధాని అగర్తలలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో త్రిపుర ముఖ్యమంత్రి విప్లవ్‌ దేవ్‌తో పాటు పలువురు రాష్ట్ర మంత్రులు, భాజపా నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మోదీ ఓ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేస్తుండగా.. అక్కడే ఉన్న రాష్ట్ర క్రీడల శాఖ మంత్రి మనోజ్‌ కాంతి దేవ్‌ తన పక్కనే నిల్చున్న తోటి మహిళా మంత్రిని అసభ్యంగా తాకాడు.
                  దీనికి సంబంధించిన ఓ వీడియో సోషల్‌మీడియాలో వైరల్‌గా రావడంతో విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో ఇది కాస్తా వివాదాస్పదంగా మారింది. మనోజ్‌ కాంతి దేవ్‌ను వెంటనే తొలగించాలంటూ ప్రతిపక్ష నేతలు డిమాండ్‌ చేస్తున్నారు. అయితే దీనిపై మనోజ్‌ను ప్రశ్నించగా.. ఘటనపై స్పందించేందుకు ఆయన నిరాకరించారు.
కాగా.. భాజపా మాత్రం ఘటనను తోసిపుచ్చింది. ప్రభుత్వానికి మచ్చ తెచ్చేందుకు ప్రతిపక్ష నేతలు ఇలా భాజపా మంత్రులపై వ్యక్తిగత ఆరోపణలు చేస్తున్నారని ఆ పార్టీ ప్రతినిధి అన్నారు. ఆ వీడియో అంతా బూటకమని కొట్టిపారేశారు. ఇదిలా ఉండగా ఘటనపై సదరు మహిళా మంత్రి నుంచి కూడా ఎటువంటి ఫిర్యాదు రాలేదు.

ఆ ఊరిలో రెండు గంటల ముందే సూర్యాస్తమయం!



                 సాధారణంగా ఎక్కడైనా సాయంత్రం ఆరు గంటల తర్వాత సూర్యాస్తమయమే అవుతుంది. కానీ ఆ ఊరిలో మాత్రం రెండు గంటల ముందే చీకటి పడుతుంది. ఒక గంట ఆలస్యంగా తెల్లవారుతుంది. అంటే సాయంత్రం నాలుగు గంటలకే చీకటి పడుతుంది. ఈ ప్రత్యేక విశేషాల గురించి తెలుసుకోవాలనుకుంటే తెలంగాణ రాష్ట్రం  పెద్దపల్లి జిల్లా వెళ్లాల్సిందే.          పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్‌ మండలం కుదురుపాక మండలం. అన్ని ప్రాంతాల్లో సాయంత్రం ఆరు గంటల తర్వాత సూర్యుడు ఆస్తమిస్తే ఈ వూరిలో మాత్రం నాలుగు గంటలకే చీకటి పడుతుంది. ఇందుకు ప్రధాన కారణం గ్రామానికి తూర్పు, పడమర దిక్కుల్లో ఉన్న ఎత్తైన కొండలే. వర్షాకాలం వచ్చిందంటే ఇంకా ముందుగానే సూర్యాస్తమయం ఉంటుంది.              తూర్పు దిక్కున కొండలు ఉండడం వల్ల సూర్యోదయం కూడా గంట ఆలస్యమవుతుంది. ఉదయం, రాత్రి వేళ్లల్లో తేడా ఉండడంతో ఈ పల్లెకు మూడు జాముల కుదురుపాకగా పేరు ఉంది.సాయంత్రం కాగానే సూర్యుడు రంగనాయకుల గుట్ట వెనుక దాక్కుంటాడని  గ్రామస్థులు చెబుతున్నారు. పనులకు వెళ్లినవారు త్వరగానే పల్లెకు చేరుకుంటారు. ఊరికి నాలుగు వైపుల గుట్టలు కొంత ప్రయోజనం ఉన్నా..  వేసవికాలంలో మాత్రం కాస్త ఇబ్బందిగా ఉంటుందని పల్లెవాసులు పేర్కొంటున్నారు

8, ఫిబ్రవరి 2019, శుక్రవారం

యాత్ర రివ్యూ



              మాజీ ముఖ్యమంత్రి వైయ‌స్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి పాద యాత్ర చేశార‌నే విష‌యం మ‌నంద‌రికీ తెలుసు. ఆ పాద‌యాత్ర ఆయ‌న రాజ‌కీయ జీవిత‌ంలో ఎంతో కీల‌క‌మైంది. అస‌లు యాత్ర చేయాల‌ని ఎందుకు అనుకున్న‌ట్టు? పాదయాత్రకు దారితీసిన పరిస్థితులేంటి? ఆయ‌న ఆలోచ‌నా విధానం ఏంటి? ఆయ‌న కుటుంబం ఆ స‌మ‌యంలో ఆయ‌న‌కు ఎలాంటి స‌ల‌హాలు ఇచ్చింది? వెంట ఉన్న‌వారు ఏమ‌న్నారు? వంటి అంశాల‌తో మ‌హి.వి.రాఘ‌వ్ తెర‌కెక్కించిన చిత్రం `యాత్ర‌`. ఈ చిత్రం వై.య‌స్‌. జీవితానికి అద్దం ప‌ట్టిందా? సినిమాటిక్ లిబ‌ర్టీస్ తీసుకున్నారా? ఆల‌స్య‌మెందుకు? చ‌దివేయండి.
సినిమా: యాత్ర‌
నిర్మాణ సంస్థ‌: 70 ఎం ఎం ఎంటర్టైన్మెంట్స్
తారాగ‌ణం: మమ్ముట్టి, రావు ర‌మేష్, జగపతిబాబు, సుహాసిని, అనసూయ, పోసాని, సచిన్ కడ్కర్, వినోద్ కుమార్, జీవా, 30 ఇయర్స్ పృథ్వి త‌దితరులు
కెమెరా: సత్యన్ సూర్యన్
మ్యూజిక్: కె ( క్రిష్ణ కుమార్ )
ఎడిటర్: శ్రీకర్ ప్రసాద్
సాహిత్యం: సిరివెన్నెల సీతారామ శాస్త్రి
ప్రొడక్షన్ డిజైన్: రామకృష్ణ, మోనిక సబ్బాని
సౌండ్ డిజైన్: సింక్ సౌండ్
వి ఎఫ్ ఎక్స్: Knack Studios
సమర్పణ: శివ మేక
నిర్మాతలు: విజయ్ చిల్లా, శశి దేవిరెడ్డి
స్టోరీ, స్క్రీన్‌ప్లే, డైరెక్షన్ : మహి వి రాఘవ్
క‌థ‌:
                   వై.ఎస్‌.రాజ‌శేఖ‌ర్ రెడ్డి (మ‌మ్ముట్టి) ఎన్నిక‌ల ప్ర‌ణాళిక‌లో భాగంగా త‌న నియోజ‌కవ‌ర్గంలో.. త‌న జిల్లాలోని నేత‌ల‌తో సంప్ర‌దింపులు జ‌రుపుతుంటారు. అత‌నికి కె.వి.పి.రామ‌చంద్ర‌రావు (రావుర‌మేష్‌) సహాయకుడు. కె.వి.పి ని కెప్‌స్ట‌న్ అని వై.ఎస్ పిలుస్తుంటాడు. పార్టీ హై క‌మాండ్ ఓ నియోజ‌క వ‌ర్గంలో సుబ్బారెడ్డి అనే వ్య‌క్తిని ఎమ్మెల్యేగా నిల‌బెడుతుంది. కానీ వై.ఎస్ ఆ సీటును సుచ‌రిత‌కు కేటాయిస్తాడు. దాంతో హై క‌మాండ్‌ నుంచి వ‌చ్చిన తివారీ.. వై.ఎస్‌ను హై క‌మాండ్‌కు వ్య‌తిరేకంగా వెళ్ల‌వ‌ద్ద‌ని అంటాడు. కానీ తాను మాట ఇస్తే ముందుకెళ‌తాన‌ని వెన‌క్కి త‌గ్గ‌న‌ని అంటాడు వై.ఎస్‌. ఇలాంటి త‌రుణంలో అధికార పార్టీ మ‌న‌దేశం ముంద‌స్తు ఎన్నిక‌ల‌కు వెళుతుంది. ప్ర‌చారం చేసుకోవ‌డానికి త‌గిన స‌మయం ఉండ‌దు. ఆర్ధిక‌బ‌లం కూడా ఉండ‌దు. ఇలాంటి స‌మ‌యంలో వై.ఎస్ ఏం చేయాల‌ని ఆలోచిస్తుంటాడు? ఆ స‌మ‌యంలో ఆయ‌న‌కు పాద‌యాత్ర చేయాల‌ని, ప్ర‌జ‌ల స‌మ‌స్య‌ల‌ను తెలుసుకోవాల‌నే ఆలోచ‌న వ‌స్తుంది. హై క‌మాండ్‌కు ఓ మాట చెబుతాడు. కానీ వారి ప‌ర్మిష‌న్ లేకుండానే పాద‌యాత్ర స్టార్ట్ చేస్తాడు. ముందుగా ఆయ‌న పాద‌యాత్ర‌కు ప్ర‌జ‌ల నుండి పెద్ద‌గా స్పంద‌న ఉండ‌దు. క్ర‌మంగా పెరుగుతూ వ‌స్తుంది. ప్ర‌జ‌ల స్పంద‌నతో ఆయ‌న ముఖ్య‌మంత్రిగా ఎదిగిన వైనం, ఆయ‌న ప్ర‌వేశ పెట్టిన ప‌థ‌కాలు.. అందుకు దారి తీసిన ప‌రిస్థితులే యాత్ర సినిమా...
విశ్లేష‌ణ‌:
             వై.ఎస్‌.రాజ‌శేఖ‌ర్ రెడ్డి ప్ర‌తిప‌క్ష నాయ‌కుడిగా ఉండి.. అధికారప‌క్ష నాయ‌కుడిగా ఎదిగిన క్ర‌మాన్ని యాత్ర సినిమాలో చూపించారు. కొత్త‌గా చెప్పిన క‌థేం కాదు.. వై.ఎస్‌.ఆర్ రాజ‌కీయ జీవితంలో పాద‌యాత్ర‌కు ఉన్న ప్రాముఖ్య‌త‌ను.. అందుకు దారి తీసిన ప‌రిస్థితుల‌ను ప్ర‌ధానంగా చేసుకుని సినిమాను తెర‌కెక్కించారు. పాత్రల తీరు తెన్నుల విషయానికి వ‌స్తే మల‌యాళ స్టార్ హీరో మమ్ముట్టి న‌ట‌న గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. ద‌ర్శ‌కుడు చెప్పిన అంశాల‌ను సినిమాగా మలిచే క్ర‌మంలో త‌న‌దైన న‌ట‌న‌తో ఆ పాత్ర‌లో ఒదిగిపోయారు. త‌న‌దైన న‌ట‌న‌ను ప్ర‌ద‌ర్శించ‌డమే కాదు.. తెలుగులో కూడా త‌నే డబ్బింగ్ చెప్పుకోవ‌డం విశేషం. గ్రేస్ ఫుల్‌గా క‌న‌ప‌డ్డాడు మ‌మ్ముట్టి. సినిమా అంతా ఈయ‌న పాత్ర చుట్టూనే ఎక్కువ‌గా తిరుగుతుంది. సినిమాలో ముఖ్య పాత్ర‌ధారులైన కె.వి.పి పాత్ర‌లో న‌టించిన రావు ర‌మేష్ పాత్ర‌కు పెద్ద‌గా ప్రాధాన్య‌త లేదు. అయితే వై.ఎస్ పాత్ర కె.వి.పికి ఇచ్చిన ప్రాముఖ్య‌త‌ను సినిమాలో చూపించారు. నిజానికి వై.ఎస్‌.ఆర్‌కు పాద‌యాత్ర చేయ‌మ‌ని స‌ల‌హా ఇచ్చిన వ్య‌క్తిగా కె.వి.పి పేరుంది. అయితే దాన్ని సినిమాలో ఎక్క‌డా ప్ర‌స్తావించ‌లేదు. వై.ఎస్‌. పాద‌యాత్ర స‌మ‌యంలో కె.వి.పి ఆయ‌న వెన్నంటే ఉన్నా ఆ పాత్ర‌ను అంత పెద్ద‌గా ఎలివేట్ చేయ‌లేదు. వై.ఎస్ అనుచరుడిగా న‌టించిన ర‌మేష్ కంటే రావు ర‌మేష్ పాత్ర ఎఫెక్టివ్ కాస్త త‌క్కువ‌గానే క‌న‌ప‌డింది. ఇక వై.ఎస్‌.రాజారెడ్డి పాత్ర‌లో న‌టించిన జ‌గ‌ప‌తిబాబు, స‌బితా ఇంద్రారెడ్డి పాత్ర‌లో న‌టించిన సుహాసిని, సుచ‌రిత పాత్ర‌లో న‌టించిన అన‌సూయ‌, వెంక‌ట్రావుగా పోసాని కృష్ణ‌ముర‌ళి, కేశ‌వ‌రెడ్డిగా వినోద్ కుమార్‌, హ‌నుమంతరావు పాత్ర‌లో తోట‌ప‌ల్లి మ‌ధు త‌దిత‌రులు వారి పాత్ర‌ల్లో చ‌క్కగా న‌టించారు.
              సాంకేతికంగా నైపుణ్యం కలిగిన చిత్ర ద‌ర్శ‌కుడు మ‌హి వి.రాఘ‌వ్ యాత్రను ఎక్కువ‌గా సినిమాటిక్ కోణంలో చూపించే ప్ర‌య‌త్నం చేశాడు. ఉదాహ‌ర‌ణ‌కు హై క‌మాండ్‌కు వై.ఎస్ విధేయుడిగా ఉండేవారు. కానీ ఈ సినిమాలో పార్టీ హైక‌మాండ్‌ను వ్య‌తిరేకించిన‌ట్లు చూపించారు. ముఖ్యంగా వై.ఎస్ ముఖ్య‌మంత్రి అయ్యే క్ర‌మంలో హైక‌మాండ్ పంపిన గులాంన‌బీ అజాద్ అనే వ్య‌క్తిని ఇక్క‌డ నెగ‌టివ్‌గా చూపించారు. అలాగే వై.ఎస్ పాత్ర‌ను హైలైట్ చేయ‌డానికి మిగ‌తా పాత్ర‌ల ప్రాముఖ్య‌త‌ను ప‌క్క‌న పెట్టేశారు. సూరీడు పాత్ర‌ను పెద్ద‌గా ఫోక‌స్ చేయ‌నేలేదు. అలాగే వై.ఎస్‌.విజ‌య‌మ్మ పాత్ర‌ధారి చేసిన ఆవిడ‌.. అలాగే ఇత‌ర పాత్ర‌ల ప‌రిధి అనేది ప‌రిమితంగానే క‌న‌ప‌డింది. కె సంగీతం బావుంది. బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్‌తో కొన్ని సీన్స్ చ‌క్క‌గా ఎలివేట్ చేశాడు. స‌త్య‌న్ సూర్య‌న్ కెమెరా వ‌ర్క్ బావుంది. చివ‌ర్లో రాజ‌శేఖ‌ర్ రెడ్డికి సంబంధించిన కొన్ని స‌న్నివేశాల‌ను, ఆయ‌న మ‌ర‌ణం స‌మ‌యంలో జరిగిన కొన్ని ప‌రిస్థితుల‌ను యథాతథంగా చూపించారు. ఈ క్ర‌మంలో వై.ఎస్‌.జ‌గ‌న్ పాద‌యాత్ర‌లో చేసిన స్పీచ్‌ను కొన్ని సెకండ్ల పాటు తీసుకున్నారు. అయితే సినిమా పూర్తిస్థాయి రాజ‌కీయ కోణంలో సాగింది. ఫ‌స్టాఫ్ మ‌రీ స్లో ఫేజ్‌లో సాగింది. ఇలాంటి పొలిటికల్ బ‌యోపిక్స్ యూత్‌ను ఏ మేర ఆక‌ట్టుకుంటాయనేది సందేహమే.