26, డిసెంబర్ 2018, బుధవారం

14 ఏళ్ల క్రితం సరిగ్గా ఇదేరోజు భారత్‌లో...


                     న్యూఢిల్లీ: 14 ఏళ్ల క్రితం 2004 డిసెంబరు 26న ప్రపంచంలోనే అతిపెద్ద ప్రకృతి విపత్తు సంభవించి 14 దేశాలకు చెందిన 2, 27,898 మంది ప్రాణాలు కోల్పోయారు. ఆరోజు ఇండోనేషియా, భారత్‌తో పాటు పలు దేశాల్లో సంభవించిన సునామీ తాకిడికి కొన్ని లక్షల మంది జీవితాలు అస్తవ్యస్తమయ్యాయి. ఇండోనేషియాలోని ఉత్తర ప్రాంతంలో రిక్టార్ స్కేల్‌పై 8.9 పాయింట్ల తీవ్రతతో భూకంపం సంభవించింది. అనంతరం సముద్రంలో ఉద్భవించిన సునామీ భారత్‌తో పాటు పలు దేశాలను అతలాకుతలం చేసింది. హిందూ మహా సముద్రంలో హఠాత్తుగా ఉవ్వెత్తున ఎగసిపడిన అలలు అక్కడికి సమీపంలో ఉన్న ప్రాంతాలను నామరూపాలు లేకుండా మార్చివేశాయి. థాయ్‌ల్యాండ్‌తో పాటు పలు దేశాల్లో సముద్ర తీరంలో నిర్మించిన హోటళ్లు, రెస్టారెంట్లలో బసచేసిన విదేశీ పర్యాటకులు సముద్రపు అలలకు కొట్టుకుపోయి ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రకృతి విపత్తులో భారత్‌కు చెందిన 10 వేల మంది బలయ్యారు. ఈ సునామీ ప్రభావంతో ప్రపంచ వ్యాప్తంగా 18 లక్షల మంది నిరాశ్రయులవగా, 50 వేల మంది గల్లంతయ్యారు.

25, డిసెంబర్ 2018, మంగళవారం

గుజరాత్ పేరు ఎక్కడైనా వినిపించిందా?: చంద్రబాబు


  •  బీజేపీ కంటే సంపన్న పార్టీ ఉందా?
  • టన్నులకొద్దీ డబ్బు పెట్టుకున్నారు
  • వాటితో గెలవాలనుకుంటున్నారు
  • కేసీఆర్‌కు ఇక్కడ కీలుబొమ్మ ఉండాలి
  • ఫెడరల్‌ ఫ్రంట్‌ ఎవరి కోసం?
  • సీఎం చంద్రబాబు ప్రశ్న
  • సుపరిపాలనపై శ్వేతపత్రం విడుదల
అమరావతి, డిసెంబరు 24: కాంగ్రెస్ తో టీడీపీ కలుస్తోందని.. సంపన్న పార్టీలు, సైద్ధాంతిక సారూప్యం లేని పార్టీలు జట్టుకడుతున్నాయని ప్రధాని మోదీ చేసిన విమర్శలను సీఎం చంద్రబాబు తిప్పికొట్టారు. బీజేపీ కంటే సంపన్న పార్టీ ఏముందని నిలదీశారు. ఏపీ ముందుకెళ్లకూడదని తెలంగాణ సీఎం కేసీఆర్‌ అనుకుంటున్నారని దుయ్యబట్టారు. సుపరిపాలన అంశంపై చంద్రబాబు సోమవారం (24-12-2018) శ్వేతపత్రం విడుద ల చేశారు. మంత్రి యనమల రామకృష్ణుడితో కలిసి విలేకరులతో మాట్లాడారు. ‘బీజేపీ టన్నుల కొద్దీ డబ్బు పెట్టుకుంది. దాంతోనే ఎన్నికల్లో గెలవాలనుకుంటోంది. ఎందుకు రెండువేల నోట్లు రద్దుచేయరు? మీకు డబ్బు ఎక్కువుంది కాబట్టి ఆ నోటు పంచి గెలవాలని చూస్తున్నారు. నేను కాంగ్రెస్ కు మద్దతు ఇస్తున్నాను.. ఎన్టీఆర్‌ కాంగ్రెస్ కు వ్యతిరేకమని మోదీ అంటున్నారు. మీరు (మోదీ)చేసిన నమ్మకద్రోహానికి, నమ్మించి మోసం చేసినదానికి.. ఎవరు కలిసొస్తే వారితో కలిసి రాష్ట్ర హ క్కులు కాపాడుకోవడంలో తప్పేంటి? మీరు అణగదొ క్కే ప్రయత్నం చేశారు. ఇక్కడున్నవారితో కలిసి కుట్ర, కుతంత్రాలు చేసి దెబ్బతీయాలనుకున్నారు.
 
ప్రధాన ప్రతిపక్షం కూడా మీపంచన చేరింది. పోలవరం నుంచి రాజధాని వరకు అడ్డుపడడం ఎంతవరకు సమంజ సం? దేశం, రాష్ట్రం కోసం అన్ని పార్టీలూ కలవాలి. ఇది ప్రజాస్వామ్య అనివార్యత. దేశంలోనే మనం బాగా చేస్తున్నామని మోదీకి కోపం. ఇక కేసీఆర్‌కు మంచి వ్యవస్థలున్నాయి. బాగా చేసుకోవచ్చు. కానీ ఆంధ్ర మాత్రం ముందుకుపోకూడదని ఆయన అనుకుంటారు. ఇందుకోసం కీలుబొమ్మ ప్రభుత్వం ఉండాలి. నియంత్రణ చేసుకోవచ్చన్నది కేసీఆర్‌ ఆలోచన’ అన్నారు.
 
ఐటీలో గుజరాత్‌ పేరు వినిపించిందా?
‘హైదరాబాద్‌ అంత అద్భుతంగా గుజరాత్‌ ఉందా? 12 ఏళ్లు మోదీ గుజరాత్‌ సీఎంగా చేశారు. కానీ ఏం చేశారు? ఐటీలో ఆరాష్ట్రం పేరు వినిపించిందా? మనం ఐటీకి ప్రాధాన్యమిచ్చాం. ఇంజనీరింగ్‌ కళాశాలలు పె ట్టాం. ఈరోజు ఐటీలో నంబర్‌వన్‌ తెలుగోడు. అదీ విజన్‌, నాయకత్వం. కొందరికి పోలవరం కట్టడం ఇ ష్టం లేకపోవచ్చు. నదుల అనుసంధానం అసలే ఇష్టం లేకపోవచ్చు. విద్యుత్‌ మిగులు ఇష్టం లేకపోవచ్చు. కానీ మనం చేస్తున్నాం. సాధిస్తున్నాం. ఇంకో నాలుగేళ్లు పోతే కష్టాలు అసలుండవు.’ ‘దేశంలో ప్రభుత్వం ఏర్పడేందుకు మూడే అవకాశాలున్నాయి. ఒకటి కాంగ్రెస్‌, రెండు బీజేపీ ప్రభుత్వాలు ఏర్పాటుచేయడం. మూడోది ఈ రెండు పార్టీల్లో ఏదో ఒక పార్టీ మద్దతుతో ఏర్పడే సంకీర్ణం. ఇంతకుమించి విశ్వామిత్ర సృష్టి చేయలేం. ఏ పక్షమో చెప్పకుండా.. ఫెడరల్‌ ఫ్రంట్‌ సాధ్యం కాదు.’ ‘పోలవరం ప్రాజెక్టు గేటు పెడితే గ్రేట్‌డేనా అని ప్రధాన ప్రతిపక్షం అవహేళన చేస్తోంది. కేంద్రం ఇన్ని అడ్డంకులు సృష్టిస్తున్నా ప్రాజెక్టు తొలి గేటు పెట్టిన రోజు కచ్చితంగా గ్రేట్‌ డే. కడపలో స్టీల్‌ ప్లాంటుకు శంకుస్థాపన చేస్తామంటే రియల్‌ ఎస్టేట్‌ కోసమని విమర్శిస్తున్నారు. అవగాహన, ఇంగితజ్ఞానం లేదు.’

21, డిసెంబర్ 2018, శుక్రవారం

ఆసియా కుబేకులకు 2018 కలిసి రాలేదట




               దిల్లీ: 2018 ప్రత్యేకించి ఆసియా కుబేరులకు కలిసి రాలేదు.     అత్యంత సంపన్నుల జాబితాలో వారి స్థానాలకు ఎసరు పెట్టింది. స్టాక్‌ మార్కెట్ స్థితిగతులు, వాణిజ్య పరంగా ఉన్న ఒత్తిడులు వారి సంపద మీద తీవ్ర ప్రభావం చూపాయి. ఈ వివరాలను వెల్లడిస్తూ బ్లూమ్బర్గ్ ఓ కథనాన్ని ప్రచురించింది.
                 ప్రపంచంలోనే అత్యంత సంపన్నులతో బ్లూమ్‌బర్గ్ బిలియనీర్ ఇండెక్స్ పేరిట ప్రతి ఏటా విడుదల చేసే జాబితాలో ఉన్న 128 మంది ఆసియా ధనవంతులు 2018లో 137 బిలియన్‌ డాలర్ల సంపదను కోల్పోయారు. 2012 నుంచి బ్లూమ్‌బర్గ్ ఈ జాబితాను విడుదల చేస్తోంది. అప్పటి నుంచి వారి మీద ఇలాంటి ప్రభావం పడటం ఇదే మొదటిసారి. అంతర్జాతీయంగా నెలకొన్న వాణిజ్య ఉద్రిక్తతలు, స్టాక్‌ మార్కెట్ ఒడుదొడుకులు ఈ పరిస్థితికి కారణాలు. వాటివల్ల ముఖ్యంగా చైనా సాంకేతిక రంగం ఎక్కువగా నష్టపోయింది. భారత్, దక్షిణ కొరియా దేశాలు కూడా ఈ ఒడుదొడుకుల నుంచి తప్పించుకోలేకపోయాయి. దానికి అడ్డుకట్ట వేయడానికి బ్యాంకులు, మనీ మేనేజర్లు చేసిన ప్రయత్నాలు ఆసియా ధనవంతులకు పెద్దగా కలిసిరాలేదు.
             బ్లూమ్‌బర్గ్ జాబితాలో ఉన్న చైనాకు చెందిన 40 మంది ధనవంతుల సంపద ఆవిరైంది. వాండా గ్రూప్‌ వ్యవస్థాపకుడు వాంగ్ జియాన్‌లిన్  అత్యధికంగా 10 బిలియన్‌ డాలర్ల సంపద కోల్పోయారు. అలాగే భారత్ కు చెందిన 23 మంది సంపన్నులు దాదాపు 21 బిలియన్‌ డాలర్లను కోల్పోయారు. ప్రపంచ స్టీల్ మార్కెట్‌ను శాసించే లక్ష్మి మిత్తల్‌ కు చెందిన 5.6 బిలియన్‌ డాలర్ల సంపద ఆవిరైంది. ఆయన మొత్తం నెట్‌ వర్త్‌లో అది 29 శాతం. అలాగే ప్రపంచంలోనే జనరిక్ డ్రగ్ మార్కెట్‌లో నాలుగో స్థానంలో ఉన్న సన్‌ ఫార్మా కంపెనీ అధినేత దిలీప్‌ సంఘ్వీ  4.6 బిలియన్‌ డాలర్లు నష్టపోయారు. దక్షిణ కొరియా, హాంకాంగ్ టైకూన్స్‌ ఈ ప్రభావం నుంచి తప్పించుకోలేకపోయాయి. అయితే ఈ మార్కెట్ ఒడుదొడుకుల్లో కూడా సంపదను పోగేసిన వారు ఉన్నారు. చైనా స్మార్ట్‌ ఫోన్‌ సంస్థ షియోమి అధినేత లీజున్‌కు అదనంగా 8.7 బిలియన్‌ డాలర్ల సంపద వచ్చి చేరింది.  భారత్‌కు చెందిన రిలయన్స్ ఇండస్ట్రీస్‌, చైనాకు చెందిన అలీబాబా గ్రూప్‌ హోల్డింగ్స్ లిమిటెడ్  సంస్థలు అదనంగా సంపదను పోగేసుకున్నాయి.

19, డిసెంబర్ 2018, బుధవారం

న్యూ ఇయర్ వేడుకలకు ఆంక్షలు





  నూతన సంవత్సర వేడుకల నేపథ్యంలో హైదరాబాద్‌ పోలీసులు పలు ఆంక్షలు విధించారు. నగరంలో పటిష్ట భద్రత ఏర్పాట్లు చేసినట్లు హైదరాబాద్ నగర్ పోలీసు కమిషనర్‌ అంజనీకుమార్ మీడియాకు తెలిపారు. వేడుకల్లో నిబంధనలు, ఆంక్షలు పాటించని వారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు. వేడుకలు కొనసాగే ప్రాంతాల్లో నిర్వాహకులు విధిగా సీసీ కెమెరాలు, ప్రైవేటు భద్రతా సిబ్బందిని ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. హోటళ్లు, బార్లు, రెస్టారెంట్లు అర్థరాత్రి ఒంటిగంట కల్లా మూసివేయాలని ఆదేశించారు. మత్తు పదార్థాలు మాదకద్రవ్యాలు వినియోగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. మహిళలకు ఇబ్బంది కలుగకుండా షీ బృందాలను అందుబాటులో ఉంచుతామని ఆయన చెప్పారు. అసభ్యకర నృత్యాలు నిర్వహిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అంజనీకుమార్‌ హెచ్చరించారు.

18, డిసెంబర్ 2018, మంగళవారం

ఐదు రాష్ట్రాల కొత్త ముఖ్యమంత్రులు


                   2018 నవంబర్‌లో ఎన్నికలు జరిగి డిసెంబర్‌ 11న ఫలితాలు వెలువడిన ఐదు రాష్ట్రాల్లో కొత్త ముఖ్యమంత్రులు కొలువు దీరారు. మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌, ఛత్తీస్‌గఢ్‌ల లో కాంగ్రెస్‌ ప్రభుత్వాలు కొలు వుదీరాయి. మధ్యప్రదేశ్‌లో కమల్‌నాథ్‌, రాజస్థాన్‌లో అశోక్‌ గహ్లాట్‌, ఛత్తీస్‌గఢ్‌లో భూపేశ్‌ బఘేల్‌లు ముఖ్య మంత్రుగా ప్రమాణ స్వీకారం చేశారు.  తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్ర సమితి విజయం సాధించింది. ఆపార్టీ  అధ్యక్షు డు  కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ముఖ్యమంత్రి అయ్యారు.  మిజోరాం రాష్ట్రంలో మిజోరాం నేషనల్‌ ఫ్రంట్‌ పార్టీ విజయం సాధించి ముఖ్యమంత్రిగా జొరంతంగా ఎన్నికయ్యారు. ఆయా రాష్ట్రాల గవర్నర్లు ప్రమాణం చేయించారు.

16, డిసెంబర్ 2018, ఆదివారం

ముద్దుల పోటీకి నో చెప్పిన బీజేపీ


                  రాంచీ: ప్రతి ఏడాది సంప్రదాయబద్ధంగా గిరిజనులు నిర్వహించుకునే ‘ముద్దుల పండుగ’కు ఈసారి బీజేపీ మోకాలడ్డింది. బహిరంగంగా ముద్దులు పెట్టుకోవడం భారతీయ సంప్రదాయం కాదని, ఈ పండుగ ద్వారా సమాజంలోకి చెడు సంకేతాలు వెళ్తాయని చెబుతూ ఈ ఏడాది పండుగకు అనుమతించేది లేదని తెగేసి చెప్పింది.
                జార్ఖండ్‌లోని గిరిజనులు ప్రతి ఏడాది డిసెంబరులో ముద్దుల పోటీ నిర్వహిస్తారు. బహిరంగంగా ముద్దులు పెట్టుకోవడంతో తమ ప్రేమను వ్యక్తపరుస్తారు. పాకూర్ జిల్లాలోని లిట్టిపర బ్లాక్‌లో జరిగే ఈ పండుగను చూసేందుకు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు పెద్ద ఎత్తున తరలివస్తుంటారు. ఏళ్లుగా ఈ ముద్దుల పండుగ కొనసాగుతున్నా సామాజిక మాధ్యమాల పుణ్యమా అని గతేడాది జరిగిన పోటీకి సంబంధించిన ఫొటోలు, వీడియోలు బాగా వైరల్ అయ్యాయి. జార్ఖండ్ ముక్తి మోర్చాకు చెందిన స్థానిక ఎమ్మెల్యే సిమోన్ మరాండి ఆధ్వర్యంలో గతేడాది జరిగిన ఈ కార్యక్రమంలో 18 జంటలు పాల్గొన్నాయి.
              ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పలు హిందూ సంఘాలు ఈ పండుగపై అభ్యంతరాలు వ్యక్తం చేశాయి. దీంతో ఈ ఏడాది ముద్దుల పండుగకు అనుమతి ఇచ్చేది లేదని బీజేపీ ప్రభుత్వం తేల్చి చెప్పడంతో జిల్లా ఎస్‌డీవో జితేంద్ర కుమార్ ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వ ఆదేశాలపై గిరిజనులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఏళ్లుగా వస్తున్నతమ ఆచారాన్ని అడ్డుకోవాలని చూడడం భావ్యం కాదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

15, డిసెంబర్ 2018, శనివారం

ఆశావాదికి అరుదైన గౌరవం


2019 తర్వాత టి డి పి పాత్ర నామమాత్రమే!


                   హైదరాబాద్‌: రాష్ట్రాలు, కేంద్రం బలోపేతం కావాలన్న ఉద్దేశంతోనే ఫెడరల్‌ ఫ్రంట్‌ ఏర్పాటు చేయాలని తెలంగాణ ముఖ్యమంత్రి  కేసీఆర్‌ ప్రయత్నిస్తున్నారని టి ఆర్ ఎస్  కార్యనిర్వాహక అధ్యక్షుడు కె తారక రామారావు అన్నారు.  టిడిపి అధినేత చంద్రబాబు ప్రయత్నిస్తున్న కూటమి కేవలం తెదేపాను బలోపేతం చేసుకోవడానికేనని విమర్శించారు. 2019 ఎన్నికల తర్వాత దేశ రాజకీయాల్లో తెదేపా పాత్ర నామమాత్రమవుతుందన్నారు. 15-12-2018 శనివారం ఆయన హైదరాబాద్‌లో నిర్వహించిన మీట్‌ ద ప్రెస్‌ కార్యక్రమంలో మాట్లాడారు. కేసీఆర్‌ ఏర్పాటు చేసే ఫెడరల్‌ ఫ్రంట్‌ ఈ దేశంలో రాష్ట్రాల పాత్ర, బలోపేతం మీద అర్థవంతమైన చర్చకు దారితీసేదిగా ఉంటుందన్నారు. చంద్రబాబు చెబుతోన్న ఫ్రంట్‌ దేశం బలోపేతం కోసం కాదని, అది  టిడిపి బలోపేతానికన్నారు.
             బిజెపిని బూచిగా చూపించి తన అసమర్థతను, తన ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చుకొనేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని, అందులో భాగంగానే బిజెపిని ఓడగొట్టేందుకు తానేదో కూటమి తయారు చేస్తున్నానన్న ప్రయత్నాన్ని బలంగా ఏపీ ప్రజల ముందు పెట్టి తద్వారా రాజకీయ లబ్ది పొందేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. చంద్రబాబు  టిడిపి కోసం పనిచేస్తే.. తాము దేశం కోసం పనిచేస్తున్నామని చెప్పారు. ఈ రెండింటికీ చాలా తేడా ఉందని చెప్పారు.

13, డిసెంబర్ 2018, గురువారం

మధ్యప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా కమల్‌నాథ్‌


భోపాల్‌: ఎట్టకేలకు తీవ్ర ఉత్కంఠ మధ్య మధ్యప్రదేశ్‌ ముఖ్యమంత్రి అభ్యర్థిని కాంగ్రెస్‌ పార్టీ ప్రకటించింది. మధ్యప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ అధ్యక్షుడిగా ఉన్న కమల్‌నాథ్‌కు అవకాశం కల్పిస్తూ నిర్ణయం వెల్లడించింది. మధ్యప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా కమల్‌నాథ్‌ శుక్రవారం ప్రమాణ స్వీకారం చేసే అవకాశముంది. సీఎం అభ్యర్థి ఎంపికపై ఆశావహులు జ్యోతిరాదిత్య సింథియా, కమల్‌నాథ్‌తో కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ, సోనియాగాంధీ, ప్రియాంక గాంధీ విస్తృతంగా చర్చలు జరిపారు. చివరికి సీనియర్‌ నాయకుడివైపే అధినాయకత్వం మొగ్గు చూపడంతో ఉత్కంఠకు తెరపడింది.

పదవుల కోసం టీఆర్ఎస్‌లో పెరిగిన ఆశావహుల సంఖ్య


           హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితికి మెజారిటీ ఉండడం, అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్‌ పార్టీ తరఫున 88 మంది ఎమ్మెల్యేలుగా ఎన్నికవ్వడంతో మంత్రి పదవుల కోసం ఆశావహుల సంఖ్య పెరిగింది. గురువారం ముఖ్యమంత్రిగా కేసీఆర్ రాజ్‌భవన్‌లో ప్రమాణం చేశారు. ఆయనతోపాటు మహమూద్ ఆలీ మంత్రిగా ప్రమాణం చేశారు. గత కేబినెట్‌లో మహమూద్ ఆలీ డిప్యూటీ సీఎం పదవితోపాటు రెవెన్యూశాఖ మంత్రిగా పనిచేశారు. ఇప్పుడు కూడా అవే శాఖలు ఇచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం. వచ్చే వారం అసెంబ్లీని సమావేశపరిచి.. ఎన్నికైనా ఎమ్మెల్యేల అందరిచేత ప్రమాణం చేయించే అవకాశం ఉంది. ఆ తర్వాత మంత్రి వర్గాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఉన్నట్లు తెలియవచ్చింది. మహమూద్ ఆలీకి 4, 5 ముఖ్య శాఖలను అప్పగించే అవకాశం ఉన్నట్లు సమాచారం. అలాగే వచ్చే నెల 15వ తేదీ లోపల పంచాయతీ ఎన్నికలు పూర్తి చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. పంచాయతీ ఎన్నికలు జరిగిన తర్వాతే పూర్తి స్థాయిలో మంత్రి వర్గాన్ని విస్తరించే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. సెప్పెంబర్ 6న అసెంబ్లీ రద్దయిన విషయం తెలిసింది. మళ్లీ ఇవాళ కొత్త ప్రభుత్వం ఏర్పాటైంది.