29, ఆగస్టు 2020, శనివారం

అన్‌లాక్-4 గైడ్‌లైన్స్ విడుదల చేసిన కేంద్రం

న్యూఢిల్లీ: అన్‌లాక్-4 మార్గదర్శకాలను కేంద్ర ప్రభుత్వం శనివారం ప్రకటించింది. సెప్టెంబర్ 1 నుంచి కొత్త మార్గదర్శకాలు అమల్లోకి వస్తాయి. సెప్టెంబర్ 30 వరకూ ఇవి అమల్లో ఉంటాయి. దేశవ్యాప్తంగా మరిన్ని కార్యకలాపాలను విస్తరిస్తున్నట్టు తెలిపింది. దేశవ్యాప్తంగా గ్రేడెడ్ (దశలవారీ) విధానంలో సెప్టెంబర్ 7 నుంచి మెట్రో రైళ్లకు అనుమతి ఇచ్చిది. అయితే కంటైన్‌మెంట్ జోన్స్‌లో లాక్‌డౌన్ నిబంధనలు సెప్టెంబర్ 30 వరకూ అమలులో ఉంటాయని తెలిపింది. 

సెప్టెంబర్ 30 వరకూ స్కూళ్లు, కాలేజీలు, కోచింగ్ సెంటర్లు, మాల్స్ మూసే ఉంటాయి. ఆన్‌లైన్/డిస్టెన్స్ లెర్నింగ్‌ కొనసాగేందుకు, ప్రోత్సహించేందుకు అనుమతించినట్టు పేర్కొంది. సెప్టెంబర్ 21 నుంచి ఓపెన్ ఎయిర్ థియేటర్లకు అనుమతి ఇచ్చింది. అలాగే 21 నుంచి క్రీడలు, ఎంటర్‌టైన్‌మెంట్ కార్యక్రమాలకు అనుమతి ఇచ్చింది. సాంస్కృతిక, సామాజిక కార్యక్రమాలకు అనుమతి ఇచ్చిది. 100 మందికి మించి హాజరు కాకూడదని నిబంధన విధించింది.

సినిమా హాళ్లు (ఓపెన్ ఎయిర్ థియేటర్లు మినహా), స్విమ్మింగ్ పూల్స్, ఎంటర్‌టైన్‌మెంట్ పార్కులు మూసే ఉంటాయి. అంతర్ రాష్ట్ర రవాణాకు  అనుమతి ఇస్తున్నట్టు ప్రకటించింది. అంతర్జాతీయ విమానా ప్రయాణాలను అనుమతించరు. కంటైన్‌మెంట్ జోన్లలో కఠిన ఆంక్షలు అమలు చేస్తారు. నిత్యావసర కార్యకలాపాలను మాత్రమే అనుమతిస్తారు.

అలాగే, 65 ఏళ్లు పైబడిన వారు, ఆరోగ్య సమస్యలు ఉన్నవారు, గర్భిణిలు, 10 ఏళ్ల లోపు పిల్లలు ఆరోగ్య అవసరాలకు మినహాయిస్తే ఇళ్లలోనే ఉండాలని సూచించింది. ఆరోగ్య సేతు మొబైల్ అప్లికేషన్‌ వాడకాన్ని ప్రోత్సహిస్తున్నట్టు తెలిపింది.

14, జులై 2020, మంగళవారం

పదో తరగతి పరీక్షల రద్దుపై అధికారిక ఉత్తర్వులు

                    అమరావతి: పదో తరగతి పరీక్షలను రద్దు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. మార్చి 23 నుంచి ఏప్రిల్ 8వ తేదీ వరకు పదో తరగతి పరీక్షలు నిర్వహించాలని ఏపీ విద్యాశాఖ అప్పట్లో నిర్ణయించింది. అయితే స్థానిక ఎన్నికల ప్రకటన నేపథ్యంలో పదో తరగతి పరీక్షల షెడ్యూల్‌ను మార్చి 31 నుంచి ఏప్రిల్ 17కు మారుస్తూ ప్రకటన విడుదల చేసింది. ఆలోపే కోవిడ్ 19 వ్యాప్తి కారణంగా రాష్ట్రంలో లాక్‌డౌన్‌ను విధించారు. దీంతో పదో తరగతి పరీక్షలను 11 పేపర్లకు బదులు 6 పేపర్లతోనే నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. వీటిని ఏప్రిల్ 10వ తేదీ నుంచి 17వ తేదీ మధ్య పరీక్షల నిర్వహణకు విద్యాశాఖ సిద్ధమైంది. అయితే జిల్లాల కలెక్టర్లు చాలా మంది కోవిడ్ 19 వ్యాప్తి కారణంగా పదవ తరగతి పరీక్షల నిర్వహణ సాధ్యం కాదని ప్రభుత్వానికి సిఫార్సు చేశారు. పోలీస్, మెడికల్ సిబ్బంది కోవిడ్ విధుల్లో ఉన్నందున పరీక్షల నిర్వహణ తలకు మించిన భారంగా ఉంటుందని వారు తెలిపారు. దీంతో రాష్ట్ర విద్యాశాఖ పదవ తరగతి పరీక్షలను రద్దు చేసి, విద్యార్థులందరినీ పాస్ చేయాలని నిర్ణయించింది. అనేక విధాలుగా పరీక్షల నిర్వహణ సాధ్యాసాధ్యాలపై విద్యాశాఖ పరిశీలించిన తరువాత విద్యార్థుల ఆరోగ్యం దృష్ట్యా పరీక్షలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. విద్యార్థులు ఎవరైతే పదవ తరగతిలో రిజస్టర్ అయి పరీక్షల కోసం హాల్ టికెట్లు తీసుకున్న వారందరూ పాస్ అయినట్లుగా ప్రకటించారు. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. అయితే పాస్ అయిన విద్యార్థులకు ఎలాంటి గ్రేడ్లు ప్రకటించ కూడదని ఉత్తర్వుల్లో ప్రభుత్వం పేర్కొంది.

11, జులై 2020, శనివారం

గిన్నిస్‌ రికార్డు కెక్కిన భారత్‌లో పులుల లెక్కింపు ప్రక్రియ

                 హైదరాబాద్‌: అంతర్జాతీయ పులల దినోత్సవం సందర్భంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రకటించిన ‘అఖిలభారత పులుల లెక్కింపు-2018’ నాలుగో దశ ప్రపంచంలోనే అతిపెద్ద కెమెరా ట్రాప్‌ వైల్డ్‌లైఫ్‌ సర్వేగా గిన్నిస్‌రికార్డు సృష్టించింది. ఇదొక గొప్ప క్షణం...ఆత్మనిర్బర్‌ భారత్‌కు ప్రకాశవంతమైనది అంటూ కేంద్ర పర్యావరణశాఖ మంత్రి ప్రకాశ్‌జవడేకర్‌ ట్వీట్‌చేశారు. ప్రధాని మోదీ ఎప్పుడూ చెబుతుండే సంకల్ప్‌ సే సిద్ధిగా ఆయన అభివర్ణించారు. పులుల సంఖ్యను రెట్టింపు చేయాలని చేసిన తీర్మానాన్ని,లక్ష్యానికి నాలుగేళ్ల ముందే నిలబెట్టుకున్నామని జవడేకర్‌ చెప్పారు. కొత్తలెక్కల ప్రకారం భారత దేశంలో 2967 పులులు ఉన్నాయన్నారు. దీంతో ప్రపంచంలో ఉన్న పులుల్లో 75శాతం భారత్‌లోనే ఉన్నాయని ఆయన వివరించారు. 2022 నాటికి దేశంలో పులుల సంఖ్యను రెట్టింపు చేస్తామని సెయింట్‌ పీటర్స్‌ బర్గ్‌లో 2010లో తీర్మానించామని, 
            ఆ లక్ష్యానికి నాలుగేళ్ల ముందే దానిని సాధించామని చెప్పారు. వనరు, సమాచార పరంగా 2018-19లో నిర్వహించిన సర్వే నాలుగో దశ చాలా సమగ్రమైనది. 141 ప్రాంతాల్లోని 26,838 చోట్ల కెమెరాలు ట్రాప్‌లు (మోషన్‌సెన్సార్లతో అమర్చిన కెమెరాలు, జంతువు ఆ పరికాల ఎదుట నుంచివెళుతున్నప్పుడు ఫోటో తీస్తాయి) అమర్చారు. 1,21,337 చ.కి.మీ. (46,848 చ.మై) విస్తీర్ణంలో సర్వే జరిగింది.  కెమెరా ట్రాప్‌లు మొత్తం 3,48,58,623 ఫోటోలు (వీటిలో 76,651 పులులు, 51,777 చిరుతలు, మిగిలినవి ఇతర జంతుజాలం) తీశాయి. వీటి నుంచి 2,461 పులులను (పులికూనలుకాక) చారలను గుర్తించే సాఫ్ట్‌వేర్‌ ద్వారా గుర్తించారని గిన్నీస్‌బుక్‌సైట్‌లో రాశారు.
                వన్య ప్రాణుల సంస్థ సాంకేతిక సాయంతో ప్రతి నాలుగేళ్లకు ఒకసారి జాతీయ పులుల సంరక్షణ యంత్రాంగం పులుల జనాభా లెక్కింపు చేపడుతుంది. రాష్ట్ర అటవీ శాఖలు, వాటి భాగస్వాములు ఈ గణన చేపడతాయి. ప్రపంచవ్యాప్తంగా 50 పులుల సంరక్షణ ప్రాంతాల్లో జరుగుతున్న లెక్కింపు ప్రక్రియలు, మన దేశంలో చేపట్టిన ‘ప్రాజెక్ట్‌ టైగర్‌’ కార్యక్రమానికి సాటిరాలేదు. పులుల సంరక్షణలో భారత్‌ అగ్రస్థానంలో వుంది. భారత్‌ చేపట్టిన చర్యలను బంగారు ప్రమాణాలుగా ప్రపంచం భావిస్తోంది. 

10, జులై 2020, శుక్రవారం

నిషేధం విధించిన 59 చైనా యాప్స్‌కు 79 ప్రశ్నలతో భారత్ నోటీసులు

నిషేధం విధించిన చైనా యాప్స్‌కు భారత్ 79 ప్రశ్నలు
జూలై 22లోగా స్పందించకపోతే...
              న్యూఢిల్లీ: నిషేధం విధించిన 59 చైనా యాప్స్ యాజమాన్యాలకు 79 ప్రశ్నలతో కూడిన నోటీసులను భారత్ పంపింది. ఈ నోటీసులో పంపిన ప్రశ్నలకు మూడు వారాల్లోగా సమాధానమివ్వాలని సదరు యాప్స్‌కు స్పష్టం చేసింది. జూలై 22 లోపు స్పందించకపోతే 59 యాప్స్‌ను శాశ్వతంగా నిషేధిస్తామని భారత్ హెచ్చరించింది. ఈ యాప్స్ కార్యకలాపాలపై ఇంటెలిజెన్స్ ఏజెన్సీల నుంచి, గ్లోబల్ సైబర్ వాచ్‌డాగ్స్ నుంచి భారత్ ఇప్పటికే డేటా తెప్పించుకున్నట్లు సమాచారం.
             సదరు యాప్స్ స్పందనకు, తెప్పించుకున్న డేటాకు పొంతన సరిపోయిందో లేదో భారత్ పోల్చి చూడనుంది. ఏమాత్రం వ్యత్యాసం కనిపించినా ఈ యాప్స్ భారత్‌లో మరింత చిక్కుల్లో పడే అవకాశం ఉంది. యాప్స్ కార్పొరేట్ మూలాలు, మాతృ సంస్థల నిర్మాణం, నిధులు, డేటా మేనేజ్‌మెంట్, కంపెనీ సర్వర్లకు సంబంధించి చైనీస్ యాప్స్‌కు పంపిన ఆ 79 ప్రశ్నల్లో భారత్ ప్రధానంగా ప్రశ్నించినట్లు సమాచారం.

7, జూన్ 2020, ఆదివారం

ప్రపంచ ఆహార భద్రతా దినోత్సవం... డబ్ల్యుహెచ్ఓ సూత్రాలివే...

ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యుహెచ్ఓ) ఐదు సూత్రాలను ప్రకటించింది. డబ్ల్యుహెచ్ఓ కిందటి సంవత్సరం ‘ఆహార భద్రతా దినోత్సవం’ను మొదలుపెట్టిన విషయం విదితమే. తింటున్న తిండి వల్ల కలిగే నష్టాలపై, రాగల ప్రమాదాలపై ప్రజల్లో అవగాహన పెంచడం, తద్వారా మానవ ఆరోగ్యానికి, ఆహార భద్రతకు, వ్యవసాయానికి సాయపడటం లక్ష్యాలుగా పెట్టుకుంది. ఈ నేపథ్యంలో ఈ ఐదు సూత్రాలు పాటిస్తూ అనారోగ్యాల బారిన పడకుండా జాగ్రత్త వహించమని చెబుతోంది. 
* వంట గదిలోకి వెళ్లిన ప్రతిసారి చేతులు శుభ్రంగా కడుక్కోవాలి. వంటగది ఎప్పుడూ పరిశుభ్రంగా ఉంచాలి. తడి లేకుండా చూసుకోవాలి. 
* నిల్వ ఆహార పదార్ధాలను వీలైనంత వరకు తీసుకోకుండా ఉంటే మంచిది.
* వండిన, వండని ఆహార పదార్థాలను వేర్వేరు డబ్బాలలో నిల్వ చేసుకోవాలి.
* ఆహారాన్ని బాగా ఉడికించి తీసుకోవాలి. అప్పుడే క్రిములు నశిస్తాయి. పోషకాల స్థాయి పెరుగుతుంది.
* శుభ్రమైన నీటిని ఉపయోగించి ఉప్పు నీటిలో కూరగాయలు కడగాలి.

మనం తినే ఆహారం సురక్షితంగా ఉండేందుకు, మన ఆరోగ్యాన్ని పాడుచేయకుండా ఉండేందుకు పొలంలోని రైతు మొదలుకొని, విధానాలు రూపొందించే ప్రభుత్వాధినేతల వరకూ ప్రతి ఒక్కరు తమదైన పాత్ర పోషించాలని డబ్ల్యూహెచ్‌ఓ చెబుతోంది. ఫలితంగా కలుషిత ఆహారం తినడం వల్ల వచ్చే వ్యాధుల భారం తగ్గి సమాజం అభివృద్ధి చెందుతుందని డబ్ల్యూహెచ్‌వో స్పష్టం చేస్తోంది. 

25, మే 2020, సోమవారం

213 దేశాల్లో .. 55 లక్షల కరోనా కేసులు

                      చైనాలోని వుహాన్ నగరంలో పురుడు పోసుకున్న కరోనా వైరస్... ఇపుడు ఏకంగా 213 దేశాలకు విస్తరించింది. మొత్తం కేసుల సంఖ్య దాదాపు 55 లక్షలకు చేరింది. దీని బారిన పడి చనిపోయినవారి సంఖ్య 3.45 లక్షలకు చేరుకుంది. ఇక 23.02 లక్షల మంది కోలుకున్నారు. ఇక అగ్రరాజ్యం అమెరికాను ఈ వైరస్ తీవ్రంగా వణికిస్తోంది. ఈ దేశంలో ప్రతి రోజూ వేల సంఖ్యలో కేసులు నమోదవుతూనే ఉన్నాయి. అమెరికాలో ఆదివారం మరో 18 వేల పాజిటివ్ కేసులు నమోదు కాగా, ఈ కేసులతో కలుపుకుంటే మొత్తం కరోనా కేసుల సంఖ్య 16,86,436 కు చేరుకన్నాయి.
         దేశంలో వైరస్‌ సోకిన వారిలో 99,300 మంది మరణించారు. ఇకపోతే, పాజిటివ్ కేసుల్లో రష్యా రెండో స్థానంలో ఉండేది. కానీ, ఇపుడు బ్రెజిల్ రష్యాను వెనక్కి నెట్టేసింది. బ్రెజిల్‌లో ఇప్పటివరకు మొత్తం 3.63 లక్షల కేసులు నమోదుకాగా, 22,716 మంది మరణించారు. ఇక 1,49,911 మంది కోలుకోగా, మరో 1,90,991 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. మూడవ స్థానంలో ఉన్న రష్యాలో కరోనా కేసులు 3,44,481 కి పెరిగాయి. దేశంలో ఇప్పటివరకు 3,541 మంది మరణించారు. ఇక 2,82,852 కేసులతో స్పెయిన్‌, 2,59,559 పాజిటివ్‌ కేసులతో బ్రిటన్, 2,29,858 కేసులతో ఇటలీ, 1,82,584 కేసులతో ఫ్రాన్స్‌ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. 
             మరోవైపు, 130 కోట్ల జనాభా వున్న భారత్‌లో ఆదివారం ఒక్క రోజే ఆరు వేలకు పాగా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ కేసులతో కలుపుకంటే మొత్తం కేసుల సంఖ్య 1.38 లక్షలకు చేరువైంది. అలాగే, ప్రపంచ దేశాల జాబితాలో భారత్... ఇరాన్‌ను వెనక్కి నెట్టి పదో స్థానంలోకి వచ్చింది.

22, మే 2020, శుక్రవారం

మంటలు పుట్టిస్తున్న వేసవి


పడమర గాలులతో ఉక్కిరిబిక్కిరి 
ద్వారకా తిరుమలలో 48 డిగ్రీలు 
ఈ నెల 25 వరకూ ఇంతే


                   వేసవి ఠారెత్తిస్తోంది. ఉష్ణోగ్రతలు అమాంతం పెరిగిపోయాయి. వడగాలులు ఉధృతమయ్యాయి. వెచ్చటి గాలులతో రాష్ట్రం నిప్పుల కొలిమిలా మారింది. రోహిణీకార్తె రాకముందే భానుడు భగభగ మండిపోతున్నాడు. పడమర, వాయవ్య దిశల నుంచి వీస్తున్న పొడిగాలులతో కోస్తా ప్రాంతం ఉడికిపోతోంది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం వరకు వేడి గాలులతో ప్రజలు అల్లాడిపోతున్నారు.

              ‘ఆంఫన్‌’ తుఫాను బలహీనపడటంతో వేసవి తీవ్ర ప్రభావం చూపుతోంది. సూర్యాస్తమయం తరువాత కూడా వేడిగాలులు వీస్తూనే ఉన్నాయి. గురువారం కోస్తాలో పలుచోట్ల సాధారణంకంటే 3 నుంచి 6 డిగ్రీలు ఎక్కువగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. విదర్భ, తెలంగాణలో కొనసాగిన వడగాడ్పుల ప్రభావం కోస్తా వరకు విస్తరించింది. ఆర్టీజీఎస్‌ డేటా ప్రకారం పశ్చిమగోదావరి జిల్లా ద్వారకాతిరుమల మండలం ఐఎస్‌ రాఘవపురంలో 48, కురించేడు(ప్రకాశం)లో 47.97, పమిడిముక్కల(కృష్ణా), క్రోసూరు(గుంటూరు), జగ్గిలబొంత(శ్రీకాకుళం)లో 46.32డిగ్రీలు నమోదయ్యాయి. భారత వాతావరణ సంస్థ నమోదు చేసే కేంద్రాలను పరిశీలిస్తే గన్నవరంలో 46, బాపట్ల, నందిగామ, ఒంగోలు,. జంగమహేశ్వరపురంలో 45, కావలి, మచిలీపట్నంలో 44 డిగ్రీలు నమోదయ్యాయి. ఈనెల 23న ఉష్ణోగ్రత మరింత పెరిగి 48 డిగ్రీలకు చేరుతుందని భారత వాతావరణ శాఖ(ఐఎండీ) ప్రకటించింది. పగటి ఉష్ణోగ్రతలు పెరగడంతో రాత్రి సమయంలోనూ గాలిలో తేమ శాతం బాగా తగ్గిపోయింది. దీంతో వడగాలులు మరింత పెరిగే అవకాశం ఉందని హెచ్చరించింది.
             
శుక్రవారం నుంచి వేడిగాలులు, ఉష్ణోగ్రతలు అధికం కానున్నాయి. ఉత్తరాంధ్రలో 45-47 డిగ్రీలు, దక్షిణ కోస్తాలో 43-44డిగ్రీలు, రాయలసీమలో 41-42డిగ్రీల నమోదు కానున్నాయి. 23న ఉత్తరాంధ్రలో తేలికపాటి జల్లులు పడే అవకాశం ఉన్నా, విశాఖ, దక్షిణ కోస్తా జిల్లాల్లో 46-48డిగ్రీలు, విజయనగరం, ఉభయగోదావరి, నెల్లూరు, చిత్తూరు, కర్నూలు జిల్లాల్లో 43-45డిగ్రీలు, నమోదు కానున్నాయి. 24న ఉత్తరాంధ్ర, దక్షిణ కోస్తాలో 44-46 డిగ్రీలు, ఉభయ గోదావరి, చిత్తూరు జిల్లాల్లో 42-43డిగ్రీలు, రాయలసీమలో 39-42డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది. 25న కూడా ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో 43-44, ఉత్తరాంధ్ర, గోదావరి జిల్లాలు, దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో 41-42, శ్రీకాకుళం జిల్లాలో మాత్రం 38-39 డిగ్రీల ఉష్ణోగ్రతలు ఉంటాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ప్రజలు వడగాలుల బారిన పడకుండా, డీహైడ్రేట్‌ కాకుండా ద్రవ పదార్థాలు ఎక్కువగా తీసుకుంటూ, నీడలో ఉండాలని విపత్తుల నిర్వహణ శాఖ సూచించింది. మరో రెండురోజులపాటు కోస్తాలో వడగాడ్పులు వీస్తాయని విశాఖ తుఫాన్‌ హెచ్చరిక కేంద్రం డైరెక్టర్‌ విజయభాస్కర్‌ తెలిపారు. 24వరకు వడగాడ్పులు కొనసాగి తరువాత క్రమేపీ తగ్గుతాయని ఇస్రో నిపుణుడు పేర్కొన్నారు.






21, మే 2020, గురువారం

ఆంఫన్ తాకిడికి పశ్చిమబెంగాల్‌లో 72 మంది మృతి

           
కోల్‌కతా: ఆంఫన్ తుపాను తాకిడికి పశ్చిమబెంగాల్‌లో 72 మంది చనిపోయారు. తన జీవితంలో ఇంతటి విధ్వంసాన్ని చూడలేదని ముఖ్యమంత్రి మమతా బెనర్జీ చెప్పారు. పరిస్థితిని స్వయంగా అంచనా వేసేందుకు ప్రధానమంత్రిని రాష్ట్రంలో పర్యటించాలని కోరారు. మృతుల కుటుంబాలకు ఆమె రెండున్నర లక్షల రూపాయల పరిహారం ప్రకటించారు.
          అతి తీవ్ర తుఫాన్‌ ‘ఆంఫన్‌’ పశ్చిమ బెంగాల్‌లోని డిఘా, బంగ్లాదేశ్‌లోని హతియా దీవుల మధ్య సుందర్‌బన్స్‌కు సమీపంలో బుధవారం సాయంత్రం తీరం దాటింది. మధ్యాహ్నం 3.30 గంటలకు ప్రారంభమైన ఈ ప్రక్రియ 5.30 గంటలకు ముగిసినట్టు భారత వాతావరణ విభాగం(ఐఎండీ) తెలిపింది. తీరం దాటే సమయంలో గంటకు 155 నుంచి 165, అప్పుడప్పుడు 190 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీచాయి. కాగా, పశ్చిమబెంగాల్‌, ఒడిసాల్లోని తీర ప్రాంత జిల్లాలపై ఆంఫన్‌ ప్రభావం భారీగా ఉందని ఐఎండీ పేర్కొంది. ఇరు రాష్ట్రాలోనూ భారీ గాలులు, వర్షాలతో ఇళ్లు నేలమట్టమయ్యాయి. వందలాది ఇళ్ల పైకప్పులు ఎగిరిపోయాయి. హౌరా జిల్లా మణికాన్‌లో భారీ వృక్షాలు కూకటివేళ్లతో సహా నేలకొరిగాయి. చాలా ప్రాంతాల్లో విద్యుత్‌ స్తంభాలు విరిగిపోయాయి.
         పశ్చిమబెంగాల్‌లో కోట్లాది రూపాయల ఆస్తి నష్టం సంభవించిందని తెలుస్తోంది. బెంగాల్‌లో పెద్ద ఎత్తున మరణాలు సంభవించడంపై బీజేపీ విచారం వ్యక్తం చేసింది. సహాయ కార్యక్రమాల్లో పాల్గొనాలని ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నద్దా కార్యకర్తలకు పిలుపునిచ్చారు. 


20, మే 2020, బుధవారం

21 నుంచి ఆర్ టి సి బస్సులు రోడ్డు పైకి


  • ఆన్‌లైన్‌లో లేదా బస్టాండ్‌లో టికెట్‌ కొనాలి
  • గ్రీన్‌, ఆరెంజ్‌ జోన్లలోనే అనుమతి
  • తొలుత 15% బస్సులతో ప్రారంభం
  • విజయవాడ, విశాఖలో కొంత ఆగాలి

            ఆర్టీసీ బస్సులు అరవై రోజుల తర్వాత ఎట్టకేలకు రోడ్డెక్కుతున్నాయి. లాక్‌ డౌన్‌తో రెండు నెలలుగా డిపోలకే పరిమితమై 2020 మే 21
గురువారం నుంచి ప్రయాణికులను గమ్యం చేర్చేందుకు సిద్ధమవుతున్నాయి. గ్రీన్‌, ఆరెంజ్‌ జోన్లలోని ప్రజల ప్రయాణ అవసరాలు తీర్చేందుకు పది నుంచి పదిహేను శాతం బస్సులు డిపోల నుంచి బస్టాండ్లకు చేరనున్నాయి. అప్పటికే ఆన్‌లైన్‌ బుకింగ్‌ చేసుకున్న వారినీ, బస్టాండుకు వచ్చి గ్రౌండ్‌ బుకింగ్‌ ద్వారా టికెట్‌ తీసుకున్నవారినే బస్సుల్లోకి ఎక్కిస్తారు. నగదు ద్వారా కొవిడ్‌ వచ్చే అవకాశం ఉందని, అందుకే కండక్టర్‌ బస్సులో ఉండకుండా ఈ విధానం అమల్లోకి తీసుకొస్తున్నామని ఆపరేషన్‌ విభాగానికి చెందిన కీలక అధికారి ఒకరు చెప్పారు. నిజానికి, ఈ నెల 18 నుంచే బస్సులు తిప్పేందుకు ఆర్టీసీ సిద్ధమైంది. అయితే, ప్రభుత్వం నుంచి అనుమతి రాకపోవడంతో ఇందుకు రెండు రోజులు ఆగాల్సి వచ్చింది.

రాష్ట్రవ్యాప్తంగా 128 బస్‌ డిపోలు ఉన్నాయి. వీటిలో వీలైనన్ని డిపోల నుంచి సాధ్యమైనన్ని బస్సులు నడపాలని అధికారులు భావించారు. అందుకు అనుగుణంగా అంతా సిద్ధమవ్వడంతో, ఎండీ మాదిరెడ్డి ప్రతాప్‌ అధికారికంగా ప్రకటన చేసేందుకు మంగళవారం విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. అప్పటికే ముఖ్యమంత్రి జగన్‌తో రవాణాశాఖ మంత్రి పేర్ని నాని, టాస్క్‌ఫోర్స్‌ ఉన్నతాధికారులు సమావేశం అవడంతో.. ఆర్టీసీ ఎండీని పిలిపించారు. విలేకరుల సమావేశం రద్దు చేసుకుని వెళ్లిన ఎండీ, ఇతర అధికారులతో కలిసి పలు అంశాలపై చర్చించారు.                         బస్సుల్లో సీటింగ్‌ మార్పు, గ్రీన్‌ జోన్ల మధ్య తిప్పేందుకు ప్రణాళిక, రెడ్‌ జోన్లలో పాటించే నిబంధనలు, తక్కువ సీట్లతో తిప్పితే వచ్చే నష్టం, ప్రజలకు బస్సులు తిరగడం వల్ల కలిగే ఉపయోగం తదితర అంశాలపై చర్చించారు. పొరుగు రాష్ట్రం తెలంగాణ.. హైదరాబాద్‌ మినహా రాష్ట్రమంతా తిప్పేందుకు నిర్ణయం తీసుకొంది. అదే తరహాలో మన రాష్ట్రంలోనూ పెద్దనగరాలైన విజయవాడ, విశాఖపట్నంలో మరికొన్ని రోజులు బస్సులు నడపరాదని నిర్ణయించారు. చార్జీల విషయంలో ప్రస్తుతానికి ఎలాంటి పెంపు లేకుండా పాత రేట్లతోనే నడపాలని సీఎం చెప్పడంతో అధికారులు సరేనన్నారు. అయితే డిపోల్లో కొన్ని బస్సులకే సీటింగ్‌ విధానం మార్చడం వల్ల వీలైనంత మేరకు బస్సులు నడపాలని నిర్ణయం తీసుకున్నారు. స్పందన ద్వారా టికెట్లు బుక్‌ చేసుకున్న వారికి మొదటి ప్రాధాన్యం ఇస్తారు. కాగా, ఆర్టీసీ బస్సులు తిప్పడంపై బుధవారం ఎంపీ మాదిరెడ్డి ప్రతాప్‌ అధికారికంగా ప్రకటన చేయనున్నారు.

17, మే 2020, ఆదివారం

మే 31 వరకూ లాక్‌డౌన్‌

                      న్యూఢిల్లీ: కరోనా కట్టడికి దేశవ్యాప్తంగా విధించిన లాక్‌డౌన్‌ను మే 31 వరకూ పొడిగిస్తూ కేంద్రం తాజాగా నిర్ణయం తీసుకుంది. మరికొద్దిసేపట్లో ఇందుకు సంబంధించిన మార్గదర్శకాలను కేంద్రం ప్రకటించనుంది. ప్రజా రవాణాపై కూడా కీలక ప్రకటన చేసే అవకాశముంది. ఈసారి మార్గదర్శకాలు గతంలో కంటే భిన్నంగా ఉంటాయని ప్రధాని మోదీ ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే. లాక్‌డౌన్‌ను కొనసాగిస్తూనే మరోవైపు ఆర్థిక కార్యకలాపాలు మొదలుపెట్టాలని ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్‌లో ప్రధాని మోదీ స్పష్టం చేశారు. గ్రీన్, ఆరెంజ్ జోన్లలో మరిన్ని సడలింపులకు కేంద్రం అవకాశం ఇవ్వనున్నట్లు తెలిసింది.
           మరోపక్క దేశవ్యాప్తంగా కరోనా తీవ్రత ఎక్కువగా ఉన్న మున్సిపాలిటీలపై కేంద్రం ప్రత్యేకంగా దృష్టి సారించనుంది. కేసులు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో లాక్‌డౌన్ ఆంక్షలను మరింత కఠినతరం చేయాలని కేంద్రం భావిస్తోంది. దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతుండటంతో లాక్‌డౌన్‌ను కొనసాగించడమే శ్రేయస్కరమని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. భారత్‌లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య ఇప్పటికే 90 వేలు దాటింది. కరోనా మరణాల సంఖ్య 2800 దాటింది.                                                                                                                                        

లాక్‌డౌన్ 4.0 మార్గదర్శకాలను విడుదల చేసిన కేంద్ర హోం శాఖ

 కేంద్రం అందుకు సంబంధించిన మార్గదర్శకాలను తాజాగా విడుదల చేసింది. మే 31 వరకూ మెట్రో, విమాన సేవలు అందుబాటులో ఉండవని కేంద్రం స్పష్టం చేసింది. కరోనా హాట్‌స్పాట్స్‌లో ఆంక్షలు మరింత కఠినంగా అమలు చేయనున్నట్లు ప్రకటించింది.
                పాఠశాలలు, కళాశాలలు, కోచింగ్ సెంటర్లు మే 31 వరకూ మూసివేసే ఉంటాయని స్పష్టం చేసింది. హోటళ్లు, రెస్టారెంట్లు మే 31 వరకూ తెరిచేందుకు అనుమతి లేదని కేంద్రం తేల్చి చెప్పింది. సినిమా హాళ్లు, షాపింగ్ మాల్స్, జిమ్ సెంటర్లు, స్విమింగ్ పూల్స్, బార్లు, ఆడిటోరియంలు, అసెంబ్లీ హాల్స్, స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లు మే 31 వరకూ తెరిచే పరిస్థితి లేదని కేంద్రం ప్రకటించింది. మే 31 వరకూ.. ప్రతిరోజూ రాత్రి 7 గంటల నుంచి ఉదయం 7 గంటల వరకూ కర్ఫ్యూ కొనసాగుతుందని తెలిపింది. కంటైన్మెంట్, రెడ్, గ్రీన్, ఆరెంజ్ జోన్లపై రాష్ట్రాలదే అధికారం అని కేంద్రం స్పష్టం చేసింది. రాష్ట్రాల పరస్పర అనుమతితో ప్రజారవాణా వెసులుబాటును కేంద్ర ప్రభుత్వం కల్పించింది. అన్ని రకాల మతపరమైన కార్యక్రమాలపై నిషేధం కొనసాగుతుందని పేర్కొంది. రెస్టారెంట్లకు హోం డెలివరీ అందించేందుకు మాత్రమే వెసులుబాటును కల్పిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.