18, ఆగస్టు 2019, ఆదివారం

ఎపిని మార్చడమే నా కల

* పరిశ్రమలకు ఎర్ర తివాచీతో స్వాగతం
* ఎన్నికల్లో ప్రవాసాంధ్రుల పాత్ర గొప్పది
* డల్లాస్‌ సభలో ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి

                రాష్ట్రాన్ని అవినీతి, లంచగొండితనం లేని రాష్ట్రంగా మార్చాలన్నదే తన కల అని ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి అన్నారు. అమెరికా పర్యటనలో భాగంగా డల్లాస్‌లో ప్రవాసాంధ్రులు నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. సంవత్సరానికి ఒకటి, రెండు సార్లయినా సొంత గ్రామాలకు వచ్చి అందరినీ పలకరించాని, పెట్టుబడులు పెట్టడానికి ముందడుగు వేస్తూ మీరు రావాలని, ప్రభుత్వం అన్ని రకాలుగా తోడుంటుందని సిఎం చెప్పారు. గ్రామాల్లో మీరు చదువుకున్న బడులను మార్చాలని ఆరాటం ఉన్నవాళ్లు, గ్రామాల్లో వైద్యశాలలు మార్చాలని తపన ఉన్నవాళ్లు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. అందరూ కలిసి గ్రామాలను బాగుపరుచుకుందామని, ప్రభుత్వ ప్రయత్నాలకు మంచి హృదయంతో మద్దతివ్వాలని కోరారు. పరిశ్రమలకు ఎర్ర తివాచీ పరిచి ఆహ్వానిస్తున్నామని, పిపిఎల సమీక్ష ద్వారా పరిశ్రమలకు మేలు కలుగుతుందని అన్నారు. మొన్నటి ఎన్నికల్లో ప్రవాసాంధ్రుల పోషించిన పాత్ర చాలా గొప్పదని, చరిత్రాత్మక విజయం వెనుక మీ కృషి ఉందని అన్నారు. అమెరికన్లను మించి తెలుగువారు, భారతీయులు ఎదుగుతున్న తీరు గర్వకారణమన్నారు. తెలుగువారి ఆత్మగౌరవాన్ని పెంచేలా రెండున్నర నెలల పాలనలో విప్లవాత్మక చర్యలు చేపట్టామని, ప్రతి మనిషీ, ప్రతి కుంటుంబమూ ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా గౌరవాన్ని పెంచేలా నిర్ణయాలు చేశామని చెప్పారు. అన్నం పెడుతున్న రైతులకు అన్నం దొరక్క అప్పులు పాలై ఆత్మహత్య చేసుకునే పరిస్థితులు రాకూడదన్నది, రాష్ట్రంలో నిరక్షరాస్యత ఉండకూడదన్నది, పల్లెలు కళకళలాడాలని, ప్రభుత్వ బడుల్లో మంచి చదువులు ఉండాలన్నది తన కోరికని అన్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్యం గొప్పగా ఉండాలని, పేదవాడు వైద్యం ఖర్చు భరించలేక, చనిపోయే పరిస్థితి రాష్ట్రంలో ఎప్పటికీ రాకూడదన్నది, సొంత ఇల్లు లేని పేదవాడు ఉండకూడదన్నది, పేదరికం, నిరుద్యోగంతో పస్తులు ఉండకూడదన్నది తన కల అని చెప్పారు. కులాలు, మతాలు, వర్గాలు, ప్రాంతాలు, రాజకీయాలకు తావులేకుండా వివక్ష లేని పరిపాలన అందించాలన్నది తన కల అని తెలిపారు. రెండున్నర నెలల వ్యవధిలోనే గ్రామ వాలంటీర్లను, గ్రామ సచివాలయాలను తీసుకువస్తున్నానన్నారు. అణగారిన వర్గాలు, బిసి, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు గతంలో ఎప్పుడూ లేని విధంగా, నామినేటెడ్‌ పదవులు, నామినేటెడ్‌ పనుల్లో రిజర్వేషన్లు కల్పిస్తున్నామన్నారు. 75శాతం ఉద్యోగాలు స్థానికులకే ఇచ్చేలా దేశంలో ఎక్కడాలేని చట్టాన్ని తీసుకొచ్చామన్నారు. తెలంగాణ రాష్ట్రంతో సత్సంబంధాలను కుదుర్చుకుంటున్నామని తెలిపారు. మూడేళ్లలో పాఠశాలలు, ఆస్పత్రుల పరిస్థితిని మారుస్తామని, నాడు, నేడు అని ఫొటోలు చూపిస్తామని చెప్పారు.

13, ఆగస్టు 2019, మంగళవారం

విమానం కాదు.. స్వేచ్ఛ కావాలి : రాహుల్‌


గవర్నర్‌ వ్యాఖ్యలకు కౌంటర్‌ 

         దిల్లీ: జమ్మూకశ్మీర్‌లో పర్యటించేందుకు రావాలన్న గవర్నర్ సత్యపాల్‌ మాలిక్‌ ఆహ్వానాన్ని కాంగ్రెస్‌ నేత రాహుల్‌గాంధీ స్వాగతించారు. అయితే అందుకు విమానం పంపాల్సిన అవసరం లేదన్నారు. తనతో పాటు ఇతర ప్రతిపక్ష నేతలు జమ్మూకశ్మీర్‌లో పర్యటించి, ప్రజలు, సైనికులను కలిసి మాట్లాడేందుకు స్వేచ్ఛ కల్పించాలని రాహుల్‌ గవర్నర్‌ను కోరారు. ‘ప్రతిపక్ష నాయకుల బృందం జమ్మూకశ్మీర్‌, లద్దాఖ్‌లో పర్యటించాలన్న మీ ఆహ్వానం చాలా గొప్పది. కానీ అక్కడ పర్యటించి ప్రజలు, సైనికులతో కలిసి మాట్లాడే స్వేచ్ఛ మాకు కావాలి’ అని రాహుల్‌ గవర్నర్‌కు ట్వీట్‌ చేశారు.  
            కశ్మీర్‌లో హింసాత్మక ఘటనలు జరుగుతున్నాయన్న రాహుల్‌గాంధీ వ్యాఖ్యలపై గవర్నర్‌ సత్యపాల్‌ మాలిక్‌ నిన్న మండిపడ్డారు. రాహుల్‌ను తాను కశ్మీర్‌కు ఆహ్వానించానని, ఆయనకు విమానం కూడా పంపుతానని, వచ్చి ఇక్కడి పరిస్థితి గమనించి అప్పుడు మాట్లాడాలని ఆయన అన్నారు.

12, ఆగస్టు 2019, సోమవారం

మరో వారంలో జాబిల్లి కక్ష్యలోకి చంద్రయాన్‌2


           అహ్మదాబాద్‌: భారత అంతరిక్ష రంగంలో సరికొత్త అధ్యయనాన్ని లిఖిస్తూ నింగిలోకి దూసుకెళ్లిన చంద్రయాన్‌ -2 మరో వారంలో జాబిల్లి కక్ష్యలోకి చేరనుంది. ఈ నెల 20న చంద్రుడి కక్ష్యలోకి ప్రవేశించి.. సెప్టెంబరు 7న జాబిల్లి ఉపరితలంపై ల్యాండ్‌ అవుతుందని ఇస్రో ఛైర్మన్‌ కె.శివన్‌ తెలిపారు. 
    భారత అంతరిక్ష పితామహుడు విక్రమ్‌ సారాభాయ్‌ శతజయంతి సందర్భంగా అహ్మదాబాద్‌లో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో శివన్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చంద్రయాన్‌ 2 విశేషాలను పంచుకున్నారు. ‘జులై 22న చంద్రయాన్‌-2ను ప్రయోగించిన తర్వాత ఐదు సార్లు కక్ష్య పెంపు ప్రక్రియలు చేపట్టాం. అవన్నీ విజయవంతమయ్యాయి. అత్యంత కీలకమైన కక్ష్య పెంపు ప్రక్రియను బుధవారం ఉదయం చేపట్టనున్నాం. ఆగస్టు 14న తెల్లవారుజామున 3.30 గంటల ప్రాంతంలో ట్రాన్స్‌-లూనార్‌ ఇంజెక్షన్‌ ప్రక్రియ జరుపుతాం. దీంతో చంద్రయాన్‌ -2 భూకక్ష్యను వదిలి చంద్రుడి కక్ష్య దిశగా పయనిస్తుంది. ఆ తర్వాత లూనార్‌ ఆర్బిట్‌ ఇన్సర్షన్‌ ప్రక్రియ చేపడతాం. ఆగస్టు 20 నాటికి జాబిల్లి స్థిర కక్ష్యలోకి ప్రవేశిస్తుంది. అప్పుడు కూడా కొన్ని కక్ష్య పెంపులు చేపట్టిన తర్వాత చివరగా సెప్టెంబరు 7న చంద్రుడి ఉపరితలంపై దక్షిణ ధ్రువానికి సమీపంలో దిగుతుంది’ అని శివన్‌ తెలిపారు. 
           ప్రస్తుతం వ్యోమనౌక పక్కాగా ఉందని, అన్ని సిస్టమ్స్‌ సరిగ్గా పనిచేస్తున్నాయని ఆయన వివరించారు. జులై 22న జీఎస్‌ఎల్వీ మార్క్‌ 3 ద్వారా చంద్రయాన్‌-2 ప్రయోగాన్ని చేపట్టిన విషయం తెలిసిందే.

9, ఆగస్టు 2019, శుక్రవారం

జాతీయ అవార్డులు: ఉత్తమ నటి కీర్తిసురేశ్‌

జాతీయ చలన చిత్ర పురస్కారాల ప్రకటన
దిల్లీ: ప్రతిష్టాత్మక 66వ జాతీయ చలన చిత్ర అవార్డులను శుక్రవారం ప్రకటించారు. దేశ రాజధాని దిల్లీలో ఈ కార్యక్రమం జరిగింది. 2018లో దేశవ్యాప్తంగా విడుదలైన అన్ని భాషల్లోని చిత్రాలను పరిగణనలోకి తీసుకుని అవార్డు విజేతలను ప్రకటించారు. అంతకుముందు జ్యూరీ సభ్యులు విజేతల జాబితాను కేంద్రం సమాచార, ప్రసారశాఖ మంత్రి ప్రకాశ్‌ జావడేకర్‌కు అందజేశారు. దర్శకుడు రాహుల్‌ రాలీ జ్యూరీ సభ్యులతో ఉన్నారు. ఈ ఏడాది ఏప్రిల్‌లో అవార్డులను ప్రకటించి మేలో ప్రదానం చేయాల్సి ఉండగా, సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో వాయిదా వేశారు. ఈసారి జాతీయ పురస్కారాల్లో తెలుగు చిత్ర పరిశ్రమ నుంచి ‘మహానటి’, ‘రంగస్థలం’, ‘అ!’, ‘చి||ల||సౌ||’ చిత్రాలకు అవార్డులు దక్కాయి.
* ఉత్తమ చిత్రం: హెల్లారో(గుజరాతీ)
* ఉత్తమ దర్శకుడు: ఆదిత్య ధర్‌(ఉరి)
* ఉత్తమ నటుడు: ఆయుష్మాన్‌ ఖురానా(అంధాధున్‌), విక్కీ కౌశల్‌(ఉరి)
* ఉత్తమ నటి: కీర్తి సురేశ్‌(మహానటి)
* ఉత్తమ సహాయ నటుడు: స్వానంద్‌ కిర్‌కిరే(చంబక్‌)
* ఉత్తమ సహాయ నటి: సురేఖా సిక్రీ(బదాయ్‌ హో)

* ఉత్తమ పర్యావరణ పరిరక్షణ నేపథ్య చిత్రం: పానీ(మరాఠీ)
* ఉత్తమ సామాజిక చిత్రం: ప్యాడ్‌మ్యాన్‌
* ఉత్తమ వినోదాత్మక చిత్రం: బదాయ్‌ హో
* ఉత్తమ పరిచయ దర్శకుడు: సుధాకర్‌రెడ్డి యాకంటి(నాల్‌: మరాఠీ)

* జాతీయ ఉత్తమ హిందీ చిత్రం: అంధాధున్‌
* జాతీయ ఉత్తమ తెలుగు చిత్రం: మహానటి
* జాతీయ ఉత్తమ సినిమాటోగ్రఫీ: పద్మావత్‌
* జాతీయ ఉత్తమ ఉర్దూ చిత్రం: హమీద్‌
* ఉత్తమ సంగీత దర్శకుడు: సంజయ్‌ లీలా భన్సాలీ(పద్మావత్‌)
* జాతీయ ఉత్తమ యాక్షన్‌ చలన చిత్రం: కేజీఎఫ్‌
* ఉత్తమ ఆడియోగ్రఫీ: రంగస్థలం (రాజా కృష్ణన్)

* ఉత్తమ స్క్రీన్ ప్లే చిత్రం:  చి||ల||సౌ||
* ఉత్తమ స్పెషల్‌ ఎఫెక్ట్స్‌: ‘అ!’(తెలుగు) కేజీఎఫ్‌(కన్నడ)
* ఉత్తమ సాహిత్యం: నాతిచరామి(కన్నడ)
* ఉత్తమ మేకప్‌: ‘అ!’
* ఉత్తమ కాస్ట్యూమ్స్‌ డిజైనర్‌: మహానటి
* ఉత్తమ ప్రొడక్షన్‌ డిజైన్‌: కమ్మార సంభవం(మలయాళం)

* ఉత్తమ ఎడిటింగ్‌: నాతిచరామి(కన్నడ)
* ఉత్తమ సౌండ్‌ డిజైనింగ్‌: ఉరి
* ఉత్తమ అడాప్టెడ్‌ స్క్రీప్‌ప్లే: అంధాధున్‌
* ఉత్తమ సంభాషణలు: తారీఖ్‌(బెంగాలీ)
* ఉత్తమ గాయని: బిందుమాలిని(నాతి చరామి: మాయావి మానవే)
* ఉత్తమ గాయకుడు: అర్జిత్‌సింగ్‌(పద్మావత్‌: బింటే దిల్‌)
* ఉత్తమ బాల నటుడు: పీవీ రోహిత్‌, షాహిబ్‌ సింగ్‌, తలాహ్‌ అర్షద్‌ రేసి, శ్రీనివాస్‌ పోకాలే

* నర్గీస్‌ దత్‌ అవార్డు: వండల్లా ఎరడల్లా(కన్నడ)

8, ఆగస్టు 2019, గురువారం

వాసిరెడ్డి పద్మకు కీలక పదవి

        ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్‌గా వైకాపా సీనియర్‌ నేత వాసిరెడ్డి పద్మ నియమితులయ్యారు. ఈ పదవిలో ఆమెను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. ఐదేళ్ల పాటు మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్‌గా పద్మ కొనసాగనున్నారు. ఇప్పటిదాకా ఈ పదవిలో కొనసాగిన నన్నపనేని రాజకుమారి బుధవారం రాజీనామా చేయడంతో ఆ స్థానంలో వాసిరెడ్డి పద్మను నియమిస్తూ ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీచేసింది.

7, ఆగస్టు 2019, బుధవారం

సుష్మాస్వరాజ్‌ ‘ప్రస్థానం’


         సాధారణ నేపథ్యం నుంచి వచ్చి ముఖ్యమంత్రిగా.. కేంద్ర మంత్రిగా దేశ రాజకీయాలపై తనదైన ముద్రవేశారు సుష్మా స్వరాజ్‌. భారతదేశపు మహిళా రాజకీయ నేతలలో ప్రత్యేక స్థానం సంపాదించారు‌. విద్యార్థి నాయకురాలి నుంచి కేంద్ర మంత్రిగా ఆమె ఎదిగిన తీరు ప్రతి ఒక్కరికీ ఆదర్శప్రాయం. భాజపాలో చేరి పార్టీ బలోపేతానికి ఎంతో కృషి చేసిన మహిళా నాయకురాలామె. విదేశాంగమంత్రిగా ఎంతో మంది భారతీయులకు ఆపన్నహస్తం అందించారు. భారతీయులకే కాదు విదేశీయులకు కూడా ఆమె స్వయంగా సహాయం చేసిన సందర్భాలెన్నో. 67ఏళ్ల సుష్మా06-08-2019  మంగళవారం రాత్రి గుండె పోటుతో తుదిశ్వాస విడిచారు. ఈ నేపథ్యంలో సుష్మాస్వరాజ్‌ గురించి..
బాల్యం, విద్యాభ్యాసం
సుష్మాస్వరాజ్ కళాశాల విద్య వరకు అంబాలాలోనే జరిగింది. ఆ తరువాత పంజాబ్ విశ్వవిద్యాలయం, చండీగఢ్‌ నుంచి న్యాయశాస్త్రంలో పట్టా పొందారు. 1970లలో విద్యార్థి దశలోనే ఆమె ఇందిరాగాంధీకి వ్యతిరేకంగా విద్యార్థి నాయకురాలిగా ఉద్యమం నడిపారు.
సుష్మా రాజకీయ జీవితం

1977లో జనతా పార్టీ తరఫున హరియాణా విధానసభ సభ్యురాలిగా ఎన్నికై 1982 వరకు ఆ పదవిని నిర్వహించి మళ్ళీ 1987లో రెండో పర్యాయం భారతీయ జనతా పార్టీ తరఫున హరియాణా విధానసభకు ఎన్నికయ్యారు. 1977 నుంచి 1979 వరకు దేవీలాల్ ప్రభుత్వంలో కార్మిక, ఉపాధి కల్పన శాఖల మంత్రిగా పనిచేశారు. 1984లో సుష్మాస్వరాజ్ భారతీయ జనతా పార్టీలో చేరారు. 1987 నుంచి 1990 వరకు దేవీలాల్ నేతృత్వంలోని లోకదళ్-భారతీయ జనతా పార్టీ సంయుక్త ప్రభుత్వంలో విద్య, ఆరోగ్యం, పౌరసరఫరాలశాఖ మంత్రిగా వ్యవహరించారు. 
జాతీయ రాజకీయాలు
1990లో సుష్మాస్వరాజ్ రాజ్యసభకు ఎన్నికై జాతీయ రాజకీయాలలో ప్రవేశించారు. అంతకుముందు 1980, 1984, 1989లలో కార్నాల్ లోకసభ నియోజకవర్గం నుంచి పోటీచేసి పరాజయం పొందారు. 1996లో దక్షిణ దిల్లీ నియోజకవర్గం నుంచి 11వ లోక్‌సభకు ఎన్నికయ్యారు. 1996లో 13 రోజుల అటల్ బిహారీ వాజపేయీ ప్రభుత్వంలో సమాచార, ప్రసార శాఖ కేబినెట్ మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. 1998లో 12వ లోక్‌సభకు మళ్లీ  రెండో సారి దక్షిణ దిల్లీ నియోజకవర్గం నుంచి ఎన్నికై వాజపేయీ రెండో మంత్రివర్గంలో మళ్లీ అదే శాఖకు మంత్రిగా పనిచేశారు. మార్చి 19 నుంచి అదనంగా టెలికమ్యునికేషన్ శాఖ బాధ్యతలు కూడా నిర్వహించారు. 
దిల్లీ ముఖ్యమంత్రిగా సుష్మా
దిల్లీ శాసనసభ ఎన్నికల్లో  విజయం సాధించడానికి 1998 అక్టోబరులో భారతీయ జనతా పార్టీ అధిష్ఠానం సుష్మాస్వరాజ్‌ను రంగంలో దింపింది. ఆ ఎన్నికల్లో భాజపా విజయం సాధించడంతో సుష్మా దిల్లీ ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టారు. దిల్లీ ముఖ్యమంత్రి పదవి చేపట్టిన తొలి మహిళగా ఆమె రికార్డు సృష్టించారు. 
బళ్ళారిలో సోనియాగాంధీపై పోటీ
1999లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో సోనియా గాంధీ కర్ణాటకలోని బళ్ళారి లోక్‌సభ నియోజకవర్గం నుంచి పోటీచేశారు. సోనియాగాంధీపై పోటీకి భారతీయ జనతా పార్టీ తరఫున సుష్మాస్వరాజ్‌ బరిలో నిలిచారు. ఆ ఎన్నికల్లో సుష్మాస్వరాజ్ ఓడిపోయినప్పటికీ.. సోనియాపై పోటీచేసి దేశ ప్రజల దృష్టిని ఆకర్షించింది.
‘ఆపన్న’ సుష్మ
కేంద్ర మాజీ మంత్రి సుష్మా సోషల్‌ మీడియాలో చాలా చురుగ్గా ఉంటారు. ఆపదలో ఉన్నామని ట్విటర్‌ వేదికగా ఆమెను ఆశ్రయించిన వారిని ఆపన్న హస్తం అందించేవారు. అందుకే ఆమెను అభిమానులు ‘ట్విటర్‌ క్వీన్‌’ అని ముద్దుగా పిలుచుకునేవారు. ఇరాక్‌లో చిక్కుకున్న ఎంతో మందికి ఆమె స్వయంగా రంగంలోకి దిగి సాయం అందించారు. 
తీజ్‌ వేడుకల్లో
సుష్మా రాజకీయాల్లో నే కాదు వ్యక్తిగత జీవితానికి ప్రాధాన్యం ఇస్తారు. పలు వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొంటారు. దిల్లీలో భాజపా మహిళా మోర్చ నిర్వహించిన తీజ్‌ వేడుకల్లో పాల్గొని ఇలా చిన్న పిల్లలా ఉయ్యాలలూగారు.
వ్యక్తిగత జీవితం
       క్రిమినల్‌ న్యాయవాది స్వరాజ్‌ కౌశల్‌ను 1975 జులై 13న సుష్మ వివాహమాడారు. రాజకీయాల్లో రాణించేలా ఆయన సుష్మకు పూర్తి ప్రోత్సాహం అందించారు. 1990-93 మధ్య మిజోరం గవర్నర్‌గా కౌశల్‌ పనిచేశారు. మనదేశంలో అతి పిన్న వయసులో గవర్నర్‌ పదవిని చేపట్టిన వ్యక్తిగా ఆయన రికార్డులకెక్కారు. 1998-2004 మధ్య కౌశల్‌ ఎంపీగా కూడా ఉన్నారు. సుష్మ-కౌశల్‌ దంపతులకు ఒక్కగానొక్క కుమార్తె. ఆమె పేరు బన్సూరీ కౌశల్‌. బన్సూరీ ఆక్స్‌ఫర్డ్‌ విశ్వవిద్యాలయంలో గ్రాడ్యుయేషన్‌ పూర్తిచేశారు.
విదేశీ ప్రతినిధులతో
          భారత పర్యటనకు వచ్చిన ఎంతో మంది విదేశీ ప్రతినిధులతో సుష్మా సమావేశమై పలు విషయాలను చర్చించేవారు. 2017 అక్టోబర్‌ 17న భూటాన్‌ రాజు నాలుగురోజుల పర్యటనకు భారత్‌ వచ్చారు. ఈ సందర్భంగా వారికి స్వాగతం పలికి మాట్లాడారు. భూటాన్‌ రాజకుమారుడితో సుష్మా సరదాగా గడిపారు. హైదరాబాద్‌లో 2017 నవంబర్‌ 28న గ్లోబల్‌ ఎంటర్‌ ప్రెన్యూర్‌షిప్‌ సమ్మిట్‌ జరిగింది. ఈ సమ్మిట్‌కి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ కుమార్తె ఇవాంక ట్రంప్‌ వచ్చారు. అప్పుడు సుష్మా ఆమెతో కాసేపు సమావేశమయ్యారు.
మానవీయ కోణం
            పాకిస్తాన్‌లో బలవంతపు వివాహం బారిన పడి స్వదేశానికి చేరుకున్న భారత మహిళ ఉజ్మాను పరామర్శిస్తున్న అప్పటి విదేశాంగ మంత్రి  సుష్మా స్వరాజ్‌. భారత్‌కు చెందిన ఉజ్మా మలేషియాలో పరిచయమైన తహీర్‌ అలీని కలిసేందుకు 2018లో పాకిస్థాన్‌ వెళ్లారు. ఆలీ ఆమెను తుపాకీతో బెదిరించి బలవంతంగా పెళ్లి చేసుకున్నాడు. దీంతో ఆమె ఇస్లామాబాద్‌లోని భారత దౌత్యకార్యాలయ అధికారులను ఆశ్రయించింది. దీనిపై ఇస్లామాబాద్‌ హైకోర్టులో పిటీషన్‌ దాఖలు చేసింది. ఉజ్మాను భారత్‌కు పంపించడంతోపాటు, వాఘా సరిహద్దు వరకు రక్షణ కల్పించాల్సిందిగా కోర్టు తీర్పునిచ్చింది.
          పాకిస్థాన్‌కు చెందిన రంజాన్‌ మహ్మద్‌ బంగ్లాదేశ్‌ నుంచి భారత్‌లోకి ప్రవేశించాడు. 2009లో మహ్మద్‌ తల్లిదండ్రులు విడిపోయారు. వారు విడిపోయే సమయంలో కుమార్తె తల్లి వద్ద, కుమారుడు తండ్రి వద్ద ఉండేలా ఒప్పందం చేసుకున్నారు. 2010లో రంజాన్‌తో కలిసి తండ్రి బంగ్లాదేశ్‌కు వచ్చాడు. అక్కడ మరో మహిళను వివాహం చేసుకున్నాడు. ఆ మహిళ రంజాన్‌ను ఇబ్బందులు పెట్టింది. దీంతో తన తల్లి వద్దకు వెళ్లాలని భావించిన అతనికి స్థానిక వ్యక్తి సలహా మేరకు భోపాల్‌ చేరుకున్నాడు. పోలీసుల తనిఖీలో పట్టుబడి స్వచ్ఛంద సంస్థ ఆశ్రమానికి చేరుకున్నాడు. వారు రంజాన్‌ వివరాలను తెలుసుకుని పాకిస్థాన్‌లోని తల్లిని ఫోన్‌లో సంప్రదించారు. వీసా సమస్యతో బాలుడు పాకిస్థాన్‌ వెళ్లే అవకాశం లేకపోవడంతో ఎన్‌జీవో అప్పటి విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్‌ను సంప్రదించింది. ఆమె బాలుడిని పాకిస్థాన్‌ పంపించే ఏర్పాటు చేస్తామని ప్రకటించారు.

6, ఆగస్టు 2019, మంగళవారం

ఆకలి చంపుకోకండి


* ‘ఆలస్యమవుతోంది... నాకొద్దు టిఫిన్‌’ అంటూ కాలేజీ బస్సుకోసం పరుగెత్తింది కృతి.
* ‘ఎప్పుడూ పప్పు, బెండకాయలేనా? నేను  క్యాంటీన్‌లో తింటాను... లంచ్‌బాక్స్‌ వద్దు’ అంటూ వెళ్లిపోయింది పావని.
ఇలా సమయంలేదని... రుచులు నచ్చక... తిండి మానేస్తే సన్నగా కనిపిస్తామని... చాలామంది అమ్మాయిలు ఏదో ఒక వంకతో పొట్ట మాడ్చుకుంటారు. సమస్యలు ఎన్ని ఉన్నా... కౌమారంలో సరైన పోషకాలు అందకపోతే... భవిష్యత్తులో కొన్నిరకాల జబ్బుల బారిన పడే అవకాశాలు ఎక్కువ. వాటిని ఇప్పటినుంచే రాకుండా చేయాలంటే... ఆహారంలో ఈ మార్పులు అవసరం. అవేంటో చూసేయండి మరి.
           ఉదయం పూట అల్పాహారం మానేసి... మధ్యాహ్నం ఆకలికి ఎక్కువగా తినడం వల్ల క్రమంగా హార్మోన్లలో అసమతుల్యత ఎదురవుతుంది. సమయానికి తగినంత ఆహారం తీసుకోకపోతే... గ్యాస్‌ సమస్యలు తప్పవు. బరువూ పెరుగుతారు. శరీరంలో కొవ్వు పేరుకుపోతుంది. రక్తహీనత సమస్యా ఎదురవుతుంది.
* అమ్మాయిలు చిప్స్‌, ప్రాసెస్‌ చేసిన పదార్థాలు, మసాలా ఆహారాన్ని ఎక్కువగా ఇష్టపడటం మామూలే. వాటివల్ల శరీరానికి కావలసిన పోషకాలేవీ అందవు. అదనంగా కెలొరీలు చేరతాయి. బరువు పెరిగేకొద్దీ నెలసరిలో తేడా మొదలవుతుంది. పీసీఓడీ సమస్యా బాధించొచ్చు.
* తిండి మానేస్తే సన్నగా మారిపోతామనుకుంటారు అమ్మాయిలు. సరిగ్గా తినక సన్నగా మారినా... అనారోగ్యకరంగా, పేలవంగా కనిపిస్తారు. వాటికి హార్మోన్ల మార్పులూ తోడవుతాయి.

మరేం తినాలి...
            ఆకుకూరలు, కాయగూరలు, పండ్లు, పాలు, నట్స్‌, గుడ్లు... వంటి అన్ని రకాల పోషకాలు అందే సమతులాహారం  ఎంచుకోవాలి. పాలు, పాల పదార్థాలు తప్పనిసరి.  ఉదయం: నిద్రలేచిన గంటలోపు నూనె తక్కువగా ఉండే ఇడ్లీ, ఉప్మా, ఓట్స్‌ వంటివాటిల్లో ఏదో ఒకటి తినాలి.    రెండు ఖర్జూరాలు, ఓ పండు, గ్లాసు పాలూ తీసుకోవచ్చు. మధ్యాహ్నం: భోజనంలో రెండు కప్పుల అన్నం లేదా మూడు రోటీలు తీసుకోవచ్చు. దీనిలోకి పప్పూ, చికెన్‌, గుడ్డు, పనీర్‌... ఇలా ఏదో ఒకటి ఉండేలా చూసుకోవాలి.  ఓ కప్పు కూరగాయల సలాడ్‌ తప్పనిసరి.

      సాయంత్రం: తేలిగ్గా జీర్ణమయ్యే చిరుతిళ్లు ఏవైనా సాయంత్రం నాలుగు-ఐదు గంటల మధ్య తినాలి. మొలకల చాట్‌, సూప్‌, శాండ్‌విచ్‌, డోక్లా, వెజిటబుల్‌ ఫ్రాంకీ... ఇలా ఏవైనా తినొచ్చు.
           రాత్రి: భోజనంలో రెండు చపాతీలు, లేదా రెండు జొన్న రొట్టెలు, రాగిదోశవంటివి తీసుకోవచ్చు. పడుకునే ముందు కప్పు పాలు తాగితే మంచిది.
ఈ పోషకాలు అవసరం
         ఇనుము: ఈ వయసులోనే వారికి రుతుచక్రం మొదలవుతుంది. నెలసరి వల్ల రక్తహీనత ఎదురుకాకుండా ఉండాలంటే... ఈ పోషకం తప్పనిసరిగా అందాలి. చేపలు, కాలేయం వంటివాటితో పాటు సజ్జలు, రాగులు, ఆకుకూరలు, సెనగలు, ఉలవలు, పల్లీలు, నువ్వులు, కాయగూరలు, పండ్ల నుంచి ఇనుము అధికమోతాదులో లభిస్తుంది.
         క్యాల్షియం: ఇనుము తరువాత ఎక్కువగా అవసరమయ్యే ఖనిజం క్యాల్షియం. దీన్ని తగినంతగా తీసుకోకపోవడం వల్ల ఎముకలు బలహీనంగా మారతాయి. వయసుపెరిగేకొద్దీ కీళ్లనొప్పులు రాకుండా ఉండాలంటే... పాలు, పనీర్‌ వంటివి తీసుకోవాలి. అవి ఇష్టపడనివారు పెరుగు తినొచ్చు. వీటితో పాటు తాజా ఆకుకూరలు, నువ్వులు, రాగులు, రాజ్మా, వేరుసెనగ పప్పు, పప్పుధాన్యాలకు ప్రాధాన్యం ఇవ్వాలి.
         మేలు చేసే కొవ్వులు: చాలామంది కొవ్వు పదార్థాల్ని హానికరం అనుకుంటారు. వీటిల్లోనూ శరీరానికి మేలు చేసే కొవ్వులు ఉంటాయి. బీఎంఐ 18 కంటే తక్కువ ఉన్న అమ్మాయిల్లో నెలసరి క్రమంగా రాకపోవడానికి కొవ్వుల లోపం కారణమైతే... స్థూలకాయుల్లో ఇవి ఎక్కువ కావడం మరో కారణం. వీటిని తగిన మోతాదులో తీసుకోవాలి. ఈ పోషకం సరిగ్గా ఉంటేనే ఎ, డి, ఇ, కె విటమిన్లను శరీరం స్వీకరిస్తుంది. రోజులో కనీసం 35 నుంచి 40 మి.లీ. నూనె తీసుకోవచ్చు. వేరుసెనగ, బాదం, పిస్తా, వాల్‌నట్లు, నువ్వులు వంటివాటి నుంచి మేలుచేసే కొవ్వులు అందేలా చూసుకోవాలి.

5, ఆగస్టు 2019, సోమవారం

28 రాష్ట్రాలు, 9 కేంద్రపాలిత ప్రాంతాలు..


              జూన్‌ 2, 2014కి ముందు 28గా ఉన్న రాష్ట్రాల సంఖ్య తెలంగాణ ఏర్పాటుతో 29కి చేరింది. ఇప్పుడు ఆ సంఖ్య మళ్లీ 28కి చేరింది. జమ్ముకశ్మీర్‌ను విభజిస్తూ కేంద్రం తీసుకున్న తాజా నిర్ణయంతో రాష్ట్రాల సంఖ్య తగ్గి కేంద్రపాలిత ప్రాంతాల సంఖ్య పెరిగింది. జమ్ముకశ్మీర్‌ రాష్ట్రాన్ని రెండు ప్రాంతాలుగా విభజిస్తూ కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా ఈరోజు రాజ్యసభలో ప్రకటించారు. జమ్ము-కశ్మీర్‌ చట్టసభతో కూడిన కేంద్రపాలిత ప్రాంతంగా.. లఢఖ్ అసెంబ్లీ లేని కేంద్ర పాలిత ప్రాంతంగా ఏర్పాటు కానున్నాయి. రెండు ప్రాంతాలకు ప్రత్యేక లెఫ్టినెంట్‌ గవర్నర్లు ఉండనున్నారు. దీంతో ప్రస్తుతం రాష్ట్రాల సంఖ్య 28కి చేరగా.. కేంద్ర పాలిత ప్రాంతాల సంఖ్య తొమ్మిదికి చేరింది.
            ఇప్పటివరకు కశ్మీర్‌లో 22 జిల్లాలు ఉండేవి. వాటిని జమ్ము, కశ్మీర్‌, లద్దాఖ్‌ రీజియన్లుగా వ్యవహరించేవారు. కాగా, జమ్ములో 10 జిల్లాలు, కశ్మీర్‌లో 10, లద్దాఖ్‌లో రెండు జిల్లాలు ఉండేవి. తాజా కేంద్రం నిర్ణయంతో లెహ్‌, కార్గిల్‌ జిల్లాలతో కూడిన లఢఖ్ రీజియన్‌ చట్టసభలేని కేంద్రపాలిత ప్రాంతంగా మారనుంది. పది జిల్లాలతో కూడిన కశ్మీర్‌ను మరో పది జిల్లాలతో కూడిన జమ్ముతో కలిపి చట్టసభతో కూడిన కేంద్రపాలిత ప్రాంతంగా ఏర్పాటుచేశారు.
జమ్ముకశ్మీర్‌ పునర్విభజన బిల్లును ఈరోజు రాజ్యసభలో కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా ప్రవేశపెట్టారు. ఈ బిల్లు రేపు లోక్‌సభ ఆమోదానికి రానుంది. అలాగే వీటితో పాటు అధికరణ 370ని కేంద్ర రద్దు చేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. 

జమ్ముకశ్మీర్‌ విభజనబిల్లుకు రాజ్యసభ ఆమోదం
 జమ్ముకశ్మీర్‌ విభజన బిల్లుకు రాజ్యసభ ఆమోదం తెలిపింది. జమ్ముకశ్మీర్‌కు ఉన్న ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించే 370 అధికరణను రద్దు చేస్తూ బిల్లును ఈ రోజు ఉదయం కేంద్రహోంశాఖ మంత్రి అమిత్‌ షా రాజ్యసభలో ప్రవేశపెట్టారు. దీనిపై రాజ్యసభలో వాడీవేడిగా చర్చ జరిగింది. హోంమంత్రి వివరణ అనంతరం ఓటింగ్‌ నిర్వహించగా.. స్వల్ప సాంకేతిక సమస్య రావడంతో స్లిప్పులతో ఓటింగ్‌ చేపట్టారు. ఈ బిల్లుకు అనుకూలంగా 125 ఓట్లు రాగా.. వ్యతిరేకంగా 61 ఓట్లు వచ్చాయి. దీంతో ఈ బిల్లు సభలో ఆమోదం పొందినట్లు రాజ్యసభ ఛైర్మన్‌ వెంకయ్యనాయుడు ప్రకటించారు. అనంతరం సభను రేపటికి వాయిదావేశారు. ఈ బిల్లు రేపు లోక్‌సభ ముందుకు రానుంది.

2, ఆగస్టు 2019, శుక్రవారం

జర్నలిస్టు రవీష్ కుమార్‌కు రామన్‌ మెగసెసె

                దిల్లీ: ఆసియా నోబెల్‌గా అభివర్ణించే ప్రతిష్ఠాత్మక పురస్కారం రామన్‌ మెగసెసె అవార్డు 2019 సంవత్సరానికి గానూ భారత్‌కు చెందిన ప్రముఖ జర్నలిస్టు రవీష్‌కుమార్‌ ఎంపికయ్యారు. ఈ ఏడాది ఈ అవార్డు మొత్తం ఐదుగురికి లభించింది. అందులో రవీష్‌కుమార్ ఒకరు. ఫిలిప్పీన్స్‌ రాజధాని మనీలాలో సెప్టెంబరు 9న ఈ పురస్కారాన్ని ప్రదానం చేయనున్నారు.
        ఎన్డీటీవీలో ప్రసారమయ్యే రవీష్‌ కుమార్‌ కార్యక్రమం ‘ప్రైమ్‌ టైమ్‌ షో’ ఎంతో ప్రజాదరణ పొందింది. నిస్సహాయుల గళాన్ని చాటిచెప్పడానికి రవీష్‌కుమార్‌ జర్నలిజాన్ని ఉపయోగించుకుంటున్నారని రామన్‌ మెగసెసె అవార్డు ఫౌండేషన్‌ అభిప్రాయపడింది. అలాగే ‘‘నైతికత, నిబద్ధతతో అత్యున్నత ప్రమాణాలతో తన వృత్తిని నిర్వహించడం; స్వాతంత్ర్యం, నిజం, సమగ్రత కోసం నైతిక ధైర్యంతో పోరాడడం; స్వరం లేని నిస్సహాయుల గళంగా మారడం; ప్రజాస్వామ్య లక్ష్యాల్ని చేరుకోవడం కోసం ఆయన సూత్రప్రాయమైన నమ్మకం’’ లాంటి లక్షణాలకు గుర్తింపుగా ఈ అవార్డును రవీష్‌ కుమార్‌కు ప్రదానం చేస్తున్నట్లు ఫౌండేషన్‌ పేర్కొంది. 
         రవీష్‌కుమార్‌తో పాటు మయన్మార్‌ జర్నలిస్టు కో స్వీ విన్, థాయ్‌లాండ్‌కు చెందిన సామాజిక కార్యకర్త ఆంగ్‌ఖానా నీలప్‌జిత్‌, దక్షిణ కొరియాకు చెందిన సామాజిక కార్యకర్త కిమ్‌ జోంగ్‌-కి, ఫిలిప్పీన్స్‌కు చెందిన రేముండో పూజంతే కయబ్యాబ్‌ను ఈ అవార్డు వరించింది. 2018లో భారతదేశానికి చెందిన భరత్ వాట్వానీ, సోనమ్ వాంగ్‌చుక్‌కు ఈ అవార్డు లభించిన విషయం తెలిసిందే.
              ఈ అవార్డును ఫిలిప్పీన్స్ మాజీ అధ్యక్షుడు రామన్ మెగసెసె జ్ఞాపకార్థం 1957లో ఏర్పాటు చేశారు. దీన్ని ఆసియా నోబెల్‌గా అభివర్ణిస్తారు. ప్రతి సంవత్సరం రామన్ మెగసెసె ఫౌండేషన్.. ప్రభుత్వ సేవలు, ప్రజా సేవ, సామాజిక నాయకత్వం, జర్నలిజం, సాహిత్యం, సృజనాత్మకత, ప్రపంచ శాంతి, అత్యుత్తమ నాయకత్వ లక్షణాలు లాంటి అంశాల్లో కృషి చేస్తున్నవారికి ఈ అవార్డును ప్రదానం చేస్తారు.

1, ఆగస్టు 2019, గురువారం

నన్ను ఆ వ్యవహారంలోకి లాగొద్దు : ప్రియాంక గాంధీ

                న్యూఢిల్లీ : రాహుల్ గాంధీ కాంగ్రెస్ అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన తర్వాత ఆయన వారసుడు ఎవరనే ప్రశ్న ఇటు నాయకులను, అటు కార్యకర్తలను వేధిస్తోంది. కొందరు రాహుల్ గాంధీయే కొనసాగాలని డిమాండ్ చేయగా, మరికొందరు సోనియాగాంధీ తిరిగి పగ్గాలు చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే తాజాగా మరో పేరు చాలా సీరియస్‌గా తెరపైకి వచ్చింది. ఆ పేరే కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ. ప్రియాంకా గనుక అధ్యక్ష బాధ్యతలను భుజాన వేసుకుంటే పార్టీ పరిస్థితి బాగుంటుందని, కేడర్‌లో నూతనోత్తేజం వస్తుందని కొందరు అగ్ర నేతలు గట్టిగానే వాదిస్తున్నారు.
             అయితే ప్రియాంకా గాంధీ మాత్రం ఈ వ్యవహారంలో తనను దూర్చవద్దని, తాను అధ్యక్ష బాధ్యతలు చేపట్టే స్థితిలో ఎంతమాత్రమూ లేనని కుండబద్దలు కొట్టారట. అయితే తాజాగా... మరోసారి గురువారం ఉదయం జరిగిన ప్రధా కార్యదర్శుల సమావేశంలోనూ ఈ ప్రతిపాదన మరోసారి ముందుకొచ్చింది. జార్ఖండ్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జీ ఆర్.పి.ఎన్. సింగ్ బాధ్యతలు చేపట్టాలని ప్రియాంకను కోరగా... బాబోయ్... ఈ వ్యవహారంలోకి తనను ఎంతమాత్రం లాగొద్దని ఖరాకండిగా చెప్పినట్లు తెలుస్తోంది.
               కొన్ని రోజుల క్రితం తాజాగా పంజాబ్ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ కూడా తాజాగా ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ... ప్రియాంకా గాంధీ అధ్యక్ష పగ్గాలు చేపట్టాల్సిందేనని తన కోరికను బహిరంగంగానే వ్యక్తం చేశారు.సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయానికి నైతిక బాధ్యత వహిస్తూ రాహుల్ గాంధీ అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. గాంధీ కుటుంబం నుంచి కాకుండా బయటి వ్యక్తులను అధ్యక్షుడిగా నియమించాలని రాహుల్ పట్టుబట్టారు.
 
                  దీంతో అగ్రనేతలైన గులాంనబీ ఆజాద్ మరికొందరు నేతలు సీనియర్ నాయకుడైన ఏకే ఆంటోనీని ఆ గురుతర బాధ్యతలు చేపట్టాలని కోరారు. ఈ ప్రతిపాదనను ఆయన సున్నితంగా తిరస్కరించారు. ఆ తరువాత రాహుల్‌కే అత్యంత సన్నిహితుడైన మరో ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌ను ఆజాద్ కోరగా ఆయనా ముందుకు రాకపోవడంతో కాంగ్రెస్ నేతలకు పాలుపోవడం లేదు. దీంతో గత్యంతరం లేక ప్రియాంక గాంధీ బాధ్యతలు చేపడితే బాగుంటుందన్న ప్రతిపాదనలు తెరపైకి వచ్చాయి.