30, డిసెంబర్ 2018, ఆదివారం

ఆ 3 దీవుల పేర్లు మారాయి

 
                   పోర్ట్ బ్లెయిర్ : అండమాన్, నికోబార్ దీవుల్లో మూడింటికి ప్రభుత్వం కొత్త పేర్లు పెట్టింది. నేతాజీ సుభాశ్ చంద్ర బోస్ పోర్ట్‌ బ్లెయిర్‌లో త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసి 75 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆదివారం పాల్గొన్నారు. మోదీ మాట్లాడుతూ రాస్ ఐలాండ్‌కు నేతాజీ సుభాశ్ చంద్ర బోస్ ద్వీప్ అని, నీల్ ఐలండ్‌కు షహీద్ ద్వీప్ అని, హవలోక్ ఐలండ్‌కు స్వరాజ్ ద్వీప్ అని పేర్లు పెట్టినట్లు తెలిపారు.
               ఈ సందర్భంగా స్మారక తపాలా బిళ్ళను, రూ.75 నాణేన్ని మోదీ విడుదల చేశారు. బోస్‌ పేరుపై డీమ్డ్ యూనివర్సిటీని ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. అంతకుముందు మోదీ మెరీనా పార్క్‌లో జాతీయ జెండాను ఎగురవేశారు. నేతాజీ సుభాశ్ చంద్ర బోస్‌ విగ్రహానికి పూలమాలలు వేసి, ఆయనకు నివాళులర్పించారు.

29, డిసెంబర్ 2018, శనివారం

ఊపిరితిత్తులను కాపాడే ఆహారం

           మానవ శరీరంలోని అతి ముఖ్యమైన అవయవము ఊపిరితిత్తులు. ఇది శరీరం పనితీరును సరిగ్గా నిర్వహించడంలో సహాయపడేందుకు ముఖ్యమైన పాత్రను పోషిస్తాయి. కాబట్టి, ఈ వ్యాసంలో, ఇప్పుడు మనము ఊపిరితిత్తులను ఎల్లప్పుడూ ఆరోగ్యంగా ఉంచే ఆహారపదార్ధాల గూర్చి చర్చించుకోబోతున్నాము. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) అందించిన నివేదిక ప్రకారం, 235 మిలియన్ల ప్రజలు ఆస్త్మాతో బాధపడుతున్నారు. భారతదేశంలో, వాయు కాలుష్యం & ధూమపానం చేసే వారు ఎక్కువగా ఉండటంవల్ల శ్వాసకోశ వ్యాధులు ప్రబలమవుతున్నాయి. Healthy Diet For Lungs: 12 Best Foods For Lungs అయితే, మన ఊపిరితిత్తుల నిరంతరంగా కలుషితమైన గాలికి గురవటం వల్ల, ఈ కాలుష్య కారకాలు బ్రోన్కైటిస్ (శ్వాసనాళముల వాపు), ఆస్తమా, న్యుమోనియా & సిస్టిక్ ఫైబ్రోసిస్ వంటి శ్వాసకోశ సమస్యలను మనలో పెంచుతున్నాయి. కాబట్టి, మీ ఊపిరితిత్తుల ఆరోగ్యాన్ని పరిరక్షించడానికి, దోహదపడే ఆహార పదార్ధాలను తినడం చాలా మంచిది. ఆరోగ్యకరమైన ఊపిరితిత్తుల కోసం తీసుకోవలసిన ఆహారాల గూర్చి చదివి మీరే తెలుసుకోండి. అవి, 
          1. యాపిల్స్ :  ఎవరైతే ప్రతిరోజూ ఒక గ్లాసు మోతాదులో ఆపిల్ రసాన్ని తీసుకుంటారో వారిలో గురక తక్కువగా ఉంటుందని కనుగొనబడింది. మరొక అధ్యయనం ప్రకారం, గర్భవతులుగా ఉన్న మహిళలు ప్రతిరోజూ ఆపిల్ను తినడం వల్ల పుట్టే పిల్లలలో ఆస్తమా లక్షణాలు చాలా తక్కువగా ఉంటుంది. ఎందుకంటే, ఆపిల్స్లో ఫాలోలిక్ సమ్మేళనాలు & ఫ్లేవానాయిడ్లను కలిగివుంటాయి ఇవి శ్వాసనాళముల వాపును తగ్గిస్తాయి.
         2. సాల్మన్ : సాల్మన్లో ఉండే ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు ఊపిరితిత్తులలో ఏర్పడిన వాపును తగ్గిస్తుంది & ఊపిరితిత్తులలో తిష్టవేసుకొని జీవిస్తున్న బ్యాక్టీరియాతో కూడా పోరాడుతుంది. సాల్మొన్తో పాటు మాకేరెల్, ట్రౌట్, సార్డినెస్ & హెర్రింగ్ వంటి ఈ చేపలు ఊపిరితిత్తులకు చాలా మంచివి. 
         3. ఆలివ్ ఆయిల్ :  ఆయిల్, ఆలివ్ ఆయిల్, & కనోల ఆయిల్స్ వంటివి కలిగి ఉంటే అవి మీ మొత్తం ఆరోగ్యానికి ఎంతో మంచివి. పెరుగుతున్న రక్తపోటుకు & బలహీనమైన రక్తనాళాల వంటి వాయు కాలుష్యంతో ముడిపడివున్న ఆరోగ్య సమస్యలతో పోరాడటానికి ఆలివ్ ఆయిల్ సహాయపడుతుంది. ఇది ఊపిరితిత్తులకు & గుండెకు ఆక్సిజన్ సరఫరాను తగ్గిస్తాయి. 
         4. గ్రీన్-టీ : గ్రీన్-టీ, మీ శరీరాన్ని శాంతపరచి, వాపులను / మంటలను తగ్గించి, మీకు స్వస్థతను చేకూర్చడంలో సహాయపడే యాంటీఆక్సిడెంట్లను కలిగి ఉంటాయి. యాంటీఆక్సిడెంట్ క్వెర్సెటటిన్ అనేది ఒక సహజమైన యాంటిహిస్టామైన్గా పనిచేస్తుంది, ఇది అలెర్జీ లక్షణాలను కలిగించే హిస్టామైన్ను విడుదలను తగ్గిస్తుంది.
            5. కాఫీ :  ఒక కప్పు కాఫీ ఆస్తమా లక్షణాలను తగ్గించడంలో మీకు సహాయపడుతుందని తెలుసా ? కెఫిన్ ఒక బ్రోన్చోడైలేటర్గా పనిచేస్తుంది, ఇది ఆస్తమాటిక్స్లో గట్టి వాయుమార్గాలను తెరచి & శ్వాసకోశ కండరాల అలసటను తగ్గిస్తుంది. కొన్ని అధ్యయనాల ప్రకారం, ప్రతిరోజు ఉదయం ఒక కప్పు కాఫీను తాగటం వల్ల మీరు తీసుకునే శ్వాసను మెరుగుపరచి & మీ ఊపిరితిత్తుల పనితీరును మెరుగుపరచడంలో సహాయపడుతుంది. 
         6. గింజలు  గింజలు కూడా మీ ఊపిరితిత్తులకు మరొక సూపర్ ఫుడ్స్. గుమ్మడికాయ గింజలు, అవిసె గింజలు & పొద్దుతిరుగుడు గింజలు వంటివి మీ శరీరానికి మెగ్నీషియమును పుష్కలంగా అందిస్తాయి,అలాగే ఆస్తమాతో బాధపడేవారికి అవసరమైన మినరల్స్ను కూడా అందిస్తాయి. మెగ్నీషియం మీ శ్వాసకోశ కండరాలకు ఉపశమనాన్ని చేకూర్చడంలో సహాయపడి, మీ శ్వాసను మెరుగుపరుస్తుంది. మీ చేతి నిండుగా ఈ గింజలను పట్టుకొని వాటిని ప్రతిరోజు వినియోగించండి (లేదా) స్మూతీలో కలిపి వాడండి.
           7. ఆరెంజ్-రంగులో ఉన్న పండ్లు, కూరగాయలు : బొప్పాయి, గుమ్మడికాయ & నారింజ పండ్లు అనేవి ఆరెంజ్ రంగులో ఉన్న పండ్లు & కూరగాయలు. ఈ రకమైన ఆహారాలు మీ ఊపిరితిత్తులకు స్నేహపూర్వకంగా ఉండే యాంటీ-ఆక్సిడెంట్లతో నిండి ఉంటాయి, ఇవి అంటువ్యాధులను, ఇతర వాపు తగ్గించడంలో బాగా ఉపకరిస్తాయి. 
              8. తృణధాన్యాలు : బ్రౌన్ రైస్, క్వినొయా & గోధుమల వంటి ధాన్యపు ఆహారాలను మీ రోజువారి డైట్లో ఉండేలా చూసుకోవాలి. మఫిన్లు, పాస్తా, రైస్, వైట్ బ్రెడ్ వంటి మరిన్ని పదార్థాలు కార్బోహైడ్రేట్లను కలిగి ఉండే ఆహారాలుగా ఉంటూ, కార్బన్ డయాక్సైడ్ ఉత్పత్తిని పెంచి, మీ ఊపిరితిత్తులపై మరింత ఒత్తిడిని పెంచుతుంది.
           9. వెల్లుల్లి : వెల్లుల్లిలో, గ్లూటాతియోన్ ఉత్పత్తిని ప్రేరేపించే ఫ్లేవానాయిడ్స్ కలిగివుంది, ఇది విషాన్ని & క్యాన్సింజెన్లను తొలగించడంలో సహాయపడటమే కాకుండా ఇది మీ ఊపిరితిత్తుల పనితీరు సరిగ్గా ఉండటంలో సహాయపడుతుంది. వారానికి రెండుసార్లు మూడు రెబ్బల పచ్చి వెల్లుల్లిని తీసుకున్నవారిలో ఊపిరితిత్తుల క్యాన్సర్ను 44 శాతానికి వరకూ తగ్గించగలదని ఒక అధ్యయనంలో కనుగొనబడింది. 
             11. కైయేన్ పెప్పర్ :  (కారపు పొడి) క్యాప్సైసిన్ అనే సమ్మేళనమును కలిగి ఉంటుంది, ఇది స్రావాల ఉత్పత్తిని ఉత్తేజపరుస్తుంధి, అలాగే శ్వాసకోశంలో ఎగువున, దిగువున ఉన్న శ్లేష్మ పొరలను కాపాడుతుంది. అందువల్ల, ఆస్తమా లక్షణాలను కలిగి ఉన్నవారు తీసుకునే భోజనంలో కారపుపొడిని కలిపి తీసుకోవాలి (లేదా) మీరు కైయేన్ మిరియాలతో చేసిన టీని కూడా త్రాగవచ్చు. 
          12. బ్రోకలీ :  బ్రోకలీలో విటమిన్-సి, ఫోలేట్, కెరోటినాయిడ్స్ & ఫైటోకెమికల్స్ ఉన్నాయి. ఈ ఆకుపచ్చ కూరగాయలో L- సల్ఫోరాఫాన్ అనే చురుకైన సమ్మేళనం ఉంది, ఇది శ్వాస సంబంధిత కణాల అనారోగ్యాలను నివారించే యాంటీ ఇన్ఫ్లమేటరీ జన్యువులుగా రూపాంతరం చెందుతుంది.

26, డిసెంబర్ 2018, బుధవారం

14 ఏళ్ల క్రితం సరిగ్గా ఇదేరోజు భారత్‌లో...


                     న్యూఢిల్లీ: 14 ఏళ్ల క్రితం 2004 డిసెంబరు 26న ప్రపంచంలోనే అతిపెద్ద ప్రకృతి విపత్తు సంభవించి 14 దేశాలకు చెందిన 2, 27,898 మంది ప్రాణాలు కోల్పోయారు. ఆరోజు ఇండోనేషియా, భారత్‌తో పాటు పలు దేశాల్లో సంభవించిన సునామీ తాకిడికి కొన్ని లక్షల మంది జీవితాలు అస్తవ్యస్తమయ్యాయి. ఇండోనేషియాలోని ఉత్తర ప్రాంతంలో రిక్టార్ స్కేల్‌పై 8.9 పాయింట్ల తీవ్రతతో భూకంపం సంభవించింది. అనంతరం సముద్రంలో ఉద్భవించిన సునామీ భారత్‌తో పాటు పలు దేశాలను అతలాకుతలం చేసింది. హిందూ మహా సముద్రంలో హఠాత్తుగా ఉవ్వెత్తున ఎగసిపడిన అలలు అక్కడికి సమీపంలో ఉన్న ప్రాంతాలను నామరూపాలు లేకుండా మార్చివేశాయి. థాయ్‌ల్యాండ్‌తో పాటు పలు దేశాల్లో సముద్ర తీరంలో నిర్మించిన హోటళ్లు, రెస్టారెంట్లలో బసచేసిన విదేశీ పర్యాటకులు సముద్రపు అలలకు కొట్టుకుపోయి ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రకృతి విపత్తులో భారత్‌కు చెందిన 10 వేల మంది బలయ్యారు. ఈ సునామీ ప్రభావంతో ప్రపంచ వ్యాప్తంగా 18 లక్షల మంది నిరాశ్రయులవగా, 50 వేల మంది గల్లంతయ్యారు.

25, డిసెంబర్ 2018, మంగళవారం

గుజరాత్ పేరు ఎక్కడైనా వినిపించిందా?: చంద్రబాబు


  •  బీజేపీ కంటే సంపన్న పార్టీ ఉందా?
  • టన్నులకొద్దీ డబ్బు పెట్టుకున్నారు
  • వాటితో గెలవాలనుకుంటున్నారు
  • కేసీఆర్‌కు ఇక్కడ కీలుబొమ్మ ఉండాలి
  • ఫెడరల్‌ ఫ్రంట్‌ ఎవరి కోసం?
  • సీఎం చంద్రబాబు ప్రశ్న
  • సుపరిపాలనపై శ్వేతపత్రం విడుదల
అమరావతి, డిసెంబరు 24: కాంగ్రెస్ తో టీడీపీ కలుస్తోందని.. సంపన్న పార్టీలు, సైద్ధాంతిక సారూప్యం లేని పార్టీలు జట్టుకడుతున్నాయని ప్రధాని మోదీ చేసిన విమర్శలను సీఎం చంద్రబాబు తిప్పికొట్టారు. బీజేపీ కంటే సంపన్న పార్టీ ఏముందని నిలదీశారు. ఏపీ ముందుకెళ్లకూడదని తెలంగాణ సీఎం కేసీఆర్‌ అనుకుంటున్నారని దుయ్యబట్టారు. సుపరిపాలన అంశంపై చంద్రబాబు సోమవారం (24-12-2018) శ్వేతపత్రం విడుద ల చేశారు. మంత్రి యనమల రామకృష్ణుడితో కలిసి విలేకరులతో మాట్లాడారు. ‘బీజేపీ టన్నుల కొద్దీ డబ్బు పెట్టుకుంది. దాంతోనే ఎన్నికల్లో గెలవాలనుకుంటోంది. ఎందుకు రెండువేల నోట్లు రద్దుచేయరు? మీకు డబ్బు ఎక్కువుంది కాబట్టి ఆ నోటు పంచి గెలవాలని చూస్తున్నారు. నేను కాంగ్రెస్ కు మద్దతు ఇస్తున్నాను.. ఎన్టీఆర్‌ కాంగ్రెస్ కు వ్యతిరేకమని మోదీ అంటున్నారు. మీరు (మోదీ)చేసిన నమ్మకద్రోహానికి, నమ్మించి మోసం చేసినదానికి.. ఎవరు కలిసొస్తే వారితో కలిసి రాష్ట్ర హ క్కులు కాపాడుకోవడంలో తప్పేంటి? మీరు అణగదొ క్కే ప్రయత్నం చేశారు. ఇక్కడున్నవారితో కలిసి కుట్ర, కుతంత్రాలు చేసి దెబ్బతీయాలనుకున్నారు.
 
ప్రధాన ప్రతిపక్షం కూడా మీపంచన చేరింది. పోలవరం నుంచి రాజధాని వరకు అడ్డుపడడం ఎంతవరకు సమంజ సం? దేశం, రాష్ట్రం కోసం అన్ని పార్టీలూ కలవాలి. ఇది ప్రజాస్వామ్య అనివార్యత. దేశంలోనే మనం బాగా చేస్తున్నామని మోదీకి కోపం. ఇక కేసీఆర్‌కు మంచి వ్యవస్థలున్నాయి. బాగా చేసుకోవచ్చు. కానీ ఆంధ్ర మాత్రం ముందుకుపోకూడదని ఆయన అనుకుంటారు. ఇందుకోసం కీలుబొమ్మ ప్రభుత్వం ఉండాలి. నియంత్రణ చేసుకోవచ్చన్నది కేసీఆర్‌ ఆలోచన’ అన్నారు.
 
ఐటీలో గుజరాత్‌ పేరు వినిపించిందా?
‘హైదరాబాద్‌ అంత అద్భుతంగా గుజరాత్‌ ఉందా? 12 ఏళ్లు మోదీ గుజరాత్‌ సీఎంగా చేశారు. కానీ ఏం చేశారు? ఐటీలో ఆరాష్ట్రం పేరు వినిపించిందా? మనం ఐటీకి ప్రాధాన్యమిచ్చాం. ఇంజనీరింగ్‌ కళాశాలలు పె ట్టాం. ఈరోజు ఐటీలో నంబర్‌వన్‌ తెలుగోడు. అదీ విజన్‌, నాయకత్వం. కొందరికి పోలవరం కట్టడం ఇ ష్టం లేకపోవచ్చు. నదుల అనుసంధానం అసలే ఇష్టం లేకపోవచ్చు. విద్యుత్‌ మిగులు ఇష్టం లేకపోవచ్చు. కానీ మనం చేస్తున్నాం. సాధిస్తున్నాం. ఇంకో నాలుగేళ్లు పోతే కష్టాలు అసలుండవు.’ ‘దేశంలో ప్రభుత్వం ఏర్పడేందుకు మూడే అవకాశాలున్నాయి. ఒకటి కాంగ్రెస్‌, రెండు బీజేపీ ప్రభుత్వాలు ఏర్పాటుచేయడం. మూడోది ఈ రెండు పార్టీల్లో ఏదో ఒక పార్టీ మద్దతుతో ఏర్పడే సంకీర్ణం. ఇంతకుమించి విశ్వామిత్ర సృష్టి చేయలేం. ఏ పక్షమో చెప్పకుండా.. ఫెడరల్‌ ఫ్రంట్‌ సాధ్యం కాదు.’ ‘పోలవరం ప్రాజెక్టు గేటు పెడితే గ్రేట్‌డేనా అని ప్రధాన ప్రతిపక్షం అవహేళన చేస్తోంది. కేంద్రం ఇన్ని అడ్డంకులు సృష్టిస్తున్నా ప్రాజెక్టు తొలి గేటు పెట్టిన రోజు కచ్చితంగా గ్రేట్‌ డే. కడపలో స్టీల్‌ ప్లాంటుకు శంకుస్థాపన చేస్తామంటే రియల్‌ ఎస్టేట్‌ కోసమని విమర్శిస్తున్నారు. అవగాహన, ఇంగితజ్ఞానం లేదు.’

21, డిసెంబర్ 2018, శుక్రవారం

ఆసియా కుబేకులకు 2018 కలిసి రాలేదట




               దిల్లీ: 2018 ప్రత్యేకించి ఆసియా కుబేరులకు కలిసి రాలేదు.     అత్యంత సంపన్నుల జాబితాలో వారి స్థానాలకు ఎసరు పెట్టింది. స్టాక్‌ మార్కెట్ స్థితిగతులు, వాణిజ్య పరంగా ఉన్న ఒత్తిడులు వారి సంపద మీద తీవ్ర ప్రభావం చూపాయి. ఈ వివరాలను వెల్లడిస్తూ బ్లూమ్బర్గ్ ఓ కథనాన్ని ప్రచురించింది.
                 ప్రపంచంలోనే అత్యంత సంపన్నులతో బ్లూమ్‌బర్గ్ బిలియనీర్ ఇండెక్స్ పేరిట ప్రతి ఏటా విడుదల చేసే జాబితాలో ఉన్న 128 మంది ఆసియా ధనవంతులు 2018లో 137 బిలియన్‌ డాలర్ల సంపదను కోల్పోయారు. 2012 నుంచి బ్లూమ్‌బర్గ్ ఈ జాబితాను విడుదల చేస్తోంది. అప్పటి నుంచి వారి మీద ఇలాంటి ప్రభావం పడటం ఇదే మొదటిసారి. అంతర్జాతీయంగా నెలకొన్న వాణిజ్య ఉద్రిక్తతలు, స్టాక్‌ మార్కెట్ ఒడుదొడుకులు ఈ పరిస్థితికి కారణాలు. వాటివల్ల ముఖ్యంగా చైనా సాంకేతిక రంగం ఎక్కువగా నష్టపోయింది. భారత్, దక్షిణ కొరియా దేశాలు కూడా ఈ ఒడుదొడుకుల నుంచి తప్పించుకోలేకపోయాయి. దానికి అడ్డుకట్ట వేయడానికి బ్యాంకులు, మనీ మేనేజర్లు చేసిన ప్రయత్నాలు ఆసియా ధనవంతులకు పెద్దగా కలిసిరాలేదు.
             బ్లూమ్‌బర్గ్ జాబితాలో ఉన్న చైనాకు చెందిన 40 మంది ధనవంతుల సంపద ఆవిరైంది. వాండా గ్రూప్‌ వ్యవస్థాపకుడు వాంగ్ జియాన్‌లిన్  అత్యధికంగా 10 బిలియన్‌ డాలర్ల సంపద కోల్పోయారు. అలాగే భారత్ కు చెందిన 23 మంది సంపన్నులు దాదాపు 21 బిలియన్‌ డాలర్లను కోల్పోయారు. ప్రపంచ స్టీల్ మార్కెట్‌ను శాసించే లక్ష్మి మిత్తల్‌ కు చెందిన 5.6 బిలియన్‌ డాలర్ల సంపద ఆవిరైంది. ఆయన మొత్తం నెట్‌ వర్త్‌లో అది 29 శాతం. అలాగే ప్రపంచంలోనే జనరిక్ డ్రగ్ మార్కెట్‌లో నాలుగో స్థానంలో ఉన్న సన్‌ ఫార్మా కంపెనీ అధినేత దిలీప్‌ సంఘ్వీ  4.6 బిలియన్‌ డాలర్లు నష్టపోయారు. దక్షిణ కొరియా, హాంకాంగ్ టైకూన్స్‌ ఈ ప్రభావం నుంచి తప్పించుకోలేకపోయాయి. అయితే ఈ మార్కెట్ ఒడుదొడుకుల్లో కూడా సంపదను పోగేసిన వారు ఉన్నారు. చైనా స్మార్ట్‌ ఫోన్‌ సంస్థ షియోమి అధినేత లీజున్‌కు అదనంగా 8.7 బిలియన్‌ డాలర్ల సంపద వచ్చి చేరింది.  భారత్‌కు చెందిన రిలయన్స్ ఇండస్ట్రీస్‌, చైనాకు చెందిన అలీబాబా గ్రూప్‌ హోల్డింగ్స్ లిమిటెడ్  సంస్థలు అదనంగా సంపదను పోగేసుకున్నాయి.

19, డిసెంబర్ 2018, బుధవారం

న్యూ ఇయర్ వేడుకలకు ఆంక్షలు





  నూతన సంవత్సర వేడుకల నేపథ్యంలో హైదరాబాద్‌ పోలీసులు పలు ఆంక్షలు విధించారు. నగరంలో పటిష్ట భద్రత ఏర్పాట్లు చేసినట్లు హైదరాబాద్ నగర్ పోలీసు కమిషనర్‌ అంజనీకుమార్ మీడియాకు తెలిపారు. వేడుకల్లో నిబంధనలు, ఆంక్షలు పాటించని వారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు. వేడుకలు కొనసాగే ప్రాంతాల్లో నిర్వాహకులు విధిగా సీసీ కెమెరాలు, ప్రైవేటు భద్రతా సిబ్బందిని ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. హోటళ్లు, బార్లు, రెస్టారెంట్లు అర్థరాత్రి ఒంటిగంట కల్లా మూసివేయాలని ఆదేశించారు. మత్తు పదార్థాలు మాదకద్రవ్యాలు వినియోగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. మహిళలకు ఇబ్బంది కలుగకుండా షీ బృందాలను అందుబాటులో ఉంచుతామని ఆయన చెప్పారు. అసభ్యకర నృత్యాలు నిర్వహిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అంజనీకుమార్‌ హెచ్చరించారు.

18, డిసెంబర్ 2018, మంగళవారం

ఐదు రాష్ట్రాల కొత్త ముఖ్యమంత్రులు


                   2018 నవంబర్‌లో ఎన్నికలు జరిగి డిసెంబర్‌ 11న ఫలితాలు వెలువడిన ఐదు రాష్ట్రాల్లో కొత్త ముఖ్యమంత్రులు కొలువు దీరారు. మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌, ఛత్తీస్‌గఢ్‌ల లో కాంగ్రెస్‌ ప్రభుత్వాలు కొలు వుదీరాయి. మధ్యప్రదేశ్‌లో కమల్‌నాథ్‌, రాజస్థాన్‌లో అశోక్‌ గహ్లాట్‌, ఛత్తీస్‌గఢ్‌లో భూపేశ్‌ బఘేల్‌లు ముఖ్య మంత్రుగా ప్రమాణ స్వీకారం చేశారు.  తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్ర సమితి విజయం సాధించింది. ఆపార్టీ  అధ్యక్షు డు  కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ముఖ్యమంత్రి అయ్యారు.  మిజోరాం రాష్ట్రంలో మిజోరాం నేషనల్‌ ఫ్రంట్‌ పార్టీ విజయం సాధించి ముఖ్యమంత్రిగా జొరంతంగా ఎన్నికయ్యారు. ఆయా రాష్ట్రాల గవర్నర్లు ప్రమాణం చేయించారు.

16, డిసెంబర్ 2018, ఆదివారం

ముద్దుల పోటీకి నో చెప్పిన బీజేపీ


                  రాంచీ: ప్రతి ఏడాది సంప్రదాయబద్ధంగా గిరిజనులు నిర్వహించుకునే ‘ముద్దుల పండుగ’కు ఈసారి బీజేపీ మోకాలడ్డింది. బహిరంగంగా ముద్దులు పెట్టుకోవడం భారతీయ సంప్రదాయం కాదని, ఈ పండుగ ద్వారా సమాజంలోకి చెడు సంకేతాలు వెళ్తాయని చెబుతూ ఈ ఏడాది పండుగకు అనుమతించేది లేదని తెగేసి చెప్పింది.
                జార్ఖండ్‌లోని గిరిజనులు ప్రతి ఏడాది డిసెంబరులో ముద్దుల పోటీ నిర్వహిస్తారు. బహిరంగంగా ముద్దులు పెట్టుకోవడంతో తమ ప్రేమను వ్యక్తపరుస్తారు. పాకూర్ జిల్లాలోని లిట్టిపర బ్లాక్‌లో జరిగే ఈ పండుగను చూసేందుకు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు పెద్ద ఎత్తున తరలివస్తుంటారు. ఏళ్లుగా ఈ ముద్దుల పండుగ కొనసాగుతున్నా సామాజిక మాధ్యమాల పుణ్యమా అని గతేడాది జరిగిన పోటీకి సంబంధించిన ఫొటోలు, వీడియోలు బాగా వైరల్ అయ్యాయి. జార్ఖండ్ ముక్తి మోర్చాకు చెందిన స్థానిక ఎమ్మెల్యే సిమోన్ మరాండి ఆధ్వర్యంలో గతేడాది జరిగిన ఈ కార్యక్రమంలో 18 జంటలు పాల్గొన్నాయి.
              ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పలు హిందూ సంఘాలు ఈ పండుగపై అభ్యంతరాలు వ్యక్తం చేశాయి. దీంతో ఈ ఏడాది ముద్దుల పండుగకు అనుమతి ఇచ్చేది లేదని బీజేపీ ప్రభుత్వం తేల్చి చెప్పడంతో జిల్లా ఎస్‌డీవో జితేంద్ర కుమార్ ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వ ఆదేశాలపై గిరిజనులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఏళ్లుగా వస్తున్నతమ ఆచారాన్ని అడ్డుకోవాలని చూడడం భావ్యం కాదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.