ఆకలితో అలమటించే వారి సంఖ్య రోజురోజుకు పెరిగిపోతుంది. ఆకలి నివారించాల్సిన పాలకులకు చిత్తశుద్ది లేదు. పేదల ఆకలి ఎప్పుడు తీరుతుందో...?
20, అక్టోబర్ 2020, మంగళవారం
బీహార్‌లో గెలిచేదెవరో చెప్పేసిన సర్వే
బీహార్ అసెంబ్లీ ఎన్నికలు మొత్తం 3 విడతల్లో జరగనున్నాయి. ఈ నెల 28న తొలి విడత, నవంబర్ 3న రెండో విడత, నవంబర్ ఏడున మూడో విడత ఎన్నికలు జరగనున్నాయి. నవంబర్ పదిన ఫలితాలు ప్రకటిస్తారు.
11, అక్టోబర్ 2020, ఆదివారం

ఆకాశంలో అద్భుత దృశ్యం ఆవిష్కృతం కానుంది. సూర్యుడి చుట్టూ తిరుగుతున్న అంగారక గ్రహం(మార్స్) మంగళవారం నాడు భూమితో కలిసి ఒకే సరళ రేఖపైకి రానుంది. ఆ సమయంలో అది మునుపటి కన్నా పెద్దగా, ప్రకాశవంతంగా కనిపిస్తుంది. ప్రతి 26 నెలలకు అంటే దాదాపు రెండు సంవత్సరాలకు ఒకసారి ఈ అమరిక కుదురుతుందని ఖగోళ శాస్త్రజ్ఞులు చెబుతున్నారు. సూర్యుడి చుట్టూ తిరుగుతున్న భూమి, అంగారకుడు తిరిగి వాటి వేర్వేరు కక్ష్యల్లోకి సాధారణ స్థితికి వెళ్లడానికి ముందు దగ్గరగా తిరుగుతాయి. కాబట్టి అంగారక గ్రహం భూమిపై ఉన్న మనకు అతి పెద్దగా, కాంతిమంతంగా గోచరిస్తుంది. ఖగోళ శాస్త్రజ్ఞులు అపోజిషన్(వ్యతిరేకత) అని పిలిచే ఈ ఖగోళ అద్భుతాన్ని మంగళవారం రాత్రి చూడొచ్చు. రాత్రి 11.20 గంటల సమయంలో సూర్యుడు, భూమి, అంగారకుడు ఈ మూడు ఒకే సరళ రేఖపైకి రానున్నాయి. అ అపురూప దృశ్యాన్ని తిలకించడం కోసం అర్ధరాత్రి వరకూ వేచివుండక్కర్లేదని, సాయంత్రం 9 లేదా 10 గంటల సమయంలో ఆగేయ ప్రాంతంలో సులువుగా చూడొచ్చని ఆస్ట్రో ఫొటోగ్రాఫర్ డామియన్ పిచ్ చెప్పారు.
9, అక్టోబర్ 2020, శుక్రవారం
ఐక్య రాజ్య సమితి ఆకలిపోరాటానికి శాంతి పురస్కారం
క్యూబా డాక్టర్లను నోబెల్ శాంతి పురస్కారంతో సత్కరించాలన్న ప్రపంచ ప్రజల ఆకాంక్షలను పక్కనపెట్టి నార్వే నోబెల్ అకాడెమీ ఈ ఏడాది శాంతి బహుమతిని ప్రపంచ ఆహార కార్యక్రమం (డబ్ల్యుఎఫ్‌పి)కి ప్రకటించింది. ఐక్యరాజ్య సమితి విభాగమైన డబ్ల్యుఎఫ్‌పి ప్రపంచంలోనే అతిపెద్ద మానవతా సంస్థఅని, ఆకలిదప్పులను నిర్మూలించి, ఆహారభద్రతకు పాటుపడుతోందని నోబెల్ కమిటీ చైర్మన్ బెరిట్ రెస్ ఆండర్సన్ ఈ సందర్భంగా అన్నారు. ఈ దిశలో ఆ సంస్థ జరిపిన బహుముఖ కృషికి గుర్తింపుగా ఈ అవార్డును ఆ సంస్థకు ఇస్తున్నట్లు తెలిపారు. ఆహార భద్రతపై పాలకులకు మరిన్ని సందేశాలు ఐక్యరాజ్య సమితి ఆహార కార్యక్రమం (డబ్ల్యుఎఫ్‌పి) ద్వారా భవిష్యత్తులో ఇవ్వాలని ఆశిద్దాం.
బీహార్ ఎన్నికలపై పాశ్వాన్ మృతి ప్రభావం ఎంత?

మరికొద్ది రోజుల్లో బీహార్‌లో ఎన్నికలు జరగుతుండగా ఆ రాష్ట్రంలో ప్రముఖ నాయకుడైన రామ్ విలాస్ పాశ్వాన్ గురువారం మృతి చెందారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఆయన మృతి ప్రభావం ఎన్నికలపై ఎలా ఉంటుందనే చర్చ సాగుతోంది. ఇప్పటికే లోక్ జనశక్తి పార్టీ (ఎల్‌జెపి) బాధ్యతలు స్వీకరించిన ఆయన కొడుకు చిరాగ్ పాశ్వాన్ నితిష్‌కుమార్‌ను ఓడించాలనే లక్ష్యంతో ఎన్డీయే కూటమి నుంచి బయటకు వచ్చాడు. కానీ బిజెపికి మాత్రం సహకరిస్తున్నాడు. బిజెపి పోటీచేసే సీట్లలో పోటీ పెట్టకుండా కేవలం జెడియు పోటీ చేసే స్థానాలపైనే గురి పెట్టాడు. రామ్ విలాస్ పాశ్వాన్.. మృతికి ముందు కొద్ది నెలల నుంచి అనారోగ్యం కారణంగా క్రియాశీలక రాజకీయాలకు దూరంగా ఉన్నాడు. ఎన్డీయే నుంచి బయటకొచ్చి పోటీ చేయాలన్న చిరాగ్ నిర్ణయంపై బిజెపి నేత సుశీల్ మోడీ మాట్లాడుతూ రామ్ విలాస్ పాశ్వాన్ క్రియాశీలకంగా ఉన్నట్లయితే ఈ పరిస్థితి ఉత్పన్నమయ్యేది కాదని అన్నాడు. ముఖ్యమంత్రి నితీష్‌కుమార్ కూడా మాట్లాడుతూ సీనియర్ పాశ్వాన్‌తో తన అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ఆయనతో ఉన్న మంచి సంబంధాల కారణంగానే పాశ్వాన్‌కు రాజ్యసభ సీటు ఇచ్చినట్లు చెప్పుకొచ్చారు.
ఎన్నికల సమయంలో ప్రజల అంతరంగాన్ని అంచనా వేయడంలో రామ్‌విలాస్ పాశ్వాన్ దిట్ట. అందుకనే ఆయన్ను రాజకీయ పండితుడు అని కూడా అంటారు. 1999లో పాశ్వాన్ తన బిజెపి వ్యతిరేక వైఖరిని విడిచి పెట్టి బిజెపి నేతృత్వంలోని ఎన్డీయే కూటమిలో నితీష్‌కుమార్‌తో కలిసి పోటీ చేశాడు. ఆ ఎన్నికల్లో 54 పార్లమెంట్ సీట్లలో ఆర్‌జెడి ఏడు సీట్లకు మాత్రమే పరిమితమైంది. లాలూప్రసాద్ తన స్వంత నియోజకవర్గమైన మాధేపూర్‌ను కూడా కోల్పయాడు. తర్వాత 2004 ఎన్నికల్లో బిజెపిని వదిలేసి కాంగ్రెస్ నేతృత్వంలోని యుపిఏతో కలిశాడు. ఈ ఎన్నికల్లో లాలూ ప్రసాద్, పాశ్వాన్, కాంగ్రెస్ కూటమి నితీష్‌కుమార్ నేతృత్వంలోని కూటమిని చిత్తుగా ఓడించింది. ఒక్క 2009లో మాత్రం రామ్ విలాస్ పాశ్వాన్ తన హాజీపూర్ స్థానాన్ని కోల్పయాడు. 2014 వరకు కొంచెం ఇబ్బంది పడ్డాడు. మళ్లీ ఆ తర్వాత 2014లో మోడీని ఎవ్వరూ నిలువరించలేరని భావించిన పాశ్వాన్ తిరిగి బిజెపితో చేతులు కలిపాడు. ఇదే సమయంలో బిజెపిని వీడిన నితీష్‌కుమార్ మూడేళ్ల కాలంలోనే ఆర్జేడి,కాంగ్రెస్‌కు మోసం చేసి తిరిగి ఎన్డీయేలో చేరాడు.
రామ్‌విలాస్ పాశ్వాన్ చనిపోగానే బీహార్‌లోని కొందరు రాజకీయ విశ్లేషకులు చిరాగ్ పాశ్వాన్ రాజకీయ వ్యూహంలో మార్పులు జరిగే అవకాశముందని అంచనా వేశారు. అయితే ఇప్పటికే చిరాగ్ పెద్ద రాజకీయ ఎత్తుగడే వేశాడు. ఈ ఎత్తుగడ అతన్ని చావో రేవో అని తేల్చుకునే పరిస్థితిలోకి నెట్టింది. బీహార్‌లో 223 అసెంబ్లీ సీట్లకు గాను అక్టోబర్ 28, నవంబర్ 3, నవరబర్ ఏడు తేదీల్లో ఎన్నికలు జరుగబోతున్నాయి. నవరబర్ పదో తేదీన ఫలితాలు ప్రకటిస్తారు. ఎన్నికల్లో తనవైఖరిపై చిరాగ్ బిజెపి జాతీయ అధ్యక్షుడు జెపి నడ్డాకు లేఖ రాశాడు. నితీష్‌కుమార్‌ను ఓడించాలనేదే తన లక్ష్యమని, బిజెపి స్థానాల్లో పోటిపడబోమని, బిజెపికి ఎటువంటి నష్టం కల్గించబోమని తెలిపాడు. తన తండ్రి అరోగ్యం గురించి విలేకర్లు నితీష్‌కుమార్‌ను ప్రశ్నించినప్పుడు ఏమీ తెలియదన్నట్లు వ్యవహరించారని ఆరోపించారు. కానీ జెడియు నేతలు మాత్రం ఈ విషయంలో చిరాగ్‌ను సంప్రదించేందుకు నితీష్‌కుమార్ ప్రయత్నించాడని, కానీ అతను స్పందించలేదని చెబుతున్నారు.
మరి పాశ్వాన్ మృతి చిరాగ్ ఎన్నికల వ్యూహంపై ఎటువంటి ప్రభావాన్ని చూపనుంది? మొదట చిరాగ్ బిజెపి పోటీచేసే అన్ని స్థానాలు మినహా మిగిలిన 122 స్థానాల్లో పోటీ చేస్తామని చెప్పాడు. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో రెండు, మూడు దశల్లో ఎన్నికలు జరిగే స్థానాల్లో చిరాగ్ పెద్దగా అభ్యర్దులను నిలబెట్టకపోవచ్చుని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. మొదటి విడతకు సంబంధించి ఇప్పటికే 42 మంది అభ్యర్ధులు నామినేషన్ వేసేవారు. వారిలో ఆరుగురు బిజెపి నుండి వచ్చిన అసంతృప్త నేతలు కూడా ఉన్నారు. వీరంతా కూడా బిజెపి పోటీ చేయని స్థానాల్లోనే నామినేషన్ వేశారు.
అయితే నితిష్‌కుమార్ చిరాగ్ పాశ్వాన్ గురించి అంతగా టెన్షన్ పడడం లేదని జెడియు నేతలు చెబుతున్నారు. కేవలం ఐదు శాతం మాత్రమే ఓట్లు ఉన్న పాశ్వాన్ దళితులు 2005 నుండి తనకెప్పుడూ వ్యతిరేకంగానే ఓటు వేశారని, ఎల్‌జెపి అభ్యర్ధులు పోటీ చేయడం వల్ల తనకు వచ్చే నష్టమేమీ లేదని నితీష్ భావిస్తున్నాడు. మరో వైపు పాశ్వాన్లు మినహా మిగిలిన దళిత కులాల ఓట్లన్నింటికీ ప్రాథినిధ్యం వహిస్తున్న మహా దళిత గ్రూపుకు నాయకుడైన జతిన్ రామ్ మాంజీ తనకు మద్దతు ఇస్తున్నందున, అది తనకు కలిసివచ్చే అవకాశమని నితీష్ భావిస్తున్నాడు. అందుకు మంజీ నేతృత్వంలోని పార్టీకి నితీష్ తనకు వచ్చిన కోటాలో నుండి ఏడు సీట్లును కేటాయించాడు.
ఈ నేపథ్యంలో చిరాగ్ పాశ్వాన్‌తో బిజెపి ఎలా వ్యవహరిస్తుందనేది కీలకం. ఒకవైపున నితీష్‌తో పొత్తు కొనసాగుతూనే చిరాగ్‌ను కూడా బిజెపి ట్రంప్ కార్డు లాగా వాడుకుంటుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. మరోవైపున చిరాగ్ కేంద్ర కేబినెట్‌లో తన తండ్రి స్దానాన్ని తాను పొందాలని కోరుకుంటున్నాడు. బీహార్‌లో బిజెపికి లాభం చేకూర్చే వైఖరి తీసుకోకుండా కేంద్ర కేబినెట్‌లోకి వెళ్లడం కష్టమని చిరాగ్‌కు కూడా తెలుసు.
28, సెప్టెంబర్ 2020, సోమవారం
శ్వేత సౌధం.. చౌమహల్లా ప్యాలెస్
చార్మినార్: చౌమహల్లా ప్యాలెస్ సందర్శన తిరిగి ప్రారంభం కానుంది. అక్టోబర్ 3వ తేదీ నుంచి సందర్శకుల
కు అందుబాటులోకి రానుంది. ఈ మేరకు చౌమహల్లా ప్యాలెస్ ట్రస్ట్ డైరెక్టర్ కిషన్‌రావు శనివారం ఓ ప్రకటన విడుదల చేశారు. ప్రభుత్వం జారీ చేసే కరోనా నిబంధనలన్నీ పాటిస్తూ అవసరమైన ముందు జాగ్రత్త చర్యలన్నీ తీసుకోవడానికి సిద్ధగా ఉన్నట్లు ఆయన పేర్కొన్నారు. కరోనా వైరస్ కారణంగా ప్రభుత్వ ఆదేశాల మేరకు గత ఆరు
నెలలుగా చౌమహాల్లా ప్యాలెస్ సందర్శనను ట్రస్ట్ నిలిపి వేసింది. వచ్చే నెల 3వ తేదీ నుంచి సందర్శకుల అందుబాటులోకి వస్తున్న సందర్భంగా సంబంధిత అధికారులు అవసరమైన ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు.
- నిజాం కాలంలో వినియోగించిన ఫర్నిచర్, మంచాలు, దుస్తులు, తల్వార్లు, ఫొటోలు తదితర విలువైన పురాతన వస్తువులన్నింటిని చౌమహల్లా ప్యాలెస్‌లోని నాలుగు ప్యాలెస్‌లలో భద్రపరిచారు. ప్రస్తుతం నిజాం ట్రస్ట్ పర్యవేక్షణలో చౌమహల్లా ప్యాలెస్ కొనసాగుతోంది.
- అసఫ్ జాహీల రాచరిక పాలనకు పాతనగరంలోని చౌమహల్లా ప్యాలెస్ నిలువుటద్దంగా నిలుస్తుంది.
- రెండో నిజాం కాలంలో చార్మినార్–లాడ్‌బజార్‌కు అతి సమీపంలో ఈ ప్యాలెస్ నిర్మాణం జరిగింది.
- చార్మినార్ కట్టడం నుంచి వాకబుల్ డిస్టెన్స్‌లో ఉన్న ఈ చౌమహల్లా ప్యాలెస్ యూరోపియన్ శైలిలో నిర్మించిన శ్వేతసౌధం.
- ఇది నాలుగు ప్యాలెస్‌ల సముదాయం.
- ఏకాంతం (ఖిల్వత్)గా నిర్మించిన ఈ ప్యాలెస్‌లో పలు నిర్మాణాలు జరిగాయి.
- 5వ నిజాం అప్జల్–ఉద్–దౌలా–బహదూర్ పాలనా (1857–69) కాలంలో ఖిల్వత్ ప్యాలెస్‌లో నాలుగు ప్యాలెస్‌ల నిర్మాణం జరిగింది.
- టెహ్రాన్‌లోని షా ప్యాలెస్‌ను పోలిన ఆర్కిటెక్చర్‌లో ఐదో నిజాం అఫ్తాబ్ మహల్, మఫ్తాబ్ మహల్, తహనియత్ మహల్, అప్జల్ మహల్‌ల నిర్మాణం జరిగింది.
- 1912లో ఏడో నిజాం ప్యాలెస్‌కు చేయించిన మరమ్మతులతో ప్యాలెస్ మరింత శోభాయమానంగా మారింది. ఇది నిజాం ప్రభువుల నివాస గృహంగా ఉండేది.
- దాదాపు 2.90 లక్షల గజాల విస్తీర్ణంలో విశాలమైన ప్రాంగణంలో నిర్మించబడింది. ఆనాటి కాలంలో విద్యుత్ లైట్లు లేని కారణంగా ప్యాలెస్‌లో వెలుగుల కోసం షాండిలియర్లను ఏర్పాటు చేశారు.
- వీటిలో పొగరాని కొవ్వొత్తులు, మైనపు ఒత్తులు ఏర్పాటు చేసేవారు. ప్రస్తుతం విద్యుత్ దీపాలు ఉండడంతో షాండిలియర్లు దేదీప్యమానంగా వెలుగుతూ చౌమహల్లా ప్యాలెస్‌కు మరింత శోభను తీసుకువస్తున్నాయి.
సందర్శన వేళలు, మార్గం
- ఎలా వెళ్లాలి: చార్మినార్ కట్టడం నుంచి లాడ్‌బజార్,ఖిల్వత్ చౌరస్తా ద్వారా ముందుకెళితే ఖిల్వత్ వస్తుంది.
- సందర్శించు వేళలు: ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటలు.
- సెలవు: శుక్రవారం.
- టికెట్ ధరలు: చిన్నారులకు రూ. 20, పెద్దలకు రూ.60, విదేశీయులకు రూ.200
- రవాణా సౌకర్యం: నగరంలోని అన్ని ప్రాంతాల నుంచి ఆర్టీసి బస్సు సౌకర్యం కలదు. ప్రస్తుతం కరోనా వైరస్ ప్రభావం కారణంగా ఆర్టీసి బస్సులు తక్కువగా అందుబాటులో ఉన్నాయి.
- పార్కింగ్: ప్యాలెస్ ఆవరణలో చార్జితో కూడిన పార్కింగ్ సౌకర్యం కలదు.
22, సెప్టెంబర్ 2020, మంగళవారం
మహిళల ఆధ్వర్యంలో లక్ష రిటైల్ షాపులు
వారిని వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దేందుకు ప్రణాళికలు
నేడు మంత్రుల కమిటీ భేటీ
అమరావతి: వైఎస్సార్ చేయూత, వైఎస్సార్ ఆసరా పథకాల ద్వారా ప్రభుత్వం అందజేసిన ఆర్థిక సహాయంతో మహిళల ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా రిటైల్ షాపుల కేటగిరీలోనే లక్ష వరకు కొత్త వ్యాపారాలు ప్రారంభించాలని సెర్ప్, మెప్మాలు ప్రణాళికలు సిద్ధం చేశాయి. ఇతర వ్యాపార మార్గాలపైనా చర్చించేందుకు ఏర్పాటైన మంత్రివర్గ ఉప సంఘం మంగళవారం తాడేపల్లిలోని పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ కార్యాలయంలో సమావేశం కానుంది.
► వైఎస్సార్ చేయూత ద్వారా ప్రభుత్వం ఇచ్చిన సాయంతో వ్యాపారాల్లో పెట్టుబడి పెట్టేందుకు ఆసక్తిపై మహిళల నుంచి అధికారులు అభిప్రాయాలు సేకరించారు. 19.61 లక్షల మంది తమ ఆసక్తిని తెలియజేయగా, అందులో 10,00,329 మంది ప్రత్యేకంగా తాము ఏ వ్యాపారం చేయాలనుకుంటున్న విషయాన్ని తెలియజేశారు.
► వారికి వ్యాపారావకాశాలు కల్పించేందుకు వివిధ శాఖల ద్వారా చేపడుతున్న చర్యలపై మంత్రివర్గ ఉప సంఘం మంగళవారం నాటి సమావేశంలో చర్చిస్తుంది.
► సోమవారం నాటికి రాష్ట్ర వ్యాప్తంగా 3,419 చోట్ల ఇప్పటికే మహిళల ఆధ్వర్యంలో దుకాణాలు ప్రారంభించే ప్రక్రియ పూర్తయిందని అధికారులు వెల్లడించారు.
21, సెప్టెంబర్ 2020, సోమవారం
మద్యమే దిక్కయింది
కష్టకాలంలో అక్కరకొచ్చిన బార్లు.. ఖజానాకు 180 కోట్ల ఆదాయం..
ఆర్థిక కష్టాలతో సతమతమవుతున్న రాష్ట్ర ప్రభుత్వానికి మద్యంపై వచ్చే ఆదాయమే దిక్కయింది. ఓవైపు నిషేధం అంటూనే, మరోవైపు మద్యం ద్వారా అధిక రాబడికి వైసీపీ ప్రభుత్వం పక్కా వ్యూహం అమలుచేస్తోంది. లాక్‌డౌన్ తర్వాత మద్యం షాపులు తెరిచినప్పుడు ఒకేసారి భారీగా ధరలు పెంచి ఖజానా నింపుకొంది. ఇప్పుడు మరోసారి బార్లకు అనుమతుల ద్వారా భారీ ఆదాయం రాబడుతోంది. వాటిని ఇప్పటికిప్పుడు తెరవాల్సిన అవసరమేంటని పలువురు ప్రశ్నిస్తున్నా పట్టించుకోకుండా బార్లకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే.
దీనిపై గత శుక్రవారం మూడు వేర్వేరు జీవోలు జారీ అయ్యాయి. వాటిద్వారా అక్షరాలా రూ.180కోట్లు ఖజానాలో పడబోతున్నాయి. అందులో రూ.140కోట్లు వెంటనే రానుండగా, మరో రూ.40 కోట్లు నెల వ్యవధిలో సమకూరనున్నాయి. తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయంటూ ఇటీవల పెట్రోలు, డీజిల్, సహజ వాయువుపై పన్నులు విధించిన ప్రభుత్వం అదే తరహాలో ఇప్పుడు బార్లపైనా కొవిడ్ ఫీజు వేసింది. దీంతో సర్కారుకు భారీగా ఆదాయం రానుంది.
30లోగా కట్టండి
లైసెన్స్, రిజిస్ర్టేషన్ ఫీజుల చెల్లింపులు, బార్లలో కరోనా నిబంధనలపై ఎక్సైజ్ కమిషనర్ ఆదివారం మార్గదర్శకాలు జారీ చేశారు. మూడు శ్లాబుల్లో ఎవరు, ఎంత ఫీజు చెల్లించాలో అందులో పేర్కొన్నారు. మొదటి కేటగిరీ బార్లు రూ. 7,07,194, రెండో కేటగిరీలో రూ.14,14,388, మూడో కేటగిరీలో ఉన్నవి రూ. 21,21,582 చెల్లించాలని వివరించారు. ఈ నెల 30లోపు ఈ రుసుములు కట్టాలని స్పష్టం చేశారు. అలాగే లైసెన్స్, రిజిస్ర్టేషన్ ఫీజుపై విధించిన 20శాతం కొవిడ్ ఫీజును నెల రోజుల్లో చెల్లించాలని తెలిపారు. మొదటి కేటగిరీ బార్లు రూ.2లక్షలు, రెండో కేటగిరీలో రూ.4లక్షలు, మూడో కేటగిరీలో రూ.6లక్షలు చొప్పున కొవిడ్ ఫీజు చెల్లించాలి. రాష్ట్రంలో మొత్తం 860 బార్లు ఉంటే అందులో 801 సాధారణమైనవి. మిగిలినవి స్టార్ హోటళ్లు, టూరిజం పరిధిలో ఉన్నాయి. ఈ 801లో మొదటి కేటగిరీ కింద 61, రెండో కేటగిరీలో 395, మూడో కేటగిరీలో 345 ఉన్నాయి. వీటినుంచి లైసెన్సు, రిజిస్ర్టేషన్ ఫీజుల కింద రూ.133కోట్లు, కొవిడ్ ఫీజు రూపంలో మరో రూ.40 కోట్లు రానున్నాయి. స్టార్ హోటళ్లు, టూరిజం పరిధిలోని బార్ల ద్వారా దాదాపు రూ.10కోట్లు వస్తాయి. మొత్తం దాదాపు రూ.180 కోట్లకు పైగా ఆదాయం రాష్ట్ర ప్రభుత్వానికి రానుంది. దీనికితోడు బార్లకు 20 శాతం కొవిడ్ ఫీజుతో పాటు మద్యం సీసాలపై మరో 10శాతం అదనపు రిటైల్ ఎక్సైజ్ డ్యూటీ విధించారు. అంటే షాపుల్లో వచ్చే ధరలపై మరో 10శాతం ధర చెల్లించి బార్ల లైసెన్సీలు మద్యాన్ని కొనుగోలు చేసుకోవాలి. దీనివల్ల షాపులతో పోలిస్తే అమ్మకాలపై 10శాతం అదనపు ఆదాయం ప్రభుత్వానికి వస్తుంది. బార్లలో కొవిడ్ నిబంధనలు పాటించాలని, టేబుళ్ల మధ్య భౌతిక దూరం ఉండాలని, గ్లాసులు వేడినీటితో శుభ్రం చేయాలని, రోజుకు రెండుసార్లు బార్లను శానిటైజ్ చేయాలని సూచించారు. కట్టడి ప్రాంతాల్లో బార్లకు కలెక్టర్ నుంచి విడిగా అనుమతి పొందాలని స్పష్టం చేశారు. కాగా, కరోనా వ్యాప్తి తీవ్రంగా ఉన్న సమయంలో బార్లు తెరవడంపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. ప్రభుత్వానికి ఆదాయం తప్ప మరో ఆలోచన లేదని, అందుకే ఇలాంటి సమయంలోనూ బార్లు తెరిచేందుకు అనుమతిచ్చిందనే వాదన వినిపిస్తోంది.
18, సెప్టెంబర్ 2020, శుక్రవారం
ఆ బెంజి కారు నా కుమారుడిది కాదు: మంత్రి జయరాం
కర్నూలు: ఆ బెంజి కారు తన కుమారుడిది కాదని ఆంధ్రప్రదేశ్ కార్మికశాఖ మంత్రి గుమ్మనూరు జయరాం తెలిపారు. టీడీపీ సీనియర్ నేత అయ్యన్నపాత్రుడు చేసిన వ్యాఖ్యలపై స్పందించిన మంత్రి మీడియాతో మాట్లాడుతూ వేరే వాళ్ల కా
రు పక్కన తన కుమారుడు ఫొటో దిగాడని చెప్పారు. హెలికాఫ్టర్ దగ్గర, ట్రైన్ దగ్గర ఫొటో తీసుకుంటే మనది అవుతుందా? అని ప్రశ్నించారు.
ఆ కారు తమదేనని రుజువు చేస్తే మంత్రి పదవికి రాజీనామా చేస్తానని జయరాం సవాల్ చేశారు. అయ్యన్నపాత్రుడు మతి భ్రమించి మాట్లాడుతున్నారని అన్నారు. ప్రతిపక్ష నేత చంద్రబాబు మాయల పకీర్‌లాంటి వారని మంత్రి జయరాం విమర్శించారు.
అయ్యన్నపాత్రుడు చేసిన వ్యాఖ్యలు
’‘మంత్రి జయరాం కుమారుడు ఈశ్వర్‌కు, ఇప్పటికే ఈఎస్ఐ స్కాములో అరెస్ట్ అయిన ఏ-14 కార్తీక్ గిఫ్ట్ ఇచ్చారు. ఖరీదైన బెంజ్ కారును మంత్రి కుమారుడికి పుట్టినరోజున సందర్భంగా ఇచ్చారు. కారుకు ఫైనాన్స్ చేయించి మరీ కార్తీక్ ఇచ్చారు. ఏ సంబంధంతో కారును కానుకగా ఇచ్చారో మంత్రి సమాధానం ఇవ్వాలి. ఏ 14 మంత్రి జయరాంకు బినామీ. అది పుట్టినరోజు కానుక కాదు...మంత్రికి ఇచ్చిన లంచం’’అని వ్యాఖ్యానించారు.
వింత వ్యాధితో ఐదుగురు గిరిజనుల మృతి
తక్షణం స్పందించిన ప్రభుత్వం..
విశా
ఖ కేజీహెచ్‌కు 18 మంది తరలింపు
అనంతగిరి (అరకులోయ): విశాఖ ఏజెన్సీ అనంతగిరి మండలంలోని రొంపల్లి పంచాయతీ కరకవలస, చినరాబ గ్రామాల్లో మూడు వారాలు వ్యవధిలోని వింత వ్యాధితో ఐదుగురు గిరిజనులు మృత్యువాతపడ్డారు. దీనిపై అరకు ఎమ్మెల్యే చెట్టి పాల్గుణ స్పందించి అధికారులతో మాట్లాడారు. ఐటీడీఏ పీవో ఆదేశాల మేరకు బుధవారం ఏడీఎంహెచ్‌వో లీలాప్రసాద్ గ్రామాలకు చేరుకుని పరిస్థితిని పరిశీలించి, వింత వ్యాధి (కాళ్లు, చేతుల వాపులు)కి గల కారణాలపై ఆరా తీశారు. గురువారం ఉదయం వైద్య సిబ్బంది గ్రామాలకు చేరుకుని మూడు అంబులెన్స్‌లో కరకవలస, సొట్టడివలస, చినరాభ గ్రామాలకు చెందిన 18 మంది గిరిజనులను గజపతినగరం తరలించారు. వీరందరికి కోవిడ్ పరీక్షలు నిర్వహించగా నెగిటివ్ రిపోర్ట్ వచ్చింది. ఆరోగ్య పరిస్థితి మెరుగ్గా ఉన్నప్పటికీ ముందుస్తు చర్యల్లో భాగంగా వీరందరని విశాఖ కేజీహెచ్‌కు తరలించారు.
నిల్వ పశు మాంసమే కారణమా? నిల్వ పశు మాంసం తీసుకోవడంతో కరకవలస వాసులు అనారోగ్యం పాలవుతున్నట్లు ప్రాథమికంగా గుర్తించినట్లు అధికార వర్గాలు తెలిపాయి. అయితే ఏ కారణంతో మరణాలు సంభవిస్తున్నాయి? కాళ్లు, చేతుల వాపులు ఎందుకు వస్తున్నాయనే దానిపై పూర్తిస్థాయి వైద్య పరీక్షలు నిర్వహిస్తే కాని చెప్పలేమని వైద్యులు పేర్కొన్నారు.



