26, జులై 2011, మంగళవారం

తెలంగాణ ఆందోళనకు తెరపడే దెన్నడు?

               తెలంగాణ ఆందోళనకు తెరపడే దెన్నడు అని ప్రజలు ఎదురు చూస్తున్నారు. ప్రభుత్వ పాలన స్తంభించి పోయింది. పాలకుల ఆగడాలను ప్రశ్నించాల్సిన ప్రధాన ప్రతిపక్షం కూడా తెలంగాణ ఆందోళనలోనే తలమునకలయ్యింది. ప్రశ్నించే వామపక్షాల్లో కూడా సిపిఎం తప్ప తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కావాలని డిమాండ్‌ చేస్తున్నాయి. విపరీతంగా ధరలు పెంచి సామాన్యుని నడ్డి విరుస్తున్న పాలకులు ప్రజల మధ్య తగువు పెట్టి చూస్తున్నారు. ఐక్యంగా ఉంటే ఆటలు సాగవని భావించిన పాలకుల కుట్రలను ప్రతిపక్షాలు సమర్థవంతంగా ఎదుర్కొనే పరస్థితి లేదు. రాష్ట్రాన్ని విడగొట్టండని గట్టిగా చెబితే సీమాంధ్రలో వ్యతిరేకత వస్తుందని .... ఐక్యంగా ఉంచండని చెబితే తెలంగాణలో రాజకీయం చేయలేమని ప్రజల పక్షాల నిలబడాల్సిన ప్రజాప్రతినిధులే దోబూచులాడుతున్నారు. దోబూచులాడుతున్న రాజకీయ నాయకులను ప్రశ్నించాల్సిన ప్రజలు మధ్య కూడా ఐక్యతను దెబ్బతీయడానికి సెంటిమెంటును రెచ్చగొడుతున్నారు. సిద్ధాంతం... చిత్తశుద్ధి లేని స్వార్థ రాజకీయ నాయకుల ఆటలు తెలుసుకోనంత కాలం ప్రజలు ఇబ్బందులు పడుతూనే ఉంటారు. ఇలాంటి సమస్యలను ఎదురవుతూనే ఉంటాయి. ప్రాంతాలకతీతంగా ప్రజలు తిరగబడితే తప్ప ద్వందవైఖరితో వ్యవహరించే రాజకీయ నాయకులకు తిక్కకుదరదు.

18, జులై 2011, సోమవారం

అనైతిక రాజకీయాలు

                  కర్నూలు జిల్లాలో అనైతిక రాజకీయాలు మరో సారి అరంగేట్రం చేశాయి. రాజకీయాలు కాదండోరు నీతిమాలిన నాయకులు అని చెప్పాలి. రాజకీయాల్లోకి నీతి మాలిన వారు రావడం వల్ల ఇలాంటివి మామూలు అయిపోయాయి. నవ్విపోదురు కాక నాకేంటి అన్నట్లు రోజుకో పార్టీలో తిరిగే నాయకుల చర్యలు రోత పుట్టిస్తున్నాయి. ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన కాటసాని రాంభూపాల్‌రెడ్డి, ఎమ్మిగనూరుకు చెందిన మరో సీనియర్‌ ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి వీరిద్దరూ కాంగ్రెస్‌ పార్టీ హస్తం గుర్తుతో ఎమ్మెల్యేలుగా గెలిచారు. మంత్రాలయం ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి టిడిపి సైకిల్‌ గుర్తుతో గెలిచారు. పార్టీలు పిరాయిస్తారనే ముందుజాగ్రత్తగా కాంగ్రెస్‌ పార్టీ ఎస్వీ మోహన్‌రెడ్డికి ఎమ్మెల్సీ పదవి కట్టబెట్టింది. ముఖ్యమంత్రి పదవి దక్కలేదని కాంగ్రెస్‌ పార్టీకి గుడ్‌బై చెప్పిన వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి స్థాపించిన వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీలో వారు నలుగురూ చేరారు. 2011 జులై 18న జగన్‌మోహన్‌రెడ్డి కర్నూలులో ఓదార్పు యాత్ర ప్రారంభించారు. ఆయన ఓదార్పులో ఆ నలుగురూ కలిశారు. అప్పటికే పలుమార్పు పార్టీలు పిరాయించిన భూమా దంపతులు జగన్‌కు బంధువులు కావడం వల్ల ఆయన వెంటే ఉన్నారు. వారు ముందుగా టిడిపికి రాజీనామా చేసి ప్రజారాజ్యంలో చేరారు. ప్రజారాజ్యం కాస్త కాంగ్రెస్‌లో కలిసి పోయిన సంగతి తెలిసిందే. దీంతో వారు వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌తో జతకట్టారు. ఆవు చేలో మేస్తే దూడ గట్టున మేస్తుందా అన్న చందంగా పలువురు నాయకుల అనుచర గణం ఎందరో వైఎస్‌ఆర్‌ పార్టీలోకి వలస వెళ్తున్నారు. అక్కడ ఎన్నాళ్లుంటారో చూడాలి మరి.

12, జులై 2011, మంగళవారం

సమస్త కళల సారాంశం 'మనిషి'

సాహితీవేత్త ఆశావాది ప్రకాశరావు
        సమస్త కళల సారాంశం 'మనిషి' అని ప్రముఖ సాహితీవేత్త ఆశావాది ప్రకాష్‌రావు పేర్కొన్నారు. అనంతపురం జిల్లా పెనుకొండ టిటిడి కళ్యాణ మండపంలో వేకువ కళాసమాజ సేవా సంస్థ ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి కవితాపురస్కారోత్సవాన్ని 2011 జులై 10న ఘనంగా నిర్వహంచారు. ప్రఖ్యాత సాహితీ వేత్తలు శ్రీశ్రీ, పుట్టపర్తి నారాయణ చార్యులు, విద్వాన్‌విశ్వం పేర్లతో మూడు వేదికలుగా ఈ పురస్కారోత్సవాలను నిర్వహించారు. ప్రముఖ అష్టావధాని, డాక్టర్‌ శావాది ప్రకాష్‌రావు పుట్టపర్తి నారాయణ చార్యుల వేదికకు అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఆశావాది మాట్లాడుతూ కళలకు, సాహిత్యానికి ఎల్లలు లేవన్నారు. వాటి ద్వారా సమాజాన్ని మేల్కొల్పవచ్చునని అన్నారు. అన్నిరంగాల్లో ప్రజలను చైతన్యం చేయడానికి కళలు, సాహిత్యం ఎంతో ఉపయోగపడతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నలుమూలల నుంచి 13 మంది ప్రముఖ సాహితీవేత్తలు, ప్రముఖ కళాకారులు పాల్గొన్నారు. కేంద్రసాహిత్య అకాడమి అవార్డు గ్రహిత శివారెడ్డి శ్రీశ్రీ వేదికకు, నెలవంక- నెమలీక సంపాదకులు శ్రీరాములు విద్వాన్‌ విశ్వం వేదికకు అధ్యక్షత వహించారు. ప్రముఖ ప్రజాగాయకుడు గోరేటి వెంకన్న సీమ సంస్కృతి, సాంప్రదాయాలపై, అనంతకరువుపై పాడిన పాటలు అలరించాయి. బి.కెభవ్య, సుగమ్య, శంకర్లు చేసిన శాస్త్రీయ నృత్యాలు పలువురిని ఆకట్టుకున్నాయి. జిల్లా రచయితల సంఘం అధ్యక్షులు జూపల్లి ప్రేమ్‌చంద్‌, ప్రముఖ శ్రీవాద కవయిత్రి శిలలోలిత, కవయిత్రులు లోయాల, డా.ఆశాజ్యోతి, ప్రముఖ కవులు బిక్కికృష్ణ, యాకోబ్‌, మాలేపల్లిలు పలు అంశాలపై కవితలు వినిపించారు. ఈసందర్భంగా జరిగిన కవిసమ్మేళనంలో వందమందికిపైగా వర్ధమాన కవులు పాల్గొన్నారు. అనంతరం రాష్ట్ర స్థాయి కవితా పురస్కారోత్సం నిర్వహించారు. ఈ సందర్బంగా రాష్ట్ర స్థాయిలోఎంపికైన కవితలను ఆయా కవితల రచయితలు వినిపించారు. రచయితలకు జ్ఞాపిలకలను, ప్రశంసపత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమానికి వేకువ సంస్థ అధ్యక్షులు జాబిలి జయచంద్ర అధ్యక్షత వహించగా ప్రధాన కార్యదర్శి రాజశేఖర్‌రెడ్డి పురస్కార ప్రస్తావకునిగా వ్యవహరించారు. ఈ కార్యక్రమంలో సర్పంచి జయలక్ష్మమ్మ, ఉపసర్పంచి శ్రీరాములు, పలువురు పట్టణ ప్రముఖులు, సాహితీ అభిమానులు పాల్గొన్నారు.

11, జులై 2011, సోమవారం

వేర్పాటువాద లొల్లి దేనికి..?

అవినీతిని కప్పిపుచ్చుకోవడానికా..?
ధరల భారం మరిచిపోవడానికా..?
          తెలంగాణా ఉద్యమాన్ని అవమాన పరచడం లేదనుకుంటే నాకున్న కొన్ని సందేహాలు చెప్పాలనుకున్నా. తెలంగాణా ప్రత్యేక రాష్ట్రం కావాలనే డిమాండ్‌ ఈనాటిది కాదు. అయితే ప్రస్తుతం విస్తరించింది. ఒకప్పుడు ప్రసార, ప్రచార మాధ్యమాలు తక్కువ కాబట్టి ప్రజల్లోకి వెళ్లడానికి సమయం పట్టేది. ఇప్పుడు విస్తృతి పెరిగింది. ప్రజల్లోకి వెంటనే చేరుతుంది. ప్రస్తుతం సిపిఎం మినహా అన్ని పార్టీలూ మద్దతు తెలిపాయి. అధికార పార్టీ నాటక మాడుతోంది. కెసిఆర్‌ దీక్షలకు స్పందించి శ్రీకృష్ణ కమిటీ వేశారు. తెలంగాణా రాష్ట్రం వచ్చేస్తుందనే భ్రమలు కల్పించాయి చిదంబరం వ్యాఖ్యలు. శ్రీకృష్ణకమిటీ నివేదిక వచ్చింది. అందులోని అంశాలన్నీ బహిరంగ పరిచారు. కొన్ని రహాస్యాలన్నారు. చివరికి అవి కూడా బయటకు పొక్కాయి. ఏకాభిప్రాయ సాధన అన్నారు. అన్ని రాజకీయ పార్టీలను పిలిచారు. మాట్లాడారు. తెలంగాణా రాష్ట్ర ఇవ్వలేమని స్పష్టం చేయవచ్చు. లేదా పలాన సమయానికి ఇస్తామని అయినా చెప్పవచ్చు. రెండూ చెప్పకుండా అవకాశ వాద ధోరణితో వ్యవహరించడం ఎంతవరకు సమంజసం. ప్రస్తుతం ప్రభుత్వ ప్రతిష్ట పడిపోయింది. మంత్రులు కుంభకోణాల్లో ఇరుక్కున్నారు. జనలోక్‌పాల్‌ బిల్లు తెస్తామని అన్నారు. అందులో ప్రధాన మంత్రిని చేర్చాలని దీక్షలు మొదలయ్యాయి. ప్రధాన మంత్రిని చేర్చాలో లేదో తేలకముందే ఇంధన ధరలు పెంచారు. ఈ పరిణామాల క్రమంలో ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతుందని భావించి దీని నుంచి ప్రజల ధృష్టిని మరల్చేందుకు తెలంగాణా రాజీనామాల అస్త్రాలను ప్రయోగించింది అధికార పార్టీ. దీని మర్మాన్ని గ్రహించిన ఇతర పార్టీల ఎమ్మెల్యేలు కూడా రాజీనామా చేశారు. అధికార పార్టీ వాళ్లతోపాటు మనం కూడా రాజీనామా చేయకపోతే ఎక్కడ ప్రజలకు దూరమవుతామోననే ఆలోచనతో టిడిపి, బిజెపి, సిపిఐ ఇతర ఎమ్మెల్యేలు కూడా రాజీనామాలు సమర్పించారు. రాజీనామాలు గవర్నర్‌కు సమర్పిస్తే రాజ్యాంగ సంక్షోభం ప్రభావం వెంటనే తెలిసేది. స్పీకర్‌ లేని సమయంలో రాజీనామాలు సమర్పించారు. ఈసారి గొడవలో కొందరి స్వార్థముందని కొన్ని పత్రికలు రాశాయి. స్వార్థముందనేది వాస్తవమే కానీ అధికార పార్టీదే స్వార్థముందనేది మాత్రం రాయలేదు. అబ్బో అధిష్టానం కోపపడినట్లు నటించింది. అందులో కోపం లేదు .... పాడులేదు. తాము వేసుకున్న పథకం బాగా విజయ వంతమయిందనే ఆనందం తప్ప. అయితే తెలంగాణా ఎప్పటికయినా సపరేటు అవుతుందనే చర్చ మాత్రం జనంలో సాగుతోంది. 2014 ఎన్నికల వరకు తేల్చరనేది కూడా అనుకుంటున్నారు. మరి అధికార పార్టీ ఏం చేస్తుందో వేచి చూడాలి.

23, జూన్ 2011, గురువారం

ఆదర్శ వివాహాలను ప్రోత్సహించాలి

                వివాహం అనేది స్త్రీపురుషుల మధ్య చట్టపరమైన ఒడంబడిక లేదా సామాజిక కట్టుబాటు అని సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు ఎంఏ గఫూర్‌ అన్నారు. 2011 జూన్‌ 23న గురువారం కర్నూలు సిపిఎం కార్యాలయ ఆవరణంలో ఆ పార్టీ ఆధ్వర్యంలో ఎస్‌ఎఫ్‌ఐ జిల్లాకార్యదర్శి సిపి నాయుడు, ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర కమిటీ సభ్యులు మహబూబ్‌నగర్‌ జిల్లాకు చెందిన ఎం.రాధ ఆదర్శ వివాహం చేసుకున్నారు. ప్రస్తుత కట్టుబాట్లు, సాంప్రదాయాలకు, హంగు ఆర్భాటాలకు భిన్నంగా ఈ వివాహం జరిగింది. ప్రముఖ వైద్యులు డాక్టర్‌ కన్నా ఆచార్యులుగా వ్యవహరించి కష్టసుఖాలలో కలిసుంటామని, సమాజ మార్పుకోసం కృషి చేస్తామని ప్రమాణం చేయించారు. పూలమాలలు వేయించి సాదాసీదాగా అందరి ఆమోదంతో ఈ ప్రక్రియను నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంఏ గఫూర్‌ మాట్లాడుతూ ఒకరినొకరు తెలుసుకుని ఒడిదొడుకులను తట్టుకుని జీవించడానికి సిద్దపడిన రాధ, సిపి నాయకుడులను అభినందించారు. ప్రేమించే హృదయాలకు పేదరికం, కుల, మతాలు అడ్డురావని అన్నారు. ఆదర్శ వివాహాలు చేసుకునేందుకు ముందుకు రావాలని యువతకు పిలుపు నిచ్చారు. ఇలాంటి వివాహాల వల్ల ఇరువర్గాల వారికి ఖర్చు తగ్గుతుందన్నారు. ప్రజాసమస్యల పరిష్కారం కోసం పాటుపడాలని వధూవరులను కోరారు. మీ సంతోషంతో పాటు పెంచి పెద్దచేసిన తల్లిదండ్రులను గౌరవించాలని, వారి ఆశలను అడియాసలు చేయరాదని సూచించారు.
జిల్లా కార్యదర్శి టి.షడ్రక్‌ మాట్లాడుతూ ఇలాంటి వివాహాలు తమ పార్టీ ఆధ్వర్యంలో ఎంతో మందికి నిర్వహించామన్నారు. సాంప్రదాయ పెళ్లిళ్లకు భిన్నంగా వివాహాలు చేస్తున్నామన్నారు. సిపిఎం మహబూబ్‌నగర్‌ జిల్లా కార్యదర్శి కిల్లెగోపాల్‌ మాట్లాడుతూ సమైక్యతనూ చాటుతూ కర్నూలు, మహబూబ్‌నగర్‌ ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు పెళ్లి చేసుకోవడం సంతోషమన్నారు. సేవాదృక్పదం, సమాజ అవగాహన కలిగిన ఎం.రాధ కష్టపడే స్వభావం కలిగి ఉందని చెప్పారు. నాయుడు, రాధ పరస్పరం అవగాహనతో అందరికి మార్గ దర్శకులు కావాలని సూచించారు. సాంప్రదాయాలకు భిన్నంగా ఒకరినొకరు అర్థం చేసుకుని జీవిత భాగస్వాములు కావడం అభినందనీయమని అన్నారు. ఈ సందర్బంగా రాయలసీమ యూనివర్సిటీ ప్రొఫెసర్‌ పుణ్యశేషుడు, నారాయణ విద్యాసంస్థలు జోనల్‌ ఇన్‌చార్జ్‌ రామలింగేశ్వరరెడ్డి, సాయిరాం విద్యాసంస్థల అధినేత సుధాకర్‌రెడ్డి, మహబూబ్‌నగర్‌ సిపిఎం కార్యదర్శి కె.గోపాల్‌, ఐద్వా రాష్ట్ర ఉపాధ్యక్షురాలు పి.నిర్మలమ్మ, కలెక్టరేట్‌ భూపరిపాలన విభాగం ఎఓ మల్లికార్జున, ఎఐఎస్‌ఎఫ్‌ జిల్లా కార్యదర్శి హుస్సేన్‌, ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి నరసింహ, మహబూబ్‌నగర్‌ జిల్లా ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు బాలనాగిరెడ్డి, జిల్లా అధ్యక్షులు శ్రీరాంలు వధువరులను ఆశీర్వదిస్తూ వారి జీవితం సుఖసంతోషాలతో సాగాలని, సమాజ సేవకోసం పాటుపడుతూ అందరికి ఆదర్శంగా నిలవాలని ఆకాంక్షించారు. ఈ ఆదర్శ వివాహానికి అన్ని ప్రజాసంఘాల నాయకులు హాజరై వారిని ఆశీర్వదించారు.

31, మే 2011, మంగళవారం

'' ఆనాటి ఆ స్నేహమానందగీతం - ఆ జ్ఞాపకాలన్ని మధురాతి మధురం''

వనపర్తి ' తెలుగువాడ' పూర్వ విద్యార్థుల సమ్మేళనం
                మహబూబ్‌నగర్‌ జిల్లా వనపర్తి తెలుగు వాడ పూర్వ విద్యార్థుల సమ్మేళనం అత్యంత వైభవంగా జరిగింది. 1977 -1984 బ్యాచ్‌ 7వ తరగతి ఎ, బి సెక్షన్ల పూర్వ విద్యార్థులు మంగళవారం (31-05-2011) వనపర్తి భగీరథ పంక్షన్‌హాలులో సమావేశ మయ్యారు. ఈ సమావేశానికి అప్పటి ఉపాధ్యాయులను ఆహ్వానించి వారిని ఘనంగా సన్మానించారు. సమావేశానికి వసంత్‌, వై.వెంకటేష్‌, కె.చంద్రుడు, మల్లికార్జున్‌ అధ్యక్షత వహించారు. '' ఆనాటి ఆ స్నేహమానందగీతం- ఆ జ్ఞాపకాలన్ని మధురాతి మధురం '' అన్న విధంగా హాజరయిన వారందరూ తమ అనుభవాలను, జ్ఞాపకాలను పంచుకున్నారు. ఉపాధ్యాయులు చంద్రకళ, సరోజనమ్మ, వనజ, జగదీశ్వరమ్మ, నిరీక్షణమ్మ, శశికళ, ఆనందం, బాలస్వామి, బసవపని, యోగానందం, రాములుశెట్టి, అప్పటి అటెండర్‌ సయ్యజ్‌ జలాల్‌ తదితరులను ఘనంగా సన్మానించారు. వారు మాట్లాడుతూ ఈ సమ్మేళనం అపూర్వం, అద్భుతమని కొనియాడారు. మరుపురాని ఈ సన్నివేశాన్ని వర్ణించడానికి భాష సరిపోదేమో అని అన్నారు. తాము చెప్పిన చదువుతో మీరంతా వివిధ స్థాయిలో సేవలు అందిస్తున్నారని, భవిష్యత్తులో సమాజానికి ఉపయోగపడే పనులు చేయాలని సూచించారు. 7వ తరగతి విద్యార్థుల సమ్మేళనం జరగడం వనపర్తి చరిత్రలో ఇదే ప్రథమమని అన్నారు. కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు పానుగంటి చంద్రయ్య, కె.కృష్ణయ్య, శాంతయ్య, గఫూర్‌, రాజేష్‌, అరుణ్‌, కిరణ్‌, యాదగిరి, లతీఫ్‌, జయప్రకాష్‌, వెంకటేశ్వర్లు, సత్యనారాయణ, రమేష్‌, తదితర 50 మంది దాకా హాజరయ్యారు.

28, మే 2011, శనివారం

డాక్టర్‌ ఆశావాది ప్రకాశరావు జీవిత ప్రస్థానం

'అక్షర' సాహితీ సమాలోచన
ఆధ్వర్యం
యువభారతి, సాధన సాహితీ స్రవంతి , తెలుగు రథం, మానస ఆర్ట్‌ థియేటర్స్‌
నా జీవిత ప్రస్థానం

(ఇటీవల ఆయన చేసిన ప్రసంగం ఆధారంగా )
ఆయన ఆయురారోగ్యాలతో మరిన్ని ప్రసంగాలు, రచనలు చేయాలని కోరుతూ ......
వక్త : డాక్టర్‌ ఆశావాది ప్రకాశరావు, పెనుకొండ -515110
cel: 9440488600
యశఃకండూతి:
                 కళాశాల ప్రవేశం చేసే దాకా సాహిత్యం అంటే ఏమిటో నాకు తెలియదు. రచయితలంటే అప్పటి సమాజం 1954-74 మధ్యకాలంలో చూపే గౌరవం చూసి ఆ కీర్తి ఏ కొంతమేరయైనా మూట కట్టుకోవాలని ఆశించాను.


కీరితి లేనిచో వనమృగీతతి తుల్యుడు మానవుండు సం
స్కారవచః ప్రపాకము విశాల మనస్సొనగూడు కాన ఆ
కీరితి కోసమే తనువు కీడ్పడ జేయగ దీక్ష బూనితిన్‌
కీరసమంబునౌ నుడుల కేల్గవ వీణియమీటు తల్లికై
                                         (అవధాన వసంతం)
            ఈ యశఃకండూతియే అనంతరకాలంలో సాహిత్యలోకంతోడి సాన్నిహిత్యాన్ని నాలో పెంచింది.
నా జీవితంలో సాహిత్యవికాసం ఒక క్రమగతిలో సాగలేదు. ఏవో ప్రేరణాంశాలు, అవకాశాలు నన్ను అటుగా ఈడ్చుకొని వెళ్లాయి. కలగాపులగంగా వివిధ సాహిత్యప్రక్రియల్లో తలదూర్చి పరిశ్రమిస్తూ వచ్చాను. పట్టు సాధించేకొద్దీ కొన్నింటిని మానుకుంటూ మరికొన్నింటిని బలమైన ఆలంబనగా చేసుకుంటూ నిలబడ్డాను.
బీజావాపం:
           నా ప్రాథమిక విద్య మా నాన్న దగ్గరే. ఆయన ఉపాధ్యాయుడుగా నాతో కృష్ణ, భాస్కర, సుమతి, వేమనశతక పద్యాలు ఓ వందదాకా ఐదవ తరగతి ముగిసేలోపుగా కంఠస్థం చేయించాడు. పెద్దబాలశిక్ష చదివించాడు.
               నాటి ఉన్నత పాఠశాలల్లో అక్షరజీవులుగా మమ్మల్ని మలచటానికి ఎన్నెన్నో పోటీలు నిర్వహించే వారు. పద్యధారణలో ఒకరి తరువాత ఒకరు, ఒకరు చెప్పిన పద్యం మరొక్కరు చెప్పకుండా నిలబడవలసి వచ్చేది. పద్యపఠనంలో పూర్వకవుల గ్రంథాల్లో ఏ పుట తెరిచి చూపిస్తే అక్కడి పద్య గద్యాలను చదువవలసి వచ్చేది.
ఒక పిరియడ్‌లో మొదటి 20 నిమిషాలు కొన్ని గద్య గ్రంథాలను మౌనంగా చదువుకొమ్మనే వారు. సాధారణంగా అవి కథలో, నాటకాలో, మహాత్ముల జీవితచరిత్రలో అయి ఉండేవి. చివరి 20 నిమిషాలల్లో చదివినదానిలో మాకు అర్థమైన, గుర్తున్న, నచ్చిన అంశాలను పేర్కొంటూ కొన్ని వాక్యాలను వ్రాయుమనే వారు.
              వ్యాసరచనలో శీర్షిక అప్పటికప్పుడే నిర్దేశించే వారు. ముందుగా ఆలోచించుకోవడానికో , తయారుచేసికొని కంఠస్థం పట్టి రావటానికో అవకాశం ఉండేది కాదు.
                 కళాశాలలో సారస్వతసంఘ ఆధ్వర్యంలో తరచు ప్రసిద్ధ కవిపండితుల ప్రసంగాలు ఉండేవి. ఊళ్లలో నాటకసమాజాల వాళ్లు మూడు నెలలకు ఒక్కమారైనా తప్పక పద్యనాటకాలు ప్రదర్శించే వాళ్లు. ఆసక్తిగా వీటికి హాజరయ్యే వాడిని. వీటిలోని ఆకర్షణాకోణాలు ఏ కొన్నైనా నాపై అజ్ఞాతముద్ర వేశాయనడంలో సందేహం లేదు.
తోడుగా అప్పటి బోధనా పద్ధతులు, పరీక్షా విధానాలు సృజనాత్మకతను పెంచేవిగా ఉండేవి. మా అధ్యాపకులు ఒక్కొక్క పాఠానికి అనేకమైన ఉపశీర్షికల క్రింద ఇస్తూ ఉండిన పుటల కొలది' నోట్స్‌' భాషపై పట్టు సాధించడానికి కారణమయ్యేది. పరీక్షల్లో పాఠ్యాంశాలలో లేని క్రొత్త పద్యాలకు తాత్పర్యం వ్రాయవలసి వచ్చేది. అట్లే ఇచ్చిన సుదీర్ఘగద్యం ఆధారంగా అడిగిన ప్రశ్నలకు సమాధానం వ్రాసేవాళ్లం.
            పై నేపథ్యం పద్యంపై ప్రీతి పెంచుకోవడానికి, అవగాహనలో ఒదిగివచ్చిన వాటికి చక్కని వ్యాసరూపం ఇవ్వటానికి, ధైర్యంగా వేదికపై ప్రసంగించటానికి తగిన బీజాలు వేశాయి.
వ్యాసవికాసం:
             13వ ఏట నాలో రచయిత తయారైనాడు. నేను చదివే పాఠశాలలో, నివసించే వసతి గృహంలో, వ్యాసరచనల పోటీల్లో బహుమతులు నావే. 10వ తరగతిలో 'అస్పృశ్యతా నివారణ' ను గూర్చి ఒక వ్యాసం వ్రాసి మా పాఠశాల వార్షికసంచికకు ఇచ్చాను. దాని సంపాదకులు '' స్వాతంత్య్ర వచ్చి పదేళ్లు దాటింది. ఇంకా ఎక్కడుంది అస్పృశ్యత? బుద్ధి లేకుంటే సరి పట్టు పట్టు'' అంటూ కాగితాలను విసిరి కొట్టారు. అది నాలో పట్టుదలను పెంచింది. సహనంతో కార్యం సాధించుకోవలసిన దీక్షను గుర్తు చేసింది.
             పౌర గ్రంధాలయం వెళ్లి ఆసక్తి గల గ్రంధాన్ని తీసుకొనే వాడిని. దానిని ఆద్యంతం చదవకుండా పీఠిక తప్పనిసరి చదివేవాడిని. నాకంటే ముందే దాన్ని చూచిన పాఠకులు ఆ పుటల్లో ఎక్కడైనా క్రీగీటులు గుర్తులు ఉంచారా? స్పందనలు వ్రాశారా? అని చూచి వాటిపై దృష్టి నిలిపి దానికి కారణాలు అన్వేషించే వాడిని. దీనివల్ల తక్కువ కాలంలో విజ్ఞానం పెరిగేది. వ్రాతకు బలం చేకూర్చే అనేక విషయాలు తెలిసివచ్చేవి. ఈ విధంగా కూర్చుకొన్న రచనాసామర్థ్యం తరచూ చుట్టూజరిగే చాల అసంబద్ధతలపై కరపత్రాలు తయారు చేసి పంచేదాకా వెళ్లింది. నా ప్రయత్నాన్ని ప్రత్యర్థులు వమ్ముచేస్తూ రావటంతో ఆ విధానం మానుకున్నాను.
              మా కళాశాలలో మతసామరస్యంపై , పోతన భాగవతంపై విద్యార్థులకు ఏటేటా నిర్వహిస్తూ ఉండిన ధర్మనిధి పురస్కారాల వ్యాసరచన పోటీలలో గెలుపొందినాను. కళాశాల వార్షికసంచికకు 'అష్టావధానం' వ్యాసం ఇచ్చాను. అధ్యాపకులమధ్య, ఉపాధ్యాయులమధ్య, మంచి గుర్తింపు వచ్చింది.
                     తెలుగు పండితుడుగా, ఆంధ్రభాషోపన్యాసకుడుగా స్థిరపడిన దశలో నా జీవన మార్గదర్శి 'విద్యావిభూషణ' శ్రీ భోగిసెట్టి జూగప్పగారి జీవితచరిత్ర వ్రాశాను. పలువురి గ్రంథాలకు వ్రాసిన ముందుమాటలు 'సమీక్షా స్రవంతి' పేర వెలువడ్డాయి. చిత్రకవి శ్రీ రాప్తాటి ఓచిరెడ్డి, సాయిలీలాగుచ్ఛ కావ్యకర్త శ్రీ యన్‌. యం . సహాయాచారి, శతావధాని శ్రీ దోమావేంకటస్వామిగుప్తల సాహిత్య సృజనపై సుదీర్ఘ వ్యాసాలు వ్రాశాను. ఇవి 'సమారాధన'లో చేరాయి. నా ఆకాశవాణి ప్రసంగాలు 'ప్రసార కిరణాలు'గా , సూక్తి ముక్తావళులు, 'ప్రత్యూష పవనాలు'గా ముద్రణలో వచ్చాయి. పోతన భాగవతంపై ప్రత్యేక శ్రద్ధతో పరిశ్రమించిన కారణంగా ''భాగవత సౌరభం'' వెలువడింది. మాజీమంత్రి శ్రీ కొత్తపల్లి జయరాం సౌజన్యంతో ముద్రించి అమూల్య ప్రసాదంగా ముముక్షువులకు పంచుతున్నాను.
అనువాద వికాసం:
              తిరుమలతిరుపతి దేవస్థానంవారి పోతనభాగవతం ప్రాజెక్టునుండి లభించిన అవకాశాన్ని సద్వినియోగం చేసికోదలచి తృతీయస్కంధానికి సరళగద్యానువాదం చేశాను. దీని ప్రధాన సంపాదకులు డాక్టర్‌ కరుణశ్రీ జంధ్యాల పాపయ్యశాస్త్రి మున్నుడిలో '' ఆశావాది ప్రకాశరావు అష్టావధాన కళలో ఆరితేరినవాడు. వినయభూషణుడు, మధురభాషణుడు. వీరి అనువాదం సరసంగా సాగింది'' . అన్నారు. ఆంగ్లంలో ఆలివర్‌ గోల్డ్‌స్మిత్‌, రచించిన 'సిటీ నైట్‌ పీస్‌' ను ' చీకటి కోణం' శీర్షికతో వచన కవితగా అనువాదించాను. పుట్టపర్తి సాయిబాబాగారి సూక్తులకు 'విభూతిగీత' పేర పద్యరూపం ఇచ్చాను.
పరిశోధనా వికాసం:
                       తాళ్లపాక అన్నమాచార్య పౌత్రుడు అన్నయ రచించిన 'చెల్లపిళ్లరాయచరిత్రము' అనే అముద్రిత యక్షగాన తాళపత్రప్రతి పరిశీలించి , క్రిమిదష్టభాగాలను పూరించి, కవి కాలాదులు నిర్ణయిస్తూ విపులమైన పీటికతో ప్రచురించాను. శ్రీ రాప్తాటి నిరోష్ఠ్య కృష్ణశతకానికి లఘుటీక వ్రాసే అవకాశం లభించింది.
పిహెచ్‌. డి., పట్టాకై శ్రీ కృష్ణదేవరాయ విశ్వవిద్యాలయంలో పేరు నమోదు చేసికొని కొన్ని అవాచ్య సంఘనటలమధ్య విరమించాను. కొన్నేళ్ల విరామంతో శ్రీ వేంకటేశ్వరా విశ్వవిద్యాలయంలోనూ చేరి సరపడని సంగతులు తలెత్తటంతో దానిఆశావదులుకొన్నాను. 'అంతకంటె మించిన డిగ్రీ రాకుండా పోతుందా' అని యథాలాపంగా పలికిన నా మాటను దైవం నెగ్గించాడు. నా 56వ యేట పొట్టిశ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం నుండి గౌరవ డాక్టరేట్‌ (డి.లిట్‌) లభించింది.
                       ఈ పరిశోధనా ప్రస్థానంలో సోదరతుల్యుడు శ్రీ గంగప్పగారి చెన్నయ్యను కలుపుకుని ఎఱ్ఱనపీఠం వారి ప్రకటనకు స్పందించి ''ప్రహ్లాద చరిత్ర-ఎఱ్ఱన, పోతన తులనాత్మక పరిశీలన'' అనే గ్రంథం వ్రాసి ఉత్తమ సిద్ధాంతగ్రంథ రచనాపురస్కారం పొందాము.
                  రాష్ట్రంలోని వివిధ విశ్వవిద్యాలయాలు నిర్వహించిన జాతీయస్థాయి సదస్సులకు సమర్పించిన కొన్ని పరిశోధనా పత్రాలు 'సువర్ణ గోపురం' గా పుస్తకాకృతి పొందినాయి.
కవన వికాసం:
           నా 15వ యేట అప్పటికి నాకు తెలిసిన ఛందోవిజ్ఞానంతో పద్యాలు వ్రాయాలన్న ఆలోచన కలిగింది. అంతలోనే మా నాన్న వ్రాసి ఎవరికీ చూపకుండా తన జేబులోనే భద్రపరుచుకొన్న కొన్ని పద్యాలను ఆకస్మికంగా చూచాను. ఆ తండ్రి కొడుకుగా పద్యరచనలో పేరు నిలుపుకోవాలన్న ఆశ తలెత్తింది.
ఒకవైపు సినిమాబాణిలో పాటలు వ్రాస్తూ, మరో వైపు చిటిపొటి పద్యాలు అల్లేవాడిని. మరికొన్ని తెలిసిన వాళ్ల పెళ్లిళ్లకు, పండుగలకు శుభాకాంక్ష రూపంగా అందించే వాడిని. ఇంకాకొన్ని పెద్దలను గౌరవించే సందర్భాలకు స్తుతిరూపంగా ఉండేవి.
             తెలుగు పండితునిగా విద్యార్థుల కోర్కె తీర్చడానికై తరచూ చెప్పుతూ వచ్చిన ఆటవెలది పద్యాలే వరదరాజు శతకం. ఇందులో చవర దశావతారస్తుతి ఉంది. ఈ శతకానికి '' చదివినాడ వరద శతకమ్ము సకలమ్ము, కరగినాడ నీదు కైత పసకు, కలదు నీకు ఆంధ్రకవికోటిలో పీట, వలదు జంకు వినయవత్‌ ప్రకాశ'' అని శ్రీ తుమ్మల సీతారామమూర్తిచౌదరి గారు దీవించారు. డాక్టర్‌ దివాకర్ల వెంకటావధాని, శ్రీ చర్లా గణపతిశాస్త్రి వగైరాల అభినందనలు అందుకొన్నాను. తర్వాతి కాలంలో ఆశతకమే మకుట విరహితంగా 'లోకలీలాసూక్తం' గా రూపు దిద్దుకొనింది.
               మూడు సంవత్సరాల పండితవృత్తి వదిలి ఎం.ఏ.,లో చేరాను. ఈ సమయంలో అవధాన గురుదేవులు డా|| సి.వి.సుబ్బన్న శతావధాని వెంట అవధానసభలకు వెళ్లుతూ వారి స్తుత్యాత్మకంగా చెప్పిన పద్యాలే ' పుష్పాంజలి ' పేర వెలుగు చూచింది. ఇది ఆకృతిలో లఘువైనా కవితా విషయికంగా , గురుభక్తి గుబాళించిన కారణంగా , అలఘుత్వాన్ని పొందిందనీ ప్రశంస నందింది. అలా నాకు శుభాశంస అందించిన సాహితీ మేరువులు డా|| మధునాపంతుల సత్యనారాయణశాస్త్రి, డా|| దాశరథి కృష్ణమాచార్యులు , డా|| సి.నారాయణరెడ్డి వగైరాలు.
ఎం.ఏ., ముగిసి డిగ్రీకళాశాలలో పనిచేస్తున్న సమయంలో '' మెరుపుతీగలు'' పద్య ఖండికల సంపుటి ముద్రితమైంది. దీనిని కవితా గురుదేవులు డాక్టర్‌ నండూరి రామకృష్ణమాచార్యుల వారికి అంకితమిచ్చాను.
                నేను ప్రధానంగా పద్యజీవినే. అయినా వచనకవితను ఏనాడు నిరసించలేదు. నినాదప్రాయంగా కాకుండ హృదయపూర్వకంగా వెల్వడే ఏ చిన్నమాటనైనా ఆదరించేవాడిని. అడపాదడపా నేనూ రసాత్మక వాక్యాలను వ్రాయడానికి ఆసక్తి చూపేవాడిని. కళాశాల వార్షికసంచికలో 'నీవు-నేను' అనే నా వచనకవిత అచ్చయింది. ఒక దశాబ్ది పిమ్మట ఆదే కవిత డా|| కమల్‌నాథ్‌పంకజ్‌ గారిచే హిందీభాషలోనికి అనూదితమై గుర్తింపు పొందింది.
               నేను సాహిత్యవిభాగ కార్యదర్శిగా అనంతపురంలో రాయలసీమ రచయితల మహాసభలు నిర్వహించాను. కొందరు నన్ను అనభ్యుదయవాదిగా , నేను చేపట్టే సాహిత్య కార్యక్రమాలన్నీ శవ సమాలోచనలుగా చిత్రించి కరపత్రాలు సభలో పంచారు. వెంటనే స్పందించి వారికి సమాధానంగా ఆశువుగా చెప్పిందే 'రొయ్య మీసాలు' వచనకవిత. అప్పటి నుండి విక్రమించి ఆకాశవాణి, తదితర సంస్థలు, శ్రోతల సమక్షంలో నిర్వహించే కవిసమ్మేళనాలకు ఒకమారు పద్యం, మరొకమారు వచనం కాన్క చేసేవాడిని. ఈ వచనకవితల సంపుటియే '' అంతరంగ తరంగాలు''. దీనిపై స్పందిస్తూ సుప్రసిద్ధసాహిత్య విమర్శకులు శ్రీ ఆర్‌.యస్‌. సుదర్శనంగారు '' తెలుగు మహాకావ్యాలను అధ్యయనం చేయడం, ఆధునికుల ప్రతిభకు అభివ్యక్తికి దోహదం చేస్తుందే తప్ప గతానికి బందీల్ని చేయదు-అన్న సత్యానికి ఆశావాది ప్రకాశరావు వ్రాసిన కవితలు మరో తార్కాణం'' అన్నారు. డాక్టర్‌ యన్‌.శాంతమ్మ గారు కూడా దీనిపై 'ఆశావాది కవితాతరంగం' పేరిట విశ్లేషణాత్మక వ్యాససంపుటి ప్రచురించి తన సౌమనస్యాన్ని చాటుకున్నారు.
          మిత్రులు శ్రీ దోర్నాదుల వరదరాజులు గారి షష్టిపూర్తి సందర్భంగా వారి అభిమతం మేరకు మూడుగంటల వ్యవధిలో 34 వృత్తాలతో ఆశువుగా చెప్పింది 'రామకథా కలశం'. శిష్యుడు జె. నీలకంఠరాయుడు తృప్త్యర్థమై వ్రాసింది 'పార్వతీశతకం'. శ్రీశ్రీశ్రీ రామకోటిరామకృష్ణానందస్వామి వారి భావాలకు పద్యరూపం ఇచ్చింది 'ఆత్మతత్వ ప్రబోధం'. జీవితంలో స్థిరపడే వధూవరులకు సందేశాత్మకంగా ఆశీర్వాదరూపంగా ఇచ్చిన చిరు కానుకయే 'దీవన సేనలు'.
అవధాన వికాసం
                 నేను మొదటి సంవత్సరం డిగ్రీ చదువుతూ ఉంగానే శ్రీ సి.వి. సుబ్బన్న శతావధాని గారి అష్టావధానం చూచాను. పేదరికం కారణంగా ఆ మార్గంలో పరిశ్రమిస్తే కీర్తితో పాటు నాలుగు డబ్బులూ వస్తాయనే ప్రలోభం తలెత్తింది. అప్పటికే పద్యరచనలో కొంతమేర పరిశ్రమించిన నేను, కొన్ని సందర్భాలలో నాకు నేనుగా, మరికొన్ని సందర్భాలలో స్నేహితుల ద్వారా, రకరకాల నిబంధనల్ని విధించుకొని వాటికి లొంగి పద్యం అల్లటమేకాక ధారణపట్టి అప్పజెప్పడం నేర్చుకొన్నాను.
                 ఈ లోగా ప్రభుత్వ ఉద్యోగం వస్తే ఎండకాలం సెలవుల్లోవెళ్లి ఏలూరులోని ఫ్లడ్స్‌ కంట్రోల్‌ సర్కిల్‌లో గుమాస్తాగా చేరాను. అక్కడ శ్రీ బస్వా సింహాద్రి అప్పారావు గారి సాహచర్యంలో మూడు నెలలపాటు చేమకూర వేంకటకవి విజయవిలాసం అధ్యయనం చేశాను. అది నా పద్యాలకు మరింత వెలుగునిచ్చే అచ్చు తెనుగు ముచ్చట్లను పదబంధాలను సమకూర్చింది.
             ఉద్యోగం వదిలి 2వ యేడు కళాశాలలో అడుగు పెట్టాను. ఎన్నో సంఘటనలు మీద మీద తారసిల్లుతూ వచ్చాయి. రిటైర్డు కలెక్టర్‌ శ్రీ బి.జూగప్ప గారి చొరవతో అప్పటి భారత రాష్ట్రపతి డాక్టర్‌ సర్వేపల్లి రాధాకృష్ణన్‌గారికి స్వాగతపద్యాలు సమర్పించి 'బాలకవి'గా అమృతాశీర్వాదాలు అందుకొన్నాను. తెలుగు శాఖ పక్షాన ఏర్పాటైన శ్రీ గాడేపల్లి కుక్కుటేశ్వరరావు గారి అష్టావధానంలో పృచ్ఛకస్థానం పొందాను. భువన విజయంలో నేపథ్య పద్యగాయకుడిని అయ్యాను.
             ఇవన్నీ ఒకరకమైన బలాన్ని తృప్తిని కలిగించడంతో ఆ యేడే కేశవవిద్యానికేతన్‌ (శివశంకరం హాస్టల్‌)లో స్నేహితుల మధ్య 02-10-1963న గాంధీజయంతి సందర్భంగా మొదటి అష్టావధానం జయప్రదంగా ముగించాను. ఈ వార్త మా తెలుగుశాఖ హెడ్‌ డాక్టర్‌ నండూరి వారి చెవిలో పడింది. వారు నన్ను 'డిపార్ట్‌మెంట్‌'కు పిలిపించి ఉపన్యాసకుల సన్నిధిలో సమస్యాపూరణ పరీక్ష నిర్వహించారు. వారిచ్చిన 'ప్రశ్నకు ప్రశ్నయే జవాబు భామిని పలికిన్‌'. అనే సమస్యకు నా పూరణ. ప్రశ్నలపై వడి ప్రశ్నలు, ప్రశ్నించెడి తనదు భర్త భావం చేమో ప్రశ్నించును, తన యెదలో ''ప్రశ్నకు ప్రశ్నయె జవాబు'' భామిని పలికెన్‌'.
             నా పూరణతో సంతోషించి నీకు ధైర్యం ఉంది. ఎక్కడైనా నెట్టుకొస్తావు. నేటి నుంచి నీవు ఆసాదివి కావు. ఆశావాదివి అని ఆశ్వీరదించారు. అప్పటినుండి నేను ఆసాది ప్రకాశరావుగా కాకుండా ఆశావాది ప్రకాశరావును అయ్యాను. నిషేధాక్షరిలోని మెలకువలను నాకు నేర్పవలసిందిగా శ్రీ గాడేపల్లి వారిని కుదిర్చారు నండూరువారు. వారి అంతేవాసిత్వంలో ఒక్క సంవత్సరం కూడా గడవకుండానే ఆ ఇరువురు బదిలీ అయ్యారు. నేను నా వికాసానికి కొండంత అండను కోల్పోయాను.
             మూడవయేడు చదువు రకరకాల కష్టాలమధ్య ముగించుకొని శిక్షణలేని తెలుగు పండిత వృత్తిలో చేరి శ్రీ సి.వి. సుబ్బన్న శతావధానిగారి గురుత్వం సంపాదించాను. వారి అవధానసభలకు వీలు కలుగజేసికుని హాజరయ్యేవాడిని. వారి వెంట ప్రయాణిస్తూ కొన్ని, ఉత్తరాల ద్వారా మరెన్నో , సందేహాలు తీర్చుకొనేవాడిని. శ్రీ సి.వి.సుబ్బన్నగారి ద్వారా నా అవధాన సువిధానానికి బలమైన పునాదులు పడ్డాయి.
                నా 19వ యేట ప్రారంభించిన అవధానం 26 వసంతాల పాటు నిరాఘాటంగా విస్తరిల్లింది. రాష్ట్రమంతటా, కర్నాటక, తమిళనాడు రాష్ట్రాలలోనూ, న్యూఢిల్లీలోనూ 171 అవధానాలు చేశాను. అవధాన పద్యాలను జారిపోనివ్వకుండా భద్రపరిచి ఐదు సంపుటాలుగా ఆంధ్రసరస్వతికి కానుక చేశాను. నాకు బాగా గుర్తింపు తెచ్చిపెట్టిన ప్రక్రియ అవధానమే. అయినా పెరుగుతున్న వయస్సుతో పాటు తరుగుతున్న ధారణ, నిరంతర ప్రయాణాలతో అనుకున్న ఎన్నో రచనలు సకాలంలో ముగించలేకపోవటం, ఉద్యోగంలో రాజీధోరణి అవలంబించలేక అనారోగ్యాన్ని కోరి తెచ్చుకోవటం, ఉత్సాహంగా అవధాన రంగప్రవేశం చేస్తున్న ఆశావహులైన కొందరు యువకులకు అవకాశాలు కల్పించాలన్న ధ్యేయం-అన్నీ కలిసి 55వ యేట 1999 ఉగాది నాడు అవధానాలకు మంగళం పాడేటట్లు చేశాయి.
                ఈ సందర్భంలో ఒకమాట చెప్పాలి. మాది ఆసాది వృత్తి. మా పూర్వులు గ్రామదేవతా పూజారులు. ఆయా దేవతలపై, పెద్దలపై జాతర్లలో ఆశువుగా పాటలు కట్టేవారు. ఆ పాటయే సంప్రదాయసాహిత్యం అధ్యయనంచేసి, అందులో శ్రద్ధ కనుబరచిన నా దగ్గర ఆశుపద్యమైంది. ఆ ఆశువు మరొకొన్ని అదనపు జాగ్రత్తలతో అవధానానికి దారితీసింది. ఈ విషయాన్నే ఒక అవధాన సభలో ఇలా చెప్పాను.
గ్రామాలన్‌ గల దేవతా కథనముల్‌ గానంబునన్‌ దీర్చుచున్‌
రోమాంచంబును గూర్చి కాన్కలుగొనే ప్రోద్యత్కులాచారమే
ధీమంతుల్‌ కొనియాడ పద్యయయి సందీపించె నా వాక్కునన్‌
శ్రీమద్దివ్య వధాన ముఖ్యగురువౌ శ్రీ సీ వి సుబ్బన్నచేన్‌
                                       (అవధాన కళా తోరణం)
సాహిత్యసేవా వికాసం:
        నేను బదిలీపై ఎక్కడికి వెళ్లినా అక్కడి సాహితీకళాప్రియత్వంగల వారిని కూడగట్టుకొని, సాహితీ ప్రచార ప్రోత్సాహాలకు అనువైన సంస్థ స్థాపించి, అందులో క్రియాశీలక పాత్ర పోషించేవాడిని. పాఠశాల విద్యాభ్యాసంలో, వసతిగృహ సాంస్కృతికవిభాగ కార్యదర్శిగా, కళాశాలలో ఆంధ్ర సారస్వత సంఘ కార్యదర్శిగా, నా అనుభవాలు సంస్థల ఆశయాలను సఫలీకృతం చేయటానికి కొంత ఉపకరించాయి.
       1974లో అనంతపురంలో కొందరు సుహృత్తుల తోడ్పాటుతో స్థాపించింది రాయల కళాగోష్ఠి. ప్రధాన కార్యదర్శిగా 15 సంవత్సరాలు సంస్థకు సేవలందించాను. 'గోష్ఠి అంటే ఆశావాది' అనే ప్రచారం ఊపు అందుకొనింది. పుస్తక ప్రచురణ, గ్రంథావిష్కరణ, కవి సమ్మేళనాలు, కావ్య పరిచయాలు, సాహిత్య మూల్యాంకనాలు, వైతాళికుల సంస్కరణలు, అష్టావధానాలు, ముఖాముఖి చర్యలు- ఇవి మేము చేపట్టిన కార్యక్రమాలు. సామర్థ్యం గల యువకుల్ని వెదికి తెచ్చి ఆయా సాహిత్యకార్యక్రమాల్లో భాగస్వామ్యులను చేసేవాళ్లం. అలా తయారైన వాళ్లు నేడు మా జిల్లా సుప్రసిద్ధులుగా ఉన్నారు.
              ఆం.ప్ర. సాహిత్య అకాడమీ రజతోత్సవసంచికలో 'తెలుగులో సాహిత్యపరిశోధన-సంస్థల పాత్ర' అనే వ్యాసం వ్రాస్తూ డాక్టర్‌ కె గోపాలకృష్ణారావు 'అనంతపురంలో స్థాపించబడిన రాయల కళాగోష్ఠి తెలుగుభాషాసాహిత్యములకు సంబంధించిన అనేకాంశములపై చర్చలు, సమావేశములు నిర్వహించుచున్నది. ఈ వేదికనుండి ప్రముఖులొనర్చిన ఉపన్యాసములు గ్రంథరూపమున వెలువడునని సహృదయలోక మెదురుచూచుచున్నది' అన్నారు.
             గుంతకల్లులో భువనవిజయము శారదాపీఠము అధ్యక్షుడుగా అష్టదిగ్గజ కవుల సాహిత్య సృజనపై విశ్లేషణలే కాక. పద్యకవులకు పెద్దపీట వేసి కవితాశిక్షణ తరగతులు నిర్వహింపబడినాయి.
        పెనుగొండలో ఘనగిరి సాంస్కృతికమండలి ప్రధానకార్యదర్శిగా పట్టణం నడిబొడ్డులో శ్రీకృష్ణదేవరాయ విగ్రహప్రతిష్ఠాపనకై సఫలప్రయత్నం చేశాను. సుప్రసిద్ధ కళాకారుడు శ్రీ సి.యన్‌ . వెంకటరావుగారి తైలవర్ణ చిత్రాలప్రదర్శన, విద్యార్థుల నేత్రావధానాదులు, కళావిభావరులు నిర్వహింపజేశాను.
        ఆంధ్ర పద్యకవితాసదస్సు అధ్యక్షుడుగా, తిరుమల తిరుపతి దేవస్థాన గ్రంథనిపుణుల మండలి సభ్యుడుగా, అజ్ఞాతకవులకు గుర్తింపు నివ్వడంలో కృతకృత్యుడనయ్యాను. ఆం.ప్ర సాహిత్య అకాడెమీ కార్యవర్గసభ్యుడుగానూ సేవల్ని విస్తరించాను. ప్రతి సంస్థలోనూ ఇతరసభ్యులతో కలిసిపోయి, కార్య సాధనయే ధ్యేయంగా నడుచుకోవటం వల్ల ఎందరిలోనో చైతన్యం నింపటం సాధ్యమైంది.
               నేను ప్రధానంగా భాషాజీవిని. కవుల సాంగత్యంలో పండిత సేవలో వినమ్రంగా ఉంటాను. చూపోపని వారు తప్ప అందరూ నన్ను అభిమానించారు. వివిధ వేళల్లో నాపై కవితల సుగంధాలు జల్లారు. దానికి సాక్ష్యంగా శ్రీశాంతినారాయణ, కల్యాణవాణి, శ్రీ సి రామసుబ్బారెడ్డి, అక్షర కిరీటం, ఆశావాది, అనే సంకలన గ్రంథాలు నిలుస్తాయి. కృతిపోషక సామర్థ్యం నాలో లేకున్నా వారే ముద్రణాభారం వహించి శ్రీ బెళ్లూరి శ్రీనివాసమూర్తి, శ్రీ చెప్యాల రామకృష్ణారావు, శ్రీ ఎంపి జానుకవి వంటి ప్రసిద్ధులు తమ గ్రంథాలను నాకు అంకితమిచ్చారు. నాపై ప్రేమామృతం కురిపించారు. స్నేహశీలురు నా గ్రంథాల ప్రచురణకు ఆర్థిక సహాయం చేశారు.
       భువన విజయంలో పెద్దన పాత్రధారిగా కృత్రిమ గండపెండేరం పండిన నా వామ పాదానికి, అత్యాశ్చర్యకంగా 2008 ఆగస్టు 10న విజయనగర రాజుల రెండవ రాజధానియైన పెనుకొండలో శ్రీ కుంచం అశ్వత్థయ్య సౌహృద సాక్ష్యంగా స్వచ్ఛ స్వర్ణగండ పెండేర ప్రదానం జరిగింది.
           నిత్య సాహిత్య వ్యవసాయినై ప్రొద్దు గడిపే వాడిని కావటంతో నాపై విశ్లేషణాత్మక సాహిత్య వ్యాసాలు అనేకం వెలువడినాయి. సాహితీ లోకం అనేక పురస్కారాలతో బిరుదాలతో నన్ను మన్నించింది. శ్రీమంకాల రామచంద్రుడు నా సాహిత్యాన్ని అనుశీలనం చేసి పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం నుండి పిహెచ్‌డి పొందాడు. సిద్ధాంత గ్రంథాన్ని కూడా ముద్రించాడు. శ్రీ వెంకటేశ్వర, ఉస్మానియా, విశ్వవిద్యాలయాల్లోనూ పరిశోధనలు జరుగుతున్నాయి. నన్ను అనుసరిస్తున్న అవధానులు ఆముదాల మురళీ, లోకా జగన్నాథశాస్త్రి, నా కీర్తిని పెంచుతున్నారు. ఉత్తమ బోధకులు, పాలకులు కవులు, పత్రికల నిర్వాహకులు అయిన శిష్యులు గణనీయంగానే ఉన్నారు.
       నిర్ద్వంద్వంగా నాది బహుముఖీనమైన కృషి, అన్నింటానేనున్నానని చాటుకోగలిగానే తప్ప, ఎందులోరే నా ప్రత్యేకతనో, ప్రగాఢతనో చాటుకున్నానని అనలేను. నేను సాహిత్యానికి చేసిన దానికంటే సాహితీలోకం నాకు చేసిందే ఎక్కువ. నేను నిబద్ధత కలవాడిని కాను. ఆయా సందర్భాలు ఎటు ఈడిస్తే అటుగా వెళ్లుతూ అక్కడ నన్ను ప్రతిష్టించుకొనే ప్రయత్నం చేశాను. సాహిత్యానికి దూరంగా బ్రతుకలేని బలహీనత నా నరనరాల్లో జీర్ణించుకొనిపోయింది.
చిరు సందేశం
      బాధాకరమైన విషయమేమిటంటే రచయితలు ఎందరో ఉన్నారు. 'సామాజిక స్పృహ' పేరిట తామరతంపరగా రచనలు చేస్తున్నారు. తాము ఏ సందేశాన్ని ఎదుటివారికి ఇస్తున్నారో అందులో వాడు జీవించడం లేదు. కవి మాటకు చేతనకు పొంతన లేకపోతే అతనికి రాజకీయ నాయకుడికి భేదమేముంది. కుడిగా బ్రతకాలనే కక్కుర్తితో సాహిత్య రాజకీయాలు చేయటం బాగులేదు. ఈ సోదరులు ఘోషించే మహిళావాదం, లంచగొండితనం, కులమత సామరస్యం, తల్లిదండ్రుల సేవ, సాటి రచయితల పట్ల సదవగాహన వగైరాలు, వారి నిజ జీవితాల్లో అపహాస్యానికి గురి అవుతున్నాయి. వాగ్రూపంలో అందంగా ఆవిష్కరిచుకోవటం దగ్గర ఆగిపోవటం కాకుండా ఆ చరణాల అనువదించ వలసినదిగా రచయితను ఆభ్యర్థిస్తున్నాను. నా సాహిత్య జీవిత ప్రస్థానంలో వ్యక్తవ్యక్తంగా తారసిల్లిన జ్ఞాతాజ్ఞాత శక్తులకు ఈ కింది పద్యంలో నిల్పి కొంతమేర నాలో పవిత్ర సంతృప్తి మిగిలించుకుంటాను.

ఏ దేవి కల్మియో ఈ నను దీవించి
పెద్దల మధ్యన పేర్మినిల్పె
ఏ గురు కరుణమో ఈ వాక్య బంధాల
మతితోడజతగూండి మ్మలయజేసె
ఏ గుప్త రూపమో ఎలయించి నన్నెప్డు
ఏ నీడకానీడ నెలమి గాచె
ఏనాటి బంధమో ఈ నాటి కొనకూడి
సాహిత్య వీధుల శక్తిబెంచె
అది పురాతసుకృతంబు, అదిపునీత
మద్ది భాగ్యోన్నతంబు, అయ్యదియలేక
ఈ ప్రకాంశ మాశావాదియెన్నడగును
ఈ మధుర మధుస్మృతి సంకెట్లగలుగు.
                                            (అవధాన కౌముది)

13, మే 2011, శుక్రవారం

ఈ ఫలితాలు ఏమార్పుకు దారి తీస్తాయి?








ప్రజలను కష్టాలనుంచి గట్టెక్కిస్తాయా?
ప్రజలపై భారాలు తగ్గుతాయా?
ప్రజల పక్షాన చట్టసభల్లో పోరాడేదెవరు?
వామపక్షాలకు ఎదురు గాలి ఎందుకు వీచింది?
దేశంలో వామపక్షాల ప్రాధాన్యత తగ్గిందా?
2011 లో ఐదు రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల ఫలితాలు వామపక్షపార్టీలకు ప్రధానంగా సిపిఎంకు ఎదురుగాలి వీచింది. ప్రజలు మార్పును కోరుకున్నారు. అంతేకాకుండా దేశంలో పెట్టుబడిదారులు కమ్యూనిస్టులను బలహీన పరచాలనే ప్రయత్నం కొంత ఫలించింది. ఈ ఫలితంగా దేశంలో వున్న ఇద్దరు మహిళా ముఖ్యమంత్రులకు మరో ఇద్దరు మహిళా ముఖ్యమంత్రులు తోడయ్యారు. ఢిల్లీనుంచి శీలాదీక్షిత్‌, ఉత్తర ప్రదేశ్‌నుంచి మాయావతి, తమిళనాడు నుంచి జయలలిత, కొత్తగా పశ్చిమబెంగాల్‌నుంచి మమతాబెనర్జి ముఖ్యమంత్రి అవుతున్నారు. ఇదొక కోణం. మరోకోణం పరిశీలిస్తే.... ప్రజలను కష్టాలనుంచి గట్టెక్కిస్తాయా? ప్రజలపై భారాలు తగ్గుతాయా? ....ప్రజల పక్షాన చట్టసభల్లో పోరాడేదెవరు?......వామపక్షాలకు ఎదురు గాలి ఎందుకు వీచింది?..వీటన్నింటికీ సమాధానాలు వెతకాలి.... పశ్చిమబెంగాల్‌, కేరళ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల నేపథ్యంలో దేశంలో వామపక్ష రాజకీయాల ప్రాధాన్యత తగ్గలేదని గుర్తించాలి. రానున్న రోజుల్లో ప్రజల హక్కులపై జరిగే దాడిని ఎదుర్కొనే క్రమంలో వామపక్షాల ప్రాధాన్యత మరింత పెరుగనుంది. దేశ రాజకీయాల్లో వామపక్షాల స్థానాన్ని ఏ పార్టీ, శక్తి పూడ్చలేదనే చెప్పక తప్పదు. బెంగాల్‌, కేరళ ఫలితాలు దేశవ్యాప్తంగా వామపక్ష అభిమానులను నిరుత్సాహానికి గురిచేసింది. కేరళలో ఏ ప్రభుత్వం వరుసగా రెండోసారి అధికారంలోకి రాలేదు. ఈ సారి ఎన్నికల్లో ఎల్‌డిఎఫ్‌ విజయం అంచుల దాకా వెళ్లి ఓడిపోయింది. రాష్ట్ర ప్రభుత్వంపై ప్రజల్లో అసంతృప్తి లేదనడానికి ఎన్నికల ఫలితాలే నిదర్శనం.
ఈ పరిణామాలకు కారణాలెన్నో...!?
బెంగాల్లో వామపక్ష కూటమి అపజయానికి పలు అంతర్గత, బాహ్య కారణాలున్నాయి. 34 సంవత్సరాల తర్వాత బెంగాల్లో వామపక్షాలకు ప్రతికూల ఫలితాలు రావడంపై మీడియాలో రకరకాల కథనాలు వచ్చాయి... వస్తున్నాయి. ఎరుపు తెల్లబోయిందని...కమ్యూనిస్టుల కంచుకోటకు బీటలు బారాయని.... 34 ఏళ్లపాలనకు తెరపడిందని... కాని ప్రజల పక్షాన పోరాడేదెవరు? ఈ ఫలితాలు ఎందుకలా వచ్చాయి. చట్టసభలో దేశ, రాష్ట్ర ప్రయోజనాలకోసం గట్టిగా పోరాడే వారు లేకపోయిరని మాత్రం విశ్లేసించలేక పోతున్నారు. అయ్యో ప్రజల కష్టాలను అర్థం చేసుకునే కమ్యూనిస్టులు ఓడి పోయారే...అని మాత్రం విశ్లేసించరెందుకు? అంటే పెట్టుబడి దారులకు మీడియా కొమ్ముకాస్తుందనేగా అర్థం. ... ఈ ఓటమిని సిపిఐ(ఎం) వినమ్రంగా అంగీకరించింది. ప్రపంచీకరణ, ఆర్థిక సంస్కరణల పూర్వరంగంలో రాజకీయ వ్యవస్థపైనా దాని ప్రభావం తీవ్రంగా పడింది. కార్పొరేట్‌ తరహా రాజకీయ విలువలు ప్రవేశించాయి. గత పదేళ్లుగా దేశ ఆర్థిక రంగంలో జరిగిన పెనుమార్పులు సంపదను పెద్ద ఎత్తున కేంద్రీకరింపజేశాయి. పెట్టుబడి దారులు ప్రభుత్వాలను నడుపుతున్నచోట ప్రభుత్వ వ్యతిరేకతను తట్టుకొని నిలబడేందుకు ఆయా రాష్ట్రాల ఆర్థిక వ్యవస్థలు తోడ్పడ్డాయి. బెంగాల్లో భూ సంస్కరణలు, కౌలు సంస్కరణలు, పంచాయతీలకు అధికార బదలాయింపు జయప్రదంగా అమలైన కారణంగా రాష్ట్ర ప్రజలకు ముఖ్యంగా పేదలకు ఎంతో ఉపశమనం లభించింది. అదే సందర్భంలో ఈ క్రమంలో కొత్త వైరుధ్యాలూ పుట్టుకొచ్చాయి. భూస్వామ్య వ్యవస్థ బలహీన పడింది. భూములు పొందిన చిన్న రైతుల సంఖ్యా పెరిగింది. భూమి ఉన్న రైతులకు, భూమి లేని వ్యవసాయ కూలీలకు మధ్య వైరుధ్యం అభివృద్ధి అయ్యింది. ఈ వైరుధ్యాన్ని పరిష్కరించేందుకే వామపక్ష ప్రభుత్వం పారిశ్రామికీకరణపై దృష్టి సారించింది. పరిశ్రమలకూ భూములు అవసరమే. ఈ భూ సేకరణలో ప్రభుత్వం కొత్త సమస్యలు ఎదుర్కొంది. వీటి విశ్వరూపం నందిగ్రామ్‌, సింగూర్‌లో వెల్లడైంది. ప్రభుత్వపరంగా, పార్టీపరంగా వచ్చిన కొత్త సమస్యలూ దీనికి తోడయ్యాయి. బ్యూరోక్రటిక్‌ ధోరణులు ప్రజలకు, పార్టీకి మధ్య గండిని సృష్టించాయి. 2009 ఎన్నికలకు ముందు నుంచే ప్రభుత్వంపై అసంతృప్తి ప్రారంభమైంది. నందిగ్రామ్‌, సింగూర్‌ ఉద్యమాల అనంతరం స్థానిక అసంతృప్తికి రాజకీయ రూపం వచ్చింది. పలు దిద్దుబాటు చర్యలూ చేపట్టింది. సమయం తగినంతగా లేకపోవడంతో ప్రజలు ఈ మార్పును గుర్తించలేక పోయారు. దీనికి తోడు ఈ కాలంలో పలు రూపాల్లో పార్టీపై తీవ్ర నిర్బంధం మొదలైంది. అంతర్జాతీయ స్థాయిలోనూ వామపక్ష ప్రభుత్వాన్ని కూల్చేందుకు ప్రయత్నాలు తోడయ్యాయి. ఈ ప్రతికూల పరిణామాలను ఎదుర్కొంటూ, పార్టీ ఐక్యతను కాపాడుకుంటూ ప్రజలతో మమేకమయ్యేందుకు పార్టీ చేసిన ప్రయత్నంలో విజయం సాధించలేక పోయిందని వామపక్ష వాదులు విశ్లేషించారు. ప్రస్తుత ఎన్నికల్లో ప్రజలు ఎన్నో ఆశలు, ఆకాంక్షలతో మమతా బెనర్జీ నేతృత్వం లోని కూటమికి పెద్ద ఎత్తున ఓట్లేశారు. మమతా బెనర్జీ వద్ద ఇప్పటి వరకూ రాష్ట్రాభివృద్ధిపై ప్రత్యామ్నాయ ప్రణాళిక లేదు. మార్పు అన్న ఏకైక నినాదంతో ఆమె విజయం సాధించారు. ఈ మార్పు ప్రగతిపథం వైపా, అభివృద్ధి నిరోధకత వైపా అన్నది భవిష్యత్తే తేల్చాలి. దాన్ని బట్టే ఈ ప్రభుత్వ సుస్థిరత ఆధారపడి ఉంటుంది. సీట్లపరంగా దెబ్బతిన్నప్పటికీ ఓట్లపరంగా ఇప్పటికీ బెంగాల్లో వామపక్షాలు ప్రబల శక్తిగానే ఉన్నాయన్నారు. 'ఇంతటి ప్రతికూల పరిస్థితుల్లోనూ వామ పక్షాలు 41 శాతం ఓట్లను సాధించాయి. ఎన్నికల ఫలితాల నేపథ్యంలో వామపక్ష రాజకీయాలకు మరింత ప్రాధాన్యత పెరిగిందనేది మాత్రం గుర్తించాలి. వామపక్షాల ఓటమి ప్రభావం జాతీయ స్థాయిలోనూ ఉంటుంది.ఈ ఎన్నికల్లో వామపక్షాలు తాత్కాలికంగా నష్టపోయాయి. కానీ వామపక్షాల ఓటమితో శ్రామికవర్గం ఇంకా ఎక్కువ నష్టపోయింది. వారి తరపున మాట్లాడే గొంతుక తగ్గుతుంది. ఇప్పటికే అవినీతి, అధిక ధరలు ఒకవైపు ప్రజలను పీడిస్తుండగా, మరోవైపు కార్మికవర్గంపై పెద్దఎత్తున దాడి జరుగుతోంది. రానున్న కాలంలో ప్రపంచబ్యాంకు, అమెరికా ఒత్తిళ్లు మరింతగా పెరుగు తాయి. పాలకులు మరింతగా పేట్రేగిపోయి ప్రజల హక్కులను కాలరాచే ప్రమాదముంది. వీటన్నింటినీ తట్టుకొని దేశం ముందుకు సాగాలంటే వామపక్ష రాజకీయాలు మరింత అవసరాన్ని ప్రజలు గుర్తిస్తారు. ఇక ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్‌ జగన్‌ సొంతపార్టీ పెట్టాడు. కోట్లు ఖర్చుచేసి ఎన్నికల్లో దిగారు. తల్లీకొడుకు ఇద్దరూ ఎమ్మెల్యే, ఎంపీలే రాజీనామా చేశారు. మంచిదే మళ్లీ ఎందుకు పోటీచేశారు. అత్యధిక మెజార్టీతో గెలిచారు. కాని తండ్రి సంపాదించిన డబ్బు, హోదాను అడ్డుపెట్టుకుని గెలిచారు.సానుభూతిని సొమ్ముచేసుకున్నారు. దీంతో రాష్ట్రంలో దేశంలో ఎలాంటి మార్పురాదని గుర్తించాలి. నేను గెలిచానహో...అని చెప్పుకోవడానికి మాత్రం ఉపయోగపడుతుంది. ఒక మార్పు మాత్రం జరిగింది. సాంప్రదాయ కాంగ్రెస్‌ ఓటును మాత్రం బద్దలు కొట్టారని మాత్రం చెప్పవచ్చు.

10, మే 2011, మంగళవారం

బాలికా విద్యపై చిన్నచూపు

-పని చేసే చోట మహిళాటీచర్లకు మౌలిక సదుపాయాలు కరువు
-లైంగిక వేధింపుల అదుపునకు సుప్రీంకోర్టు తీర్పును అమలు చేయాలి
- యుటిఎఫ్‌ రాష్ట్ర కార్యదర్శి కె.విజయగౌరి
'' ఆర్థిక అసమానతలు , ప్రభుత్వ వైఫల్యం కారణంగా బాలికలు విద్యలో వెనుకబడుతున్నారు. మహిళా ఉపాధ్యాయులకు 63 శాతం ప్రభత్వ పాఠశాలల్లో మరుగుదొడ్లు లేవు. 600 నుంచి 800 మంది బాలికలు ఉండే ఉన్నత పాఠశాలల్లో ఉపాధ్యాయులకు , విద్యార్థినులకు సరయిన సౌకర్యాలు లేక పోవడం విడ్గూరం. మొత్తం టీచర్లలో 44 శాతం మహిళా టీచర్లు మాత్రమే ఉన్నారు. పని చేసే ప్రదేశాల్లో మౌలిక సదుపాయాలు లేక తీవ్రమైన ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును అమలు చేయక పోవడం వల్ల మహిళా ఉపాధ్యాయులపై లైంగికవేధింపులను అదుపు చేయలేక పోతున్నారు. బాలికల విద్యాభివృద్ధికి తీసుకోవల్సిన చర్యలపై అదేవిధంగా మహిళా టీచర్లపై లైంగిక వేధింపులు, మౌలిక సదుపాయాలపై మహాసభల్లో తీర్మానాలు ప్రవేశ పెడుతాం ''అని కర్నూలులో జరుగుతున్న యుటిఎఫ్‌ రాష్ట్ర మహాసభలకు హాజరయిన రాష్ట్ర కార్యదర్శి కె విజయగౌరి ప్రజాశక్తికి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో తెలిపారు.
బాలికలు విద్యలో వెనుక బడటానికి గల కారణాలేమిటి?
విజయ గౌరి: ప్రభత్వం విద్యను ప్రయివేటు పరం చేయాలనుకోవడం. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు కల్పించకపోవడం. బాలికల్లో అక్షరాస్యత పెరగపోవడానికి పేదరిక కూడా ఒక కారణం. ప్రధానంగా ఎస్సీ, ఎస్టీ, బిసి, మైనార్టీల బాలికలు చదువులకు అవకాశాలు తక్కువగా ఉంటున్నాయి. 2011 లెక్కల ప్రకారం మహిళల అక్షరాస్యత 59 శాతం మాత్రమే ఉంది. పాఠశాల విద్యను అభ్యసిస్తున్న బాలికల్లో కేవలం 68 శాతం మాత్రమే ఉంది. అన్నింటికీ మించి ఆర్థిక అసమానతలు కూడా బాలికలు చదువుకోక పోవడానికి కారణమవుతున్నాయి. వీటన్నింటికీ ప్రభుత్వ వైఫల్యమే కారణం. 600 నుంచి 800 మంది బాలికలు ఉండే ఉన్నత పాఠశాలల్లో మహిళా టీచర్లకు మరుగుదొడ్లు లేకపోవడం విచారకరం. కిలో మీటరు దూరంలో ఉండే పాఠశాలలను మూసేయడం వల్ల దూరం వెళ్లి చదవలేక ట్రాపవుట్లు అవుతున్న వారిలో ఎక్కువగా బాలికలు ఉంటున్నారు.
పని చేసే చోట మహిళా టీచర్లకు సదుపాయాలు ఎలా ఉన్నాయి?
విజయ గౌరి: పని చేసే చోట మహిళా టీచర్లకు మౌలిక సదుపాయాలు లేవు. మరుగుదొడ్లు, 60 శాతం ఉన్నత పాఠశాలల్లో విశ్రాంతి గదులు లేవు. మొత్తం టీచర్లలో మహిళలు 44 శాతం మాత్రమే ఉన్నారు. వారు స్వేచ్చగా పని చేసే పరిస్థితులులేవు లైంగిక వేదింపులకు గురవుతున్నారు. లైంగిక వేధింపులకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును అమలు చేయడం లేదు. వేధింపులను అరికట్టడానికి రాష్ట్ర, జిల్లా, డివిజన్‌ స్థాయిల్లో ప్రత్యేక కమిటీలు వేయాలని ప్రభుత్వానికి సూచించి ఏడు సంవత్సరాలు దాటినా అతిగతీ లేదు. ఈ మధ్య కాలంలో అదిలాబాద్‌, విశాఖపట్నం, పశ్చిమగోదావరి, జిల్లాలోడ్యూటీలో ముగ్గురు మహిళా టీచర్లను వికృత రూపంలో హత్య చేశారు. అకృత్యాలకు పాల్పడే వారి విచ్చల విడి తనానికి ఈ మూడు హత్యలే నిదర్శనం. విశాలమైన విద్యారంగంలో ఉద్యోగ భద్రత, రక్షణ కల్పించడంలో ప్రభుత్వం గోరంగా విఫలమైంది.
బాలికల విద్యాభివృద్ధికి ఎలాంటి చర్యలు అవసరం?
విజయ గౌరి: ఆర్థిక అసమానతలు తొలగించాలి. పేదలకు 360 రోజులు పని కల్పించాలి. పని చేసే హక్కును గ్యారంటీ చేయాలి. పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకాన్ని మరింత పటిష్టంగా నిర్వహించాలి. బాలికల విద్యకోసం ప్రభుత్వం ప్రవేశ పెట్టిన నబ్జల్‌ పథకాన్ని చిత్తశుద్ధితో అమలు చేయాలి. బాలికల కోసం ప్రత్యేక వైద్య సదుపాయాలు కల్పించాలి. చదువుకు అవసరమైన యూనిఫాం, పుస్తకాలు, అల్పాహారం వంటి సౌకర్యాలు కచ్చితంగా కల్పించాలి. ప్రభుత్వ పాఠశాలల్లో ప్రతి క్లాసుకు ఒక టీచర్‌ ఉండేలా చూడాలి. రేషనలైజేషన్‌ ద్వారా ఉపాధ్యాయులను తగ్గించే పద్దతికి స్వస్తి పలకాలి.
బాలికల విద్య, మహిళా టీచర్ల సమస్యలపై యుటిఎఫ్‌ ఎలాంటి కార్యక్రమాలు చేపట్టనుంది?.
విజయ గౌరి: బాలికల విద్యను పెంపొందించడానికి ,మహిళా టీచర్లరక్షణ కోసం ఆందోళన ఉధృతం చేస్తాం. కర్నూలు మహాసభల్లో ప్రత్యేక తీర్మానాలు చేయనున్నాం. ఈ సభల ముగింపుకు హాజరయ్యే కేంద్ర మంత్రి పురంధేశ్వరి దృష్టికి అన్ని సమస్యలను తెస్తాం. సుప్రీం కోర్టు తీర్పు అమలయ్యేలా ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తాం. అంతే కాకుండా సామాజిక చైతన్యం లేక పోవడం వల్ల మహిళలు అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. అందరిలో సామాజిక చైతన్యాన్ని కల్పించేలా యుటిఎఫ్‌ తరుపున ప్రయత్నిస్తాం.

9, మే 2011, సోమవారం

కర్నూలులో కదం తొక్కిన ఉపాధ్యాయులు

ఉద్యమస్ఫూర్తితో ఉత్సాహభరిత వాతావరణంలో యుటిఎఫ్‌ ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు కర్నూలులో కదం తొక్కారు. యుటిఎఫ్‌ 12వ రాష్ట్ర మహాసభలను పురస్కరించుకొని సోమవారం కర్నూలు ఎస్‌టిబిసి కళాశాల నుంచి ఉపాధ్యాయులు మహాప్రదర్శన నిర్వహించారు. 42 డిగ్రీల సెంటీగ్రేడ్‌ ఉష్ణోగ్రతతో ఉన్న సూర్యతాపం ఉపాధ్యాయుల ఉద్యమ స్ఫూర్తి, ఉత్సాహంతో పోటీ పడలేదు. ప్రదర్శనలో పిడిఎఫ్‌ ఎమ్మెల్సీ చైర్మన్‌ చుక్క రామయ్య, ఎమ్మెల్సీలు గేయానంద్‌, ఎంవిఎస్‌ శర్మ, వి బాలసుబ్రమణ్యం, మాజీ ఎమ్మెల్సీ యుటిఎఫ్‌ సీనియర్‌ నాయకులు రామిరెడ్డి, అధ్యక్షప్రధానకార్యదర్శులు నారాయణ, ఐ వెంకటేశ్వరరావు, గౌరవాధ్యక్షులు సుభాష్‌చంద్రబోస్‌, సహాధ్యక్షులు బాబిరెడ్డి, రాష్ట్ర నాయకులు అగ్రభాగాన నడిచారు. వివిధ జిల్లాల నాయకులు భారీ సంఖ్యలో పాల్గొని విజయవంతం చేశారు. ఉపాధ్యాయులు ఈ ర్యాలీలో ప్రభుత్వ విద్యారంగాన్ని పరిరక్షించాలని, మధ్యాహ్న భోజన పథకానికి అధిక నిధులను కేటాయించాలని, ఉపాధ్యాయుల అప్రెంటీస్‌ విధానం రద్దు చేయాలని, విద్యాహక్కు చట్టాన్ని అమలు చేయాలని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిధులను కూడా పెంచాలని ప్లకార్డులను ప్రదర్శించారు. అలాగే ప్రభుత్వం ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించాలని, విద్యారంగాన్ని పటిష్టం చేయాలని కోరుతూ నినాదాలు చేశారు. భగత్‌సింగ్‌, శ్రీకృష్ణదేవరాయలు, తిమ్మరుసు, లెనిన్‌ వేషాధారణలు అందరినీ ఆకట్టుకున్నారు. ఉపాధ్యాయులు యుటిఎఫ్‌ జెండాలను పట్టుకొని ఒక్కసారిగా వేలాది మంది తరలివెళ్తుండటంతో కర్నూలు నగరం ఎర్రకావురు వేసింది. గురువయ్యల డ్రమ్ములు, ప్రజానాట్య మండలి కళాకారుల డప్పుల ప్రదర్శన కూడా ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంది. ప్రదర్శన ఎస్‌టిబిసి నుంచి ఆర్‌ఎస్‌ రోడ్డు, మౌర్యాయిన్‌, రాజ్‌విహార్‌ సెంటర్‌ మీదుగా పెద్దాసుపత్రి, కలెక్టరేట్‌ నుంచి మాంటిస్సోరీ పాఠశాల ప్రాంగణం వరకూ సాగింది. ప్రదర్శనలో ఉపాధ్యాయులు అధిక సంఖ్యలో పాల్గొని ప్రభుత్వ విధానానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. డప్పులు వాయిస్తున్నప్పుడు ఉపాధ్యాయులు, నాయకులు నాట్యం చేశారు. వివిధ జిల్లాల నుంచి వచ్చిన యుటిఎఫ్‌ నాయకులు బ్యానర్లు కట్టుకొని ప్రదర్శన చేశారు.