17, అక్టోబర్ 2011, సోమవారం

యాతమేసి తోడినా చేను తడవదు

30 ఏళ్లు వెనక్కి పోయిన సాగు
మిగిలింది కష్టాలు... కన్నీళ్లు
మహబూబ్‌నగర్‌ రైతుల వలసబాట
         ''యాతమేసి తోడినా... ఏరు ఎండదు. పొగిలి పొగిలి ఏడ్చినా పొంత నిండదు...'' అని ఓ కవి అన్నాడు. కానీ కరువు ప్రాంత రైతులను కదిపితే 'యాతమేసి తోడినా చేను తడవదు.. మోటరేసి తోడాలంటే కరెంటు వుండదు' అని కంటతడి పెడుతున్నారు. నేడు వ్యవసాయ రంగంలో ఆధునిక పద్ధతులెన్నో. కానీ పాలకులు అమలు చేస్తున్న విధానాల ఫలితంగా రైతన్నలు కష్టాల కడలిలోకి నెట్టబడుతున్నారు. యాతం (గూడ)తో నీళ్ళుతోడి సాగుచేసిన 30ఏళ్ళనాటి వ్యవసాయ పద్ధతులనే పాటించాల్సిన దుస్థితి దాపురించింది. మామూలుగానే మహబూబ్‌నగర్‌ జిల్లాలో వర్షాభావం అధికం. నెట్టెంపాడు, బీమా, కల్వకుర్తి ఎత్తిపోతల ప్రాజెక్టులు చిటికెలో పూర్తి చేస్తాం... ఇక అంతా పచ్చదనమే... పాడిపంటలకు కొదువలేదు అని చెప్పిన మహానుభావులెందరో... కానీ ఆచరణలో రైతులను పట్టించుకునే ప్రజాప్రతినిధి ఒక్కరంటే ఒక్కరూ లేక వరుస కష్టాలతో చితికిన రైతు పొగిలి పొగిలి ఏడుస్తున్నాడు. పంట పొలానికి నీరు పెట్టలేకపోతున్నానని కుమిలిపోతున్నాడు. కరువు పరిస్థితి పరిశీలన నిమిత్తం వెళ్ళిన 'ప్రజాశక్తి' ప్ర్రతినిధి ముందు కన్నీటి పర్యంతమయ్యాడు.
          అది మహబూబ్‌నగర్‌ జిల్లాలోని కొందుర్గు మండలం చేగిరెడ్డిగనపురం గ్రామం. వెయ్యి ఎకరాలకు పైగా సాగుభూమి వుంది. బావులు, బోర్ల కింద 200 ఎకరాల్లో వరి సాగు చేశారు. 50శాతం పైగా వరిపైర్లు ఎండిపోయాయి. వేరుశనగ, మొక్కజొన్న తదితర మెట్టపంటలు 90శాతం ఎండిపోయాయి. ఏ రైతును కదిలించినా వ్యవసాయం దండగ... గ్రామంలో పనుల్లేవు... ఎటయినా వలసలు పోతామని అంటున్నారు. చెగిరెడ్డి గనపురం గ్రామంలోని నాలుగు గిరిజనతండాల్లో చాలా ఇళ్లకు తాళాలు వేసి వున్నారు... అటుగా వెళుతున్న వారిని 'వీరంతా ఎటువెళ్ళారు?' అని అడిగితే... 'వలసలు పోయిన్రన్నా...' అని బదులు చెప్పారు. ఈ తండాల్లో 100కు పైగా గిరిజన కుటుంబాలుంటే ప్రస్తుతం 40 కుటుంబాలు కూడా లేవు. ఈ నేపథ్యంలో 'ప్రజాశక్తి' ప్రతినిధి బృందం ఇదే గ్రామాన్ని పూర్తిగా సందర్శించి రైతులను పరామర్శించింది. 'భూమికి నీరు పారించని బతుకెందుకు?' అని రైతు కావాలి చంద్రయ్య కన్నీరు మున్నీరయ్యాడు. ఎకరాకు 12 వేల రూపాయల దాకా ఖర్చుచేసి ఆరు ఎకరాల్లో వరి నాట్లేశాం. మూడురూపాయల వడ్డీకి సావుకారి వద్ద అప్పుతెచ్చినం. పాత అప్పులే తీరలేదు. మళ్లీ అప్పుఅయ్యింది. బాగా పంట చేతికొచ్చి... ఎకరాకు 30 బస్తాలు పండితే, రూ.15 వేలైనా చేతికొచ్చేవి. ఇంతకష్టపడితే ఐదుబస్తాలైనా వస్తుందో లేదో నమ్మకం లేదు. పైభాగాన కుంటలో నీళ్లుండయి... అందుకే బావిలో నీళ్లున్నరు...ఈ నీళ్లు ఎన్నిరోజులు వస్తయో తెల్వదు. కుంటెండితే బాయిలో నీళ్లు తగ్గి కిందికి పోతరు... ఐదుగురం అన్నదమ్ములం భాగాలు పంచుకున్నం. ఒకొక్కరికి ఎకరం పైగా భూమిలో వరిసాగు చేశాం. వేరే మార్గం లేక మానాయిన సెప్పిండని ఇట్ల గూడేసి నీళ్లుతోడుతుండం. ఇట్లా గూడతో నీళ్లు ఎత్తిపోసేది మాతండ్రి వయస్సులో ఉన్నప్పుడు ఉండేదంట. మాకు కొత్తేకాని ఏంజేయాలె. రెండ్రోజులు గూడేసి నీళ్లుతోడితే కాళ్లుచేతులు నొప్పులయినరు. నిన్న చిన్న వానవడింది. కొంతమేలు. లేకుంటే చేను గీమాత్రం కనిపించేదా..? మాకష్టాలు ఎన్నడు తీరుతయో. మాకు ఎనిమిది మంది ఆడబిడ్డలు... కొడుకు కోసం చూస్తే అందరూ ఆడొళ్లే పుట్టిండ్రు. ఇద్దరి పెండ్లి చేసినం... ఇంకా ఇద్దరు పెండ్లికున్నరు. నలుగురు సదువుతున్నరు. కాపుదానం అప్పులు, పిల్లల ఖర్చులు.. మోయ లేకుండయినరు.... ఎవరికి జెప్తే మాకష్టాలు తీరుతరు... పట్టించుకునెటొల్లే లేరు.... బ్యాంకుల్లో అప్పులు పుడ్తల్లేవ్‌.... పాతరు కడితే ఇచ్చెటొల్లేమో... పంటసరిగ్గా పండవ్‌ అప్పుల్తీరవ్‌...' అని వాపోయాడు. చంద్రయ్య తన భార్యతో కలిసి రోజంతా గూడతో నీటిని తోడితే ఒక మడి పారుతుంది. ఆగకుండా వేస్తే మరో సగం మడికి నీరు పారే అవకాశం ఉంది. అన్నదమ్ములు రోజుకొకరు చొప్పున గూడవేసి ఒక్కో మడి ఎండిపోకుండా నీరందిస్తున్నారు. ఇలా కష్టపడి తమ శ్రమశక్తిమీద పంటను కొంతయినా కాపాడుకోవాలనుకుంటున్నారు. కావలి చంద్రయ్యను చూసిన బావుల కింద సాగుచేసే మరో ఇద్దరు గూడ పద్దతిన సాగునీరందిస్తున్నారు. మరి కొందరు రైతులు కూడా ఈ పద్దతికి సిద్దమవుతున్నారు. నీరు పుష్కలంగా ఉంటేనే ఈ పద్దతి సాధ్యమవుతుంది.
            చంద్రయ్య కష్టాలు తెలుసుకునేలోపే 20 మందిదాకా రైతులు వచ్చారు. 'సారు మాగురించి రాసుకోండి. మా చేలన్ని ఎండిపోతున్నరు చంద్రయ్య బాయిలో నీళ్లు పైన ఉన్నరు... ఆయన గూడేసుకుని కొంతయినా తడుపుకుంటున్నడు. మా బాయిలో నీళ్ళు చాలా లోతున్నరు. కరెంటు వస్తేనే మోటర్‌ నడవాలి' అని అదే ఊరికి చెందిన రైతులు ఊరడి కృష్ణయ్య, భీమయ్య, గుండని భీమయ్య, కుక్కల చెన్నయ్య, మాదారపు రాజు, యాదయ్య, వెంకటయ్య, నర్సింహా తదితరులు వారి బాధలు వినిపించారు. ఎవరిని కదిలించినా 'మా వరిచేను ఎండిపోయింది. పశువులకు మేతకూడా కష్టమే. వేరుశనగ, మొక్కజొన్న వందలాది ఎకరాల్లో చేలన్నీ చేతికి రాకుండా పోయాయ'ని వాపోతున్నారు. అప్పులు పెరిగిపోతున్నాయని దిగులు పడుతున్నారు. రైతుల కష్టాలు వర్ణనాతీతంగా ఉన్నాయి. ఇప్పటికే వలసలు మొదలయ్యాయి.
             కరువు పరిస్థితికి కరెంటు సమస్య తోడైంది. రాత్రి పగలు నిద్ర లేకుండా పొలం వద్ద కాచుకుని ఉన్నా గంటకు మించి మోటార్లు నడవడం లేదు. దీంతో వరిపొలం ఒక మడి తడిస్తే మళ్లీ కరెంటు వచ్చే వరకు తడారి పోతుంది. తిరిగి అదే మడి పారుతుంది. వరుస కష్టాలతో చితికి పోయిన రైతుకు డీజిల్‌ ఇంజన్లు కొనే స్థోమత లేకుండా పోయింది. కొందరితో డీజిల్‌ ఇంజన్లు ఉన్నా పెరిగిన డీజిల్‌ ధరలను భరించలేకున్నారు. కష్టపడి సాగు చేసిన వరిఫైరు ఎండిపోతుంటే రైతు ఏదో విధంగా సాగునీరందించాలనుకున్నాడు. పాతపద్ధతిని ఎంపిక చేసుకున్నారు. పెరిగిన ఖర్చుల దృష్ట్యా వ్యవసాయంలో మూడు దశాబ్దాల నాటి సాగునీటి పద్దతిని రైతులు ఎంచుకున్నారు. ప్రస్తుతం ఉన్న ఆధునిక యంత్రాలు అనేక కొత్త పద్ధతులకు రైతు స్వస్తిపలికే పరిస్థితి వచ్చింది. 1990 తరువాత రాష్ట్రంలో నూతన పారిశ్రామిక ఆర్థిక విధానాలు గ్రామీణ వ్యవస్థను ఛిద్రం చేస్తోంది. ఎండిన పంట పొలాలు కళ్లముందు కదలాడుతుంటే... పంటను కాపాడుకునేందుకు నడుంకట్టాడు. మూడు దశాబ్ధాల క్రితం ఉపయోగించిన 'యాతం లేదా గూడ' పద్దతి ద్వారా పొలాలకు రైతులు సాగునీరందిస్తున్నారు. యంత్రాలతో అయ్యే ఖర్చులు భరించలేకున్నామని శ్రమశక్తితో సాగునీరందిస్తున్నారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే రైతులు మరిన్ని పాతపద్దతులను అనుసరించే అవకాశాలు కనిపిస్తోంది.

5, అక్టోబర్ 2011, బుధవారం

పండుగలు- ఉత్సవాలు- ప్రజాసంస్కృతి

              మనం నిత్యం జరుపుకునే పండుగలు , ఉత్సవాలు, జాతరలు, కొలుపులు, మొదలయిన వన్నీ మన సంస్కృతిలో భాగం. పండుగలు ,ఉత్స వాలు అన్ని మతపరమైనవి కావు. కొన్ని పండుగలు పూర్తిగా మానవుని ఉత్పత్తికి సంబంధించి-అంటే వ్యవ సాయం, పశుపోషణ, వంటి వాటికి సంబంధించి ఉంటాయి. కొన్ని ప్రకృతిపై మానవుడు విజయం సాధించిన సందర్భాన్ని పురష్కరించు కుని జరుగుతుంటాయి. కొన్ని పండు గలు పూర్తిగా మతనమ్మకాలు, కథలపై ఆధారపడి ఉంటాయి. అయితే వీటన్నింటినీ ఇలా పూర్తిగా విడదీసి చూడటం కూడా కష్టం. మానవుని ఉత్పత్తికి, ప్రకృతిపై విజయాలకు సంబంధించిన పండుగల్లో కూడా మతపరమైన నమ్మకాలు, ఆచారాలు ఉంటాయి. అదేసమయంలో పూర్తిగా మతమపరమైన కథలపై ఆధారపడిన పండుగల్లో కూడా వెతికి చూస్తే మానవ సమూహాల అభివృద్ధికి సంబంధించిన అనేక చారిత్రక విషయాలు కనిపిస్తుంటాయి. అందువల్ల మనం పండుగలు ఉత్సవాలు జాతరలు వంటి వాటిని ఏవిధంగా చూడాలి. ఏ విధంగా ఈసందర్భాల్లో పాత్రవహించాలి అన్న ప్రశ్న ముందుకు వస్తుంది. దీనికి సమాధానం ఒక్కటే-పండుగలు ఉత్సవాలను మూఢనమ్మకాల పేరుతో మొత్తంగా కొట్టి పారేయకూడదు. అదే సమయంలో వాటిలోని అన్ని అంశాలను అంటే మూఢ విశ్వాసాలు, మూఢాచారాలు ఆధ్యాత్మిక విష యాలను కూడా భుజాన వేసుకుని మోయకూడదు.
           మానవుడు మనుగడ కోసం ప్రకృతితో సాధించిన పోరాటంలో ఒక్కో విజయం సాధించడం ద్వారానే అభివృద్ధి పథంలో ముందుకు పోతూ వచ్చాడు. అయితే ప్రకృతితో మనిషి ఒంటరిగా పోరాడలేదు. సామూ హికంగా, సమిష్టిగా పోరాడాడు. అందువల్ల ప్రకృతిపై విజయం సాధించి నప్పుడు మానవులు సమిష్టిగానే సంతోషం పంచు కున్నారు. అవే సంబరాలు ఉత్సవాలు అయ్యాయి. ఆది మానవునికి అగ్గి అప్పట్లో కొరకరాని కొయ్య. అగ్గితో చాలా పనులు చేయవచ్చు. ఎముకలు కొరికే చలినుంచి అది కాపాడుతుంది. అడవుల్లో క్రూరమృగాలను భయపెట్టి దూరంగా ఉంచుతుంది. మాంసం, దుంపలు , కూరగాయలు, గింజలు కాల్చుకు తినడానికి ఎంతగానో ఉపకరిస్తుంది. కాని మానవునికి దాన్ని స్వాధీనం చేసుకోవడం-అంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు అగ్గిని సృష్టించు కోవడం అంతతొందరగా అలవడ లేదు. దావానలాల్లో దొరికిన నిప్పును కాపాడు కుంటూ చాలా కాలం గడిపాడు. కాని దాన్ని కాపాడుకోవడం , వర్షం, వరదల నుంచి పొడిగా ఉంచుకోవడం చాలా శ్రమతోనూ ప్రయాసతోనూ కూడిన పని. తరువాత చెక్కలను రాపాడించడం ద్వారా , చెకుముకి రాళ్లను కొట్టడం ద్వారా నిప్పు చేయడం నేర్చుకున్నాడు. దాంతో మనిషి నిప్పుపై ఆధిపత్యం సాధించాడు. ఎప్పుడు కావాలంటే అప్పుడు, ఎక్కడ కావాలంటే అక్కడ నిప్పు తయారు చేయడం నేర్చు కోవడమే కాదు, నిప్పును అనేక రకాలుగా ఉపయోగించడం ప్రారంభించాడు. చివరికి నిప్పు మనిషి జీవితంలోనూ, అభివృద్ధిలోనూ అత్యంత కీలకాంశంగా మారింది. ఇటువంటి నిప్పుపై సాధించిన విజయం మానవాళికి చిన్నవిషయ మేమి కాదుకదా! అందుకే నిప్పుపై విజయం ప్రపంచంలోని అన్ని మానవ సమూహాలకు పండుగే అయింది. మనకు దీపావళి మాధిరిగానే ప్రపంచంలోని అన్ని మానవ సమా జాల్లోనూ దీపాల పండుగలు ఉంటాయి. వాటి చుట్టూ అనేక రకాల కథలు ఉండవచ్చు గాక. ఒక్కో సమాజం అగ్గి గురించిన ఒక్కో రకం కథను సృష్టించుకోవచ్చు గాక. కాని అన్నిట్లోనూ ఉన్న ఉమ్మడి అంశం అగ్గిపై మానవుని విజయమే , చీకటి నుంచి వెలుగులోకి మనిషి ప్రయాణమే. ఇదే విధంగా వ్యవసాయ సమాజాల్లో పంటలు వేసే తరుణం, పంటచేతికొచ్చే తరుణం సంబరాలుగా మారాయి. పశుపోషణ ప్రధానంగా ఉన్న సమాజాల్లో పశువులపై విజయమే అంటే పశువులను మచ్చిక చేసుకోవడమే పండుగలుగాను , ఉత్సవాలుగాను మారాయి.
              అయితే మన పండుగలన్నీ ప్రకృతిపై విజయాలకు సంబంధించి నవే కావు. ప్రకృతి శక్తులను స్వాధీనం చేసుకునే క్రమంలో మనిషి ప్రకృతికి సంబంధించిన ఒక్కో దృగ్విషయాన్నే కనుగొంటూ వచ్చాడు. అయినా అతనికి ఎల్లప్పుడూ తెలియని విషయం ఉంటూనే వస్తుంది. తెలియని విషయాల చుట్టూ తన స్వాధీనంలో లేని శక్తుల చుట్టూ మనిషి అనేకనేక నమ్మకాలు ఏర్పరుచు కున్నాడు. అనేక కథలు అల్లుకున్నాడు. తాను గెలువలేని శక్తులను ప్రసన్నం చేసు కోవడం ద్వారా , వాటిని అనుక రించడం ద్వారా తనకు అవిలోబడి ఉండేట్లు లేక తన ఇచ్చకు అను కూలంగా మెలిగేట్లు చేయవచ్చు ననుకున్నాడు. అందులో నుంచి పుట్టినవే ప్రకృతి ఆరాధన, క్రతువులు, మత నమ్మకాలు వగైరా. ఆదిమానవుడు చెట్టునూ పుట్టనూ ప్రసన్నం చేసుకోవడానికి క్రతువులు ఆచరించాడు. వ్యవసాయ సమాజంలో రుతుచక్రాన్ని తనకు అనుకూలంగా మలుచుకునేందుకు పూజలు చేశాడు. ధాన్యం జీవనాధారం కనుక ధాన్యలక్ష్మిని ఆరాధించాడు. ఆధునిక సమాజంలో ధనం, డబ్బు పోగుపడ్డాక అది ఏవిధంగా తన వద్దకు వస్తుందో, వచ్చింది తననుంచి ఎందుకు పోతుందో అర్ధం గాక అయోమయం నుంచి బయటపడటానికి భగవంతున్ని ప్రార్థిస్తున్నాడు. ఈసమాజంలో డబ్బే సర్వస్యం కనుకు ధనలక్ష్మిని తన ఆధీనం చేసుకోవడానికి వ్రతాలు, యాగాలు చేస్తున్నాడు. దీక్షలు పడుతున్నాడు.
              ప్రకృతితో మానవుడు సమిష్టిగా పోరాడాడని చెప్పుకున్నాం కదా! ఈసమిష్టిపోరాటంలో మానవుల మధ్య కూడా అనేక రకాల సంబంధా లేర్పడ్డాయి. ఒక జాతిని మరొక జాతి పీడించడం జరిగింది. ఈ పీడననుంచి విముక్తి కోసం పోరాటాలు జరిగాయి. ఈపోరాటాల్లో జయాప జయాలు కూడా పండుగలు, పర్వదినాలు, దుర్దినాలుగా మారి మన సంస్కృతిలో భాగమైనాయి. ప్రాచీన గణ వ్యవస్థలో గణనాథులే తరువాత దేవుళ్లు, దేవతలు అయ్యారు. వారి కొలుపులు పండుగలు ఉత్సవాలుగా మారాయి. పరాయిపీడన నుండి విముక్తి కోసం జరిగిన పోరాటంలో నేలకొరిగిన వీరుల జన్మదినాలు పర్వదినాలుగా మారాయి. పాలననుంచి విముక్తి జరిగిన దినాలు ముఖ్యమైన జాతీయ పర్వదినాలుగా మారాయి.
          ఈ విధంగా ఆదిమానవుడు నిప్పు, నీరుపై విజయం సాధించినప్పటి నుంచి నిన్నమొన్న పరాయి పాలననుంచి విముక్తి వరకు మానవజాతి ప్రయాణంలోని ప్రతి విజయం, అపజయం పండుగగానో, పర్వదినంగానో, మరో ముఖ్యమైన దీక్షా దినంగానో మారుతూ వచ్చాయి. వాటి చుట్టూ అనేక కథలు, నమ్మకాలు ఏర్పడుతూ వచ్చాయి. అందువల్ల పండుగలు, ఉత్సవాలు మన సుదీర్గ సంస్కృతిలో ఒక భాగమే మినహా వేరు కాదు.
     మన సాంస్కృతిక వారసత్వమంతా అంటే మానవుడు అప్పటివరకు నేర్చుకున్న విజ్ఞానం, కళలు, సాహిత్యం , నృత్యం , సంగీతం వగైరాలన్నీ పండుగల్లో ప్రదర్శితమవుతాయి. మానవుడు వ్యక్తిగతంగా గాని , సమిష్టిగాని సంపాధించిన భౌతిక సంపద ప్రదర్శించ డానికి పండుగలు వేదికలవుతాయి. ఒక మానవ సమూహం యొక్క సాంస్కృతిక వారసత్వాన్ని తెలుసుకోవాలంటే వారి పండుగలు, ఉత్సవాలు, జాతరలను పరిశీలిస్తే చాలా విషయాలు తెలుస్తాయి. ఉదాహరణకు సంక్రాంతి పండుగనే చూడండి. అది పంట చేతికొచ్చిన తరుణంలో జరిగే పండుగ కనుకు వ్యవసాయ సమాజాలపై ఆధారపడి బతికే కళాకారులు హరిదాసులు, గంగిరెద్దుల వాళ్లు, బుడబుక్కల వాళ్లు, జంగమ దేవర్లు, వగైరా ఈపండుగ రోజుల్లో తమ కళలను ప్రదర్శిస్తారు. అలాగే పండుగ సందర్భంలో ప్రజలు ఇల్లు అలకడం , రంగులు, ముగ్గులు వేయడం ద్వారా తమ కళా కౌశలాన్ని ప్రదర్శిస్తారు. పండుగ పాటలు , పద్యాలు, నాటకాలు, కోడిపందాలు, గొర్రెపొటేళ్ల పందాలు, ఎడ్ల పందాలు వగైరాలన్నీ ప్రజల సాంస్కృతిక ప్రదర్శనలే. సంక్రాంతి మాదిరిగానే దసరా పండుగ సందర్భంలో కూడా వివిధ ప్రాంతాల్లో వివిధ రకాలయిన సాంస్కృతిక రూపాలు ప్రదర్శిస్తారు. అలాగే వృత్తులను బట్టి , కులాలను బట్టికూడా రకరకాల సంబరాలు జరుపుకుంటారు. వారివారి సాంప్రదాయ కళారూపాలను ప్రదర్శిస్తారు. అందువల్ల ప్రజాసంస్కృతిని రక్షించాలను కునేవారికి , ప్రోత్సహించాలను కునే వారికి పండుగలు, ఉత్సవాలు, జాతర్లు కూడా సందర్భాలన్న దాంట్లో సందేహం లేదు.
పండుగలో రకాలు
           మనసమాజంలో మనం చేసుకునే పండుగలు , ఉత్సవాలు, జాతరలు , పర్వదినాలలో అనేక రకాలున్నాయి. అన్ని పండుగలు మతంతో ముడిపడి ఉన్నప్పటికీ వీటిలో కొన్ని మానవుని ఉత్పత్తితో ప్రత్యక్షంగా గాని, పరోక్షంగా గాని సంబంధం కలిగి ఉన్నాయి. ఉత్పత్తి అంటే ఆహార ఉత్పత్తి మాత్రమే కాదు. పునరుత్పత్తి కూడా. పంటలు, రుతువులను బట్టి ఈపండుగలు జరుపుకుంటారు. కొన్ని పూర్తిగా ఆధ్యాత్మిక పండుగలున్నాయి. మానవజాతి చరిత్రలో ఈ పండుగలు సాపేక్షంగా తరువాత ఉద్భవించినవై ఉంటాయి. ఇక ఇటీవలి కాలంలో జరిగిన రాజకీయ విముక్తి , ఉద్యమాలు , పోరాటాల్లో త్యాగాలు చేసిన వారి జయంతులు , వర్ధంతులు , రాజకీయ విజదినాలు కూడా పండుగలు, పర్వదినాల్లో చేరిపోయి. ఒక్క మనసమాజంలోనే కాదు. ప్రపంచంలోని అన్ని సమాజాల్లోనూ , అన్ని దేశాల్లోనూ తరతమ తేడాలతో ఇటువంటి విభజన కనిపిస్తుంది. మనకు సంబంధించి నంతవరకు పండుగలను ఆరు రకాలుగా విభజించ వచ్చును.
1. ఉత్పత్తితో ముడిపడిన పండుగలు, 2. ఆధ్యాత్మికమైన పండుగలు, 3. ఉత్సవాలు-జాతరలు, 4. వ్రతాలు- క్రతువులు, 5. రాజకీయపరమైన ఉత్సవాలు, 6. నాయకుల వర్ధంతులు - జయంతులు
      ఉత్పత్తితో సంబంధమైన పండుగలలో దసరాకూడా ఒకటి. దసరాగురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం.
దసరా: దసరా ఇంతకు ముందే చెప్పుకున్నట్లు ప్రకృతిపై మానవుని విజయోత్సవానికి సంబంధించిన పండుగ ముఖ్యంగా వ్యవసాయంలో మానవుడు సాధించిన విజయాలతో ఇది ముడిపడి ఉంది. ఉత్తరాదిలో దసరా సందర్భంగా రామలీలా ఉత్సవాలు చేస్తే , దక్షిణాదిలోనూ , బెంగాల్‌లోనూ దేవి నవరాత్రులు జరుపుతారు. ప్రధానంగా విజయదశమి విజయానికి సంబం ధించిన పండుగ. ఆరోజు అన్ని ప్రాంతాల్లో ఆయుధ పూజలు చేయడం ఆనవాయితీ. మనరాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో అమ్మవార్ల జాతరలు జరుగుతాయి. దసరాసందర్భంగా విచిత్ర వేశాలు వేయడం పెద్ద సాంస్కృతిక కార్యక్రమం. దసరావేశాలు తెలుగు వారికి సుపరిచితాలే.
బతుకమ్మ: బతుకమ్మ పండుగను తెలంగాణాలో , దసరారోజుల్లో జరుపుకుంటారు. బతుకమ్మ పేరిట తంగేడు, గుమ్మడి పూలతో అలంక రించిన పసుపు 'గౌరి' ని పల్లెంలో పెట్టి , పాటలు పాడుతూ , ఆపల్లెంచుట్టూ తిరుగుతూ పూజ చేస్తారు. తొమ్మిది రోజులు ఇలా చేసి చివరి రోజున మేళతాళాలతో బతుకమ్మను నిమజ్జనం చేస్తారు. కొన్ని చోట్ల బొమ్మల కొలెవు తీరుస్తారు. కొన్ని చోట్ల విజయదశమి రోజును విద్యారంభ దినంగా పరిగణించి పిల్లలకు అక్షరాభ్యాసం చేస్తారు. పూర్వం బడిపిల్లలు '' అయ్యవారికి చాలు ఐదు వరహాలు, పిల్లవాళ్లకు చాలు పప్పుబెళ్లాలు'' అంటూ పాటలు , పద్యాలు పాడుతూ ఇంటింటికి తిరిగే వారు.
రాయలసీమలో ప్రధానంగా కర్నూలు జిల్లాలో బన్నీ ఉత్సవాలు (కర్రల సమరం) జరుపుకుంటారు. ఎక్కువ ప్రాంతాల్లో శమి వృక్షానికి పూజలు చేసి ఆకును తెచ్చి పెద్దలకు ఇచ్చి ఆశ్వారం తీసుకుంటారు. ఒక్కో ప్రాంతానికి జిల్లాకు ఒక్కో ప్రత్యేకతతో ఈ పండుగను జరుపుకుంటారు.

21, సెప్టెంబర్ 2011, బుధవారం

బియ్యం ఒక్కటి తగ్గిస్తే పేదోడి ఆకలి తీరుతుందా?

                    ''ఆహార ధాన్యాలు గోదాముల్లో ముక్కిపోతున్నాయి. ఎలుకలు పందికొక్కులకు ఆహారంగా మారుతున్నాయి. ప్రజలు తిండిలేక పలువురు నకనక లాడుతున్నారు.'' ఉచితంగా పంచండని అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. మన పాలకులు మాత్రం ముక్కిపోయినా సరే ఎలుకలు, పందికొక్కులు తిన్నా సరే ఉచితంగా ఇవ్వం. ఇస్తే ప్రజలు సోమరులుగా మారుతారని ప్రకటించారు. రోజుకు 20 రూపాయలు ఖర్చులేయలేని జనాభా 80 శాతం మంది ఉన్నారు. అలాంటి వారికి ఇది కొంత ఉపశమనమే. అయినప్పటికీ మనిషికి పౌష్టికాహారం కావాలంటే ఎంతకావాలి. 20 రూపాయలు కూడా ఖర్చు చేయలేని పేదలకు ఇది సరిపోతుందా?. పరిశీలించాలి. మరో విషయం ఒక మనిషికి నెలకు నాలుగు కిలోల బియ్యం మాత్రమే రెండు రూపాయల కిలో బియ్యం ఇస్తున్నారు. ఈ ఏడాది నవంబర్‌ ఒకటి నుంచి ఒక్క రూపాయకు ఇస్తారట. రెండు రూపాయలకే ముక్కిపోయి చేదెక్కిన బియ్యం ఇస్తున్నారు. ఒక్కరూపాయకిలో బియ్యం తెచ్చి పశువులకు వేయడానికి కూడా ఉపయోగపడదు. ఒక వేళ మంచివే ఇచ్చారనుకో... ఈ బియ్యం ఎన్నాళ్లు తింటాడు. ముక్కిపోయిన బియ్యం ఇస్తే అందులో ఎన్నిక్యాలరీల శక్తి వస్తుంది. ఒక్క బియ్యం మాత్రమే తినలేడు కదా మనిషి , వంటచెరుకు(కర్రలు, కిరోసిన్‌, లేదా గ్యాస్‌), ఉప్పు, పప్పు, మంచినూనే, కారం తదితరాలు కావాలి కదా. వాటి ధరలు ఆకాశాన్నంటాయి. మనిషికి పౌష్టికాహారం ఎలా అందుతుంది. లక్షల మంది విద్యార్థులు సాంఘీక సంక్షేమ ప్రభుత్వ హాస్టళ్లు, రెసిడెన్సియల్‌ కశాలల్లో చదువుతున్న విద్యార్థులకు రోజుకు 18 రూపాయలు మాత్రమే ఇస్తున్నారు. దీంతో ఎంతకొనాలి. ఎంత పెట్టాలి. అని వార్డెన్లు ప్రశ్నిస్తున్నారు. సమాధానం లేదు. 18 రూపాయలకు ఎన్ని సరుకులు వస్తాయో మనకు తెలియనిది కాదు. కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వ ఒక్క రూపాయ కిలో బియ్యం పథకంతో ఏమి ప్రయోజనం లేదు. ఇది ప్రచారానికి చెప్పుకోవడానికి పనికి వచ్చేది తప్ప మరొకటి కాదని చెప్పాలి.
పట్టణాల్లో అందుబాటులో లేని చౌకధర దుకాణాలు
              పట్టణ ప్రాంతాల్లో చౌకధర దుకాణాలకు వెళ్లాలంటే కనీసం 20 రూయలకు పైగా ఖర్చువుతున్నాయి. 20 కిలోల బియ్యం కోసం మరో 20 ఖర్చు చేయాల్సిందే. కొన్ని రూట్లకు ఆటోలు వెళ్లవు. ఆరూటుకు వెళ్లాలంటే అదనంగా ఛార్జీ అడుగుతారు. చౌకధరకు దొకికే సరుకులు ఇంటికి చేర్చితే ప్రయోజనకరంగా ఉంటుంది. అదే విధంగా ఒకరోజు బియ్యం, ఒకరోజు చక్కెర, మరో రోజు కిరోసిన్‌ ఇస్తున్నారు. ఎందుకిలా ఎన్నిసార్లు తిరగాలయ్యా అంటే సమాధానం లేదు. సబ్సిడీ సరుకులు తీసుకోవడానికి అదనంగా వినియోగదారునికి ఖర్చులున్నాయి. ప్రయోజనమేంటి ప్రాక్టికల్‌ విషయాలను ఎందుకు పాకులు పరిశీలించడం లేదు.
ధరలు తగ్గించడమంటే ....ఏంటి?
         అన్ని ధరలు పెంచిన పాలకులను ప్రజలు క్షమించరు. పెట్రోలు ధరలు తగ్గించాలి, గ్యా స్‌ ధరలు తగ్గించాలి. ప్రయివేటు పాఠశాలల్లో , కళాశాలల్లో ఫీజులు తగ్గించాలి. అబ్బో చెప్పాలంటే చాలా ఉన్నాయి. పుక్కడికి వచ్చాయిగదాని, బియ్యం కూడా ప్రజలవే ..ముక్కిపోయాక బియ్యం ధర ఒక్కటి తగ్గించడం కాదు. జనం కష్టాలు పరిశీలించాలి. అందరికీ పని కల్పించాలి. ప్రయివేటు ప్రాధాన్యతను తగ్గించాలి. ప్రభుత్వం అవినీతిని తగ్గించాలి. శ్రమదోపిడీని తగ్గించాలి. పేదల ఆకలి తగ్గించాలి. ఇవన్ని చేస్తే పాలకులను ప్రజలు అభినందిస్తారు.

21, ఆగస్టు 2011, ఆదివారం

రాజీనామా డ్రామా?

               ఒక పక్క అవినీతిపై చట్టం చేయాలని సామాజిక కార్యకర్త అన్నాహజారే ఢిల్లీలో దీక్షలు చేస్తున్నారు. ఆయనకు మద్దతుగా ప్రదర్శనల్లో పాల్గొన్న వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీలు ఎమ్మె ల్యేలు ఆంధ్రప్రదేశ్‌లో అందుకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారెందుకు. అవినీతి అంతం కావాలని అంటారు. జగన్‌ అక్రమార్జనపై చర్యలు తీసుకోవాలంటే వ్యతిరేకిస్తున్నారు. ఇదేంటి సుప్రీంకోర్టు ఆదేశాల మేరకే సిబిఐ వైఎస్‌ జగన్‌ అక్రమార్జనపై చర్యలు తీసుకోవడానికి ప్రయత్నిస్తుంది. కాని జగన్‌ అనుచరులు జీర్ణించుకోలేకున్నారు. సిబిఐ విచారణలో ఆయన నీతిమంతుడని తేలితే వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌కు మంచి భవిష్యత్తు ఉండే అవకాశం ఉంది కదా? ఎందుకు ఆయన అనుచరులు తొందరపడుతున్నారో... మరీ కథేంటో కొంత పరిశీలిద్దాం. .....
           సిబిఐ సోదాలతో వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి బెెంబేలెత్తుతుండటంతో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ రాజీ నామా అస్త్రం ప్రయోగించింది. కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే వ్యూహం రూపొందించారు. సిబిఐ ఎఫ్‌ఐఆర్‌లో వైఎస్‌ రాజశేఖరరెడ్డి పేరును ప్రస్తావించడం పట్ల తీవ్ర నిరసన వ్యక్తం చేస్తూ జగన్‌ గ్రూపు ఎమ్మెల్యేలు, ఎంపీలు రాజీనామాలు చేయాలని నిర్ణయించారు. ఇద్దరు ఎంపీలతో పాటు, 28 మంది ఎమ్మెల్యేలు రాజీనామాలు చేయనున్నట్లు ప్రకటించారు. ఇద్దరు తెలుగుదేశం ఎమ్మెల్యేలతో పాటు, తెలంగాణా ఏర్పాటు కోసం రాజీనామాలు చేసిన ముగ్గురు ఎమ్మెల్యేల పేర్లు కూడా ఈ జాబితాలో ఉన్నాయి. తమ పార్టీ పదవులకే కాకుండా కాంగ్రెసు పార్టీ సభ్యత్వానికి కూడా రాజీనామా చేయనున్నారు. ఈ నిర్ణయం జరిగిన వెంటనే వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నేతలు స్పీకర్‌, గవర్నర్‌ అపాయింట్‌మెంట్‌ కూడా తీసుకున్నారు. సోమవారం ఉదయం స్పీకర్‌ను, సాయంత్రం గవర్నర్‌ను కలవాలని నిర్ణయించుకున్నారు. రాజీనామా లేఖలు సమర్పించిన తరువాత బస్సు యాత్ర చేయాలనే నిర్ణయానికి వచ్చారు. ఆదివారం రాష్ట్ర రాజధానిలో చోటుచేసుకున్న ఈ పరిణామాలు చర్చనీయాంశమయ్యాయి. ఈ దిశలో కొందరితో ఇప్పటికే చర్చల ప్రక్రియ కూడా ప్రారంభించినట్లు సమాచారం. మరో వైపు ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌ రెడ్డి, పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ బుజ్జగింపుల పర్వానికి శ్రీకారం చుట్టారు.
రాజీనామాలు చేసేది వీరే
        సమావేశానంతరం వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నేత పిల్లి సుభాష్‌చంద్రబోస్‌ రాజీనామాలు చేయనున్న ఎంపీలు, ఎమ్మెల్యేల పేర్లను ప్రకటించారు. నెల్లూరు ఎంపీ మేకపాటిరాజమోహన్‌రెడ్డి, అనకాపల్లి ఎంపీ సబ్బంహరి రాజీనామాలు చేయనున్నట్లు ఆయన తెలిపారు. శాసనసభ్యులుపిల్లి సుభాష్‌చంద్రబోస్‌ (రామచంద్రాపురం), బాలినేని శ్రీనివాస్‌రెడ్డి (ఒంగోలు), కొండా సురేఖ (పరకాల) మేకపాటి చంద్రశేఖరరెడ్డి (ఉదయగిరి), టి. శ్రీకాంత్‌రెడ్డి (రాయచోటి), బి. శివప్రసాద్‌రెడ్డి (దర్శి), భూమా శోభానాగిరెడ్డి (ఆళ్లగడ్డ), సిహెచ్‌ ఆదినారాయణరెడ్డి( జమ్మలమడుగు), కాపు రామచంద్రారెడ్డి (రాయదుర్గం), కోర్ల భారతి (టెక్కలి) , కె. శ్రీనివాసులు (రైల్వే కోడూరు), గొల్ల బాబూరావు (పాయకరావుపేట), పూతలపట్టు రవి (పూతలపట్టు), కె. సత్యవతి (భద్రాచలం), జయసుధ (సికింద్రాబాద్‌), బాలరాజు (పోలవరం) కాటసాని రామ్‌భూపాల్‌రెడ్డి( పాణ్యం), బి.గుర్నాథరెడ్డి(అనంతపురం), ఆకేపాటి అమర్‌నాథ్‌రెడ్డి (రాజంపేట), ఆళ్ల నాని(ఏలూరు), ఎం. ప్రసాద్‌రాజు (నరసాపురం), కె. చెన్నకేశవరెడ్డి ( ఎమ్మిగనూరు), ఎన్‌. శేషారెడ్డి (అనపర్తి), సుచరితారెడ్డి (ప్రత్తిపాడు), ద్వారంపూడి చంద్రశేఖర్‌ (కాకినాడ సిటి), బాలనాగిరెడ్డి (మంత్రాలయం), నల్లపురెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి (కోవూరు), ధర్మాన కృష్ణదాస్‌ (నరసన్నపేట) రాజీనామాలు సమర్పించనున్నారు.
ఏంటీ రాజీనామాలు ?
         వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి అనుంగు శిశ్యులుగా, ఆయన అనుచరులుగా సిగ్గుశరం ఉన్న వాళ్లయితే రాజకీయాలకు దూరంగా వెళ్లి పోండి? కాంగ్రెస్‌ నీచ రాజకీయాలకు పాల్పడుతుందని భావిస్తున్న మీరు నీచ రాజకీయాల్లో ఎందుకు ఉండాలనుకుంటున్నారు. రాజశేఖర్‌రెడ్డి , ఆయనకు మారుడు జగన్‌మోహన్‌రెడ్డి ఒకే టానులోని గుడ్డకాదా? ఆయన కాంగ్రెస్‌లోనే ఉండి ఉంటే నీతి మంతుడే అవుతుండె నేమో. అబద్దాలను నిజాలను చేసే రాజకీయాల్లో మీరెందుకున్నారు. నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే సిబిఐ విచారణను ఆహ్వానించండి?. జగన్‌ వేసే ఎంగిలి మెతుకుల కోసం ఆశపడే ఇలాంటి రాజీనామా డ్రామాలాడుతున్నారని జనం అనుకోరా? ఆలోచించండి. న్యాయస్థానాల పట్ల మీకు గౌరవం లేదా? ఉంటే ఎందుకు విరుద్దంగా వ్యవహరిస్తున్నారు?. జగన్‌కు ఒక పరీక్ష పెట్టారు. ఆపరీక్షలో నెగ్గితే అంటే అవినీతికి పాల్పడకుండా నిజాయితీగా సంపాదించాడని తేలితే మీకూ మంచిదేగా? బుడమ కాయలదొంగంటే భుజాలు తడుముకుంటున్నంత పని ఎందుకు చేస్తున్నారు. ప్రజాప్రతినిధులుగా ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన ఎమ్మెల్యేలు, ఎంపీలు నిజాయితీగా ప్రజా సంక్షేమాన్ని పట్టించుకోవడం లేదు. ప్రజలు ఐదేళ్లు అధికారంలో ఉండాలని మీకు ఓట్లేశారు. కాని వేర్పాటు వాద ఉద్యమాలకోసమో, స్వార్థ ప్రయోజనాలకోసమో, కొందరు వ్యక్తుల కోసమో రాజీనామా చేస్తే ఎలా? ప్రతి దానికి రాజీనామా రాజీనామా అంటారేంటీ. తుమ్మితే ఊడే ముక్కు ఎన్నాళ్ల్లుంటుందీ. ఇదంతా కుట్రపూరిత డ్రామా. ఏం చేస్తారో చూడాలి.

20, ఆగస్టు 2011, శనివారం

'నేను సైతం' పార్టీ ఫిరాయించగలను

                2009 ఎన్నికలకు ముందు సామాజిక న్యాయం పేరుతో ప్రముఖ సినీనటుడు చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని స్థాపించారు. నేను సైతం ప్రపంచాగ్నికి సమిధనొక్కటి ఆహుతిస్తాను. అనే శ్రీశ్రీ గీతం కాస్త చిరంజీవి విషయంలో తిరబడిందనిపిస్తోంది. నేనుసైతం పార్టీ ఫిరాయించగలను అని చిరంజీవి నిరూపించుకున్నారు. ఎన్‌టి రామారావు మాదిరిగా రాజకీయ రంగంలో గొప్ప సంచలనం సృష్టిస్తారని అనుకున్నారు ప్రజాదరణ చూసి. కాని సినీ నటుడు కావడం వల్లనే జనం అంతగా వచ్చారని ఎన్నికల తరువాత తేలిపోయింది. ఆయన సామాజిక న్యాయం అనే గొప్ప నినాదం చేశారు. ప్రజారాజ్యం పార్టీలో అంతా డబ్బున్న వాళ్ళకే ప్రాధాన్యత ఉందని కొందరు నాయకులు చిరంజీవి కంటే ముందే పార్టీ ఫిరాయించారు. సామాజిక న్యాయం అనగానే అప్పుడప్పుడే ఎదుగుతున్న కొందరు బడుగు, బలహీన వర్గాల నాయకులు ప్రజారాజ్యంలో చేరారు. సామాజిక న్యాయం సాధ్యం కాదని తెలుసుకుని ఆపార్టీకి కార్యకర్తలు దూరమయ్యారు. 20-08-2011న రాజీవ్‌ గాంధీ జన్మదినం సందర్భంగా ఆయన కుమారుడు రాహుల్‌ గాంధీ సమక్షంలో కాంగ్రెస్‌ పార్టీలో చేరారు చిరంజీవి. ఆ తరువాత కాంగ్రెస్‌ పార్టీని బలోపేతం చేస్తానని , సామాజిక న్యాయం కాంగ్రెస్‌ పార్టీ ద్వారానే సాధ్యమవుతుందని చెప్పారు. చిరంజీవి. ఆరు దశాబ్ధాల కాలంలో సాధ్యం కాని సామాజిక న్యాయం చిరంజీవి కాంగ్రెస్‌లో చేరగానే ఎలా సాధ్యమో చిరంజీవి ఆలోచించాలి. ఆర్థిక అంతరాలు పెంచి సామాజికంగా వెనుకబడిన వారిని దోపిడీ చేస్తున్న కాంగ్రెస్‌ పార్టీతో సామాజిక న్యాయం ఎలా సాధ్యమవుతుంది?.

26, జులై 2011, మంగళవారం

తెలంగాణ ఆందోళనకు తెరపడే దెన్నడు?

               తెలంగాణ ఆందోళనకు తెరపడే దెన్నడు అని ప్రజలు ఎదురు చూస్తున్నారు. ప్రభుత్వ పాలన స్తంభించి పోయింది. పాలకుల ఆగడాలను ప్రశ్నించాల్సిన ప్రధాన ప్రతిపక్షం కూడా తెలంగాణ ఆందోళనలోనే తలమునకలయ్యింది. ప్రశ్నించే వామపక్షాల్లో కూడా సిపిఎం తప్ప తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కావాలని డిమాండ్‌ చేస్తున్నాయి. విపరీతంగా ధరలు పెంచి సామాన్యుని నడ్డి విరుస్తున్న పాలకులు ప్రజల మధ్య తగువు పెట్టి చూస్తున్నారు. ఐక్యంగా ఉంటే ఆటలు సాగవని భావించిన పాలకుల కుట్రలను ప్రతిపక్షాలు సమర్థవంతంగా ఎదుర్కొనే పరస్థితి లేదు. రాష్ట్రాన్ని విడగొట్టండని గట్టిగా చెబితే సీమాంధ్రలో వ్యతిరేకత వస్తుందని .... ఐక్యంగా ఉంచండని చెబితే తెలంగాణలో రాజకీయం చేయలేమని ప్రజల పక్షాల నిలబడాల్సిన ప్రజాప్రతినిధులే దోబూచులాడుతున్నారు. దోబూచులాడుతున్న రాజకీయ నాయకులను ప్రశ్నించాల్సిన ప్రజలు మధ్య కూడా ఐక్యతను దెబ్బతీయడానికి సెంటిమెంటును రెచ్చగొడుతున్నారు. సిద్ధాంతం... చిత్తశుద్ధి లేని స్వార్థ రాజకీయ నాయకుల ఆటలు తెలుసుకోనంత కాలం ప్రజలు ఇబ్బందులు పడుతూనే ఉంటారు. ఇలాంటి సమస్యలను ఎదురవుతూనే ఉంటాయి. ప్రాంతాలకతీతంగా ప్రజలు తిరగబడితే తప్ప ద్వందవైఖరితో వ్యవహరించే రాజకీయ నాయకులకు తిక్కకుదరదు.

18, జులై 2011, సోమవారం

అనైతిక రాజకీయాలు

                  కర్నూలు జిల్లాలో అనైతిక రాజకీయాలు మరో సారి అరంగేట్రం చేశాయి. రాజకీయాలు కాదండోరు నీతిమాలిన నాయకులు అని చెప్పాలి. రాజకీయాల్లోకి నీతి మాలిన వారు రావడం వల్ల ఇలాంటివి మామూలు అయిపోయాయి. నవ్విపోదురు కాక నాకేంటి అన్నట్లు రోజుకో పార్టీలో తిరిగే నాయకుల చర్యలు రోత పుట్టిస్తున్నాయి. ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన కాటసాని రాంభూపాల్‌రెడ్డి, ఎమ్మిగనూరుకు చెందిన మరో సీనియర్‌ ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి వీరిద్దరూ కాంగ్రెస్‌ పార్టీ హస్తం గుర్తుతో ఎమ్మెల్యేలుగా గెలిచారు. మంత్రాలయం ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి టిడిపి సైకిల్‌ గుర్తుతో గెలిచారు. పార్టీలు పిరాయిస్తారనే ముందుజాగ్రత్తగా కాంగ్రెస్‌ పార్టీ ఎస్వీ మోహన్‌రెడ్డికి ఎమ్మెల్సీ పదవి కట్టబెట్టింది. ముఖ్యమంత్రి పదవి దక్కలేదని కాంగ్రెస్‌ పార్టీకి గుడ్‌బై చెప్పిన వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి స్థాపించిన వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీలో వారు నలుగురూ చేరారు. 2011 జులై 18న జగన్‌మోహన్‌రెడ్డి కర్నూలులో ఓదార్పు యాత్ర ప్రారంభించారు. ఆయన ఓదార్పులో ఆ నలుగురూ కలిశారు. అప్పటికే పలుమార్పు పార్టీలు పిరాయించిన భూమా దంపతులు జగన్‌కు బంధువులు కావడం వల్ల ఆయన వెంటే ఉన్నారు. వారు ముందుగా టిడిపికి రాజీనామా చేసి ప్రజారాజ్యంలో చేరారు. ప్రజారాజ్యం కాస్త కాంగ్రెస్‌లో కలిసి పోయిన సంగతి తెలిసిందే. దీంతో వారు వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌తో జతకట్టారు. ఆవు చేలో మేస్తే దూడ గట్టున మేస్తుందా అన్న చందంగా పలువురు నాయకుల అనుచర గణం ఎందరో వైఎస్‌ఆర్‌ పార్టీలోకి వలస వెళ్తున్నారు. అక్కడ ఎన్నాళ్లుంటారో చూడాలి మరి.

12, జులై 2011, మంగళవారం

సమస్త కళల సారాంశం 'మనిషి'

సాహితీవేత్త ఆశావాది ప్రకాశరావు
        సమస్త కళల సారాంశం 'మనిషి' అని ప్రముఖ సాహితీవేత్త ఆశావాది ప్రకాష్‌రావు పేర్కొన్నారు. అనంతపురం జిల్లా పెనుకొండ టిటిడి కళ్యాణ మండపంలో వేకువ కళాసమాజ సేవా సంస్థ ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి కవితాపురస్కారోత్సవాన్ని 2011 జులై 10న ఘనంగా నిర్వహంచారు. ప్రఖ్యాత సాహితీ వేత్తలు శ్రీశ్రీ, పుట్టపర్తి నారాయణ చార్యులు, విద్వాన్‌విశ్వం పేర్లతో మూడు వేదికలుగా ఈ పురస్కారోత్సవాలను నిర్వహించారు. ప్రముఖ అష్టావధాని, డాక్టర్‌ శావాది ప్రకాష్‌రావు పుట్టపర్తి నారాయణ చార్యుల వేదికకు అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఆశావాది మాట్లాడుతూ కళలకు, సాహిత్యానికి ఎల్లలు లేవన్నారు. వాటి ద్వారా సమాజాన్ని మేల్కొల్పవచ్చునని అన్నారు. అన్నిరంగాల్లో ప్రజలను చైతన్యం చేయడానికి కళలు, సాహిత్యం ఎంతో ఉపయోగపడతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నలుమూలల నుంచి 13 మంది ప్రముఖ సాహితీవేత్తలు, ప్రముఖ కళాకారులు పాల్గొన్నారు. కేంద్రసాహిత్య అకాడమి అవార్డు గ్రహిత శివారెడ్డి శ్రీశ్రీ వేదికకు, నెలవంక- నెమలీక సంపాదకులు శ్రీరాములు విద్వాన్‌ విశ్వం వేదికకు అధ్యక్షత వహించారు. ప్రముఖ ప్రజాగాయకుడు గోరేటి వెంకన్న సీమ సంస్కృతి, సాంప్రదాయాలపై, అనంతకరువుపై పాడిన పాటలు అలరించాయి. బి.కెభవ్య, సుగమ్య, శంకర్లు చేసిన శాస్త్రీయ నృత్యాలు పలువురిని ఆకట్టుకున్నాయి. జిల్లా రచయితల సంఘం అధ్యక్షులు జూపల్లి ప్రేమ్‌చంద్‌, ప్రముఖ శ్రీవాద కవయిత్రి శిలలోలిత, కవయిత్రులు లోయాల, డా.ఆశాజ్యోతి, ప్రముఖ కవులు బిక్కికృష్ణ, యాకోబ్‌, మాలేపల్లిలు పలు అంశాలపై కవితలు వినిపించారు. ఈసందర్భంగా జరిగిన కవిసమ్మేళనంలో వందమందికిపైగా వర్ధమాన కవులు పాల్గొన్నారు. అనంతరం రాష్ట్ర స్థాయి కవితా పురస్కారోత్సం నిర్వహించారు. ఈ సందర్బంగా రాష్ట్ర స్థాయిలోఎంపికైన కవితలను ఆయా కవితల రచయితలు వినిపించారు. రచయితలకు జ్ఞాపిలకలను, ప్రశంసపత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమానికి వేకువ సంస్థ అధ్యక్షులు జాబిలి జయచంద్ర అధ్యక్షత వహించగా ప్రధాన కార్యదర్శి రాజశేఖర్‌రెడ్డి పురస్కార ప్రస్తావకునిగా వ్యవహరించారు. ఈ కార్యక్రమంలో సర్పంచి జయలక్ష్మమ్మ, ఉపసర్పంచి శ్రీరాములు, పలువురు పట్టణ ప్రముఖులు, సాహితీ అభిమానులు పాల్గొన్నారు.

11, జులై 2011, సోమవారం

వేర్పాటువాద లొల్లి దేనికి..?

అవినీతిని కప్పిపుచ్చుకోవడానికా..?
ధరల భారం మరిచిపోవడానికా..?
          తెలంగాణా ఉద్యమాన్ని అవమాన పరచడం లేదనుకుంటే నాకున్న కొన్ని సందేహాలు చెప్పాలనుకున్నా. తెలంగాణా ప్రత్యేక రాష్ట్రం కావాలనే డిమాండ్‌ ఈనాటిది కాదు. అయితే ప్రస్తుతం విస్తరించింది. ఒకప్పుడు ప్రసార, ప్రచార మాధ్యమాలు తక్కువ కాబట్టి ప్రజల్లోకి వెళ్లడానికి సమయం పట్టేది. ఇప్పుడు విస్తృతి పెరిగింది. ప్రజల్లోకి వెంటనే చేరుతుంది. ప్రస్తుతం సిపిఎం మినహా అన్ని పార్టీలూ మద్దతు తెలిపాయి. అధికార పార్టీ నాటక మాడుతోంది. కెసిఆర్‌ దీక్షలకు స్పందించి శ్రీకృష్ణ కమిటీ వేశారు. తెలంగాణా రాష్ట్రం వచ్చేస్తుందనే భ్రమలు కల్పించాయి చిదంబరం వ్యాఖ్యలు. శ్రీకృష్ణకమిటీ నివేదిక వచ్చింది. అందులోని అంశాలన్నీ బహిరంగ పరిచారు. కొన్ని రహాస్యాలన్నారు. చివరికి అవి కూడా బయటకు పొక్కాయి. ఏకాభిప్రాయ సాధన అన్నారు. అన్ని రాజకీయ పార్టీలను పిలిచారు. మాట్లాడారు. తెలంగాణా రాష్ట్ర ఇవ్వలేమని స్పష్టం చేయవచ్చు. లేదా పలాన సమయానికి ఇస్తామని అయినా చెప్పవచ్చు. రెండూ చెప్పకుండా అవకాశ వాద ధోరణితో వ్యవహరించడం ఎంతవరకు సమంజసం. ప్రస్తుతం ప్రభుత్వ ప్రతిష్ట పడిపోయింది. మంత్రులు కుంభకోణాల్లో ఇరుక్కున్నారు. జనలోక్‌పాల్‌ బిల్లు తెస్తామని అన్నారు. అందులో ప్రధాన మంత్రిని చేర్చాలని దీక్షలు మొదలయ్యాయి. ప్రధాన మంత్రిని చేర్చాలో లేదో తేలకముందే ఇంధన ధరలు పెంచారు. ఈ పరిణామాల క్రమంలో ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతుందని భావించి దీని నుంచి ప్రజల ధృష్టిని మరల్చేందుకు తెలంగాణా రాజీనామాల అస్త్రాలను ప్రయోగించింది అధికార పార్టీ. దీని మర్మాన్ని గ్రహించిన ఇతర పార్టీల ఎమ్మెల్యేలు కూడా రాజీనామా చేశారు. అధికార పార్టీ వాళ్లతోపాటు మనం కూడా రాజీనామా చేయకపోతే ఎక్కడ ప్రజలకు దూరమవుతామోననే ఆలోచనతో టిడిపి, బిజెపి, సిపిఐ ఇతర ఎమ్మెల్యేలు కూడా రాజీనామాలు సమర్పించారు. రాజీనామాలు గవర్నర్‌కు సమర్పిస్తే రాజ్యాంగ సంక్షోభం ప్రభావం వెంటనే తెలిసేది. స్పీకర్‌ లేని సమయంలో రాజీనామాలు సమర్పించారు. ఈసారి గొడవలో కొందరి స్వార్థముందని కొన్ని పత్రికలు రాశాయి. స్వార్థముందనేది వాస్తవమే కానీ అధికార పార్టీదే స్వార్థముందనేది మాత్రం రాయలేదు. అబ్బో అధిష్టానం కోపపడినట్లు నటించింది. అందులో కోపం లేదు .... పాడులేదు. తాము వేసుకున్న పథకం బాగా విజయ వంతమయిందనే ఆనందం తప్ప. అయితే తెలంగాణా ఎప్పటికయినా సపరేటు అవుతుందనే చర్చ మాత్రం జనంలో సాగుతోంది. 2014 ఎన్నికల వరకు తేల్చరనేది కూడా అనుకుంటున్నారు. మరి అధికార పార్టీ ఏం చేస్తుందో వేచి చూడాలి.

23, జూన్ 2011, గురువారం

ఆదర్శ వివాహాలను ప్రోత్సహించాలి

                వివాహం అనేది స్త్రీపురుషుల మధ్య చట్టపరమైన ఒడంబడిక లేదా సామాజిక కట్టుబాటు అని సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు ఎంఏ గఫూర్‌ అన్నారు. 2011 జూన్‌ 23న గురువారం కర్నూలు సిపిఎం కార్యాలయ ఆవరణంలో ఆ పార్టీ ఆధ్వర్యంలో ఎస్‌ఎఫ్‌ఐ జిల్లాకార్యదర్శి సిపి నాయుడు, ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర కమిటీ సభ్యులు మహబూబ్‌నగర్‌ జిల్లాకు చెందిన ఎం.రాధ ఆదర్శ వివాహం చేసుకున్నారు. ప్రస్తుత కట్టుబాట్లు, సాంప్రదాయాలకు, హంగు ఆర్భాటాలకు భిన్నంగా ఈ వివాహం జరిగింది. ప్రముఖ వైద్యులు డాక్టర్‌ కన్నా ఆచార్యులుగా వ్యవహరించి కష్టసుఖాలలో కలిసుంటామని, సమాజ మార్పుకోసం కృషి చేస్తామని ప్రమాణం చేయించారు. పూలమాలలు వేయించి సాదాసీదాగా అందరి ఆమోదంతో ఈ ప్రక్రియను నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంఏ గఫూర్‌ మాట్లాడుతూ ఒకరినొకరు తెలుసుకుని ఒడిదొడుకులను తట్టుకుని జీవించడానికి సిద్దపడిన రాధ, సిపి నాయకుడులను అభినందించారు. ప్రేమించే హృదయాలకు పేదరికం, కుల, మతాలు అడ్డురావని అన్నారు. ఆదర్శ వివాహాలు చేసుకునేందుకు ముందుకు రావాలని యువతకు పిలుపు నిచ్చారు. ఇలాంటి వివాహాల వల్ల ఇరువర్గాల వారికి ఖర్చు తగ్గుతుందన్నారు. ప్రజాసమస్యల పరిష్కారం కోసం పాటుపడాలని వధూవరులను కోరారు. మీ సంతోషంతో పాటు పెంచి పెద్దచేసిన తల్లిదండ్రులను గౌరవించాలని, వారి ఆశలను అడియాసలు చేయరాదని సూచించారు.
జిల్లా కార్యదర్శి టి.షడ్రక్‌ మాట్లాడుతూ ఇలాంటి వివాహాలు తమ పార్టీ ఆధ్వర్యంలో ఎంతో మందికి నిర్వహించామన్నారు. సాంప్రదాయ పెళ్లిళ్లకు భిన్నంగా వివాహాలు చేస్తున్నామన్నారు. సిపిఎం మహబూబ్‌నగర్‌ జిల్లా కార్యదర్శి కిల్లెగోపాల్‌ మాట్లాడుతూ సమైక్యతనూ చాటుతూ కర్నూలు, మహబూబ్‌నగర్‌ ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు పెళ్లి చేసుకోవడం సంతోషమన్నారు. సేవాదృక్పదం, సమాజ అవగాహన కలిగిన ఎం.రాధ కష్టపడే స్వభావం కలిగి ఉందని చెప్పారు. నాయుడు, రాధ పరస్పరం అవగాహనతో అందరికి మార్గ దర్శకులు కావాలని సూచించారు. సాంప్రదాయాలకు భిన్నంగా ఒకరినొకరు అర్థం చేసుకుని జీవిత భాగస్వాములు కావడం అభినందనీయమని అన్నారు. ఈ సందర్బంగా రాయలసీమ యూనివర్సిటీ ప్రొఫెసర్‌ పుణ్యశేషుడు, నారాయణ విద్యాసంస్థలు జోనల్‌ ఇన్‌చార్జ్‌ రామలింగేశ్వరరెడ్డి, సాయిరాం విద్యాసంస్థల అధినేత సుధాకర్‌రెడ్డి, మహబూబ్‌నగర్‌ సిపిఎం కార్యదర్శి కె.గోపాల్‌, ఐద్వా రాష్ట్ర ఉపాధ్యక్షురాలు పి.నిర్మలమ్మ, కలెక్టరేట్‌ భూపరిపాలన విభాగం ఎఓ మల్లికార్జున, ఎఐఎస్‌ఎఫ్‌ జిల్లా కార్యదర్శి హుస్సేన్‌, ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి నరసింహ, మహబూబ్‌నగర్‌ జిల్లా ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు బాలనాగిరెడ్డి, జిల్లా అధ్యక్షులు శ్రీరాంలు వధువరులను ఆశీర్వదిస్తూ వారి జీవితం సుఖసంతోషాలతో సాగాలని, సమాజ సేవకోసం పాటుపడుతూ అందరికి ఆదర్శంగా నిలవాలని ఆకాంక్షించారు. ఈ ఆదర్శ వివాహానికి అన్ని ప్రజాసంఘాల నాయకులు హాజరై వారిని ఆశీర్వదించారు.